అనంతపూర్

జిల్లాలోని రైతులకు పంట రుణాల కింద ఇప్పటివరకు రూ.601 కోట్లు పంపిణీ చేయడమైందని, ఈనెలాఖరులోపు నిర్ధేశిత లక్ష్యంతో 50శాతం (రూ.800 కోట్లు) పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.జనార్ధన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పంట రుణాల పంపిణీపై బ్యాంక్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ బ్రాంచి వారీగా ఎంతశాతం పంటరుణాలు పంపిణీ చేసిన ప్రక్రియను సమీక్షించుకుని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు తగు రీతిలో ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొన్ని బ్యాంక్ బ్రాంచ్‌ల నందు ఇప్పటివరకు రుణాల పంపిణీ, గ్రామాల వారి వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే రీతిలో ప్రదర్శించలేదన్నారు. అందుకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. పంట రుణాలకై వచ్చిన రైతులకు టోకన్లను జారీ చేసి క్రమపద్ధతిలో పంపిణీ చేసి మిగిలిన రైతులకు కేటాయించిన సమయంలో బ్యాంకులకు రావాల్సిందిగా సూచించాలన్నారు.
అందుకు బ్యాంక్ అధికారులు సమస్యలను వివరించి రైతులకు సర్ధిచెప్పాలన్నారు. ఎటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలతో లోపభూయిష్టమైన సమాచారంను నమోదు చేసి పంట రుణం మంజూరుకై ఎవరు వచ్చినా తక్షణమే సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్పందించి అలాంటివారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ప్రతి బ్యాంక్ మేనేజర్ కనీసం ఒక్కకేసునైనా నమోదు చేయాలన్నారు. ఎన్నో ఒత్తిడులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనను విడనాడాలన్నారు. పంటరుణాల మంజూరుకై సంబంధిత రెవెన్యూ అధికారులు తగిన సమాచారం ఎప్పటికపుడు బ్యాంక్ అధికారులకు అందిచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి అనితారామచంద్రన్, ఎల్‌డిఎం రాఘవేంద్రరావు, పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్, సిండికేట్ బ్యాంక్ సిఎం రవిశంకర్, ఎస్‌బిఐ సిఎం భాస్కర్‌రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ సిఎం సోమరాజు, కులకర్ణి తదితరులు పొల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని అగళి మండలంలో ప్రవహించే సువర్ణముఖి నది కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకా సిద్దనకొండలో పుట్టి గూబలగట్ట, నాగేపల్లి, చంద్రగిరి, హొసగళి, కిత్తగళి మీదుగా మండలంలో ప్రవహిస్తోంది. గత 15ఏళ్ళ క్రితం కర్ణాటక ప్రభుత్వం గూబలగట్ట వద్ద సువర్ణముఖి నదికి అడ్డంగా రెండు కొండల అంచులను కలుపుతూ పెద్ద డ్యాంను నిర్మించారు. ఫలితంగా అగళి మండల చెరువులకు చుక్కనీరు పైనుంచి రావడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి నీరు రాకపోవడంతో బావులు, బోర్లు, కుంటలు, చెరువులు నీరు లేక ఎండిపోయాయి. అక్కడ అడ్డంగా డ్యాం నిర్మించడంతో నదికి అడ్డంగా బడువనపల్లి, నాగేపల్లి, హొసళ్ళి, కిత్తగళి, భీమనకుంట వద్ద పెద్ద చెరువులు, చెక్‌డ్యాలు, అడ్డుకట్టలు నిర్మించారు.
