సమ్మె సక్సెస్‌ – రాష్ట్రంలోనూ విజయవంతం

13.07
యుపిఎ-2 సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు,ఉద్యోగులు కన్నెర్ర చేసారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు పర్చాలని, అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలని… తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో పదికోట్ల మంది శ్రామికులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం మీద సమ్మె ప్రభావం పడింది. సిఐటియు, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసిసిటియు, యుటియుసి కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్‌ అనుబంధ సంఘమైన ఐఎన్‌టియుసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెతో బెంగాల్‌, కేరళ, త్రిపురతోపాటు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శ్రామికులు విధులను బహిష్కరించటంతో పారిశ్రామిక యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకింగ్‌, బీమా కార్యకలాపాలు ఆగిపోయాయి.
రవాణా నిలిచిపోయింది. బొగ్గు, టెలికమ్యూనికేషన్లు, రక్షణ, రోడ్డు రవాణా, ఓడరేవులు, పెట్రోలియం, విమాన యానం, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భారీగా పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాలుపంచుకున్నారు. అనేక చోట్ల ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెకు పిలుపునివ్వడం పోరాటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. సమ్మె ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది.సమస్యలను పరిష్కరించకపోతే ఫీబ్రవరిలో ఛలో పార్లమెంట్‌ నిర్వహిస్తామని ఉద్యోగ,కార్మిక సంఘాలు హెచ్చరించాయి. సమ్మె విజయవంతం చేసిన శ్రామికులకు కార్మిక సంఘాలు అభినందనలు తెలియజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. అన్ని జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి. పారిశ్రామికవాడలు వెలవెలబోయాయి. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం వివిధ కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లో జరిగిన భారీ ప్రదర్శనలో యుపిఎ-2 ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని వక్తలు డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు కార్మిక సంఘాలు రూపకల్పన చేస్తాయని హెచ్చరించారు.

Leave a Reply

free website analytics