‘సాలూర ’ పైకి ‘శివ ’ సైన్యం

నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు జోలికి వస్తే ఊరుకోబోమని, మహారాష్ట్ర నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా అడ్డుకుంటామని మహారాష్టక్రు చెందిన శివసేన ఎమ్మెల్యేలు గురువారం హిచ్చరించారు. ముంబాయి ఎమ్మెల్యే సుహాస్‌సహంత్, పర్భని ఎమ్మెల్యే బందు జాదవ్ ఈ హెచ్చరిక చేశారు ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మంజీరానది ఒడ్డున నిర్మించిన ‘సాలూర’ ఎత్తిపోతలపథకాన్ని పరిశీలిం చేందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, 200 మంది శివసేన కార్యకర్తలు గురు వారం కొన్ని వాహనాలపై వచ్చారు. మధ్యలో పోలీసులుఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తోసి, దూసుకొచ్చారు.
నాటకాలాడితే ఊరుకోం
బాబ్లీ ప్రాజెక్టు అక్రమ కట్టడం అని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘రాజకీయ నాటకం’ ఆడుతున్నారని, ఈ నాటకాలు తమ ప్రాంతంలో చెల్లవని వారు స్పష్టం చేశారు. బాబీ జోలికి వస్తే మహా రాష్ట్ర సరిహద్దుల్లోని నీటి పథకాలకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటామని సుహాస్ సహం త్, బందు జాదవ్ హెచ్చరించారు.
‘మా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిందన్న సంగతి చంద్రబాబు నాయుడుకు తెలీదా? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందికదా? ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పుడే ఎందుకు ఆపలేకపో యారు? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, నేరుగా పాల్గొనలేక బాబ్లీ విషయాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబునాయుడు రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని ఇద్దరు ఎమ్మెల్యేలు ఘాటుగా విమర్శించారు.
పోలీసులు అడ్డుకున్నా…
ఈ ప్రాంతంలో మహారాష్ట్ర పోలీసులు సైతం శివసేన ఎమ్మెల్యేలను, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, కొంత మంది బారికేడ్లను దాటి దూసుకొచ్చి లిఫ్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. బాబ్లీ ప్రాజెక్టుపై మరోసారి వివాదం సృష్టిస్తే సాలూర ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రాంతం నుంచి తొలగించడం తప్పదని వారు హెచ్చరించారు.
ఎమ్మెల్యేల వెంట నాందేడ్ జిల్లా శివసేన జిల్లా అధ్యక్షుడు హేమంత్ పాటిల్, నాందేడ్ మాజీ ఎమ్మెల్యే అంగ్‌షయా శెట్కార్, శివసేన ఉపాధ్యక్షుడు ప్రకాష్ మరావర్, సాలూర ప్రాంతం శివసేన అధ్యక్షుడు విశ్వనాథ్, ధర్మాబాద్ శివసేన అధ్యక్షుడు అశోక్ తుడిమే, మహిళా కార్యకర్తలు జెండాలు ధరించి నినాదాలు చేశారు. ఆంధ్రా ప్రాంతంలోకి శివసేన నాయకులు తరలి రాకుండా బోధన్ డిఎస్‌పి జాఫర్ జావేద్ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసు బలగాలను బందోబస్తుగా ఏర్పాటుచేశారు.
సంఘటన స్థలానికి నిజామాబాద్ జిల్లా ఎంపీ మధుయాష్కిగౌడ్, బోధన్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ గౌసుద్దీన్, ఎంపిపి గిర్దావర్ గంగారెడ్డి, టీడీపీ కన్వీనర్ అమర్‌నాథ్‌బాబు తదితర నాయకులు మహారాష్ట్ర నీటి దోపిడిపై ప్రసంగించారు. ఆ సమయంలో ఎత్తిపోతల పథకం ఉన్న సాలూర ప్రాంత రైతులు కర్రలతో అక్కడికి చేరుకున్నారు. వివిధ పార్టీల కార్యకర్తలు, శివసేన కార్యకర్తలు కూడా వచ్చారు. అవతలి నుంచి దాడులు చేస్తే తాము దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులు ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తిరిగి బారికేడ్లు దాటించి మహారాష్టక్రు పంపించేశారు.




