శ్రీకాకుళం

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

మీ కోటలు మీడియాకు చూపండి


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని లోటస్‌పాండ్, బెంగళూరు, కడపలో ఉన్న భవంతులను మీడియాకు చూపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. విజయనగరంలోని తన ఇల్లును మీడియాకు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌కు వచ్చిన బొత్స సోమవారం గాంధీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ జగన్‌పై, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ ఉపఎన్నికలు అవినీతికి, నీతికి, వంచనకు, అభివృద్ధికి మధ్య జరగనున్నట్లు తెలిపారు. జగన్ తన పార్టీ పేరు చెప్పుకోలేని బలహీనుడని అన్నారు. వైఎస్సార్ అంటే యువజన, శ్రామిక, రైతు అనే అర్థం అని జగన్ ఎప్పుడైనా చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. తనకు సిఎం పదవి ఇవ్వకుండా చిన్నాన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీ నుంచి వెళ్ళిపోయిన జగన్‌ది త్యాగమా? స్వార్థమా? అని ప్రశ్నించారు. వైఎస్‌కుగానీ, కుటుంబానికిగానీ పార్టీ ఏమి అన్యాయం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని తెలిపారు. మోతిలాల్ నెహ్రూ సంపన్నుడైనప్పటికీ ఆ తర్వాత అలహాబాద్‌లోని సొంత ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశారని చెప్పారు. కానీ జగన్ కట్టింది ఇల్లా? హోటలా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. దొంగ ఎప్పటికీ దొంగేనని దొరకాలేడని తెలిపారు. తాను ఇనే్నళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నా అని ఆయన పొరపాటుగా అనడంతో విలేఖరులు నవ్వారు. తిరిగి బొత్స సవరించకుంటూ ఇనే్నళ్ళు మంత్రిగా ఉండి ఏమైనా సంపాదించానా? అని ప్రశ్నించారు. జగన్ తన భవంతులను మీడియాకు చూపించాలని అన్నారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బొత్స స్పందిస్తూ, మీరు సాక్షి పత్రిక విలేఖరా?, జగన్‌లా ఫీలైపోతున్నారు? అని అన్నారు. బెంగళూరు, లోటస్ పాండ్, కడపలోని ఇళ్లను మీడియాను తీసుకెళ్ళి చూపించమనండి అన్నారు. విజయనగరంలోని తన ఇల్లును చూసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇల్లుతో పాటు మద్యం షాపులు చూపిస్తారా? అని ప్రశ్నించడంతో, మీరు ఏమిటీ వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో మీరు ఉద్యోగులని, అలా ముఖం ఎర్రగా చేసుకుని ప్రశ్నిస్తారా?, మామూలుగా అడగండి అని అన్నారు. అన్ని ప్రశ్నలు మీరే వేస్తే ఎలా? మిగతా మీడియా ప్రతినిధులకు అడగడానికి అవకాశం ఉండాలని తెలిపారు.
వైఎస్ ఫొటో పట్టుకుంటారా?
ఇటీవల జర్నలిస్టు సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించినప్పుడు కొంత మంది వైఎస్ ఫొటో పట్టుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఆలోచించాలని తెలిపారు. రాజకీయాల్లో ఉన్న తాము విమర్శలు, ఆరోపణలు చేసుకుంటాం కానీ, పార్టీలకు అతీతంగా ఉండాల్సిన జర్నలిస్టులు వైఎస్ ఫొటోలు ఎలా పట్టుకున్నారని ఆయన అన్నారు.
కార్యకర్తల్లో ఉత్సాహం
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తాను పర్యటించినప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎక్కడా అసంతృప్తి కనిపించలేదని అన్నారు. పైగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న ఉత్సాహం కనిపించిందని తెలిపారు. ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను పార్టీ సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయ్యో పాపం అనే సానుభూతి, డబ్బు మదంతో ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆలోచనతో జగన్ ఉన్నారని తెలిపారు.
తల కిందులుగా తపస్సు చేసినా..
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు ఆయన్ను ఆదరించరని బొత్స తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని 5.25 రూపాయలకు పెంచి, ఇప్పుడు మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచితంగా బియ్యం ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. నీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు తన కుమారుడు, కోడలు పేరిట విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ ఎవరి కనుసన్నల్లో పని చేయదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలను, ఫ్లెక్సీలను దగ్ధం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ చేతులు కట్టుకుని కూర్చోలేదని ఆయన హెచ్చరించారు. పశు ప్రవృత్తి మానుకోవాలని ఆయన సూచించారు. 294 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగితే రెఫరెండం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

