చిత్తూరు
ఆస్తి, నీటి, యుడిఎస్ పన్నులు చెల్లించిక బకాలున్న వారి ఇళ్ళను జప్తు చేస్తామని నగర పాలక సంస్థ కమీషనర్ జానకి తిరుపతి నగర ఇళ్ళ యజమానులకు తెలిపారు. నగరంలో ఇళ్ళ యజమానులు తొలి ఆర్ధ సంవత్సరం వరకు చెల్లించాల్సిన నీటి పన్నుల డిమాండును జారీ చేశామన్నారు. సంబంధిత వారు ఈ – మాస్ ఆన్‌లైన్ కౌంటర్‌లో వాటిని చెల్లించాలన్నారు. ఈ అర్ధ సంవత్సరం ఆస్తిపన్ను ఈనెల 31తేదిలోపు ఏలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించాలన్నారు. నగర ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సకాలంలో పన్నులు చెల్లించని ఇళ్ళపై కార్పోరేషన్ యాక్టు 1995 ప్రకారం జప్తు చేస్తామన్నారు. నగర పాలక సంస్థ మంచినీటి కొరత లేకుండా సరఫరా చేస్తుందన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని నీటి చార్జీలను వెంటనే చెల్లించాల్సివుందని, అయితే కొంత మంది పన్నులు చెల్లించడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. పన్నులు చెల్లించిన వారి ఇంటికి ఉన్న తాగు నీటి కొళాయి, యుడిఎస్ కనెక్షన్‌లు తొలగిస్తామన్నారు.
చంద్రగిరి మండలం కొత్తపేట, ప్రశాంతనగర్‌లో నివశిస్తున్న మీన అధిక అప్పులు చేసింది. ఆ అప్పులను కట్టలేదని ఆమెను అదే కాలనీకి చెందినవారు మీనను, తల్లి మునిలక్ష్మిను వాళ్ల ఇంటిలోనే గృహనిర్బంధం చేశారని చంద్రగిరి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రశాంతినగర్‌లో విచారించారు. పోలీసు విచారణలో మీన అధిక వడ్డీలకు అప్పు చేసినట్లు తేలిందని తెలిపారు.
మా సమస్యలు పరిష్కరించండనీ కలెక్టర్ దొర అంటూ జిల్లాలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కి అర్జీదారులు కలెక్టర్ శేషాద్రికి వినతి చేశారు. ఈ సందర్భంగా అర్జీదారులతో కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. అర్జీదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్ మండల అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.
బ్రిడ్జిలోన్లు మంజూరు చేయండి : ఇందిరమ్మ ఇంళ్ళు నిర్మించుకోవడానికి బ్రిడ్జిలోన్లు మంజూరు చేయాలంటూ చిత్తూరు మండలం పచ్చనపల్లి దళితులు కలెక్టర్‌కు వినతి చేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని 140 కుటుంబాలున్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినప్పటికీ ఇచ్చే బిల్లు చాలడం లేదన్నారు. బ్రిడ్జిలోన్లు ఇప్పిస్తే ఇండ్లు నిర్మించుకొంటామని వారు విన్నవించారు.
కోడి పిల్లల పెంపకం కమిషన్‌లో మోసగిస్తున్నారు : కోడి పిల్లల కంపెనీల వారు మోసగిస్తున్నారని కోళ్ళఫారం యజమానులు కలెక్టర్‌కు విన్నవించారు. వారు మాట్లాడుతూ సుగుణ, బాలాజీ, సువేరా తదితర కంపెనీలు పిల్లలు, ఫీడ్ ఇచ్చి పెంచమంటారని వారు తెలిపారు. 1992వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం ఇప్పటి వరకు రెండు రూపాయలు మాత్రమే కమీషన్ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కంపెనీల వారు అధికాంగా ఇస్తామని ముందుకొస్తున్నారని వారి రానీయకుండా అడ్డుకొంటున్నారని వారు తెలిపారు. నిత్యావసర వస్తువుల దరలు విపరీతంగా పెరగడంతో తమ కుటుంబాలు ఎలా పోసించుకోవాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా మోసగిస్తున్నారని వారు తెలిపారు.
రోడ్డు పనులు మంజూరు చేయండి : రోడ్డు పనులుమంజూరు చేయాలంటూ పెనుమూరు మండలం చిన్నకలికిరి, బోడిరెడ్డికండ్రిగ గ్రామస్తులు వినతి చేశారు. వారు మాట్లాడుతూ మా గ్రామానికి మంజూరు అయిన రోడ్డు పని కొంత వరకు జరిగిందన్నారు. ఆగిపోవడంతో రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. త్వరలో రోడ్డు పని చేసి ఇబ్బంది లేకుండా చేయాలంటూ వారు వినతి చేశారు.
