కృష్ణా,గోదావరి బేసిన్‌లో చమురు,సహజవాయు అన్వేషణ కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్‌జీసీ ఇంధన రంగంలో అతి పెద్ద కంపెనీలైన బిపి ప్లెక్, ఎగ్డాన్ మోబిల్,బిజి గ్రూపు,బిహెచ్‌పి బిలిటాన్ వంటి సంస్థలతో వ్యూహాత్మకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సంప్రదింపులు ప్రారంభించింది. సముద్రగర్భంలో లోతుగా తవ్వకాలు జరపడంలో అనుభవం ఉన్న పెద్ద కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుతున్నామని చమురు సహజవాయువుల సంస్థ (ఒఎన్‌జీసీ) డైరక్టర్ దినేష్ పాండే మంగళవారంనాడు ఇక్కడ విలేఖరులతో చెప్పారు.
సముద్ర గర్భంలో తవ్వకాలకు సంబంధించి కెజి-డిడబ్ల్యుఎన్-98 2 బ్లాకు విషయమై ప్రభుత్వం ఆమోదం లభించడంలో జాప్యం జరిగినందుకు నార్వేకి చెందిన స్టాట్‌ఆయిల్, బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రాస్ సంస్థలు రంగం నుంచి తప్పుకోవడంతో ఇతర పెద్ద కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఒఎన్‌జీసీ ఎదురుచూస్తోంది.ఈ ప్రాజెక్టులో ఒఎన్‌జీసీకి 65 శాతం వాటాలు ఉన్నాయనీ, ఈ బ్లాక్‌లో 14 ట్రిలియన్ క్యుబెక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని పాండే చెప్పారు.ఐజీ బ్లాక్‌లో వంద శాతం వాటాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
బంగారం ధర మంగళవారం ఢిల్లిలో రికార్డు స్థాయిలో పెరిగి పది గ్రాములు 18,660 రూపాయలకు చేరుకుంది. బంగారం గతంలో ఎన్నడూ ఈ స్థాయికి చేరుకోలేదు. ప్ర స్తుత వివాహాల సీజన్‌లో స్టాకిస్టులు, ఆభరణాల వ్యాపారులు ఎక్కువ కొనుగోళ్లకు పాల్పడడం , ప్రపంచవ్యాప్త ట్రెండ్ దీనికి కారణమయింది. బంగారం ధర పది గ్రాములకు 260 రూపాయల వంతున పెరిగి 18,660 రూపాయలకు చేరుకుంది. ఆభరణాల ధర కూడా తదనుగుణంగానే పదిగ్రాములకు 18,510 రూపాయలకు చేరుకుంది. సవరల ధర 75 రూపాయల వంతున పెరిగి 8 గ్రాములు 14,525 రూపాయలకు చేరుకుంది. ప్ర స్తుత పెరుగుదల గత ఏడాది డిసెంబర్ 3న నమోదైన రికార్డును అధిగమించింది. న్యూయార్క్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ట్రేడింగ్ సెంటిమెంటు ఆశావహంగా మారింది. గత వారం బంగారం ధర రెండువారాల్లో ఎన్నడూలేనంత దిగువ స్థాయికి పడిపోవడంతో దానిపై పెట్టుబడులు పెరిగాయి. ఈక్విటీ మార్కెట్లలో పరిస్థితి ఆశావహంగా లేకపోవడంతో పెట్టుబ డులు బంగారం బాట పట్టడం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమైంది. మరో పక్క బిఎస్‌ఇ బెంచ్ మార్క్ సెన్సెక్స్ యూరోజోన్ సంక్షోభం కారణంగా మూడు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ ఇతర కార ణాలకు వివాహాల సీజన్ తోడవడంతో ఈ రంగంలో బూమ్ సంభవించింది. మనదేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే విదేశాలలోని బంగారం మార్కెట్‌లలో పరిస్థితి కూడా పెరుగుదలనే సూచిస్తోంది. సోమవారం సాయంత్రం న్యూయార్క్ బంగారం మార్కెట్, ధరల పెరుగుదలతో లాభపడింది.
అయితే వెండికి తగిన అమ్మకాల మద్దతులోపించడంతో 100 రూపాయలు తగ్గి కిలో 28,950 రూపాయలకు పడిపోయింది. వెండి నాణాల ధర కొనుగోలుకు 34,400 రూపాయల వద్ద నిలకడగా నిలిచింది. వంద నాణాల అమ్మకం ధర 34,500గా నమోదయింది.
ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండడం, స్పెయిన్‌లో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయినట్టు వార్తలు వెలువడడంతో మంగళవారం భారత మార్కెట్లు కూడా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. పది నెలల తర్వాత 16 వేల దిగువకు సెన్సెక్స్ దిగజారింది. అయితే, చివరిలో కొద్దిగా కోలుకుని 16,022,48 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 15,960.15 పాయింట్ల వద్ద కూడా కదలాడింది. మొత్తం మీద మంగళవారం సెన్సెక్స్ 447 పాయింట్లను కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 137.20 పాయింట్లను నష్టపోయి 4,806.75 పాయింట్ల వద్ద ముగిసింది. స్పెయిన్‌లో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్న వార్తలతో ప్రపంచ బ్యాంకులు కుదేలయ్యాయి. యూరో జోన్ మార్కెట్లు 3 నుంచి 5 శాతం నష్టంతో ప్రారంభం కావడం కూడా ఆసియా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 2.44 శాతం నష్టపోయి 2,533.30 రూపాయిల వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2.67 శాతం నష్టపోయి రూ.698.75 వద్ద ముగియగా, విప్రో 2.18 శాతం నష్టపోయి రూ.633.80 వద్ద ముగిసింది. ఫైనాన్సియల్ టెక్నాలజీస్ 5.37 శాతం నష్టపోయి రూ.1,238.20 వద్ద ముగిసింది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 4.27 శాతం పడిపోయి రూ.354.20 వద్ద క్లోజయింది. స్పెయిన్ కమర్షియల్ బ్యాంక్ కజాసర్ దివాళా అంచుకు వెళ్లడంతో సంక్షోభం తలెత్తింది. అయితే, స్పెయిన్ సెంట్రల్ బ్యాంక్ ప్యాకేజీలతో ముందుకు రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గినా అమ్మకాలు కొనసాగాయి. మరోవైపు ఐరోపాలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుండడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.
రాష్ట్రంలోని కాకినాడ బేసిన్ (కెజి)లో లభ్యమయ్యే చమురు నిల్వలను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసేందుకు కేంద్రం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇక్కడ ఉన్న అపారమైన చమురు నిక్షేపాలు స్థానిక అవసరాలకు వినియోగిస్తామని, అందుకు కేంద్రం సుముఖంగా ఉందని, ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరాతో తాను చర్చల జరిపిన సందర్భంలో ఈ విషయం స్పష్టం చేశారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. 11 వ ప్రణాళిక అంతానికి 78,700 మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యం నిర్ణయించినట్లు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో చేపట్టనున్న కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు ఎంఓయు ఒప్పందం మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి కె. రోశయ్య సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. 1991 లో సంస్కరణలు ప్రారంభమైనప్పటికీ, విదేశీ పెట్టుబడులు రాలేదన్నారు. 2003 లో 100 శాతం ఎఫ్‌డిఐలు ఆహ్వానిస్తూ చట్టం తీసుకువచ్చిన తర్వాత కూడా పెట్టుబడులు పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 10 వ పంచవర్ష ప్రణాళికలో 42 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం కాగా, 21 వేల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగిందని తెలిపారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విద్యుత్ ఉత్పాదన పెరుగుతోందన్నారు. 12వ ప్రణాళికలో లక్షకోట్ల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నిర్ణయించారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం ద్వారా 80 వేల గ్రామాల్లో వెలుగులు నింపామని తెలిపారు. ఉత్పాదన పెరిగిన తర్వాత వినియోగం తగ్గుతుందని వస్తున్న విమర్శలను ఆయన కొట్టివేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సింగపూర్‌కు చెందిన సెమ్‌కార్ప్ సంస్థ రాష్ట్రానికి చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్‌తో సంయుక్తంగా థర్మల్ ప్రాజెక్టును చేపట్టడం హర్షదాయకమన్నారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వ పరంగా విదేశీ సంస్థలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం హామీ: రోశయ్య
రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ భరోసా ఇచ్చారని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. సోమవారం తాను జరిపిన ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్నారు. రాష్ట్ర సమస్యలు, లైలా తుఫాను బాధితులను ఆదుకోవటం తదితర సమస్యలపై వారికి నివేదిక సమర్పించానని, అయితే, వారు తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆహ్వానించారు. సింగపూర్‌కు చెందిన సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తు చేస్తూ, సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఒకప్పుడు ధనవంతులు, పరిశ్రమలకు మాత్రమే విద్యుత్ అవసరమని భావించేవారమని, ప్రస్తుతం ప్రతి ఇంటికి విద్యుత్ అవసరం ఏర్పడిందన్నారు. విద్యుదుత్పాదనలో స్వయం సమృద్ధి సాధించే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలకు విద్యుత్ అత్యవసరమన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసే విషయంలో తమ వంతు సహకారం అందించాలని కేంద్ర మంత్రి షిండేను సిఎం కోరారు.
