‘సంక్షేమం’తో నక్సలిజాన్ని మాయం చేశాం – ఎన్‌డిసి సమావేశంలో రోశయ్య

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా భారీగా ఆదాయం తగ్గిందని, ఈ నేపథ్యంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. అదనపు అప్పుకు అవకాశం ఇవ్వడం ద్వారా, అదనంగా నిధులు ఇవ్వడం ద్వారా కేంద్రం సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన శనివారమిక్కడ జరిగిన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు పది శాతం నుండి ఐదు శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో పథకాలు అమలు కష్టంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35 శాతం కంటే తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రాలకు మరిన్ని రుణాలు సేకరించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
ఇందుకోసం ఆర్థిక నియంత్రణ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టాన్ని సవరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 11వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాల అమలులో మన్మోహన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఆయన ప్రశంశించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 2004 తర్వాత రాష్ట్రంలో నక్సలిజం సమస్యను మాయం చేయడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. నక్సలిజాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా పరిగణించడం వల్లే ఈ విజయం సాధ్యమయ్యిందని తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏడు జిల్లాల్లో ఇప్పటికీ నక్సల్ సమస్య ఉన్నదన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయాలను మెరుగు పరిచేందుకు కేంద్రం ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం కింద రాష్ట్రంలోని లక్షన్నర గిరిజన కుటుంబాలకు సుమారుగా 14 లక్షల అటవీ భూమిపై యాజమాన్య హక్కు కల్పించినట్లు వివరించారు. 2004-09 మధ్య వ్యవసాయ రంగ అభివృద్ధి జాతీయ సగటు రెండున్నర శాతంగా ఉండగా, తమ రాష్ట్రంలో ఆరు శాతానికి పైగా నమోదయ్యిందని వివరించారు. సాగునీటి రంగంపై తమ ప్రభుత్వం ప్రాధ్యాన్యతతో పని చేస్తోందని వివరించారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు సాధ్యమైనంత త్వరగా జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో బయో టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత కల్పించాలని రోశయ్య కోరారు.




