సర్కార్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు

an-1260137650132ఒక వైపున వరదల్లో సర్వస్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు కాంగ్రెస్ సర్కార్ నరకం చూపెట్టిందని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కనీసం ఆహారం కూడా సరఫరా చేయకపోగా ముఖ్యమంత్రి రోశయ్య హెలికాప్టర్ లోను, మంత్రులు బోట్లలోనూ షికార్లు చేశారని ఆయన దుయ్యబట్టారు. రెవెన్యూ మంత్రి అయితే, అసలు వరద బాధిత ప్రాంతాలను కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత దారుణం, హేయం అని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. అప్రకటిత విద్యుత్ కోతపై విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించిన అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం శాసనసభా పక్ష నేత చంద్రబాబు నాయుడు వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ దాడికి దిగారు.  కాగా, కచ్చితంగా మానవ తప్పిదం వల్లే వరదలు వచ్చిపడ్డాయని టిడిపి, లెఫ్ట్ పార్టీలు, ప్రజారాజ్యం పార్టీ ఆరోపించాయి. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదని, నరకం చూపించిందని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన సమాధానమిస్తూ, వరద ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసంబద్ధం అన్నారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ధర్మాన వ్యాఖ్యలతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో సభలో గందరగోళం నెలకొన్నది. సభ సజావుగా నడిచే పరిస్థితి కనిపించకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

Leave a Reply

free website analytics