హైదరాబాద్

రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ప్రజలను మభ్యపెట్టి వేలాదికోట్ల రూపాయిల భూములు, ఖనిజ సంపదను తమ కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. వై.ఎస్. బతికుండగా తన అల్లుడికి 1.46 లక్షల ఎకరాల బయ్యారం భూములను ఎవడబ్బసొమ్మని దానం చేశారని, గాలి సోదరులకు ఓబులాపురం గనులను కట్టబెట్టారని, ఇలా రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబసభ్యులు దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మూడురోజుల పాటు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంగళవారం ఉదయం జిల్లాలోని ఎచ్చర్ల నియోజకవర్గం పైడిభీమవరం జాతీయ రహదారిపై జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైడిభీమవరంలో చంద్రబాబు మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించిందని ఆగ్రహించారు.
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి వై.ఎస్. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నిలుపుకోలేదన్నారు. వై.ఎస్.కుటుంబం అభివృద్ధి చెందిందని, రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయిందని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేయించిన రోడ్లను పాడుచేసే విధంగా ఓదార్పు యాత్రతో వై.ఎస్.విగ్రహాలను జగన్ ఏర్పాటు చేస్తున్నారని, భారీగా డబ్బులు ఖర్చుచేసి జనాన్ని తరలించుకుంటూ ఓదార్పు యాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోతుంటే, రోశయ్య పరిపాలన ప్రజలకు రోత పుట్టిస్తోందన్నారు. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. చివరికి రోశయ్య తిరుపతి వచ్చి అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా డబ్బులులేవనే రీతిలో ముఖ్యమంత్రికి
టిక్కెట్ కూడా తీయడంలేదని, ముఖ్యమంత్రి పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్యుని పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి వారంరోజుల పాటు జ్వరం వస్తేగాని రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాల బారిన పడుతూ పడుతున్న ఇబ్బందులు అర్ధంకాలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం రోగాలబారిన పడవేసిందని, పేదప్రజలకు వైద్య సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రాష్ట్ర బడ్జెట్ 40 వేల కోట్ల నుంచి 1.05 లక్షల కోట్లకు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినా రాష్ట్రంలో జరిగిన అభివృధ్ధి ఏమీ లేదని, చివరికి విద్యార్ధులకు ఫీజుల రీయంబర్స్‌మెంట్‌కు కూడా నిధులు లేవని ముఖ్యమంత్రి చేతులెత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒరిస్సాలోను, కాంగ్రేసేతర రాష్ట్రాలలో పర్యటిస్తూ సమస్యలపై ప్రజలతో పోరాటం సాగిస్తానంటున్న రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి, ఇక్కడ ప్రజల సమస్యలపైన, అవినీతిపైన పోరాడేందుకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగ అభివృధ్ధికి, సాంకేతిక రంగాన్ని అభివృధ్ధి చేసేందుకు తీసుకున్న చర్యల కారణంగానే ఇప్పుడు లక్షలాది మంది విద్యార్ధులు ఉన్నత విద్య అభ్యసించి విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. సెల్‌ఫోన్‌లు భారీసంఖ్యలో వినిమయంలోకి రావడం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొన్నారు. టెలికంరంగంలో త్రిజి స్పెక్ట్రమ్ వినియోగంలో కేంద్రప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయిల ఆదాయం సమకూరిందని, అయితే కాంగ్రెస్, డిఎంకె నాయకులు అందులో 50 వేలకోట్ల రూపాయిలు స్వాహా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతి చర్యలవల్ల ప్రపంచస్థాయిలో దేశపరువు మంటగలుస్తోందని విమర్శించారు. ఐపిఎల్‌లో వేల కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు దేశంలో నిర్వహించనున్న కామన్‌వెల్త్ క్రీడల పోటీల నిర్వహణలో కూడా భారీ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ప్రపంచదేశాలలో భారత్ తలదించుకునే పరిస్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవ్వాడ మత్స్యలేశంలో అణువిద్యుత్ ప్రాజక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారసంఘాలు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పరిశ్రల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలను, భూములను