దీంతో ఎగువ ప్రాంతం నుంచి తమ వాటా నీరు సైతం కర్ణాటక వాసులు కొల్లగొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అగళి మండలంలో నీరు లేక పెద్ద చెరువులైన మధూడి, అగళి, ఇరిగేపల్లి చెరువులు నిండి 15ఏళ్ళు అయింది. చెరువులు మొత్తం ముళ్ళకంపలు, పిచ్చిమొక్కలతో పేరుకుపోయాయి. వందల ఎకరాల్లో ఉన్న కొబ్బరి, వక్క చెట్లు నీరు లేక పూర్తి ఎండిపోయాయి. అదే కర్ణాటక రాష్ట్ర గూబలగట్ట, బడవనహళ్ళి, చంద్రగిరి, నాగేపల్లి, భీమనకుంట, రంట్వాళలు, దండినదిబ్బ, సిడిదర గల్లు తదితర 30గ్రామాల రైతులు వక్క, కొబ్బరి, పూల తోటలతో కళకళలాడుతున్నాయి. మన పాలకులు ఎగువ ప్రాంతంలో మన నీటిని కొల్లగొడుతూ ఏ కట్టడాలు కట్టినా వాటిని అడ్డుకోవడంలో ప్రజాప్రతినిధులు విఫమయ్యారని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారుల ఉదాసీనత వైఖరిని నిరసిస్తూ సిపియం నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక తహసీల్దార్ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిం చే దాకా ప్రతి రోజూ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగుల విధులను ఆటంకం కలిగిస్తామని హెచ్చరిస్తూ తహసీల్దార్ ఛాంబర్‌లో ఆందోళనకారులు గంటపాటు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా సిపియం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లస్థలాలతో పాటు ఇళ్లుకూడా నిర్మింపచేస్తామని గొప్పలు చెబుతున్నా, ఆ పథకాలన్నీ కేవలం అనర్హుల దరి చేర్చారని, అర్హులను గుర్తించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. పట్టణంలో చాలా మంది నిరుపేదలు తలదాచుకోవడానికి ఇళ్లు లేక వారు ప్రభుత్వ స్థలాల్లో పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, ప్రస్తుతం వారు కాపురం ఉన్న స్థలాలకే ప్రభుత్వం పట్టాలను అందజేయాలని డిమాండ్ చేశారు.
కసాపురంలో ఓ ఆలయానికి సంబంధించిన ఇనామ్ భూములను ప్రభుత్వం భూసేకరణ జరిపించి ఆ స్థలాల్లో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వేలాది రేషన్‌కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వం, బోగస్ ఏరివేతలో భాగంగా ఇంటిగ్రేటెడ్ పేరుతో నిర్వహించిన సర్వేలో అర్హులకార్డులను తొలగించడం ఎంతమేరకు సమంజసమని శ్రీనివాసులు ప్రశ్నించారు. దీపం కింద పేదలకు గ్యాస్ కనెక్షన్‌ను మంజూరు చేసిన ప్రభుత్వమే, తిరిగి కార్డుదారులకు కిరోసిన్ కోటాను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. దీంతో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమైయ్యారని ఆయన దుయ్యబట్టారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్లు ఆమరణ దీక్షలు చేపడుతున్నా మీరు పట్టించుకోరా అని సిఐటియు పట్టణ కార్యదర్శి సాధిక్ నిలదీశారు. అంతలోనే తహసీల్దార్ నారాయణరావు బదులిస్తూ ఇది కూడా ప్రజాసమస్యలను పరిష్కరించే కార్యాలయమేన ని, తాము కూడా ప్రజా సేవకులమేనని గుర్తుచేశారు.
అంత లోనే సిపియం నాయకులు ప్రజాసేవకులైతే ఇన్నాళ్లు సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు కాలక్షేపం చేస్తున్నారని వాదనకు దిగారు. ఈ దశలో పోలీసులు ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే సిపియం నాయకులు పోలీసులు బయటికి వెళ్లాలని నినాదాలు చే శారు. చివరకు తహసీల్దార్ నారాయణరావు స్పందించి తన పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు ప్రారంభిస్తానని హామీ ఇవ్వడంతో వారు సిపియం నాయకులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో సిపియం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, సిఐటియు పట్టణ కార్యదర్శి సాధిక్‌భాషా, సిపియం ఐదవ జోన్ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, నాయకులు కుళ్లాయప్ప, కెవిపిఎస్ డివిజన్ కార్య దర్శి వై.శ్రీనివాసులు, ఐద్వా నాయకురాలు ఇందిరమ్మలతోపాటు పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ధి ముగింపు ఉత్సవాలు సమీపిస్తున్నందున సంబంధిత జిల్లా అధికారయంత్రాంగం వారికి కేటాయించిన విధుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిత్యం చేపట్టాల్సిన పనులను సమీక్షించుకుని తగు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.బి.