11, 12 తేదీల్లో గవర్నర్ జిల్లా పర్యటన

రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ రెండురోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 11న జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 11న ఉదయం 6.20 గంటలకు హైదరాబాద్‌లో కింగ్ ఫిషర్ విమానంలో బయలుదేరి 7.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 8 గంటలకు ప్రభుత్వ హెలికాప్టర్‌లో బయలుదేరి 8.45 నిమిషాలకు మదనపల్లె సమీపంలోని అంగల్లు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను చేరుకుంటారు. అక్కడనుంచి తుమ్మచెట్లపల్లికి బయలుదేరి 9 గంటలకు స్థానిక శాటిలైట్ పాఠశాలలో విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడనుండి 9.40 నిమిషాలకు బయలుదేరి రివర్ స్కూల్ 9.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ విద్యార్ధులతో, టీచర్లతో ముఖాముఖి చర్చలో పాల్గొన్న అనంతరం 10.15 గంటలకు అక్కడ బయలుదేరి రుషి వ్యాలీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కు వెళతారు. 10.25 నుండి రుషి వ్యాలీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్ధులు, టీచర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడనుంచి 11 గంటలకు బయలుదేరి హార్స్‌లీ హిల్స్‌కు వెళతారు. 11.30 నుండి 11.45 మధ్యన హార్స్‌లీ హిల్స్‌లోని గవర్నర్ బంగ్లాలో నూతన గదిని ప్రారంభిస్తారు. 11.45 నుంచి 2.45 వరకు హార్స్‌లీ హిల్స్‌లో విశ్రాంతి తీసుకుని 3 గంటలకు బయలుదేరి 3.25కు అంగల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.30కు అంగల్లు హెలిప్యాడ్ నుండి ప్రభుత్వ హెలికాప్టర్‌లో బయలుదేరి తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 3.50 నిమిషాలకు చేరుకుంటారు. 4 గంటలకు స్థానిక పద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకున్న అనంతరం 4.30కు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5 నుండి 5.30 గంటల మధ్యన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి 5.50కి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 6.15కు తిరుపతిలో బయలుదేరి 7 గంటలకు తిరుమలకు వెళ్ళి అక్కడ శ్రీపద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. అదే విధంగా 12వ తేది ఉదయం 7.30 గంటల నుండి 9 గంటల మధ్యన తిరుమలలో జరిగే అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30కు తిరుమలలో బయలుదేరి 10.15 నిమిషాలకు శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీకి చేరుకుంటారు. 10.25 నుండి 12.35 నిమిషాల వరకు 50వ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 12.40కు అక్కడ నుంచి బయలుదేరి 12.45కు పద్మావతి అతిథి గృహం చేరుకుని స్వల్ప విరామం అనంతరం 1.40కి రేణిగుంట విమానాశ్రయం బయలుదేరుతారు. 2.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు వెళతారు.