హరించివేసే పరిశ్రమల ఏర్పాటును మాత్రం తాము అడ్డుకుంటాన్నారు. అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపడుతున్న పోరాటంలో దేశం పార్టీ పూర్తిస్థాయిలో పాల్గొంటుందన్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను మెరుగుపరచి, వారికి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వెనుగబడినతరగతుల ప్రజల వ్యతిరేకప్రభుత్వమని స్పష్టమవుతోందన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలుగాని, ఫీజుల రీయంబర్స్‌మెంట్‌కు గాని ప్రభుత్వం చర్యలు తేసుకోకపోవడంవల్ల విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, అంబేద్కర్ యూనివర్శిటీ జంక్షన్‌లో విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్ధుల సమస్యలను వారినే అడిగి తెలుసుకుని, విద్యార్ధుల ఉద్యమాలకు టిడిపి పూర్తి మద్దతు పలుకుతోందని, ఈనెల 9వ తేదీన విద్యారంగ సమస్యలపై శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న మహాధర్నాలో తాను పాల్గొంటున్నానని, విద్యార్ధులంతా ఈ పోరాటంలోపాల్గొనాలన్నారు. విద్యార్ధుల ఫీజులను రీయెంబర్స్‌మెంట్ చేయాలని కోరుతూ తమ పార్టీ శాసనసభ్యులు ధర్నాచేస్తే పోలీసులు అక్రమంగా వారిని అరెస్ట్ చేశారని, వారికి ఫీజులు చెల్లించాలని తాను ముఖ్యమంత్రిని కోరితే డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తమ పార్టీ పేదలకోసం ఆవిర్భవించిందని, పేదలకోసం సంక్షేమ పధకాలు అమలు చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని, పేదరిక రహిత రాష్ట్రంగా మనరాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తన జీవితాశయమని, తాను చనిపోయేలోగా పేదరిక నిర్మూలనకోసం అవసరమైన చర్యలు చేపడతానని తెలిపారు. చంద్రబాబు వెంట మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు, తమ్మినేని సీతారామ్, గౌతు శివాజీ, ప్రతిభాభారతి, పార్టీ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు, నాయని సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యుపిఎ-2 సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు,ఉద్యోగులు కన్నెర్ర చేసారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు పర్చాలని, అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలని… తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో పదికోట్ల మంది శ్రామికులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం మీద సమ్మె ప్రభావం పడింది. సిఐటియు, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసిసిటియు, యుటియుసి కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్‌టియుసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెతో బెంగాల్, కేరళ, త్రిపురతోపాటు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శ్రామికులు విధులను బహిష్కరించటంతో పారిశ్రామిక యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు ఆగిపోయాయి.
రవాణా నిలిచిపోయింది. బొగ్గు, టెలికమ్యూనికేషన్లు, రక్షణ, రోడ్డు రవాణా, ఓడరేవులు, పెట్రోలియం, విమాన యానం, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భారీగా పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాలుపంచుకున్నారు. అనేక చోట్ల ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెకు పిలుపునివ్వడం పోరాటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. సమ్మె ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది.సమస్యలను పరిష్కరించకపోతే ఫీబ్రవరిలో ఛలో పార్లమెంట్ నిర్వహిస్తామని ఉద్యోగ,కార్మిక సంఘాలు హెచ్చరించాయి. సమ్మె విజయవంతం చేసిన శ్రామికులకు కార్మిక సంఘాలు అభినందనలు తెలియజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. అన్ని జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి. పారిశ్రామికవాడలు వెలవెలబోయాయి. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం వివిధ కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లో జరిగిన భారీ ప్రదర్శనలో యుపిఎ-2 ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు కార్మిక సంఘాలు రూపకల్పన చేస్తాయని హెచ్చరించారు.

