సమైక్య నినాదం వినిపించిన రోజా

rojaసినీ నటి, తెలుగుదేశం మాజీ నాయకురాలు రోజా సమైక్య నినాదం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. విడిపోవడానికి సంతోషం లేనప్పుడు కలిసి ఉంటేనే మేలన్నారు. రాష్ట్రాన్ని ముక్కచెక్కలు చేసి బలహీనం చేయొద్దని వేర్పాటువాదులకు రోజా విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర, తెలంగాణ కవలపిల్లలని వాటిని విడగొట్టే దుశ్చర్యకు పాల్పడవద్దని ఆమె కోరారు. ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ఇతరుల ఉద్యమాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు చెప్పారు. కష్టమైనా నష్టమైనా కలిసే ఉందామని వేర్పాటువాదులకు రోజా పిలుపునిచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు. తెలంగాణ ఒక్కటే వెనుకబడిన ప్రాంతం కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా తీవ్ర వెనుకబాటుతనంతో కునారిల్లిపోతున్నాయని ఆమె గుర్తు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన చిరంజీవిపై ఉన్న ఆగ్రహాన్ని ఆయన పిల్లలు, కుటుంబ సభ్యుల సినిమాలపై చూపించడం ఏంతమాత్రమూ సమర్దనీయం కాదని రోజా ఖండించారు. రాజకీయ నాయకుడిగా చిరంజీవి తన విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. అయితే, ఆయన కుటుంబ సభ్యుల సినిమాల రీళ్ళు తగలబెట్టడం, ఆడుతున్న సినిమాథియేటర్లపై దాడులు చేసి ధ్వంసం చేయడం క్షమార్హం కాదన్నారు. మోహన్ బాబు ఏ పార్టీకీ చెందని వారని, ఆయన సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించినందుకే ఆయన తనయుడి సినిమాను తెలంగాణలో ఆడనివ్వకుండా అడ్డుకోవడంలో అర్థం లేదన్నారు. సినిమా రంగం (కళారంగం) వేరని, రాజకీయాలు వేరన్నారు. ఈ రెండు రంగాలను ముడిపెట్టి సమస్యను చూడవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఎందరో కళాకారులు పుట్టారని, వారందరినీ తామంతా గౌరవిస్తామన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
కొందరు వేర్పాటు వాదులు విడిపోదామని వాదనలు వినిపిస్తున్నప్పుడు కలిసి ఉందామని సమైక్యవాదులు తమ అభిమతాన్ని వ్యక్తం చేయడంలో తప్పేమిటని రోజా ప్రశ్నించారు. విద్యా విషయంలో హైదరాబాద్ నగరం దేశ విదేశాల్లో ఖ్యాతిని ఆర్జించిందని, అలాంటిది రాష్ట్రాన్ని విడగొట్టి పరువు తీయవద్దని ఆమె సూచించారు. స్వార్థ రాయకీయ నాయకుల ప్రేరణతో ముక్కుపచ్చలారని విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి, జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాన్ని గమనించాలని ఆమె కోరారు. మనందరి ఆస్తి అయిన బస్సులను, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం తగదని రోజా అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రానికి కట్టుబడి అందరం కలిసి మెలసి ఉందామని రోజా పిలుపునిచ్చారు.

Leave a Reply

free website analytics