చిత్తూరు
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో అత్యంత కీలకపాత్ర పోషించనున్న అన్నా బ్రదర్స్‌పెై అన్ని రాజకీయ పార్టీల చూపు వారిపెై పడింది. దాదాపు 25 వేల ఓట్లు కలిగిన రాజీవ్‌నగర్ గ్రామ పంచాయతిలో అధిక శాతం ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ గెలుపు దాదాపు ఖరారెైనట్లే. దీంతో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణలతో మంతనాలు సాగిస్తున్నారు. మాజీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, అన్నా రామకృష్ణలు కాంగ్రెస్‌పార్టీలు కొనసాగుతున్నారు.
అన్నా రామచంద్రయ్య యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. కొంతకాలంగా పార్టీలకు దూరమై బిసి సంఘర్షణ సమితి స్థాపించి, జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికలలో కీలకపాత్ర వీరిదేనని తెలిసి పలువురు ప్రముఖులు మంతనాలు ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డి, మంత్రి పార్థసారధి, తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, పలువురు ప్రముఖులు మంతనాలు సాగించారు. అన్నా బ్రదర్స్ చూపు మరి ఏవెైపు మొగ్గుచూపుతారో ఆ పార్టీ విజయం దాదాపు ఖరారెైనట్లే.
ఒక నెల ముందు పంచాయతీలో ప్రజాపథం కార్యక్రమం జరిగిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పంచాయతీ ప్రజలపెై వరాలజల్లు కురిపించారు. దాంతోపాటు పంచాయతీ నాయకులకు సెైతం అభయహస్తం ఇచ్చారు. దీంతో ఎక్కువ శాతం కాంగ్రెస్‌వెైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నా రామచంద్రయ్య యాదవ్ మాత్రం రాజకీయాలకు కొంత దూరమయ్యానని తెలిపినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తమ సత్తా ఏమిటో చూపుతామని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ శ్రీవారిని దర్శించుకున్న తీరు వివాదస్పదమైంది. క్రైస్తవమతానికి చెందిన జగన్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకపోవడాన్ని టిటిడి తప్పుపట్టింది. ఆయన తండ్రి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వస్త్రాలు సమర్పించారని, జగన్ కూడా 2009లో తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని, కొత్తగా మరోమారు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతోనే ఆయన ఇవ్వలేదని భూమన్‌కరుణాకర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. దీనిపై టిటిడి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళుతున్న సమయంలో తమ సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించారని చెప్పారు. అయితే గతంలో 2009లో సంతకం చేశానని మరోమారు అవసరం లేదని ఆయన వర్గీయులు చెప్పి ఆలయంలోనికి తీసుకువెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామన్నారు. ఇదిలా వుండగా భవగంతుడ్ని నమ్మి ఆలయంలోనికి వచ్చినప్పుడు డిక్లరేషన్ పేరుతో అవమానించడం సరికాదని టిటిడి అధికారులపై కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థి విజయం కోసం జగన్ ప్రచారానికి మంగళవారం తిరుపతి వచ్చారు. రోడ్‌షో అనంతరం అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లి బస చేశారు. బుధవారం ఉదయం విఐపి బ్రేక్‌లో దర్శించుకునేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు వద్దకు వచ్చారు. హిందూమతస్తులు కాని ప్రముఖులు ఎవరైనా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తమకు పరిపూర్ణమైన నమ్మకం ఉందని, హిందూమతాన్ని గౌరవిస్తామని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వున్న రిజిస్టర్‌లో స్వయంగా రాసి సంతకం చెయ్యాల్సి ఉంటుంది. దీనే్న డిక్లరేషన్ అంటారు. అయితే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు వెళ్లిన జగన్ రిజిస్టర్‌లో సంతకం పెట్టకుండా ఆలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వివాదమైంది.
డిక్లరేషన్ ఇవ్వకపోవడం తప్పు: దాడి
హైదరాబాద్: తిరుమల ఆలయ సందర్శనకు వెళ్లే ఇతర మతస్తులు డిక్లరేషన్ ఇచ్చి స్వామిని సందర్శించుకోవాలన్న నిబంధనలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తుంగలో తొక్కడం సబబుకాదని శాసనమండలిలో ప్రతిపక్షనేత, టిడిపి సీనియర్ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో మాట్లాడుతూ తిరుమల ఆరాధ్యమైన, పవిత్రమైన పుణ్యస్ధలమని, ఈ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. దేవాలయ సంప్రదాయ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, నేను ఎందుకు ఇవ్వాలి? సోనియాగాంధీ ఇచ్చారా అని అడగడం సబబుకాదని ఆయన జగన్‌ను విమర్శించారు. ఒకవేళ సోనియాగాంధీ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లి ఉండినట్లయితే అది కూడా తప్పే అన్నారు. మందీమార్బలంతో ఏ డిక్లరేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా లోపలికి వెళ్లడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. సనాతన సంప్రదాయాలను జగన్ గౌరవించాలని, లేకపోతే ఆ ఫలితం దుష్ఫలితంగా మారి జగన్ కూడా అనుభవిస్తారని తీవ్ర హెచ్చరిక చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ?