ఏఐసిసి అక్రమాలపై విచారణ చేయాలని ఏసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాను ఆహ్వానిస్తున్నానని ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అంబటి రాంబాబు అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఏ విచారణకైన సిద్ధమని చెప్పారు. విచారణకు సహకరిస్తానని కూడా ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరగాలని ఇద్దరు మాజీ మంత్రులు డిమాండ్ చేసినప్పుడు తాను దానిని ఆహ్వానించానని పేర్కొన్నారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రోజు అందుకు అనుగుణంగా ఆదేశించివుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని చెప్పారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. రంగాస్వామి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఏసిబి కోర్టు ఈ రకమైన ఆదేశాన్ని ఇచ్చిందని మీడియాలో చూశానన్నారు. ఇంతకు ముందే ప్రభుత్వమే స్వయంగా సిబిఐ విచారణకు ఆదేశించివుంటే బాగుండేదన్నారు. సిబిఐ విచారణకు తాను లేఖ రాసి ఉండాల్సింది అని ప్రస్తుత ఏపిఐఐసి ఛైర్మన్ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యనాలు వింతగా ఉన్నాయని చెప్పారు. మీపై ఆరోపణల వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించగా అది తేలాల్సి ఉందన్నారు. సుబ్రమణ్యం వెనక రోశయ్య ఉన్నారో రోశయ్య వెనక సుబ్రమణ్యం ఉన్నారో తెలియదని అంబటి రాంబాబు ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మాట్లాడే వారు నాడు తాను పదవిలో ఉన్నప్పుడే ఎందుకు గళం విప్పలేదని అంబటి ప్రశ్నించారు. తాను ఏపిఐఐసి ఛైర్మన్ పదవిలోనుంచి వైదొలిగి మూడున్నర సంవత్సరాలవుతోందని చెప్పారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక, ఓదార్పు యాత్ర జరుగుతుండగా, వాటిని తాము సమర్థిస్తున్న తరుణంలోనే ఈ ఆరోపణలు గుర్తుకు రావడంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడినేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో ఎవరినైనా ఎదురిస్తా అని జగన్ చేసిన వ్యాఖ్యనాల అర్థం సోనియాను వ్యతిరేకించడమేనని ఎందుకు అర్థంచేసుకోవాలని ఆయన అన్నారు. దేశంలో ఇతర ప్రతిపక్షాలు లేవా బిజెపి పార్టీ లేదా అని ఆయన ప్రశ్నించారు. సోనియాను వ్యతిరేకిస్తానని జగన్ చెప్పినట్లు మీరు అర్థంచేసుకొంటే ఏమీ చేయలేమన్నారు. జగన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఏదో ఒక రోజు ఆయన సిఎం అవుతారని చెప్పారు. ఓదార్పునకు వచ్చిన ప్రజలను చూస్తేను జగన్ ప్రజాదరణ అర్థమవుతోందన్నారు. ఈ ప్రజాదరణ ఎంతటిదో భవిష్యత్‌లో తేలిసిపోతుందని వ్యాఖ్యనించారు. ఈ ప్రజాదరణను చూసే చంద్రబాబుకు వణుకుపుట్టిందన్నారు.

