సమస్యలు తలెత్తిన కేంద్రాల్లోనే పునఃపరీక్ష – డిజీపి అరవింద రావు

గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నూతన డిజీపి అరవింద్ రావ్ పేర్కొన్నారు. సమస్యలు తలెత్తిన కేంద్రాల్లోనే పునఃపరీక్షలు జరిపే అవకాశం వుంటుంది తెలిపారు. గ్రూప్‌వన్ పరీక్ష రోజే తెలంగాణా బంద్‌కు పిలుపునిచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు డిజిపి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు పెద్ద ఎత్తున బలగాలను దించాలని ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఈ అంశంపై డిజిపి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో ఆరా తీశారు. ఐదవ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 1గంట వరకూ అన్ని చోట్ల గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 445 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోందని, ఇందులో 200 కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం ఉందని అధికార వర్గాలు గుర్తించాయి. దీంతో ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు. ఆందోళనకు దిగే వ్యక్తుల సమాచారం రహస్యంగా సేకరిస్తున్నారు. దీనికి తోడు పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల పూర్తిస్థాయి తనిఖీలు చేయాలని ఆదేశించారు. అగ్ని సంబంధమైన ఎలాంటి వస్తువులను అనుమతించకుండా జాగ్రత్తులు తీసుకున్నారు. పెద్ద ఎత్తున సూపర్‌వైజర్లు, తనిఖీ అధికారులను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేకంగా వీడియో తీసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిద్వారా అసాంఘికశక్తుల కదలికలను గుర్తించవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది. పరీక్ష ప్రాంతాల్లో ప్రత్యేకంగా మొబైల్ పార్టీలను రంగంలోకి దించారు. ఇవి ముందు రోజు నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తాయి. పరీక్ష కేంద్రాల్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటను కూడా నియమిస్తున్నారు. ఆర్టీసీ, ఫైర్, రెవెన్యూ విభాగాలను అప్రమత్తం చేశారు. బంద్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్ష రాసేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. కొన్నిచోట్ల పరీక్షను అడ్డుకోవడం వల్ల రాష్ట్రం మత్తం అడ్డుకోవచ్చన్న అపోహ ఉంది. దీన్నిదృష్టిలో పెట్టుకుని కేవలం పరీక్షలకు ఆటంకం అయ్యే ప్రాంతాల్లోనే తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆందోళన జరిగే ప్రాంతాలు నష్టపోయే వీలుందనే ప్రచారం చేస్తున్నారు.