జగన్ సుదీర్ఘ చర్చలతో పునరాలోచన
:ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.మోహన్‌బాబు ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలో జరిగే ఉపఎన్నికల్లో మోహన్‌బాబు తిరుపతి నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందని ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. తన సోదరిని చూసేందుకే జగన్ తన నివాసానికి వచ్చారని తామిద్దరం దగ్గరి బంధువులని మోహన్‌బాబు ప్రకటించినా ఈ ఇరువురి భేటీ వెనక అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని అంటున్నారు.
తిరుపతి నుంచి తమ పార్టీ తరఫున మాజీ తుడా చైర్మన్ భుమన కరుణాకర్‌రెడ్డి లేదా తెదేపా సీనియర్ నేత కందాటి శంకరరెడ్డిని పోటీకి పెట్టాలని గతంలో ప్రతిపాదించిన జగన్ ఆ తర్వాత మనసు మార్చుకుని మోహన్‌బాబు అభ్యర్థిత్వంపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని తమ పార్టీలోకి తీసుకుని తద్వారా పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్న జగన్ మోహన్‌బాబును ఉపఎన్నికల్లో పోటీకి పెట్టాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రతిపాదనపై మోహన్‌బాబు కూడా అంగీకారం తెలిపారని అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని అప్పటిదాకా తనను వదిలేయమని మోహన్‌బాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జగన్ అందుకు ససేమీరా అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తిరుపతి నియోజకవర్గం బరిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో జగన్ ఇదే సామాజికవర్గానికి చెందిన వారిని కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు తన తండ్రిని ఎలాగైనా ఒప్పించాలని మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణుబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు కూడా సమాచారం. వాస్తవానికి వచ్చే సాధారణ ఎన్నికల్లో మోహన్‌బాబు తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ నియోకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ నటి రోజా పోటీ చేస్తున్నందున తనకు ఈ పార్టీ తరఫున టిక్కెట్ దొరికే అవకాశం లేదని అందుకే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు మోహన్‌బాబు తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. మోహన్‌బాబు వ్యవహారం ఇటు తెదేపా అటు కాంగ్రెస్‌లో చర్చనీ యాంశమైంది.
మోహన్‌బాబుని పోటీకి పెట్టడం ద్వారా తిరుపతి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమ వైపునకు తిప్పుకోగలమా, లేదా అనే సందేహాలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి. మోహన్‌బాబును పోటీకి పెడితే భుమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు మోహన్‌బాబుకు మద్దతునిస్తారా, సహకరిస్తారా అనే ఆందోళన ఈ పార్టీలో నెలకొని ఉంది. జగన్ చెబితే కరుణాకర్‌రెడ్డి, ఇతర నేతలు వింటారని ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. మరి జగన్ అభ్యర్థనను మోహన్‌బాబు ఆమోదిస్తారా, లేక తిరస్కరిస్తారా అన్నది వేచిచూడాలి.
ఇటీవలే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని తిరుపతి సమీపంలోని తన విద్యాసంస్థ వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆయనపై ప్రశంసల జల్లుకురిపించిన మోహన్‌బాబు ఇంతలోనే పార్టీ మారుతారా అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాలను వేధిస్త్తోన్న ప్రశ్న? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని నాగం జనార్దన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్న ఫళంగా పార్టీని వీడి వెళ్ళారని ఇలా ఎంతో మంది తెదేపా నుండి బయటకు వెళ్ళి నామరూపాలు లేకుండా అయిపోయారని తమ పార్టీకి కార్యకర్తలే గొప్ప బలమని తెదేపా నేతలు అంటున్నారు.

రెణుకా చౌదరి ఇంటికి ముఖ్యమంత్రి కిరణ్
ఢిల్లీని మంచి చేసుకునే వ్యూహం
చిరంజీవి ఇంటికి మంత్రి గల్లా అరుణ
కొడుక్కి తిరుపతి టిక్కెట్ కోసం విన్నపం
వెూహన్‌బాబు ఇంటికి సతీసమేతంగా జగన్
వైఎస్సార్సీపీలోకి రమ్మని ఆహ్వానం!
