సెల్‌టవర్ ఎక్కితే పదివేలు, ఆమరణ దీక్షకు పాతికవేలు ఇచ్చిన కేసీఆర్ – ఐటిఏ
“సమైక్యవాదపోరాట ఉద్యమం కృత్రిమం.. మా ప్రత్యేక తెలంగాణ పోరాటమే నిజం” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై.. ఐటీఏ బహిరంగంగా సమాధాన మిచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఐటీఏ ప్రెసిడెంట్ నగేష్ మాట్లాడుతూ.. “తా చెడ్డకోతి వనమంతా చెరిచింద”న్న మాటను నిజం చేస్తూ.. పచ్చని జన్మభూమిలో కేసీఆర్ చిచ్చు పెట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలంగాణ తెలుగు సోదరులంతా గ్రహించాలని గుర్తు చేశారు. మంటలు చల్లారుతాయోమోనని లేచి కూర్చుని అమాయక ప్రజలను రెచ్చగొడుతున్న కేసీఆర్.. నిన్నటి వ్యాఖ్యల్లో శ్రీకాకుళం ఎన్జీవోలకు, రైతులకు సమైకాంధ్ర పోరాటంలో పాల్గొంటే అధికంగా వచ్చే లాభమేంటని ప్రశ్నించిన తీరును నగేష్ తప్పుబట్టారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని వేర్పాటువాదాన్ని ప్రారంభించిన కేసీఆర్ వంటి స్వార్థ రాజకీయ నాయకుల వల్ల జన్మభూమి చీలిపోకూడదని ఆయన తెలిపారు. “సమైక్యవాద ఉద్యమం” దేశభక్తిలోంచి పుట్టినదనే విషయం వేర్పాటువాదులకు, స్వార్థపరులకు అర్థమయ్యే అవకాశం లేదని నగేష్ ఆరోపించారు. సెల్‌టవర్ ఎక్కితే పదివేలు, ఆమరణ దీక్షకు పాతికవేలు చొప్పున కేసీఆర్ అంతకు ముందు ఇచ్చారు కనుకనే ఆయనకు అటువంటి ఊహలు వచ్చాయని విమర్శించారు. ఆమరణ దీక్షలో కూర్చునే ముందే.. తెలంగాణా యూనివర్శిటీల్లో తిరిగి కొంతమందిని ప్రత్యేకించి అక్కడ ఆందోళన చేసేటట్లు వ్యూహరచన చేశారని, అందుకుగాను ఆయన డబ్బు పంచారని నగేష్ అన్నారు. అమాయకుడైన కూలీ కూడా.. కలిసుంటే పనులెక్కువొస్తాయని తేల్చి చెబుతాడని, కానీ కేసీఆర్ లాంటి వేర్పాటు వాదులు స్వార్థప్రయోజనాలను ఆశించి దొంగదీక్షలు చేస్తున్నారని నగేష్ అన్నారు. బుద్ధిమంతులు ఎవరైనా.. కలిసుంటే వ్యాపారాలు బాగుంటాయనే చెబుతారని, అలాంటి సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తూ.. అమాయక విద్యార్థుల్ని రెచ్చగొడుతూ.. కేసీఆర్ మొసలికన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు. అణుబాంబులొచ్చినా నన్నేమీచేయలేవన్న కేసీఆర్ వాఖ్యలపై నగేష్ స్పందిస్తూ.. నిజానికి తెలంగాణ ప్రజల భ్రమలు తొలగించుకుని నీ అసలు రూపమేంటో తెలుసుకునేంత వరకు కేసీఆర్ కష్టాల్ని రగిలిస్తూనే ఉంటాడని అన్నారు. కేసీఆర్ పుట్టి చేసిన హానీ చాలునని, ఇకనైనా నోరు పారేసుకోవద్దని నగేష్ అన్నారు. నిజమైన రాజకీయ ఊసరవెల్లులు వేరేవారిని ఊసరవెల్లుగా చూడక ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.