జనార్ధన్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక డ్వామా సమావేశ హాలులో కలెక్టర్ అధ్యక్షతన అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న పెనుకొండలో పర్వతారోహణ కార్యక్రమానికి విశేషస్పందన లభించడం అభినందనీయమని, పర్వతారోహణ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎంతో సమాచారాన్ని తెలుసుకోవడంతో జీవితంలో మరుపురాని ఘటనంగా నిలుస్తుందన్నారు. రాయల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రతిశాఖాధికారి వారి శాఖలచే సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను ఛాయాచిత్ర ప్రదర్శనలను, వాస్తవికత ఉట్టిపడేలా నమూనాలతో ఛాయా చిత్రప్రదర్శనను ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 5,6,7 తేదీల్లో డివిజన్ల వారీగా విద్యార్థులను ఉత్సవాలను తిలకించుటకై ప్రవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో చర్చించి వారివద్ద వాహనాలను వినియోగించుటకు ఆర్డీఓలు, విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు జెసి కేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి రంగయ్య, ఎస్‌ఎస్‌ఏ పిఓ రామచంద్రారెడ్డి, నగరపాలక సంస్థకమిషనర్ శివకోటిప్రసాద్‌తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధి కసాపురం ఆంజనేయుడు వెల సిన పుణ్యక్షేత్రాన్ని వ్యాపారకేంద్రంగా మార్చవద్దు .. భక్తులను నిలువుదోపిడి చేసే విధం గా పూజా, నివేదల ధరలను పెంచేందుకు ఆమోదముద్ర వేసిన పాలకమండలి వ్యవహా రం ఆదిలోనే పిచ్చితుగ్లక్ పాలనకు ప్రతీకగా నిలిచిందని భజరంగదళ్ జిల్లా ఉపాధ్యక్షు డు మం జులా వెంకటేష్ ఆరోపించారు. సోమవారం భజరంగదళ్, విహెచ్‌పి నాయకులు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా భజరంగదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, విహెచ్‌పి పట్టణ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడుతూ కలియుగ దైవం కసాపు రం ఆంజ నేయస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఉన్న ఆలయ పాలనా యంత్రాంగం, ఒక్క సారిగా భక్తులపై ధరల భారాన్ని మోపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నా మని చెప్పారు. అలాగే కేసరి సదనంలోని వసతి గృహాలు కూలడానికి సిద్ధంగా ఉంటే వాటికి మరమ్మతుల పేరిట రూ.29 లక్షల నిధులను ఖర్చు పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. ఒక వేళ ఆ నిధుల ద్వారా మరమ్మతులు చేయించినట్లయితే భక్తులు విశ్వాసంతో ఇచ్చిన కానుకలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారడం తధ్యమని వారు తెలి పారు. మరమ్మతులని చెప్పి నిధులను వృథాచేయకుండా అదే రూ. 29 లక్షలతో భక్తుల సౌకర్యార్థం కొత్త డార్మెటరీ హాల్‌ను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
ఆలయ పరిసరాల్లో మొదట పరిశుభ్రత పాటించి భక్తులు అనారోగ్యాలకు గురికాకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని వెంకటేష్ సూచించాడు. అభివృద్ధి పనుల పేరిట భక్తులు విశ్వాసంతో హుండీల్లో వేసిన కానుకలను మంచి కార్యక్రమాలకు సద్వినియోగానికి ఖర్చు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలే గానీ, వృథా చేసే విధంగా పాలకమండలి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఆయన విజ్ఞప్తి చేశారు. శాశ్వత పూజా, నివేదనల ధరలను పెంచుతూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన కసాపురం ఆలయం వద్ద ‘ఘంటా నాదం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భజరంగదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, విహెచ్‌పి పట్టణ అధ్యక్షుడు విశ్వనాథ్, కార్యదర్శి మారుతి దాస్, భజరంగదళ్ నాయకుడు బాబూ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు మండల ప్రెసిడెంట్ దాదెం శ్యామలమ్మ తన పదవికి సోమవారం రాజీనామా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల మేరకు గతంలో జరిగిన ప్రాదేశిక సభ్యుల ఎన్నిక మేరకు అప్పట్లోనున్న శాసన సభ్యులు పల్లె రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రాధేశిక సభ్యులు చేసుకొన్న ఒప్పందం మేరకు రెండు సంవత్సరాలు దాదెం శ్యామలమ్మ, మిగితా కాలం శాంతమ్మ ను ఎంపిక చేసే విధంగా పల్లె రఘునాథ్‌రెడ్డి వద్ద ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రాదేశిక సభ్యులు పేర్కొన్నారు.