బినామీ ఉచ్చు!


పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఒకదానివెంట మరొకటి శరపరంపరగా వస్తున్న ఆరోపణలతో సత్తిబాబు ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు. కొద్దికాలం కిందట ఇసుక మాఫియాతో సంబంధాలున్నాయని, అందులోనూ బినామీ వ్యాపారం ఉందన్న ఆరోపణకు గురయిన బొత్సను.. మద్యం సిండికేట్ల వ్యాపారంలో బినామీలున్నారంటూ వస్తున్న ఆరోపణలు ఇప్ప టికీ వెన్నాడుతూనే ఉన్నాయి. ఆ ఆరోపణల వేడి చల్లారకముందే మళ్లీ సినిమాల్లో బినామీ వ్యాపారం విమర్శ తెరపైకి రావ డం, అందులో భానుకిరణ్‌ పేరు కూడా విని పించడం సత్తిబాబును రాజకీయంగా అప్రతిష్ఠ పాలుచేసేలా మారింది. బండ్ల గణేష్‌ అనే ఒక సాధారణ సినిమా ఆర్టిస్టు, కోట్లాదిరూపాయ లతో సినిమాలు తీస్తుండటం వెనుక బొత్స పెట్టుబడి ఉందంటూ టీడీపీ తాజాగా పేల్చిన బాంబు, సత్తిబాబును రాజకీయంగా ఇరుకున పెట్టింది. అయితే.. వాటిని ఖండించకపోగా గణష్‌తో సంబంధాలు ఉండటం నేరమా అని బొత్స ఎదురు ప్రశ్నించడం ప్రస్తావనార్హం.
ఇప్పటికే మద్యం సిండికేట్లలో ‘తెల్ల’ దొరల పేరిట బినామీ వ్యాపారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బొత్స మళ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. బినామీల ద్వారా బొత్స సంపాదించిన డబ్బును సినిమాల్లో పెటుబడుల రూపంలో మారుస్తున్నారని, అందుకోసం గణేష్‌ అనే ఒక సాధారణ సినిమా నటుడిని భారీ సినిమాల నిర్మాతగా మార్చారన్న ఆరోపణలు తెరపైకి రావడం, బొత్స పేరు చెప్పి గణేష్‌ సినీ వర్గాలను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందటం బొత్సను రాజకీయంగా ఇరుకునపెట్టినట్టయింది. ఒకప్పుడు సాధారణ వేషాలు వేసిన బండ్ల గణేష్‌ అనే నటుడిని.. బొత్స తాను అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో నిర్మాతగా మార్చారని, బొత్స బినామీగా ఉన్న గణేష్‌ పెద్ద నిర్మాతలు కూడా తీయలేని భారీ సినిమాలు తీస్తున్నారని టీడీపీ తాజాగా ఎక్కుపెట్టిన ఆరోపణాస్త్రం ఎన్నికల సమయంలో బొత్సను సంకట పరిస్థితికి నెట్టినట్టయింది. దానితో పార్టీ ఇమేజీకి డామేజీ తగిలినట్టయింది. ఎంతోమంది పెద్ద నిర్మాతలు చేతులు కాల్చుకుని సినిమాలు తీసే ధైర్యం లేక దూరంగా ఉంటుంటే, కోట్లు నష్టాలు వస్తున్నా గణేష్‌ మళ్లీ పెద్ద తారలతో ఎలా సినిమాలు తీయగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నిలదీశారు.
విజయనగరం జిల్లాలో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును అడ్డుకున్న పీసీసీ చీఫ్‌ బొత్సపై ఎదురుదాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి, సినిమా నిర్మాత బండ్ల గణేష్‌తో బొత్సకు ఉన్న లింకులు బ్రహ్మాస్త్రంలా అక్కరకొచ్చాయి. ఆ మేరకు ‘తీన్‌మార్‌’ సినిమా ఫంక్షన్‌లో గణేష్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేసి, బొత్సను ఇరుకునపెట్టింది. ‘నేను మర్డర్‌ చేసినా బొత్స నన్ను రక్షిస్తారు. బొత్స నన్ను ప్రోత్సహించారు. అన్నా.. అనుక్షణం నేను నీ వెంట ఉంటా. నీ ఇష్టం వచ్చింది చెయ్యి’ అని బొత్స సమక్షంలో గణేష్‌ చేసిన వ్యాఖ్యల సీడీని రామయ్య మీడియాకు విడుదల చేయడంతో బొత్స పరిస్థితి ఇరుకున పడినట్టయింది.
