సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిద్దాం
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిద్దామని ఎంఎల్‌సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య అన్నారు. శుక్రవారం స్థానిక కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో బీసీ ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి పోతుల రాధాకృష్ణలతో కలిసి 2008 డీఎస్సీ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు.
2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరులో జిల్లాలోని కదిరి, కళ్యాణదుర్గం ప్రాంతాల ఉపాధ్యాయులకు జాప్యం చేయడం సరికాదన్నారు. విద్యావలంటీర్లకు ఏడాది కాలంగా జీతాలు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు.
అనంతరం ఉపఖజానా కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్టీఓ రామభూషణ రాజుతో ఎమ్మెల్సీ మాట్లాడారు. నిబంధనల మేరకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఏ ప్రాతిపదికన మంజూరు చేశారో అదే విధంగా ఈ ప్రాంత ఉపాధ్యాయులకు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.