ఈ విషయంలో నియోజక వర్గ పునర్‌విభజనలో భాగంగా నల్లచెరువు మండలం కదిరి నియోజక వర్గానికి విలీనమైంది. తర్వాత కదిరి శాసన సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఈ ఒప్పందం పై స్థానిక జడ్పీటీసి అబ్ధుల్‌ఖాదర్ ఒప్పందం ప్రకారం పార్టీ ప్రతిష్టకై దాదెం శ్యామలమ్మను రాజీనామా చేయాల్సిందిగా పలు మార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పటికే ఒప్పందాన్ని మించి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా దాదెం శ్యామలమ్మ రాజీనామా చేయకపోవడంతో జడ్పీటీసి మెజార్టీ సభ్యుల చేత అవిశ్వాస తీర్మాణానికి రంగం సిద్దం చేశారు. ఈ విషయం పై కలత చెందిన శాసన సభ్యులు దాదెం శ్యామలమ్మను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో సోమవారం శ్యామలమ్మ అనంతపురం జడ్పీ ఇన్‌చార్జ్ సిఇఓ వద్ద రాజీనామాను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఎమ్పీపి భర్త శివారెడ్డిని వివరణ కోరగా స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఒత్తిడి మేరకు తన భార్య ఎమ్పీపి పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పలు కాలనీలలో మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాహశీల్ధార్ కార్యాలయం ఎదుట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ మాట్లాడుతూ బుక్కరాయ సముద్రం మండల పరిధిలో వీరభద్ర కాలనీ, కెవియస్ నగర్, ఐలమ్మ కాలనీ, శర్మాస్ కాలనీ, గుజ్జుల సరళాదేవి కాలనీ తదితర కాలనీలలో ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిసున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మంచినీరు, మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్ళు, విద్యుత్ సరఫరా, ఇళ్ళపట్టాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించ డంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. సిపిఐ తాలూకా కార్యదర్శి సి.మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెసీమల, పట్టణ ప్రాంతాలలో అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నామని ప్రకటనలు చే స్తోందే తప్ప వాటిని అమలు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.
కాలనీలలో సమస్యలు తీర్చకపోతే తాహసిల్దార్ కార్యాలయం ముందు ప్రతిరోజు ఒక్కో కాలనీవాసులు వచ్చి దిగ్బంధనం చేసి కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలనుండి వీరభద్ర కాలనీలో విద్యుత్ లేకపోవటంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆ కాలనీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా అనంతరం తాహశీల్ధార్ వరప్రసాద్ రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శింగనమల నియోజక ఇన్‌చార్జ్ వెంకటేష్, మండల కార్యదర్శి నారాయణ స్వామి, జిల్లా రైతు సంఘం నాయకులు కాటమయ్య, రవీంద్ర, హుస్సేన్, సర్పంచులు మహాదేవ్, ప్రజా నాట్య మండలి కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
పట్టణంలో నకిలీనోట్లు చెలామణి చేస్తున్న ఓ యువకుడిని సబ్‌డివిజనల్ క్రైంపార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని తేరువీధిలో సోమవారం రాత్రి 9:00 గంటల సమయంలో ఇద్దరు యువకులు రూ.100ల నకిలీనోట్లు చలామణి చేస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సబ్‌డివిజన్ క్రైంపార్టీ కానిస్టేబుళ్లు శివ, రామాంజినేయులు, వేణు హుటాహుటిన అక్కడికి చేరుకుని సదరు యువకుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అయితే అప్పటికే ఓ యువకుడు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పట్టుబడిన యువకుడు అనంతపురానికి చెందిన మక్బుల్ బాషాగా చెబుతున్నాడు. కాగా పట్టణంలో పెద్ద ఎత్తున నకిలీనోట్లు చెలామణి అవుతున్నట్లు ఆంధ్రజ్యోతిలో గతనెలలో ప్రత్యేక కథనం ప్రచురితమైన సంగతి తెల్సిందే. రూ.100ల నకిలీనోట్లు పెద్ద ఎత్తున చెలామణి చేస్తున్నట్లు కూడా ఆ కథనంలో ప్రచురించింది.
