హక్కుల కోసం గర్జించిన హోంగార్డులు – కిషన్‌రెడ్డి దీక్షకు గుండా మల్లేష్ మద్దతు

వేతనాలు పెంచాలని కోరుతూ హక్కుల కోసం హోంగార్డులు గర్జించారు. వందలాదిమంది హోంగార్డులు రాజధాని నగరంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరుబాట వీడమని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. హోంగార్డుల పోరాటానికి అండగా ఉంటామని సిపిఐ, బిజెపి, ఎంఆర్‌పిఎస్, తెలంగాణా మాలయువసేనతో పాటు పలు ప్రజాసంఘాలు బాసటగా నిలిచాయి. కాగా, హోంగార్డుల ఆందోళనకు సంఘీభావంగా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. తొలుత దీక్షా శిబిరాన్ని సిపిఐ శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేష్, బిజెపి జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ, ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ, మాజీ మంత్రి రామస్వామిలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. గుండా మల్లేష్ మాట్లాడుతూ హోంగార్డులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తున్నదని విమర్శించారు. కనీస వేతనాలు అమలుచేయకుండా చట్టాలను పాలకులు ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న 40వేల మంది హోంగార్డులు దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో కీలకపాత్ర వహిస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రస్తుత తరుణంలో రోజుకు 130 వేతనం సరిపోతుందా? అని ప్రశ్నించారు. కార్మికశాఖ నిర్వహించిన శాస్త్రీయ సర్వే ప్రకారం కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని తేల్చారన్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించకపోతే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో కలసి ఐక్య ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని ప్రకటిస్తున్నారని, ఎవరికి ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారికంగా హోంగార్డులతో వెట్టిచాకిరి చేయిస్తున్నదని విమర్శించారు. సమస్యలపై వై.ఎస్.కు 145 లేఖలు రాశానని, రోశయ్యకు 21 లేఖలు, 22వ లేఖ హోంగార్డుల సమస్యలపై రాస్తానన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య నివాసాన్ని, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇది హోంగార్డుల ఆకలి పోరాటమన్నారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉన్నా మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇవ్వటంలేదన్నారు. వీరి సమస్యలపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే 3250 వేతనంతో తల్లిదండ్రులను ఏ విధంగా పోషించుకుంటారు? పిల్లలను ఎలా చదివించుకుంటారని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీలతో కలసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