ఎపీఐఐసీ, ఎమ్మార్ ప్రాపర్టీస్ రగడ ప్రస్తుతం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కు చేరింది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న కోట్లాది రూపాయల భారీ కుంభ కోణంపై న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నిందితులను శిక్షించాలని న్యాయస్థానం ఏసీబీ అధి కారులను ఆదే శించింది. ఇందులో గతంలో పనిచేసిన మాజీఛైర్మన్ అం బటి రాంబాబు, ్రప్రిన్సిపాల్ సెక్రటరీ బీ.పీ. ఆచార్య, కట్టా పార్థసారధిరావులతో పాటు మరో పదహారు మంది ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులే సూత్రధారులుగా ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీరంగారావు అనే న్యాయవాది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు వేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సంబంధించిన వివ రాలను పరిశీలించిన న్యాయస్థానం ఎమ్మార్ ప్రాపర్టీస్ చెందిన ఆస్తుల, వ్యవహారాలు, వారికి ఉన్న లింకులను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎమ్మార్ ప్రాపర్టీస్ అం శంలో అప్పట్లో ఎపీఐఐసీ ఛైర్మన్, అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచా రణ జరిపి కేసు నమోదు చేయాలని ఎసీబీ న్యాయస్థానం పోలీసులను ఆదే శించింది. ఎమ్మార్ ఒప్పందంలో ఎపీ ఐఐసీ అవకతవకలకు పాల్పడిందని దీనికి బాధ్యులైన అప్పటి ఛైర్మన్ అంబటి రాంబాబు, ఎండీ బీపీ ఆచార్య, సలహాదారు పార్థసారధిపై చర్యలు తీసుకోవాలని న్యాయ వాది శ్రీరంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లిలోని ఎసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ సహా 16 మంది వ్యక్తులు, 16 సంస్థలతో ఎపీఐఐసీ కుదు ర్చుకున్న ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకుందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు న్యాయ స్థానాన్ని కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం ముగ్గురిపై అవినీతి నిరోధక చట్టంలోని 11, 12, 13 సెక్షన్లు, భారతీయ శిక్షా స్మృతిలోని 406, 420, 409, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను ఆదే శించింది.
ఏసీబీ విచారణ ఎదుర్కొనే వారి వివరాలు ఈవిధంగా ఉన్నాయి…
బీపీ ఆచార్య, ప్రిన్సిపాల్ సెక్రటరీ, అంబటి రాంబాబు, మాజీ ఎపీఐఐసీ ఛైర్మన్, డి.పార్థసారధిరావు, రిటైర్డు అధికారి, మెస్సర్స్ ఎమ్మార్ ప్రాపర్టీస్, దుబాయ్, మెస్సర్స్ ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్,అలీఫ్ రీసోర్స్ అండ్ ఇన ్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భువితేజా ఎంటర్ ప్రైజెస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్,మ్యాక్ సొల్యూ షన్స్ ఇంక్, న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్,ఆర్‌యు సర్వీస్ సెంటర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రాం క్లిన్ టెంపల్‌టన్ ఇంటర్నేషనల్, ఎస్ శ్రీరామ్ గ్రూప్ కంపెనీస్, ప్రకృతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవల ప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్.

రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనలకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభు త్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలి పారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో బెంగుళూరు విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో వెయ్యి ఎకరాల భూమిని ఇందుకు అనువైన ప్రాంతంగా ఇదివరకే గుర్తించామన్నారు.ప్రొఫెసర్ మోహన్ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూషన్ కమిటి పరిశీలన జరిపి ప్రతిపాదిత ప్రాం తం క్యాంపస్‌కు అనువైనదిగా తేల్చిందన్నారు.ఐ.ఐ.సి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సానుకూలతను వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రోశ య్యకు లేఖకూడా రాశారన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా వ్యవసాయ రం గానికి సంబంధించి కోర్సుల నిర్వహణ, ఫ్యాకల్టీ నియామకం, ప్రయోగశాల ఏర్పాటు పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాటవుతాయని మంత్రి రఘు వీరారెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాల నలో రాష్ట్ర ప్రజలకు ఒరింగిందేమీ లేకపోగా సమస్యలు మరిన్ని పెరిగాయని మాజీ ముఖ్య మంత్రి , టిడిపి అధినేత నా రా చంద్రబాబునాయుడు విమర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జిల్లాకు విచ్చేసిన చ ంద్రబాబుకు జిల్లా ముఖద్వారం పైడి భీమవరం వద్ద నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకుల నుంచి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయ నున్న కొవ్వాడ మత్స్యలేశం ప్రాంతాన్ని సంద ర్శించారు. తరువాత ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులను కలిశారు.