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రసకందాయంలో పడుతున్నది. రాజకీయ లాబీయింగ్ ఊపందుకుంటున్నది. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి నివాసానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెళ్ళడం… రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో మంత్రి గల్లా అరుణకుమారి తన కుమారుడితో కలిసి సమాలోచనలు జరపడం… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రాజకీయంగా ఏ లింకూ లేకున్నా సినీ నటుడు మోహన్ బాబు ఇంటికెళ్ళడం… సండే స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన తాజా రాజకీయ మంత్రాంగం అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎవరి వ్యూహం ఏమిటి? అన్న చర్చకు దారితీస్తోంది. భవిష్యత్ రాజకీయాలపై ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. అయితే నేతలు మాత్రం ఈ పరిణామాలను తేలికగానే తీసుకుంటున్నారు. మరో కోణమే లేదని కొట్టిపారేస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే… ఈ మూడు భేటీల్లో రాజకీయ ప్రాధాన్యతలు స్పష్టమవుతున్నాయి.
ముఖ్యమంత్రే స్వయంగా రేణుకా చౌదరి నివాసానికి వెళ్ళడం గమనార్హం. దాదాపు 45 నిమిషాల పాటు వీరు సమాలోచనలు చేశారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని రేణుకాచౌదరి తెలిపారు. పార్టీ వర్గాలు మాత్రం మరోకోణంలో విశ్లేషిస్తున్నాయి. అధినేత్రికి అతి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో రేణుక ఒకరు. ఈ కారణంగానే కిరణ్ ఆమెను కలిసి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా దృష్టిపెట్టింది. పార్టీపై క్రమంగా పట్టుబిగిస్తోంది. వరుసగా ఎఐసిసి దూతల రాక… నివేదికలు సమర్పించడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత నాయ కత్వంలో
భారీ మార్పులు ఉండొచ్చన్న ప్రచారం ఊపందుకుంటోంది. వీటన్నింటికీ మించి ఇటీవల ఢిల్లిd పర్యటనకు వెళ్ళిన కిరణ్‌కు సోనియాను కలిసే అవకాశం కూడా లభించలేదు. దీన్నిబట్టి అధిష్టానంతో పటిష్టమైన సత్సంబంధాలు అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచనతోనే ఆయన హైకమాండ్‌లో పట్టున్న ప్రతి ఒక్కరిని విధిగా కలుస్తున్నారు. గతంలో దాసరి నారాయణరావు, కెవిపి రామచందర్‌రావు, జైపాల్ రెడ్డిని వ్యక్తిగతం వెళ్ళి కలిసారు. తాజాగా రేణుక నివాసానికి వెళ్ళడం విశేషం. కిరణ్ పనితీరుపై రేణుక కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా… ఆమె తిప్పికొడుతున్నారు. ఆమెతో సత్సంబంధాలు భవిష్యత్‌లోనూ కలిసి వస్తాయని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ఢిల్లిdని దృష్టిలో ఉంచుకునే రేణుక కేంద్రంగా కిరణ్ వ్యూహాత్మకంగా పావులు కదిపి ఉంటారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
అన్నయ్యతో అరుణమ్మ లాబీయింగ్
రేపో మాపో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అరుణకుమారి తన కుమారుడు జయదేవ్‌తో కలిసి, చిరంజీవి నివాసానికి వెళ్ళారు. ఈ కలయిక మర్యాదపూరకమని ఇరుపక్షాలు చెబుతున్నా… అసలు విషయం తిరుపతి సీటే అనేది సుస్పష్టం. చిరు ఆశీస్సులు ఉన్న అభ్యర్థికే తిరుపతి సీటు కేటాయించాలనేది హైకమాండ్ అభిప్రాయం. అయితే చిరు కుటుంబీకులు బరిలో లేకపోవడంతో, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. అయినప్పటికీ అరుణ తన కుమారుడి కోసం ఢిల్లిd స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో జయదేవ్‌కు టిక్కెట్ వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిరు మద్దతు ఉంటే తన ప్రయత్నాలు ఫలిస్తాయని మంత్రి విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె చిరును ఒప్పించేందుకు మంతనాలు జరిపారని తెలుస్తోంది. పూర్వ పిఆర్పీ అభ్యర్థి పసుపులేని హరిప్రసాద్ ద్వారా ఆమె చిరును ఒప్పించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. సినీ నటుడు మహేష్‌బాబు, ఆయన తండ్రి కృష్ణ మద్దతు కూడగట్టిన అరుణ చిరు ప్రసన్నం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
యువనేత మోహనాస్త్రం
సినీ నటుడు మోహన్‌బాబు నివాసానికి యువనేత జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వమే ఇందుకు కారణమని మోహన్‌బాబు పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయ సమీకరణలే దీని వెనుక అసలు వ్యూహం అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మోహన్‌బాబు.. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించిన దాఖలాలున్నాయి. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో ఏర్పడ్డ బంధుత్వం తర్వాత ఆయన జగన్‌తోనూ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో మోహన్‌బాబు వైఎస్సార్ పార్టీకి అస్త్రంలా ఉపయోగపడతారని జగన్ వర్గం భావిస్తోంది. ఇప్పటికే టిడిపి నేతలకు వైఎస్సార్ పార్టీ వల వేస్తోంది. ఇందులో భాగంగానే మోహన్‌బాబును పార్టీకి దగ్గర చేసేందుకు ఈ కలయిక తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా తాజా పరిణామాలన్నీ ఆసక్తి రేపుతున్నాయి.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతు న్నాయని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. చార్జిషీట్‌లు వేయ ముందే ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యతో పాటు రాజగోపాల్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌లను అరెస్టు చేశారన్నారు. ఓఎంసీ, ఎమ్మార్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు దాఖలు చేసినా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డిని మాత్రం ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను జగన్ సం పాదించారన్నారు. వైఎస్ హయాంలో వేలాది ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువైన గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయన్నారు.
