హైదరాబాద్ హలీంకు పేటెంట్ సర్టిఫికెట్ ప్రదానం

హైదరాబాద్ హలీంకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నదని జాగ్రఫికల్ ఇండికేషన్స్, రిజిస్ట్రార్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్ కంట్రోలర్ జనరల్ పి.హెచ్.కురియన్ అన్నారు. రంజాన్ మాసంలో లభించే హలీం వంటకం హైదరాబాద్‌లో మాత్రం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండటం విశేషమని ఆయన ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని గ్రాండ్‌ప్లాజా హోటల్‌లో హలీంకు పేటెంట్ సర్టిఫికెట్‌ను ఆయన ప్రదానం చేశారు. హలీం మేకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు ఎం.ఎ. మజీద్ ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. హైదరాబాద్ హలీంకు పేటెంట్ లభించడం దేశానికే గర్వకారణమని ఈ సందర్భంగా కురియన్ అన్నారు. డార్జిలింగ్ టీ మాదిరిగా ఇప్పుడు హైదరాబాద్ హలీంకు నిఖార్సైన గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం హైదరాబాద్ హలీంను మరే నగరంలోనూ విక్రయించరాదని, ఒకవేళ విక్రయించాల్సి వస్తే హలీం మేకర్స్ అసోసియేషన్ అనుమతి తప్పనిసరని ఆయన వెల్లడించారు. పేటెంట్ సర్టిఫికెట్ గ్రహీత ఎం.ఎ.మజీద్ స్పందిస్తూ హైదరాబాద్ హలీంకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు. ఈ హలీం రుచి విషయంలో తమసంస్థ రాజీ పడబోదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ ధనాని, ఎఐపిసి కన్సల్టెంట్ రవి, ఇండియా పేటెంట్ ఆఫీస్ వైజ్ఞానిక సలహాదారు డాక్టర్ కల్పనా శాస్త్రి, జాతీయ మాంస పరిశోధన కేంద్రం సంచాలకులు డాక్టర్ ఎన్.కొండయ్య, పర్యాటక అభివృద్ధి సంస్థ సంచాలకులు సుబోధ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.