నేరుగా సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా పలు చోట్ల చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కారు ఏలికలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆరేళ్ల పాలనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. అల్లుడు, కొడుకు, స్నేహితులు, బంధువులకు ప్రజా సంపదను అప్పనంగా వైఎస్ అప్పగించారని విరుచుకుపడ్డారు. మంత్రులంతా అవినీతి ‘ఘను’లేనని, వారి కళ్లు పడితే కొండలు క్షణాల్లో కనుమరుగవుతున్నాయని అన్నారు. ఇంతటి అవినీతి పరులను ఎక్కుడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాల ద్వారా ఖజాను నింపుకొంటున్న ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో మాత్రం తీవ్ర అలక్ష్యం వహిస్తోందన్నారు. నిధుల లేమి సాకుతో రోశయ్య ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌లో ఆడుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లోనూ కప్పదాటు వైఖరిని కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారన్నారు.

కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి విషయంలో ఓర్పుతో వ్యవహరించాలని పార్టీ భావిస్తోందని, ఆయనకు ఎటువంటి హాని తలపెట్టే ఆలోచన తమకు లేదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించడం ఆయనకు ఉద్వేగభరితమైన విషయమేనని, ఈ విషయాన్ని పార్టీ గుర్తించిందని కాంగ్రెస్‌లోని అత్యున్నత వర్గాలు పీటీఐ ప్రతినిధికి వివరించాయి. “ఆయన వ్యవహారశైలి సాధారణంగా ఉండడం లేదు. తన తండ్రి మరణం ఆయనకు ఉద్వేగాన్ని కలిగించే అంశమే. వైఎస్ మరణం జగన్‌కే కాదు. పార్టీకి కూడా నష్టమే. ఓదార్పు యాత్రను పార్టీ తరఫున నిర్వహిస్తామని చెప్పినా ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు.
అయితే, ఆయనకు హాని తలపెట్టాలని, ఆయనను బాధ పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ విషయంలో పార్టీ ఓర్పుతో వ్యవహరిస్తుంది” అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. పార్టీ అధిష్ఠానం మాటను ధిక్కరించి జగన్ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ వై.వెంకట్రామిరెడ్డి మూడు మాసాల పాటు సెలవుపై వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గ్రూప్-1 ఎంపిక పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వమే సెలవులపై వెళ్ళాలని ఆదేశించి ందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా తానే సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని సంక ల్పించినట్టు వెంకట్రామిరెడ్డి తన సన్నిహితులకు చెప్పారని సమాచారం. గత ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణావాదులు, కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణా ప్రాంత నేతలు ప్రయత్నించడం, వెంకట్రామిరెడ్డిపై తెరాస అధినేత కెసిఆర్‌తోపాటు ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేయడంతో ఆయన సెలవుపై వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా వెంకట్రామి రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. జనవరి మాసం దాకా సెలవుపై వెళ్ళి ఫిబ్రవరిలో వెళ్ళి తిరిగి విధులకు
హాజరు కావాలని ఆ మాసమంతా పదవిలో కొనసాగి పదవీ విరమణ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే గ్రూప్-1 వివాదాలకు వెంకట్రామిరెడ్డియే కారణమని పలువురు మంత్రులు, తెలంగాణావాదులు, తెలంగాణా విద్యార్థుల జేఏసీ ఆరోపించడం ఈ అంశాన్ని ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా తీవ్రంగా పరిగణించిందని తెలిసింది. రెండుసార్లు వాయిదా వేసిన గ్రూప్-1 ఎంపిక పరీక్షను మరోసారి వాయిదా వేస్తే బాగుండేదని అనవసరంగా పరీక్షను జరిపి సమస్యను మరింత జఠిలం చేశారని ఢిల్లిలోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వ్యాఖ్యానించారని సమాచారం. వెంకట్రామిరెడ్డి వ్యవహారశైలిపై గవర్నర్ నరసింహన్ కూడా అసంతృప్తితో