కడప

జగన్‌ అనుచరుడు మంగలి కృష్ణ అరెస్టు


ఒక పక్క ఆస్తుల కేసులో సీబీఐ ఇస్తున్న షాకు లతో ఉక్కిరిబిక్కిరవు తున్న వైఎస్‌ జగన్‌కు, తాజాగా రాష్ట్ర సీఐడి అధికారులు కూడా మరో షాక్‌ ఇచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహి తుడిగా ఉన్న దంతులూరి కృష్ణ, అలియాస్‌ పులివెందుల కృష్ణ, అలియస్‌ మంగలి కృష్ణను సిఐడి అధికారులు మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్‌ చెక్‌పోస్టు వద్ద మంగళవారం నాడు అరెస్టు చేశారు. మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడైన మలి శెట్టి భానుకిరణ్‌కు ఆయుధాలు సరఫరా చేసిన నేరంపై అతన్ని అరెస్టు చేసినట్లు సిఐడి విభాగం అద నపు డిజిపి రమణమూర్తి ప్రకటించారు. సూరి హత్యకు ముందు మంగళి కృష్ణ దఫదఫాలుగా తనకు 8 తుఫాకులు సరఫరాచేసినట్లు భాను కిరణ్‌ సిఐడి విచారణలో అంగీకరించాడు.
ఈ సమాచారం ఆధారంగా గతంలో సూరికి బాడీగార్డుగా పనిచేసిన మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన చంద్రశేఖర రెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద భాను దాచిన రెండు తూఫాకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం భాను వద్ద కూడా రెండు తుఫాకులు స్వాధీనం చేసుకు న్నారు. భాను ఇచ్చిన సమాచారం మేరకే కొద్దిరోజుల క్రితం అనంతపురంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు మరో రెండు తుఫాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి దివంగత పరిటాల రవిని హతమర్చడానికి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని మేడాపురం గ్రామంలో 1999 సంవత్సరంలో సూటికేసు బాంబు అమర్చిన కేసులో కోర్టు గత నెలలో మంగలి కృష్ణతోపాటు మరో నాల్గురికి జైలు శిక్షణ ఖరారు చేసింది.
దానిపై మంగలి కృష్ణ హైకోర్టులో అప్పిల్‌ చేసుకోవడంతో బెయిల్‌ లభించింది. అయితే భాను కిరణ్‌కు ఆయుధాలు సరఫరాచేసిన కేసులో సిఐడి పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకొని కృష్ణ నాలుగు రోజలు కిత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా డు. అయితే మంగలి కృష్ణ మరో ముగ్గురు అనుచరులతో కలిసి హైదరాబాద్‌ వస్తున్నాడన్న పక్కా సమాచారం అందండంతో షాద్‌నగర్‌ సమీపం లోని చెక్‌పోస్టు వద్ద కాపలా కాసిన సిఐడి అధికారు లు అతన్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, మంగలి కృష్ణ కద లికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అం దడంతో సోమవారం రాత్రి 11.40 నిమిషాలకు మహబూబ్‌నగర్‌జిల్లా కొత్తూరు టోల్‌గేటు దగ్గర సిఐడి అధికా రులు కృష్ణను అరెస్టు చేసినట్లు తెలు స్తున్నది. ఈ విష యం బయటకు పొక్కకుండా జాగ్ర త్తపడ్డ సిఐడి అధి కారులు మంగళవారం రాత్రి అధికారికంగా అరెస్టు చూపట్టారు. కృష్ణను బుధవా రం మెజిస్ట్రేట్‌ ముందు హజరపరుస్తామని సిఐడి అధికారులు చెప్పారు.

