సచివాలయంలో తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు నేతలు

విద్యార్ధుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కె.రోశయ్యకు వినతిపత్రం సమర్పించాలని సచివాలయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఘోర అవమానం ఎదురైంది. ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తెదేపా ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో 25 ప్రజాప్రతినిధులు సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భద్రతా సిబ్బందిని తోసుకుంటూ ముఖ్యమంత్రి కార్యాలయమైన సి బ్లాక్ వద్దకు వచ్చారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఉన్నచోటే భైఠాయించి, ”ఫీజుల రియింబర్స్‌మెంట్ అమలుపరచాలని, 34 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం నశించాలని, మంత్రి పిల్లి పులి కావాలని, ” అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిగివచ్చి తమ వద్ద వినతిపత్రం తీసుకోవాలని, లేనిపక్షంలో కెబినెట్ సబ్ కమిటీ సభ్యులో ఎవరో ఒకరు వచ్చి తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇంతలో ఎమ్మెల్యే గాలి ముద్దకృష్ణమనాయుడు వద్దకు సైఫాబాద్ ఎసిపి మురళీధర్ వచ్చి ”సార్ ఇకసరిపోతుంది లేవండి” అంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో రెచ్చిపోయిన తెదేపా ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలైన తమను అరెస్టు చేస్తారా? ఎమ్మెల్యేలు తీవ్రవాదులు, గూండాల మాదిరిగా కనిపిస్తున్నారా? అంటూ రేవంతరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడులు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తెదేపా ఎమ్మెల్యేలను 151 సెక్షన్ ప్రకారం
అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన తెదేపా ప్రజాప్రతినిధుల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు, రావుల చంద్రశేఖరరెడ్డి, మసాల పద్మ, దూళిపాళ్ళ నరేంద్ర, రేవంతరెడ్డి, సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, జి.రామన్న, మండవ వెంకటేశ్వరరావు, నగేష్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రత్నం, నామా నాగేశ్వరరావులతో పాటు 25 మంది ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 2008-09లో ఫీజుల రీయాంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, సాచ్యురేషన్ పద్దతిలో చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలో రూ.1600 కోట్లు, ప్రస్తుతం రూ.900 కోట్ల బకాయిలను విద్యార్ధులకు చెల్లించాల్సివుందని, అయితే బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్నీ చెల్లిస్తే ఇక రూ. 190 కోట్లే మిగులుతాయని, కాగా ఇంకా చెల్లించాల్సిన రూ.309 కోట్లు ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల కాలంలో 4వేల కోట్లు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగిందని, కేంద్రం నుండి మరో రెండు వేల కోట్ల నిధులు వచ్చాయని మొత్తం కలిపితే వచ్చిన ఆరు వేల కోట్లలో నాలుగు వేల కోట్లును ఫీజులు రీయాంబర్స్‌మెంట్‌కు కేటాయిస్తే సరిపోతుందన్నారు. లక్షలాది మందికి భోగస్ అకౌంట్స్ ఉన్నాయనే కుంటిసాకుతో రోశయ్య ప్రభుత్వం ఫీజు రీయాంబర్స్‌మెంట్ చేయడం లేదని ఆయన ఆరోపించారు.