కార్డులిప్పించాలంటూ ధర్నా : రద్దు చేసిన బియ్యం కార్డులను ఇప్పించాలంటూ ఐరాల మండలం ఎం.పైపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జంగాలపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో అధికశాతం మంది నిరుపేదలేనని, 150 రేషన్‌కార్డులనుగాను వంద కార్డులు రద్దు చేశారని ఇలా తొలగిస్తే ఎలా బతికేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎం.శారద, జయమ్మ, పి.సుశీలమ్మ, జి.రూపలున్నారు.
క్వారీని రద్దు చేయాలంటూ ధర్నా : క్వారీని రద్దు చేసి మా గ్రామాన్ని కాపాడాలంటూ ఎస్‌ఆర్ పురం మండలం పుల్లగుండ్లపల్లి ఎస్‌టి కాలనీకి చెందిన మహిళలు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గ్రామం దగ్గర్లో కొండ క్వారీ పనులుచేస్తున్నారన్నారు. నల్లమందులతో రాళ్ళను పేల్చడం శబ్దంతో గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారన్నారు. కొండల్లో పశువులు మేతకు కూడా వెళ్ళడం లేదన్నారు. తమ గ్రామాన్ని కాపాడాలంటూ వారు వినతి చేశారు.
ఉపాధిలోకనీస వేతనం చెల్లించాలంటూ ధర్నా
మహాత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాది పథకం క్రింద కూలీలకు కనీస వేతనం చెల్లించాలని కోరుతూ సోమవారం కూలీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గుడిపాల మండలం గట్రాళ్ళమిట్ట గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి కూలీలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసినా ఒక్కరికీ రోజుకు 16 నుంచి 20 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారని చెప్పారు. ఒక్క కూలీకి రోజుకు 16 రూపాయలు చెల్లిస్తే పెరిగిన ధరలకు ఎలా బతకాలని వారు ఆవేదన చెందారు.

ఏడుకొండల స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్ల ను అక్రమాలకు పాల్ప డిన ఎంతటి వారైనను ఉపేక్షించేది లేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌బ మెంట్ టాస్క్‌ఫోర్స్ డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు. ఆర్జిత సేవాటిక్కెట్ల అక్రమాలను రెండు రోజులపాటు తిరుమలలో విచారణ చేపట్టడానికి ఐజి అనూరాధ, డిఐజి హరీష్‌గు ప్తాతో కలిసి సోమవారం సాయం త్రం విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసు గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేసు పురోగతిని వెల్లడించారు. స్వామి వారి దర్శనం ఆర్జిత సేవా టిక్కెట్లు ముందస్తు బుకింగ్‌లో భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలతోపాటు ఉద్దేశపూర్వ కంగా ఉద్యోగులు, బయట వ్యక్తులు, పెద్దలు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.
ఎంతటి పెద్దలైనా వదిలే ప్రసక్తి లేద ని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన టిటిడిలో అక్ర మాలకు పాల్పడిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలతోపాటు కఠిన చర్య లు తీసుకోవాలని, అక్రమాలకు కార కులైన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టవల్సినవసరం ఉందని ఆయన అన్నారు. ఒకే వ్యక్తి 160 నుంచి 170 టిక్కెట్లు అడ్వాన్సు రిజర్వే షన్ చేసుకో వడం వలన అక్రమ మార్గంలో ధన పంపిణి కాక, నిజమైన భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్లను పొందడం దుర్లభంగా మారిందన్నారు. 60, 70 ఏళ్ల వర కు ఒకే పర్యాయం టిక్కెట్లను అడ్వాన్సు బుకింగ్ చేయిం చుకోవడం వెనుక తెలివైన నేర ప్రవృత్తి దాగుందన్నారు. ప్రభుత్వానికి ఆర్జిత సేవాటిక్కెట్ల కుంభకోణంపై నివేదికను మరో 15 రోజుల్లో సమర్పించనున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మండలంలో విజృంభించిన అతిసార అదుపులోకి రావడంలేదు. బాధితులకు సరైన వైద్యం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కదిరాయచెరువులో నెల రోజుల నుండి అతిసార విజృంభిస్తుండడంతో ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే. అయితే బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయాలు అందకపోవడంతో అతిసార అదుపులోకి రాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితులు వాల్మీకిపురం, గుర్రంకొండ, మదనపల్లి, పీలేరు ఆస్పత్రులలో చికిత్సలు చేయించుకుంటున్నారు.