దీనికి తగినట్లుగానే.. గణేష్‌ వల్ల తాము నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక బొత్స ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు అనే సినీ డిస్ట్రిబ్యూటర్‌కు గణేష్‌ డబ్బులు ఎగ్గొట్టాడని, బొత్స పేరు చెప్పి తనను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వడం లేదని సుబ్బారావు ఈనెల 5న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. భాను పేరు చెప్పి గణేష్‌ కోట్లాది రూపాయలు కాజేశాడని, తీన్‌మార్‌ సినిమా ఓవర్సీస్‌ హక్కులను 2 కోట్లకు గణేష్‌ నుంచి కొన్నామని, అయితే అగ్రిమెంట్‌, సినిమా ప్రింట్స్‌ ఇవ్వకుండా మోసం చేశారని, తమ డబ్బు వాపసు కోరితే బొత్స, భాను కిరణ్‌ పేరిట బెదిరిస్తున్నారని, ఇంకోసారి డబ్బుల కోసం వస్తే చంపేస్తామని హెచ్చరించారంటూ క్రౌన్‌ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్లు సుబ్బారావు, మధుసూదనరావు శనివారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే బొత్స అధికారపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోని బూరుగుపల్లిలో గిరిజనులకు చెందిన 2,700 వేల ఎకరాల అసైన్డ్‌ స్థలంలో కృష్ణవంశీకి 50 ఎకరాలు, ఇతర సినీ ప్రమఖు లతో పాటు ప్రముఖులకూ అమ్మి మోసం చేశారని, దీనిపై కృష్ణవంశీ నిలదీస్తే బొత్స, భాను పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు సుబ్బారావుతో పాటు ఇటు వర్ల రామయ్య కూడా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వస్తుండటం బొత్సకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
‘తీన్‌మార్‌ సినిమాకు 9 కోట్లు నష్టం వచ్చింది. 48 కోట్లతో గబ్బర్‌ సింగ్‌ తీస్తున్నారు.
గతంలో 22 కోట్లతో ఆంజనేయులు సినిమా తీశారు. ఒక సాధారణ నటుడు అశ్వనీదత్‌, రామానాయుడు వంటి బడా నిర్మాతలు కూడా నిర్మిం చలేని సినిమాలు ఎలా నిర్మిస్తారు? ఇది కచ్చితంగా బొత్స బినామీ సొమ్మే’నని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు, తాజాగా గణేష్‌ బాధితులూ ప్రశ్నిస్తున్నారు. అయితే… వీటిని ఖండిస్తారని భావించిన బొత్స, తనకు గణేష్‌తో సంబంధం ఉంటే తప్పేమిటని, అతను సంఘవిద్రోహశక్తా అని ఎదురు ప్రశ్నించడం మరిన్ని అనుమానాలకు, విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అటు గణేష్‌ కూడా తాను బొత్స బినామీ కాదని, కాకపోతే తనకు ఆయన అన్న అని స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో బొత్స రాజకీయంగా మరోసారి చిక్కుల్లో పడినట్టయింది. ఉప ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యవహారం వెలుగుచూడటం ప్రతిపక్షాలకు అనవసరంగా తామే అస్త్రాలు ఇచ్చినట్టయిందని కాంగ్రెస్‌ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదోపీఆర్పీ వెంటనే చేయాలి
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన నూతన (పదవ) వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని డిమండ్‌ చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ నేతలు సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. వేతన సవరణ సంఘం నిర్ణయాల అమలుపై వేసిన కమిటీనే పదవ వేతన సవరణ సంఘంగా మార్పు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరినట్లు సమన్వయ కమిటీ ఛైర్మన్‌, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హన్మంత రెడ్డి పేర్కొన్నారు.

