సెలవుపై ఎపిపిఎస్‌సి చైర్మన్‌ – నేడు ఎపిపిఎస్‌సి అత్యవసర భేటీ

08.09
గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణపై వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ వై.వెంకట్రామిరెడ్డి మూడు మాసాల పాటు సెలవుపై వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రూప్‌-1 ఎంపిక పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వమే సెలవులపై వెళ్ళాలని ఆదేశించి ందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా తానే సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని సంక ల్పించినట్టు వెంకట్రామిరెడ్డి తన సన్నిహితులకు చెప్పారని సమాచారం. గత ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణావాదులు, కాంగ్రెస్‌ పార్టీలోని తెలంగాణా ప్రాంత నేతలు ప్రయత్నించడం, వెంకట్రామిరెడ్డిపై తెరాస అధినేత కెసిఆర్‌తోపాటు ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేయడంతో ఆయన సెలవుపై వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు.  వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా వెంకట్రామి రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. జనవరి మాసం దాకా సెలవుపై వెళ్ళి ఫిబ్రవరిలో వెళ్ళి తిరిగి విధులకు
హాజరు కావాలని ఆ మాసమంతా పదవిలో కొనసాగి పదవీ విరమణ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే గ్రూప్‌-1 వివాదాలకు వెంకట్రామిరెడ్డియే కారణమని పలువురు మంత్రులు, తెలంగాణావాదులు, తెలంగాణా విద్యార్థుల జేఏసీ ఆరోపించడం ఈ అంశాన్ని ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం కూడా తీవ్రంగా పరిగణించిందని తెలిసింది. రెండుసార్లు వాయిదా వేసిన గ్రూప్‌-1 ఎంపిక పరీక్షను మరోసారి వాయిదా వేస్తే బాగుండేదని అనవసరంగా పరీక్షను జరిపి సమస్యను మరింత జఠిలం చేశారని ఢిల్లిలోనూ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు వ్యాఖ్యానించారని సమాచారం.  వెంకట్రామిరెడ్డి వ్యవహారశైలిపై గవర్నర్‌ నరసింహన్‌ కూడా అసంతృప్తితో ఉన్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. గ్రూప్‌-1 సమస్యను ఎంతో చాకచక్యంతో వ్యవహరించవలసిన ఏపీపీఎస్సీ ఈ విషయంలో ఘోర వైఫల్యం చెందిందని గవర్నర్‌ అభిప్రాయపడుతున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. పరీక్షకు పదిహేను రోజుల ముందే సమస్యపై లోతుగా అధ్యయనం చేసి ఇరువర్గాలను చర్చలకు ఆహ్వానించి ఉంటే వివాదం ఇంతవరకు వచ్చి ఉండేది కాదని గవర్నర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రోశయ్య సైతం ఏపీపీఎస్సీ పనితీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నట్లు తెలిసింది. తనకు వచ్చిన ఫిర్యాదులను, వినతిపత్రాలను ప్రభుత్వానికి పంపించవలసిన ఏపీపీఎస్సీ వాటిని తమదగ్గరే ఉంచుకుని సమస్యను జఠిలం చేసిందని వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వానికి పంపి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్‌-1 పరీక్షను నిర్వహించి ఉండేవారమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో జూనియర్‌ లెక్చరర్ల ఎంపిక పరీక్ష విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారని తాజాగా విమర్శలు వస్తున్నాయి. కమిషన్‌ స్వయంప్రతిపత్తి గల సంస్థ అని తమకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని చెప్పుకుంటున్న వెంకట్రామిరెడ్డి సమస్యలు వచ్చే సరికే వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వంపై నెట్టడం ఆయనకు అలవాటుగా మారిందని సీనియర్‌ మంత్రి ఒకరు విమర్శించారు. పోటీ పరీక్షల తేదీల ఖరారు విషయంలో ఎవరి ప్రమేయం లేకుండా తనకుతానే తేదీలను నిర్ణయించి ప్రకటిస్తున్నారని తీరా పరీక్షల వాయిదా అంశం వచ్చే సరికి పక్కకు తప్పుకుని ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని సాక్షాత్తూ ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిన విషయం విదితమే.  తెలంగాణా ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ ప్రాంత అభ్యర్థులను ఇబ్బందులు పెట్టేందుకే వెంకట్రామిరెడ్డి ఉద్దేశ పూర్వకంగా గతంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్ష వివరాలను లగడపాటిికి అందజేశారని, దీన్ని అదునుగా తీసుకుని ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణాను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తుతున్నారు.
పరీక్ష తిరిగి నిర్వహణపై నేడు నిర్ణయం
ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-1 ఎంపిక పరీక్ష ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రం కూడా పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే బయటకి పొక్కడంతో తిరిగి పరీక్షను నిర్వహించాలా? వద్దా? అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు ఏపీపీఎస్సీ పాలకమండలి అత్యవసరంగా సమావేశమవుతోంది. తెలంగాణా ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తి ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  ఒక పరీక్ష కేంద్రంలో తిరిగి పరీక్ష నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గతంలో ఏపీపీఎస్సీ ఇటువంటి తరహా పరీక్షలను జరపలేదని చెబుతోంది. తెలంగాణా ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రాలు అందజేశారు.

Leave a Reply

free website analytics