అప్పటినుంచి పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించారు. అయితే దీంతో పాటు పట్టణ వాసులు కూడా అప్రమత్తం కావడంతో ఈ నకిలీనోట్ల చెలామణి వ్యవహారం బట్టబయలైంది. రాత్రివేళ అత్యంత తెలివిగా రూ.100 ల నోట్లను మార్పిస్తూ ఇద్దరు యువకులు తేరు వీధుల్లో వివిధ షాపులకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న యువకుడి ద్వారా మొత్తం గుట్టు విప్పడానికి పోలీసులు తమదైన శైలిలో ధర్యాప్తు ప్రారంభించారు. దీంతోపాటు నకిలీనోట్ల ముఠా కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంలో రెవన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు తహశీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డగించారు. అయినా సిపిఎం నాయకులు, ప్రజలు గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్న కార్యాలయంలోకి చొరబడ్డారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులివ్వాలని అధికారుల ముందు బైఠాయించారు. పోలీసులు నాయకులను బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు, సిపిఎం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలను అడిగేందుకు వచ్చిన తమను బయటకు పంపేందుకు మీరెవరని నాయకులు పోలీసులను నిలదీశారు. ఈ సమయంలో తహశీల్దార్ కలుగజేసుకుని పోలీసులను వారించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ అధికారులు సర్వే నిర్వహించినప్పుడు అర్హులైన వారి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారని విమర్శించారు. జిఎస్‌బిసి కాలువ గడ్డపై దశాబ్దాల కాలంగా నివసిస్తున్న పేదలకు అక్కడే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన తహశీల్దార్ అర్హులైన పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తొలగించిన జాబితాలో అర్హులుంటే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిఎస్‌బిసి కాలువపై ఉన్న పేదలకు పట్టాలిచ్చేందుకు ఆయా శాఖ అధికారులతో సంప్రదించి వారు అనుమతిస్తే పట్టాలిస్తామన్నారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, పట్టణ పేదల సంక్షేమ సంఘం డివిజన్ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి వై.శ్రీనివాసులు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, సిఐటియు పట్టణ కార్యదర్శి సాధిక్‌బాషా, చిన్న వ్యాపరస్తుల సంఘం నాయకులు కుళ్లాయప్ప, ఆవాజ్ కమిటీ నాయకులు ఆయూబ్ ఇరానీ, డివైఎఫ్‌ఐ నాయకులు ఓబిలేసు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తిమ్మప్ప, ఐద్వా నాయకురాలు ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.
2009 సంవత్సరం మార్చి ఐదున పట్టణంలోని కాన్యాకాపరమేశ్వరి గుడిలో ఓ వివాహ కార్యక్రమంలో జరిగని చోరీ కేసుకు సంబంధించి నిందితున్ని గుంతకల్లు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కేసు సంబంధించిన వివరాలను డీఎస్పీ విక్టర్ విలేకరులకు తెలియజేశారు. అనంతపురం పట్టణం విరూపాక్షి నగర్‌కు చెందిన ఐటిఐ విద్యార్థి వర్మ మంజునాథ్ 2009 మార్చి ఐదున గుంతకల్లు పట్టణంలోని కన్యాకా పరమేశ్వరి గుడిలో రాయదుర్గానికి చెందిన జయంతి సుధాకర్ గుప్తా కుమార్తె వివాహం జరిగింది. ఈ వివాహంలో గుర్తుతెలియని దండగులు 21 తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం బళ్లారి చౌరస్తా వద్ద పోలీసులను చూసి మంజునాథ్‌ను అరెస్టు చేశారు. విద్యార్థిని విచారించగా బంగారం కేసుకు సంబంధించిన నిజాన్ని వెల్లడించారు.
పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కుమార్తె గదిలో ఓ వృద్ద మహిళ ఉంది. ఆమె ఏమరపాటును గమనించి పక్కనున్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. వీటిని తన మేనమామ ఇంటిలో పూడ్చిపెట్టాడు. ఖర్చుల కోసం రెండు బంగారు గాజులను తీసుకుని విక్రయించేందుకు సోమవారం వెళ్తుండగా పోలీసులకు పట్టుకున్నారు. ఆతని వద్ద నుంచి 17 తులాల బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మైనర్ అయినందును జువెనెల్ కోర్టులో హాజరి పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ సిఐ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.