టెంపో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. రేణిగుంట-కోడూరు రహదారిలోని ఆంజనేయపురం సమీపంలో ఆదివారం రాత్రి ఒంటిగంటకు రాజంపేట నుంచి చెన్నరుకి వెళుతున్న టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చాంద్‌బాషా(49) అక్కడికక్కడే మృతి చెందాడు. రేష్మా(9), తిమ్మారెడ్డి(50), రమేష్‌బాబు(42), రామచంద్రయ్య(50), బలరామయ్య(45) వెంకటసుబ్బమ్మ(40) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రుయాకు తరలించారు. రేణిగుంట ఎస్‌ఐ అబ్బన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ చేపట్టిన నిరాహార దీక్ష సోమవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ దీక్షలో అత్తిలి ఆనందనాయుడు, వెంకటరమణ, గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ లబ్ధికోసమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బస్సు యాత్రను చేపట్టాడని ఎంఎల్‌సి రెడ్డెప్పరెడ్డి పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో వున్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, అప్పట్లో ఈ సమస్య గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణాను దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు బస్సు యాత్రను చేపట్టారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కావడంతో పార్లమెంట్‌లో కానీ, కోర్టులో కానీ తేల్చుకోవాలని అలాంటిది హర్తాళ్, బంద్‌లు చేపడితే సమస్య పరిష్కారం కాదన్నారు.
వరకట్నం కోసం తన భర్త తరచూ తనను వేదిస్తున్నారని ఓ మహిళ గంగవరం పోలీసులకు పిర్యాదు చేసింది. బాదితురాలి కధనం మేరకు… బేలుపల్లి గ్రామానికి చెందిన తలారి రత్నమ్మ అనే మహిళకు గుండుగల్లు గ్రామానికి చెందిన హరిప్రసాద్ తో వివాహమైంది. కొద్దిరోజుల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో వరకట్న వేదింపులు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో శనివారం తలారి రత్నమ్మ విదులు నిర్వహిస్తుండగా తనను దుర్బాషలాడి బెదిరించారని పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదుమేరకు ఎసై్స చిన్నగోవిందు నిందితున్ని అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను పరిశీలించి.. వాటిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి.. ఆంధ్రరాష్ట్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నీటి మోసాన్ని ఎండగట్టేందుకు ప్రయత్నించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు 74మంది ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టుచేసి జైళ్లో పెట్టడం తెలుగు జాతికే అవమానమని కుప్పం తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, టిడిపి ప్రజాప్రతినిధుల అరెస్టు, జైళ్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలో కుప్పం వందపడకల ఆసుపత్రి కూడలి వద్దనే టెంటు వేసి.. వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో నిత్యం వాహనాల రాకపోకలు సాగించే జాతీయ రహదారిని కాస్త తెలుగు తమ్ముళ్లు తమ వంటా వార్పుతో పాటు బోజనాలు చేస్తూ.. సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యాటక ప్రాంతంగా మార్చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు టిడిపి చేసిన ధర్నా కార్యక్రమంతో జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడ్డారు.
తెలుగు దేశం పార్టీ కుప్పం నియోజక వర్గ ఇన్‌చార్జి పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ముందుకుసాగుతోందని.. మహా రాష్ర్టలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా.. యుపిఎ ప్రభుత్వం టిడిపి నేతల అరెస్టు విషయంలో చోధ్యం చూస్తుండటం తెలుగు జాతిని అవమానించినట్లేనన్నారు. కుప్పం ఎంపిపి డాక్టర్ వెంకటేష్, జడ్పీటిసి కవితాసాంబశివంలు మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు చూపుతామని నమ్మంచి మోసం చేయడంతో పాటు తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి.. నేడు ప్రధాన ప్రతిపక్ష్య నేతగ ఉన్న చంద్రబాబు నాయుడిని సైతం ఓ నేరస్తుడిగా నిర్బందించి కనీస సౌకర్యాలు కల్పించకుండా తెలుగు వారిని మహారాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఏడు జిల్లాలు ఎడారిగా మారుతుందని.. ఈ విషయంలో ఐక్యమత్యంతో ముందుకుసాగిల్సిన నేతలు రాజకీయాలు మాట్లాడటం దురదుష్టకమన్నారు. మహా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని.. పరిస్థితి ఇలానే జరిగితే ఆంధ్రరాష్ట్రంలో జరిగే అనర్థాలకు యుపిఎ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందన్నారు. మహారాష్ట్ర అంటే ఏమైనా పాకిస్తానా.. స్వతంత్య్ర భారత దేశంలో భారతీయ పౌరుడు ఎక్కడికైనా వెళ్లొచ్చని అయితే మహారాష్ట్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు కుప్పం బంద్
టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేసి జైళ్లో పెట్టడాన్ని నిరసిస్తూ.. నేడు కుప్పం నియోజక వర్గ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ కార్యాలయం తెలిపింది. ప్రజలు, వ్యాపారులు, యువత, ఉద్యోగులు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.