చెల్లిని చంపిన అన్న


కులదురహంకారానికి నిండు ప్రాణం బలి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన అన్నే చెల్లిని ఉరేసి చంపి కుందూ నదిలో పాతిపెట్టిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా చాపాడు మండలం భద్రిపల్లె పంచాయతీ నెర్రవాడ గ్రామానికి చెందిన చల్లా గంగన్నకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గంగయ్య తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మూడో కుమార్తె లలిత (29) తప్ప ఎవరూ పెద్దగా చదువుకోలేదు. ఆమె అగ్రికల్చర్‌ బిఎస్సీ, ఎంఏ, పిహెచ్‌డి చేసి కర్నూలు జిల్లా చాగలమర్రిలో వ్యవసాయ అధికారిణిగా పనిచేస్తోంది. చదువుకునే రోజుల్లో కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన సహ విద్యార్థి నాగేశ్వరరావును ప్రేమించింది. వేర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి లలిత సోదరుడు గంగయ్య అంగీకరించలేదు. తల్లి పదేళ్ల కిందటే మృతి చెందింది. తండ్రి వృద్ధుడు కావడంతో గంగయ్యే చెల్లెళ్లను పెంచాడు. లలిత తన వివాహ విషయమై అన్నతో ఘర్షణపడింది. తాను ప్రేమించిన నాగేశ్వరరావునే పెళ్లిచేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఉద్రేకానికి లోనైన గంగయ్య లలితను ఉరేసి చంపేశాడు. విషయం బయటికి పొక్కితే శిక్ష తప్పదని భావించి చిన్నాన్న గొక్కి పుల్లయ్యతో కలిసి మండలంలోని శ్రీరాములపేట సమీపంలోగల కుందూనదిలో లలిత మృతదేహాన్ని పూడ్చి వేశారు. తన చెల్లిని మైదు
కూరు బస్టాండులో చాగలమర్రి బస్సు ఎక్కించి వచ్చానని గ్రామస్తులకు చెప్పాడు.
లలితకు నాలుగేళ్లుగా తన చెల్లెలు వరలక్ష్మికి రోజూ ఫోన్‌ చేసే అలవాటు ఉండేది. ఒక్కసారిగా అక్క నుంచి ఫోన్లు ఆగిపోవడంతో అన్నయ్యను ఫోన్‌లో సంప్రదించింది. లలిత విషయం తనకు తెలియదనీ, ఇంటికి కూడా రాలేదని సమాధానం చెప్పాడు.నాలుగు రోజులయినా అక్క జాడ తెలియకపోవడంతో పోలీసులకు వరలక్ష్మి ఫిర్యాదు చేసింది. లలిత ప్రియుడితో వెళ్లి పోయిఉంటుందనే ఉద్దేశంతో నాగేశ్వరరావును పోలీసుస్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. లలిత గురించి తనకు తెలియదనీ, కుటుంబీకులే ఏదైనా చేసి ఉండొచ్చనే అనుమానం నాగేశ్వరరావు వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు గ్రామస్తుల్ని విచారించడంతో అన్న గంగయ్య మీదే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డిఎస్‌పి కరుణాకర్‌, సిఐ జనార్ధన్‌నాయుడు ఆదివారం గంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడ్ని, అతనికి సహకరించిన చిన్నాన్న గొక్కి పుల్లయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. తహశీల్దార్‌ ప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో నదిలో మృతదేహాన్ని వెలికితీసి ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
అన్నను కఠినంగా శిక్షించాలి: లలిత సోదరి సొంత చెల్లెలిని కిరాతకంగా చంపిన గంగయ్యను ఉరి తీయాలని మరో చెల్లెలు నాగలక్ష్మి పేర్కొంది. ఇలాంటి వారి వల్లే సమాజంలో అశాంతి చోటు చేసుకుంటోందని తెలిపింది.

ఉప ఎన్నికలను పక్కాగా నిర్వహించాలి కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌

జిల్లాలోమూడు నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు పక్కాగా నిర్వహించేందుకు పీఓలు, ఏపీఓలు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సభాభవనంలో ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహణపై పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నిగంటలకు చేరుకోవాలి, మాక్‌ పోలింగ్‌ ఏ విధంగా నిర్వహించాలి, ఏజెంట్లను ఏపద్దతిలో కూర్చోబెట్టాలి, ఈవీఎంలు మొరాయిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు బాధ్యతగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించరాదన్నారు. ఎర్రగుంట్ల తహశీల్దార్‌ ఎన్నికల పోలింగ్‌ గురించి పీఓలకు, ఏపీఓలకు విపులంగా తెలియజేశారు. పోలింగ్‌ స్టేషన్‌లో పీఓలు వరుసగా కూర్చోవాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌లో ఓటర్లు లోపలికి వెళ్లేందుకు ఒక దారి, బయటికి వచ్చేందుకు మరొకదారి ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్ల సంతకాలను పీఓలు సరిచూసుకోవాలన్నారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంటు మాత్రమే ఉండాలన్నారు. ఆయుధాలను పోలింగ్‌ స్టేషనుకు తీసుకువచ్చేవారికి అనుమతి ఇవ్వరాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఉపపోరుపై అధికారుల నిఘా నేత్రం