ఆయనకేం పని లేదు!


డీఎల్‌ వ్యాఖ్యలపై సీఎం
ప్రాణహిత, పోలవరంలకు జాతీయ హోదాకు కృషి
మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు పసలేనివని, ఇలాంటి వ్యాఖ్యలు అభివృద్ధికి విఘాతాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్న పేట ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఆదివారం సాయంత్రం సిఎం విశాఖ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ లో స్థానిక విలేకరులతో మాట్లాడారు.
తనను డిఎల్‌ కోవర్టు అని పేర్కొనటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాభి వృద్ధికి ఉపయోగపడే వ్యాఖ్యలనైతే పరిగణనలోకి తీసుకోవచ్చు గానీ పని లేక మీడియా ముందు చేసే అసంబద్ధ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఏవో సంచలనాలు సృష్టిద్దామని ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజలు పట్టించుకోరన్నారు. పార్టీలు, పార్టీల నేతలు ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకోవాలే తప్ప ఎందుకూ పనికిరాని వ్యాఖ్యలు చేస్తే ఒరిగేదీ లేదని అన్నారు. చేవెళ్ళ, ప్రాణహిత, పొలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, పోలవరంపై ఒరిస్సా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఆ ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

శంకర్రావుకు ఉరి శిక్ష


ఒకేరోజు ఏడుగురిని హత్య చేసి నరహంతకునిగా మారిన మాజీ సైనికోద్యోగి మెట్ట శంకర్రావుకు సోమవారం శ్రీకాకుళం అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి కెవి రమణాజీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 2010 డిసెంబర్ 1న జిల్లాలోని జలుమూరు మండలం నగరికటకం పంచాయతీ మెట్టపేట గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి శంకర్రావు, పేగుబంధమని కూడా చూడకుండా తొమ్మిదేళ్ళ కుమార్తె మానస, ఆరేళ్ళ కుమారుడు దివాకర్‌లను అతికిరాతకంగా తలలు నరికి హతమార్చాడు. పిల్లల తలలను శ్రీముఖలింగం క్షేత్రానికి స్వాగత ఆలయమైన సోమేశ్వర ఆలయ గర్భగుడిలో భద్రపరిచాడు. అక్కడనుంచి స్వగ్రామమైన మెట్టపేట చేరుకుని పైల లక్ష్మణరావు (55), వెంకట్రావు (50), మెట్ట ఎర్రయ్య (70), ఊట పార్వతి (60), బొడ్డేపల్లి దమయంతి (55)లను అతిదారుణంగా హత్య చేసి గ్రామంలో భయబ్రాంతులు సృష్టించాడు. అంతేకాకుండా పలు ఇళ్ళపై బాంబులతో దాడి చేసి మారణాయుధాలతో నరరూప రాక్షసుడిగా వీరంగం చేశాడు. గతంలో భార్య కూన విజయలక్ష్మి కూడా శంకర్రావు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్లో బంధువుల ఫిర్యాదు మేరకు శంకర్రావుకు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది. విడుదలైన తరువాత గ్రామానికి చెందిన కొంతమంది వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న అక్కసుతో ఒకేరోజు ఐదుగురిని హతమార్చాడు. ఈ ఘటన ప్రజలనే కాకుండా పోలీసులనూ భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు డిఐజి సౌమ్యమిశ్రా, అప్పటి ఎస్పీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికార్లు మెట్టపేటను సందర్శించి బాధిత కుటుంబాల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. ఈ విషయాన్ని నగరికటకం వీఆర్వో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును దర్యాప్తుచేసి కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేసిన నేరానికి పదేళ్ళు, హత్య చేస్తానని బెదిరించిన నేరానికి అయిదేళ్ళు జైలుశిక్ష, క్రూరంగా, పాశవికంగా, భయానకంగా ఇద్దరు పిల్లలు సహా ఏడుగురిని హత్య చేసిన నేరానికి హత్య కేసుల్లోనే అత్యంత హేయమైన హత్య పేర్కొంటూ ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.

