సర్కారుపై మండిపడ్డ చంద్రబాబు

10-3slider5
ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది సంక్షేమ బడ్జెట్ కాదని… తాగుబోతుల బడ్జెట్ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. పేదల రక్తాన్ని పిండి ఖజానా నింపుకోవడమే ఏకైక కార్యక్రమంగా ఈ బడ్జెట్లో కనిపిస్తోందని, గొంతు తడుపుకోవడానికి మంచి నీరు ఇవ్వలేకపోయినా ఊరూరా అడగకుండానే మద్యాన్ని పారిస్తున్నారని ధ్వజమెత్తారు.
మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లా డుతూ, “ఈ 8 నెలల్లో వచ్చినన్ని సమస్యలు రాష్ట్ర ప్రజలకు ఎన్నడూ రాలేదు. ప్రజలకు నరకం ఇక్కడే కనిపిస్తోంది. వరదల్లో రూ. 12వేల కోట్ల నష్టం వాటిల్లినా పైసా పరిహారం లేదు. ఈ సమస్యలపై ప్రతిపక్షంగా టీడీపీ మడమ తిప్పని పోరాటం చేస్తోంది” అని చెప్పారు. విద్యుత్ కోతకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ ముందు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గన్‌పార్కులో కరెంటుతీగలు కట్టి వాటిపై దుస్తులారేశారు. ఈ సందర్భంగా వామపక్షాల ఎమ్మెల్యేలూ పాల్గొన్నారు. కాలిపోతున్న మోటార్లను ప్రదర్శనలో ఉంచారు. పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతుల దుస్థితిని తెలియజేస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉరేసుకున్నట్టు నటించారు. నమూనా అసెంబ్లీలో పోచారం సీఎం పాత్ర పోషించారు.
20న ధర్నాలు: తెలుగు రైతు
విద్యుత్ కోతలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని తెలుగురైతు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వ్యవసాయానికి 9గంటలు సరఫరా చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 20న అన్ని జిల్లాల్లో ఎస్ఈ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని, 27న అన్ని మండలాల్లో సబ్‌స్టేషన్ల ముట్టడి నిర్వహించాలని రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది.
మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు చీకట్లో చదువుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, దీపాలు పెట్టుకుందామన్నా కిరోసిన్ ధర పెంచారని దుయ్యబట్టారు. కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో తాగునీటి సమస్య కూడా నెలకొందన్నారు.

Leave a Reply