ఎన్నికల నియమావళిపై డేగకన్ను
భారీగా బైండోవర్‌ కేసులు
జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ముందస్తు చర్యలు చేపడుతోంది. పోలీసు శాఖ కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఓటర్లు ప్రశాంత వాతావ రణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం ప్రజలను అవగాహన పరచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలనే విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డ బ్బులతో పాటు శాంతిభద్రతలకు ఇబ్బందులు కల్పిస్తారన్న అనుమానం తుపాకులపై కూడా అధికారులు నిఘా నేత్రం వుంచారు. ఎన్నికల ని¸ ుమావళి ఉల్లంఘనపై డేగకన్ను వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన దాదాపు 48వేల బ్యానర్లను ఫ్లెక్సీలను తొలగించారు. ప్రధాన ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా జిల్లాలో లైసెన్స్‌ పొందిన తుపాకులపై పోలీేసు యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా 1700పైగా లైసెన్స్‌ తుపాకులు వుంటే 1301 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా లైసెన్స్‌ లేకుండా 18 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలలో 2491 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. నగదు సరఫరాలకు సంబంధించి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 60లక్షల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎన్నికలలో మద్యం పైన కూడా అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించారు. ఎక్సైజ్‌ అధికారులు ఇప్పటి వరకు దాదాపు 3వేల లీటర్లకు పైగా లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద జిల్లాలో జరగనున్న ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జిల్లాయంత్రాంగం పటిష్టమై చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నియమావళి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. అదేవిధంగా ఎన్నికల ప్రచార ఖర్చులను అంచనా వేసేందుకు కూడా మరో అధికార బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికల్లో వెలువడే పెయిడ్‌ ఆర్టికల్స్‌పై పరిశీలన జరిపేందుకు కూడా కమిటీని ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు చెక్‌ పెడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం ముందుకు సాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నోటిఫికేషన్‌ విడుదలతో మొదలైన ఉప హడావుడి ప్రచార బరిలోకి అతిరథ మహారథులు

ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో ఎన్నికల హడావుడి మొదలైంది. శుక్రవారం ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల ఘట్టం ప్రారంభమైంది. దీంతో ఉపపోరులో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ నామినేషన్‌లను ఈ నెల 25వతేదీలోగా దాఖలు చెెయాల్సి వుంది. ఇదిలా వుండగా నోటిఫికేషన్‌ వెలువడడంతో ఎన్నికల హడావుడి 3 నియోజకవర్గాలలో మొదలైందని చెప్పవచ్చు. జగన్‌ వర్గానికి చెందిన అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్ధతుగా ఓటు వేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ వారిపై అనర్హతవేటు వేసింది. దీంతో వారు ఎమ్మెల్యే పదవులను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఉప ఎన్నికలు అటు వైకాపాతో పాటు ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి సవాల్‌గా మారాయి. తమకున్న బలంతో మూడు స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వుంది. సానుభూతితో పాటు ప్రస్తుతం ప్రభుత్వం, సిబిఐ జగన్‌ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ను ఇబ్బందిపాలు చేసేందుకు సిబిఐని జగన్‌పై ఉసిగొల్పుతుందన్న కారణంగా ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతుందన్న అంచనాలో వైకాపా నేతలు వున్నట్లు సమాచారం. కాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో చిక్కుకోవడం, ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ప్రజలుకూడా జరిగిన అక్రమాలను తెలుసుకున్నారని, అదేవిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న పథకాల పట్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని, కారణంగా కాంగ్రెస్‌ వైపే ప్రజలు మొగ్గుచూపుతారన్న ఆశతో ఆ పార్టీ నేతలు వున్నట్లుసమాచారం. ఇదిలా వుండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోయాయని, ప్రజలను పట్టించుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదన్న కారణంగా ప్రజలలో నిరాశా నిస్ప్రృహలు చోటుచేసుకున్నాయని, దీంతో ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన అధినేతలు జిల్లాలో రెండు పర్యాయాలు ప్రచార పర్వాన్ని ముగించారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేశారు. అధినేతల సభలకు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. అయితే పోలింగ్‌ రోజున ఎవరికి ఓటేస్తారన్నది అంతుబట్టని విషయం. కాగా ప్రస్తుతానికి అధినేతల పర్యటన జిల్లాలో ముగియడంతో ఇక అతిరథ మహారథులను ప్రచారబరిలోకి దింపేందుకు ఆయా పార్టీలు యత్నిస్తున్నట్లుసమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 3 నియోజకవర్గాలలో ప్రచారం చేపట్టనున్నట్లు సమాచారం. తెదేపా తరపున కోడూరు నియోజకవర్గంలో బాలకృష్ణ ప్రచారం చేస్తారన్న వాదనలు వినవస్తున్నాయి. అదేవిధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమ్మతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల ప్రచార తేదీ ముగిసే నాటికి ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశాలు కానవస్తున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి వైకాపాను ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం నుంచి రోడ్‌షోను జగన్‌ నిర్వహించారు. చిన్న ఓరంపాడుక్రాస్‌, కొర్లకుంట, మంగంపేట, అనంతరాజుపేట, రాఘవరాజపురం మీదుగా కోడూరుకు రోడ్‌షో చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్దిపథంలోకి తీసుకెళ్లడంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కృషి చేశారన్నారు. ఎన్నో సం క్షేమ పథకాలు చేపట్టారన్నారు. వ్యవసాయాన్ని పండుగగా చేసుకోవాలని తలంపుతో రైతులకు పలు రాయితీలను కల్పించారన్నారు. ఉచితంగా 7 గంటల పాటు విద్యుత్‌ సరఫరా సౌకర్యాన్ని అందివ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకాన్ని అందుకు సంబంధించిన ఫైలుపై చేయడం జరిగిందన్నారు. రాజశేఖర్‌ రెడ్డి పాలన రైతన్న రాజ్యంగా కొనసాగిందన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్య లభించే విధంగా ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌ మెంట్‌ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకే కాకుండా అగ్రవర్ణాలలో కూడా వున్న పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో బోధనా ఫీజులను ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్న తలంపుతో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. ఎంతో వ్యయమయ్యే శస్త్ర చికిత్సలు పేదలకు ఉచితంగా అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారన్నారు. అలాగే పేదలు వైద్యం కోసం కష్టపడకూడదనే తలంపుతో 104, 108 సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. కానీ ఈ పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేయకుండా ప్రజలను ఇబ్బందులకు గుిం చేస్తోందన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వృద్ధులకు, వికలాంగులకు, చేనేతలకు ఖచ్చితంగా పెన్షన్‌లు అందేవన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేని కారణంగా వారు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇదిలా వుండగా తనకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై సిబిఐ అస్త్రాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తనను ఏమీ చేయలేరన్నారు. ఆ దేవుని అండతో పాటు ప్రజల ఆశీస్సులు తనకు వున్నాయన్నారు. ప్రజలు అందించే ఆదరాభిమానాలతో మరింత ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన తెదేపా కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై తనపై విమర్శలను గుప్పించడమే ఏకైక అజెండాగా పెట్టుకొని ఉప ఎన్నికలలో ప్రచారం చేస్తోందన్నారు. కానీ ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని జగన్‌ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌, తెదేపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 2014లో జరిగే ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలు ఓ సెమీ ఫైనల్స్‌ లాంటివని, ఈ ఎన్నికలలో వైకాపా అభ్యర్థులను ఓటర్లు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్‌ నిర్వహించిన రోడ్‌షోలకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్‌షోలో రైల్వేకోడూరు నియోజకవర్గ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొండారెడ్డి, కన్వీనర్‌ పంజం సుకుమార్‌ రెడ్డి, సిద్ధయ్య, వేమన వర్మ, పట్టణ కన్వీనర్‌ రమేష్‌, నందబాల, మైనారిటీ నాయకులు అన్వర్‌ బాష, ముజీబ్‌, ఆదామ్‌ సాహెబ్‌, ఓబులవారిపల్లె మాజీ జడ్పీటీసీ సాయికిశోర్‌ రెడ్డి, చిట్వేల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెవు శ్రీనివాసులు రెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17 పింఛన్లు తిన్న మహిళా రాబందు