గాయత్రి సంస్థ వ్యవస్థాపకులు టి. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, తాను పుట్టిన గడ్డ అయిన కృష్ణపట్నం వద్ద సింగపూర్ సంస్థ సంయుక్త రంగంలో చేపడుతున్న థర్మల్ ప్రాజెక్టులో 49 శాతం సెమ్‌కార్ప్ సంస్థ భాగస్వామ్యం ఉండగా, మిగతా 51 శాతం తమ గాయత్రి సంస్థదని అన్నారు. తొలి దశలో రూ. 6,869 కోట్ల పెట్టుబడితో 1,320 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహం బట్టి చూస్తే తమ సంస్థ మరో 6 వేల మెగావాట్ల ప్రాజెక్టును చేపడుతుందేమోనని అన్నారు. గాయత్రీ సంస్థ ఎండి టి.వి. సందీప్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, థర్మల్ ప్రాజెక్టు వివరాలను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వి. ప్రసాద్, జివికే సంస్థల వ్యవస్థాపకులు జి.వి. కృష్ణారెడ్డి, సింగపూర్‌కు చెందిన సెమ్ కార్ప్ గ్రూప్ ప్రెసిడెంట్, సిఇవో టాంగ్ కిన్ ఫీ, భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ కెల్విన్ ఇయూ, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ విన్‌దూత్, గాయత్రీ ప్రాజెక్టుల వైస్ ఛైర్మన్ బ్రిజ్ మోహన్ రెడ్డి, వెంకటాచలం, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
ఇఎంఆర్ సహా హెల్త్‌కేర్ టెక్నాలజీ సొల్యూషన్స్ సేవలందిస్తున్న సంస్థ ఇ-మెడి వరల్డ్ ప్రైవేట్ ఈక్విటీ రూపంలో 30 కోట్ల రూపాయల నిధులను సేకరించి వాటిని అభివృద్ధి ప్రణాళికలకు ఉపయోగించాలని భావిస్తోంది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశంలో తొలిసారిగా నెఫ్రాలజిస్టులు, క్లినికల్ హెడ్‌లు, పేషంట్లకూ మధ్య సంధానకర్తగా వ్యవహరించేలా రూపొందించిన వెబ్‌సైట్ పిడిఆర్‌ఎంఎస్ డాట్ కామ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీషజ్ జోషి ప్రసంగిస్తూ, ప్రతి క్షణం అందుబాటులో ఉండే వధంగా రూపొందించిన ఈ వెబ్‌సైట్లో రోగి పూర్తి వివరాలు, ప్రిస్క్రిప్షన్ హిస్టరీలను సురక్షితంగా దాచుకోవచ్చని ఆయన తెలిపారు. మరో మూడు నెలల్లో ఇదే తరహా వెబ్‌సైట్లను గైనకాలజీ, ఇఎన్‌టి, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలకు కూడా ఆరంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. పిడిఆర్‌ఎంఎస్ సొల్యూషన్‌ను అభివృద్ధి చేయడానికి 2 కోట్ల రూపాయలను వెచ్చించామని, వచ్చే రెండు సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నామని జోషి తెలిపారు.
గడచిన ఏప్రిల్‌లో టాటా మోటార్స్ అమ్మకాల్లో 52 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే వాహన యూనిట్ల విక్రయాలు 37,518 నుంచి 57,202 యూనిట్లకు పెరిగాయని సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ దేబాసిస్ రే ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ అమ్మకాలు 36,257 యూనిట్ల నుంచి 49 శాతం వృద్ధితో 54,065 యూనిట్లకు పెరిగిందని తెలిపింది. కమర్షియల్ వాహనాల్లో 36 శాతం, ఎల్‌సివి విభాగంలో 20 శాతం, ఎంఅండ్ హెచ్‌సివి విభాగంలో 63 శాతం వృద్ధిని నమోదు చేశామని వివరించారు. పాసింజర్ వాహన విభాగం ఏకంగా 70 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. మొత్తం 24,902 వాహన యూనిట్లను విక్రయించామని, అందులో 23,102 యూనిట్ల టాటా వాహనాలు, 1,800 యూనిట్ల ఫియట్ వాహనాలు విక్రయించామని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు 1,261 యూనిట్ల నుంచి 149 శాతం పెరిగి 3,137 యూనిట్లకు పెరిగాయని ఆయన తెలిపారు.
