సంక్షోభాల మధ్య నిలకడగా రాణిస్తున్న రోశయ్య
- వ్యక్తిగత ప్రతిష్టకు దూరంగా… పార్టీకే విధేయుడైన రోశయ్య
విపత్కర పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఎలాంటి ఉత్సవాలు జరుపుకోకుండానే సిఎమ్ హోదాలో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఏడాది పాలన పూర్తికాగానే ప్రత్యేకంగా విజయోత్సవాలు, పునరంకితాలు జరుపుకోవడం సంప్రదాయం. కానీ అనారోగ్యం పేరిట రోశయ్య దీన్ని కూడా పక్కన పెట్టారు. గత ఏడాదిలో తాను సాధించిన విజయాలు, భవిష్యత్‌లో తన ప్రణాళికల గురించి మీడియా,ప్రజలముందు ఊదరగొట్టే ఆసక్తిని ఆయన కనబర్చలేదు. తనకప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే చాలన్న ధోరణికే ఆయన పరిమితమయ్యారు.

ఈ ఏడాదిలో రోశయ్యపాలనాతీరు, వ్యవహారశైలిని అవలోకిస్తే…గొప్పప్రజాకర్షణగల నాయకుడిగా రూపుదిద్దుకోలేదు.వాక్చాతుర్యాన్నిపెంచుకోలేదు.వాదనతో నలుగుర్ని ఒప్పించి, మెప్పించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకోలేదు.అద్భుత దీపాన్ని చూపెట్టి ప్రజల్లో ఆశలు కల్పించలేదు.కనీసం తనకంటూ సొంతవర్గాన్ని కూడా ఏర్పరుచుకోలేదు.కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తిరిగి కాంగ్రెస్ అధిష్ఠానం ఆధిపత్యం సాధించడానికి ఏడాది రోశయ్యపాలన దారితీసింది. ఈ ఏడాదిలో ఆయన తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఏనాడూ ప్రాకులాడలేదు. పాలనలో తనముద్ర వేయాలన్న తపనా చూపలేదు. పార్టీ తరఫున రాష్ట్రపాలనకు తానొక ధర్మకర్తగానే భావించారు. సోనియా ఆదేశాలకు, ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రాన్ని పాలించడమొక్కటే తన విద్యుక్తధర్మంగా అనుకున్నారు. ఆరేళ్ళపాలనలో వైఎస్‌తో సమానంగా ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువే మానసిక
శ్రమకోర్చిన రోశయ్య తనపాలనలో కూడా ప్రభుత్వ పథకాలన్నింటిపై వైఎస్ ముద్రే కొనసాగాలని తపనపడ్డారు. 2004నుంచి వైఎస్ పలుపథకాలు ప్రకటించారు. వాటిని క్రమం తప్పకుండా అమలు చేసేందుకు ఆర్ధికమంత్రిగా రోశయ్య పలు కసరత్తులు చేశారు. రోశయ్య కృషి కారణంగానే ఈ పథకాలన్నీ నిరాటంకంగా కొనసాగాయి. కానీ ప్రతిష్ఠ మాత్రం ఒక్క వైఎస్‌కే దక్కింది. దీనిపై కూడా ఆయనేనాడూ దృష్టి పెట్టలేదు.
రోశయ్యకున్న ఈ మానసిక,నాయకత్వ పరిపక్వతే ఈ రోజున దేశంలోని కాంగ్రెస్ సిఎమ్‌లందరిలోకి ఆయనకొక ప్రత్యేకతను కొనితెచ్చింది. ఈ ఏడాది కాలంలోరాష్ట్రం అనేక దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాల్ని చవిచూసింది. వైఎస్ మరణంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఆ ఉపద్రవం నుంచి కోలుకోకముందే రాయలసీమను ముంచెత్తిన వరదలు… ఆపై తెలంగాణా విభజనోద్యమం… దానివెంటే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం… ఆ తర్వాత వరుసగా లైలా తుపాన్‌లు, కోస్తా అతలాకుతలాలు, ముందెన్నడూ లేనిరీతిలో కడపలో కూడా ముంపు దృశ్యాలు. మరో వైపు జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర వివాదాలు.
ఇన్ని విపత్కర పరిస్థితులు కూడా రోశయ్యపై వ్యతిరేకముద్ర వేయలేదు. సీమాంధ్ర, తెలంగాణానేతలు పార్టీలకతీతంగా, ప్రాంతాలవారీగా జట్లుకట్టి పరస్పర ఘర్షణలకు పాల్పడినా ఏ ప్రాంతనాయకులు కూడా రోశయ్యను లక్ష్యంగా చేసుకోలేదు. సీమాంధ్రా నేతల పొడగిట్టని తెలంగాణా వాదులు కూడా రోశయ్య ముఖ్యమంత్రిత్వాన్ని మన్నించారు. సీమాంధ్రా మంత్రుల్ని తెలంగాణాలో తిరగనివ్వకపోయినా రోశయ్యకు మాత్రం మినహాయింపునిచ్చారు.
ఇదంతా అజాతశతృవుగా రోశయ్య సాధించుకున్న ఇమేజ్‌తోనే సాధ్యపడింది. రాష్ట్రాన్నిపాలించిన సంజీవరెడ్డి నుంచి బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, ఎన్‌టిఆర్, చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వరకు తమపాలనా కాలంలో అనేక వివాదాల్ని ఎదుర్కొన్నారు. తమకునచ్చిన వాళ్ళకే పదవులు కట్టబెడుతూ మరికొందర్ని దూరం చేసుకున్నారు. ఈ కారణంగా అనేక రాజకీయ సంక్షోభాలకు గురయ్యారు. కానీ రోశయ్య ఈఏడాదికాలంలో ఎలాంటి ఆరోపణలకు తావివ్వలేదు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రజా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఓ విధంగా చెప్పాలంటే గత ఏడాదికాలం రాష్ట్ర చరిత్రలోనే అతికీలక సమయం. 1953నుంచి ఇంతటి విపత్కర పరిస్థితిని రాష్ట్రం ఏనాడూ ఎదుర్కోలేదు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా తొలిఏడాది విజయవంతంగా పూర్తిచేసుకున్న రోశయ్య పథకాలు,ప్రచారాల్తో సొంతముద్ర వేయలేకపోయినప్పటికీ అన్నివర్గాలు,ప్రాంతాలు, ఆఖరకు ఇతర పార్టీల విశ్వాసాన్ని కూడా చూరగొన్న వ్యక్తిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.