ఉన్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. గ్రూప్-1 సమస్యను ఎంతో చాకచక్యంతో వ్యవహరించవలసిన ఏపీపీఎస్సీ ఈ విషయంలో ఘోర వైఫల్యం చెందిందని గవర్నర్ అభిప్రాయపడుతున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. పరీక్షకు పదిహేను రోజుల ముందే సమస్యపై లోతుగా అధ్యయనం చేసి ఇరువర్గాలను చర్చలకు ఆహ్వానించి ఉంటే వివాదం ఇంతవరకు వచ్చి ఉండేది కాదని గవర్నర్ భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రోశయ్య సైతం ఏపీపీఎస్సీ పనితీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నట్లు తెలిసింది. తనకు వచ్చిన ఫిర్యాదులను, వినతిపత్రాలను ప్రభుత్వానికి పంపించవలసిన ఏపీపీఎస్సీ వాటిని తమదగ్గరే ఉంచుకుని సమస్యను జఠిలం చేసిందని వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వానికి పంపి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్-1 పరీక్షను నిర్వహించి ఉండేవారమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో జూనియర్ లెక్చరర్ల ఎంపిక పరీక్ష విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారని తాజాగా విమర్శలు వస్తున్నాయి. కమిషన్ స్వయంప్రతిపత్తి గల సంస్థ అని తమకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని చెప్పుకుంటున్న వెంకట్రామిరెడ్డి సమస్యలు వచ్చే సరికే వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వంపై నెట్టడం ఆయనకు అలవాటుగా మారిందని సీనియర్ మంత్రి ఒకరు విమర్శించారు. పోటీ పరీక్షల తేదీల ఖరారు విషయంలో ఎవరి ప్రమేయం లేకుండా తనకుతానే తేదీలను నిర్ణయించి ప్రకటిస్తున్నారని తీరా పరీక్షల వాయిదా అంశం వచ్చే సరికి పక్కకు తప్పుకుని ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని సాక్షాత్తూ ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిన విషయం విదితమే. తెలంగాణా ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ ప్రాంత అభ్యర్థులను ఇబ్బందులు పెట్టేందుకే వెంకట్రామిరెడ్డి ఉద్దేశ పూర్వకంగా గతంలో జరిగిన గ్రూప్-1 పరీక్ష వివరాలను లగడపాటిికి అందజేశారని, దీన్ని అదునుగా తీసుకుని ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణాను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తుతున్నారు.
పరీక్ష తిరిగి నిర్వహణపై నేడు నిర్ణయం
ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ఎంపిక పరీక్ష ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రం కూడా పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే బయటకి పొక్కడంతో తిరిగి పరీక్షను నిర్వహించాలా? వద్దా? అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు ఏపీపీఎస్సీ పాలకమండలి అత్యవసరంగా సమావేశమవుతోంది. తెలంగాణా ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష నిర్వహణలో ఇబ్బందులు తలెత్తి ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒక పరీక్ష కేంద్రంలో తిరిగి పరీక్ష నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గతంలో ఏపీపీఎస్సీ ఇటువంటి తరహా పరీక్షలను జరపలేదని చెబుతోంది. తెలంగాణా ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రాలు అందజేశారు.

రెండు పర్వదినాలు ఒకరోజు తేడాతో వస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు, రంజాన్ పర్వదినంపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీప్రసాద్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ అరవిందరావు, నగర పోలీసు కమిషనర్ ఎ.కే.ఖాన్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎ.కే.ఖాన్ మాట్లాడుతూ రంజాన్, గణపతి నవరాత్రులకు ముందుగానే బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండపాల ఏర్పాటు చేసే నిర్వాహకులతో సమావేశం నిర్వహించామనీ, నగర పోలీసులతో పాటు అదనంగా ఇతర జిల్లాల నుంచి 9వేల మంది సిబ్బందిని నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు.