ముంబై కేంద్రంగా పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలందిస్తున్న కాన్కరంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లాజిస్టిక్స్ సేవలను ఆరంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో 25 ప్రాంతాలను ఎంపిక చేశామని, ఇక్కడ లాజిస్టిక్స్ సప్లయ్ చైన్‌ను త్వరలో ఆరంభించనున్నామని సంస్థ సిఇఒ కె సుధీర్ బాబు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సంస్థ నికరలాభం 4.75 కోట్ల రూపాయలుగా నమోదైందని, మొత్తం ఆదాయం 51.58 కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంస్థ భవిష్యత్ వృద్ధికి కీలకం కాగలదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
మరో రెండేళ్ళలో భారత్‌లో మెక్ కేఫ్ కాఫీ షాప్ చైన్‌ను ఆరంభించనున్నట్టు మెక్ డొనాల్డ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫాస్ట్ ఫుడ్, కాఫీషాప్ చైన్‌లను ‘మెక్’ బ్రాండ్‌పై నడుపుతున్న సంస్థ భారత్‌లో మాత్రం ఫాస్ట్ పుడ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. 2012లో 1000 కోట్ల రూపాయలతో రిటైల్ కాఫీ చైన్ మార్కెట్‌ను ఆరంభించనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. ఇప్పటికే మెక్ డొనాల్డ్ ఔట్‌లెట్లు కొనసాగుతున్న చొట కొంత స్థలం కేటాయించి మెక్ కేఫ్‌లను ఆరంభిస్తామని తెలిపారు. తొలుత ఈ కాన్సెప్ట్‌ను ఆస్ట్రేలియాలో 1993లో ఆరంభించామని, ప్రస్తుతం వివిధ దేశాల్లో 1300 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విస్తరించిన భారత కాఫీ మార్కెట్ తమకు అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. ముందుగా మెట్రోల్లో మెక్ కెఫేలు ఆరంభిస్తామని తెలిపారు. ఇటీవల తాము ఆరంభించిన బ్రేక్‌ఫాస్ట్ కాన్సెప్ట్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 177 మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టులోగా మరో 20 స్టోర్‌లను ప్రారంభించే యోచన ఉన్నట్టు సంస్థ వెల్లడించింది.
భారత ఉపఖండ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు మార్కెటింగ్ అవార్డును వరుసగా రెండవ సారి జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు లభించింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో వైభవంగా జరిగిన రూట్స్ ఆసియా- 2010లో ఈ అవార్డును ప్రకటించారు. ముంబై, ఢిల్లి సహా నాలుగు విమానాశ్రయాలతో పోటీపడ్డ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఈ విభాగంలో విజేతగా నిలిచింది. జిహెచ్‌ఐఎఎల్ ఎయిర్‌లైన్ మార్కెటింగ్ హెడ్ రవీన్ పింటో అవార్డును అందుకున్నారు. వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలు నామినేట్ చేస్తే వాటి ఆధారంగా ప్రకటించే ఈ అవార్డు సంస్థకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని జిహెచ్‌ఐఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ పి శ్రీపతి వ్యాఖ్యానించారు. వరుసగా రెండవసారి అవార్డు దక్కడం జిఎంఆర్ కృషికి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. కాగా, గత సంవత్సరం రూట్స్ ఆసియా సదస్సు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు స్థానం లభించింది. పెప్సీ కంపెనీ చీఫ్ ఇంద్ర నూయి 93వ స్థానంలో నిలిచిందని జాబితాను రూపొందించిన బిజనెస్ మేగజైన్ ఫోర్బ్స్ వెల్లడించింది. మొత్తం 141.36 మిలియన్ డాలర్లతో దనహర్ లిమిటెడ్ చీఫ్ హెచ్ లారెన్స్ కుల్ప్ జూనియర్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన వ్యక్తుల్లో నూయి తరువాత క్వెస్ట్ డయాగ్నస్టిక్స్ చీఫ్ సూర్య మోహాపాత్ర (96), అడోబ్ సిస్టమ్స్ సిఇఒ శంతను నారాయన్ (425)లు నిలిచారు. నూయి వేతనం 10.66 మిలియన్ డాలర్లని, మోహపాత్రా 10.29 మిలియన్‌లు, నారాయణ్ 1.88 మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతున్నారని ఫోర్బ్స్ వివరించింది. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం యుఎస్‌లోని టాప్ 500 కంపెనీల సిఇఒలు గత సంవత్సరం తమ వేతనాలను తగ్గించుకున్నారు. 2009లో 30 శాతం వరకూ వేతనాలను తగ్గించుకన్నారని తెలిపింది.
గత సంవత్సరం టాప్ 500 సిఇఒలు 4 బిలియన్ డాలర్లను సంపాదించారని, వీరి సరాసరి వేతనం 8 మిలియన్లుగా నమోదై ఉందని తెలిపింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఒరాకిల్ సిఇఒ లారెన్స్ జె ఇల్లిసన్ 130.23 మిలియన్ డాలర్లతో నిలిచారు. ఆయన తరువాత చిస్పకే ఎనర్జీ చీఫ్ ఆబ్రే మెక్ క్లెండాన్ 114.29 మిలియన్ డాలర్లతో నిలిచారు. హెల్వెట్ పాకార్డ్ చీఫ్ మార్క్ వి హర్డ్, 26వ స్థానంలో, న్యూస్ కార్పొరేషన్ చీఫ్ రూపర్ట్ మర్డోక్ 15.55 మిలియన్లతో 53వ స్థానంలోనూ నిలిచారు.