అట్లూరు మండలంలోని కామసముద్రం పంచాయతీకి చెందిన సీఎస్‌పీ రాజబోలు బుజ్జమ్మ గత రెండు సంవత్సరాల నుంచి 17 మంది పింఛను దారుల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేసిందని, అంతేకాకుండా ఈ డబ్బును స్వాహా చేసినట్లు సమాజిక తనిఖీల్లో స్పష్టం అయినట్లు డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి తెలిపారు. ఈమెను ఓపెన్‌ ఫోరం నందు విచారించగా నేను డబ్బులు అధికారులకు చెల్లి ంచానని, అటువంటి రాతపూర్వంగా ఏమీ లేవని ఆమె బుకాయించింది. నారి చెంచుసుబ్బమ్మ రెండు సంవత్సరాల నుంచి కువైట్‌లో ఉన్నా ఇక్కడ గుర్తువేసి డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ లబ్దిదారురాలు డ్వామా పీడీ ఎదుట వచ్చి నేను రెండు ఏళ్ల నుంచి కువైట్‌లో ఉన్నానని, నాకు ఇచ్చే వితంతు పింఛను నావారికి ఎవరికీ అందలేదని ఆమె వాపోయింది. సామాజిక తనిఖీ బృందంకామసముద్రం పంచాయతీలో పరిశీలించినప్పుడు 17 మంది వరకు ఇలా పింఛను పొందడం లేదని, సీఎస్‌పీ నే స్వాహా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీనిపై రికవరీకి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. ఎస్పీగా బాధ్యతులు చేపట్టిన ఆయన బుధవారం స్థానిక అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో, పులివెందుల డివిజన్‌ పరిధిలోని డిఎస్పీ జయచంద్రుడు, సిఐ, ఎస్సైలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాలను అరికట్టెందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మట్కాపై, క్రికెట్‌ బుకీలపై ప్రత్యేక దృష్టివుంచి సంబంధితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు కృషిచేస్తామన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటినుంచి కట్టుదిట్ట మైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటినుంచి జిల్లా వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల రహదారులలో ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా చూస్తామన్నారు. ఈ ప్రాంతంలో గత ఏడు నెలల కిందట మావోయిస్టుల సంచరిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి, అవి ఎంతవరకు వాస్తం, అన్నది తాము త్వరలో తెలుసుకుంటామన్నారు. ఉప ఎన్నికలను దృష్టిలో వుంచుకుని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కార్య క్రమంలో అర్బన్‌ సిఐ శ్రీరాములు, రూరల్‌ సిఐ రాజేంద్ర ప్రసాద్‌, లక్కిరెడ్డిపల్లె సిఐ వెంకటేశ్వర్లు, పులివెందుల సిఐ శంకరయ్య, అన్ని మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.

నేడు ఎన్నికల నోటిఫికేషన్‌

25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
జూన్‌ 12న పోలింగ్‌
ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం
సమారానికి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
ఈ నెల 18వ తేదీ శుక్రవారం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిసారు. 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూన్‌ 12వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. చెక్‌పోస్టులలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి అనిల్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ మనీష్‌ కుమార్‌ సిన్హా, తగిన చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్లు, విత్‌డ్రా ప్రక్రియలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషనర్‌ వేసే సమయంలో వంద మీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాలను అనుమతించరు. అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాల్లో 5 మందిని మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ల సమయంలో మీడియాకు కూడా అనుమతి లేదు. ప్రతి మండలంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నిఘా తెచ్చారు. మూడు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు 18 టీంలు డబ్బు, మద్యం అక్రమరవాణాను నిరోధించేందకు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న చోట మద్యం బెల్ట్‌ షాపులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండడంతో ఆయా రాజకీయ పార్టీలు ఇక ఉపసమరానికి సన్నధ్ధమవుతున్నారు. ఉప ఎన్నికల్లో ఎ లాగైనా గెలవాలనే లక్ష్యంతో ఆయా రాజకీయపార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక నామినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని చెప్పవచ్చు.

56 లక్షల నగదు పట్టివేత

కడప రాజంపేట రహదారిలో బాకరాపేట వద్ద గురువారం వాహనాల తనిఖీలో భాగంగా రూ. 56 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసి అక్రమంగా రవాణా అవుతున్న మద్యం, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగతుంది. ఈ నేపధ్యంలో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కడప నుంచి మంగపేట వెళుతున్న స్కార్పియో ఏపీ29 బీజి 5303 అనే వాహనం లో రూ.56 లక్షలు నగదు పట్టుబడింది. ఒంటిమిట్ట సీఐ భాస్కర్‌ నగదును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. మంగంపేట మైనింగ్‌ కంపెనీకి సంబంధించిన డబ్బుగా గుర్తిం చారు. ఈ నగదును అక్కడి సిబ్బంది జీతభత్యాల చెల్లింపుకు తీసుకెలుతున్నట్లు వాహనంలో ఉన్నవారు తెలిపారు. అయితే ప్రస్తుతం జీతాలు చెల్లింపు సమయం కాదని భావించిన పోలీసులు అనుమానాస్పదం కింద నగదును సీజ్‌ చేసిన అనంతరం ఐటీ అధికారులకు అందజేశారు. ఈ విషయం గురించి సీఐ భాస్కర్‌ ఏపీ ఎంఐడీసీ ఎండీ సీవీ విజయ్‌ కుమార్‌ రెడ్డితో మాట్లాడడం జరిగింది. సిబ్బంది జీతభత్యాలకోసమే నగదును కడప నుంచి మంగపేటకు తీసుకెళుతున్నట్లు ఆయన సీఐకి వివరించారు. ఈ తనిఖీలలో సిద్దవటం ఎస్సై శివశంకర్‌, ఒంటిమిట్ట ఎస్సై జీవన్‌ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.

free website analytics