రాగల మూడురోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, 5 నుంచి 10 మి.మీ వర్షం కురిచే అవకాశం ఉందని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వారు తెలిపారు. గత వారం జిల్లా అంతటా నిర్మలంగాను, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతంగాను ఉండి,కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడి 5 నుంచి 10 మి.మీ వర్షం కురిసిందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 37 నుంచి 39 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 28 డిగ్రీలుగా ఉందన్నారు. రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రత గరిష్ట 36 నుంచి 39 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 26 నుంచి 28 డిగ్రీలుగాను నమోదుకావచ్చునన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 నుంచి 7 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.
స్థానిక భవానినగర్ సర్కిల్ నందు గల గేట్ డిగ్రీ కళాశాల నందు క్యాంపస్ ఇంటర్వ్యూలలో 85 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ మెగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐబిఎం, ఎడికో, శ్రీరామ్ వ్యాల్యూ కంపెనీలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో 85 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ఇస్తూ అంకిత భావంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు విఎస్‌ఆర్ ప్లేస్‌మెంట్స్ సెల్ నుంచి సి.పి.శేఖర్ రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సుజాత, సిహెచ్.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
సంప్రదాయ కళారూపాలైనటువంటి చేనేత వస్త్రాలు, శిల్పకళా, రంగుల అద్దకం వంటి వాటిని ప్రోత్సహించాలని సినీనటి శ్రీదేవి తెలిపారు. లేపాక్షి కాటన్, శిల్క్ చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలను శుక్రవారం సాయంత్రం స్థానిక సింధూర కల్యాణ మండపంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కళాకారుల నైపుణ్య పురోభివృద్ధి కోసం ప్రయోగాత్మకంగా ఇలాంటి ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ఎంతో ముదావహమని తెలిపారు. కళాకారుల ఆర్థికాభివృద్ధికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లేపాక్షి ఎంపోరియం సీనియర్ మేనేజర్ శ్రీహరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన వచ్చే నెల 8వ తేది వరకు కొనసాగుతుందని తెలిపారు.
ప్రతి ఏడాది తిరుపతిలో 4 ప్రదర్శన శాలలను ఏర్పాటుచేసి, ఒకేచోట అన్నిరకాల వస్త్రాలు లభించేలా ప్రదర్శన శాలలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి కళాకారులకు అన్నిరకాల సౌకర్యాలను ఏర్పాటుచేసి, వారి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు తిరుపతిలో వేదిక కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనశాలలో గద్వాల్, వెంకటగిరి, పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, కళంకారి, సిద్ధిపేట, వరంగల్, కాటన్ డ్రస్ మెటీరియల్స్, చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో లేపాక్షి సిబ్బంది మూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టిటిడి ఫారెస్టు కార్మికులకు టైమ్‌స్కేల్ ఇవ్వాలని, టిటిడి ట్రస్టుబోర్డు చేసిన తీర్మానం 454 అమలు చేయాలని టిటిడి పరిపాలన భవనం వద్ద టిటిడి అటవీ కార్మికులు రిలే నిరాహారదీక్ష చేశారని జనరల్ సెక్రటరి ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి విజిలెన్స్ వారు విచారణ చేసిన కార్మికుల జాబితను బయటపెట్టి, ఆ జాబిత ప్రకారం విధులలోకి తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు. టిటిడి యాజమాన్యం మా నిరసనలు పరిగణనలోకి తీసుకొని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. శాసనమండలికి టిటిడి ఇచ్చిన హామీలను నిలబెట్టు కోవాలన్నారు. ఈ నిరాహార దీక్షలో చెంచుముని, రవి, మునస్వామి, చెంగారెడ్డి, వెంకటముని పాల్గొన్నారు.