అలాగే విగ్రహాల నిమజ్జనానికి 45 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ బీఇడీ కేంద్రంలోకి విద్యార్థుల చొరబాటులో పోలీసుల వైఫల్యం లేదని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రహారీగోడ చిన్నదిగా ఉండటం వల్ల వారిని నియంత్రించలేకపోయినట్లు చెప్పారు. ఇక నుంచి ఇలాంటి పరీక్షలు నిర్వహించే కేంద్రాల ఎంపిక సమయంలో పోలీసులను కూడా సంప్రదిస్తే ఏ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే భద్రతకు అనువుగా ఉంటుందో సూచించే అవకాశం ఉంటుందని ఖాన్ అభిప్రాయపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం మరోసారి ముందుకొచ్చింది. ఇంత వరకు విద్యార్థి సంఘాలు, సంక్షేమ సంఘాలు ఆందోళనలు సాగిస్తుండగా, సోమవారం తెలుగుదేశం పార్టీ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. దాంతో 25 మందికి పైగా టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను వినడానికి కూడా ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని టిడిపి నేతలు ఆరోపించారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి సిఎం నిరాకరించారని, వినతి పత్రం తీసుకోవడానికి మంత్రులు అంగీకరించలేదని చెప్పారు. టిడిపి నేతలను బలప్రయోగంతో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసిన నాయకులను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అక్కడ ధర్నా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలరాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో టిడిపి రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బకాయిల మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోగా చెల్లిస్తామని ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి కె రోశయ్య రీయింబర్స్‌మెంట్ విషయమై చర్చించేందుకు రమ్మంటూ టిడిపికి ఆహ్వానం పంపారు. క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో చంద్రబాబుతో పాటు కడియం శ్రీహరి, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే, చర్చలు విఫలమయ్యాయి. సర్కార్ మొండివైఖరి అవలంబిస్తోందని చర్చల అనంతరం చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి వితండవాదం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగినా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తమతోపాటు కలిసి వచ్చే పార్టీలు, విద్యార్థి సంఘా లతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 8వ తేదీన మోటారుసైకిళ్ల ర్యాలీని, 9న నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. సోమవారం ముగిసిన ఆ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఫీజుల కోసం యాజమాన్యాలు వేధిస్తే విదార్థులు అక్కడికక్కడే ఆందోళనలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.
పోలీసులతో వాగ్వాదం
అంతకుముందు సచివాలయంలోని సిఎం కార్యాలయం ముందు టిడిపి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిద్దరు టిడిపి నేతలతో పాటు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. టిడిపి నాయకులను అరెస్ట్ చేసి మూడు వ్యాన్లలో నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ బోధనా ఫీజులపై చర్చిండానికి తాము ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ముందుగానే కోరినా, అవకాశం ఇవ్వలేదన్నారు. సిఎం కార్యాలయంలోకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం అనుమతించకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కెఇ ప్రభాకర్ మాట్లాడుతుండగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఎంపిలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ధూళిపాల నరేంద్ర, రావుల చంద్రశేఖరరెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ మసాల పద్మజతో సహా ధర్నాలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
టిడిపి లబ్ది పొందాలని యత్నిస్తోంది : మంత్రులు
విద్యార్థులతో రాజకీయాలను చేస్తూ టిడిపి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని మంత్రులు విమర్శించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, బాలరాజు తదితరులు టిడిపి నేతల అరెస్ట్ అనంతరం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజల క్రితమే ముఖ్యమంత్రి అప్పాయింట్‌మెంట్ ఇస్తే టిడిపి నేతలు రాలేదని చెప్పారు. సోమవారం సిఎంకు అనారోగ్యంగా ఉండటంతో ఆయన సచివాలయానికి రాలేదని, దీనిని రాద్దాంతంచేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చిన తనను వినతిపత్రం తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారని, ఇదేం పద్దతని మంత్రి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నించారు. టిడిపి నేతలకు రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నో అంశాలున్నాయని, విద్యార్థులను ఉపయోగించుకోవడం మంచిదికాదని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమహయంలో 300 కోట్ల రూపాయలు కూడా రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వని తెలుగుదేశం పార్టీకి ఈ విషయమై మాట్లాడే హక్కు ఎక్కడుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 389.20 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు చెల్లించాల్సిఉందని, దీనిని కూడా ఈ నెల 15వ తేదిలోగా విడుదల చేస్తామని చెప్పారు. రీయింబర్స్‌మెంట్ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను యాజమాన్యాలు వేధిస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.