సత్తిబాబు సంకటం


ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వారే ఎక్కడయినా రాణిస్తారు. అది రాజకీయాలు కావచ్చు. మరొక రంగం కావచ్చు. ఒకనాటి కారు డ్రైవర్లు నేడు మంత్రులు, ఎంపీల వుతున్నారు. ఒకప్పటి ఆఫీసుబాయ్‌లు కూడా ఎమ్మెల్యే లయ్యారు. రైసుమిల్లుల్లో గుమాస్తాలు కూడా ఎమ్మెల్యే లుగా పనిచేశారు. నాడు పీఏలుగా ఉన్న వాళ్లు నేడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అప్పటి పంచాయితీ స్థాయిలో చోటా మోటా కాంట్రాక్టర్లు నేడు బడా కాంట్రా క్టర్లు, మంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
వైఎస్‌ రెండుసార్లు సీఎం అయినా, అధిష్ఠానాన్నే శాసించే స్థాయికి ఎదిగినా, చనిపోయేంతవరకూ ఒదిగే ఉండేవారు. అలాంటి వారు నైతికంగా కూడా చిరస్థాయిగా నిలిచి పోతారు. అయితే, స్థాయి పెరిగిన వెంటనే తమ మూలాలు మరిచిపోవడం, ఇతరుల స్థాయిని నిందించే నేత ల వెలుగు జిలుగులు కొద్దికాలమేనని, పదవులు పోయిన తర్వాత వారిని ఎవరూ పట్టించుకోరని చరిత్ర చెబుతోంది. నోటి దురుసు ఉన్న నాయకుల హవా తాత్కాలికమేనని ఎంతో మంది విషయంలో రుజువయింది. ఇటీవలి కాలంలో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మీడియాపై తెగ అస హనం చెందుతున్నారు. తన రాజకీయ గురవయిన పెన్మత్స సాంబశివరాజు కరుణా కటాక్షాలతో పంచాయితీ కాం ట్రాక్టరు నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకూ ఎదిగిన సత్తిబాబు ఇప్పుడు మీడియా స్థాయినే ప్రశ్నించేంతగా ఎదిగారు. కొద్దిరోజుల నుంచి మీడియా పట్ల సత్తిబాబు వ్యవహారశైలి విచిత్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియాపై చిరాకు పడుతున్నారు.
తెలంగాణ నేత కు పీసీసీ పగ్గాలివ్వాలని దామోదర్‌రెడ్డి ఢిల్లీలో చేసిన లాబీ యింగ్‌ సత్తిబాబును అభద్రతకు గురిచేస్తోందంటు న్నారు. పత్రికల స్థాయిని, సంఖ్యను తూకమేసి కొలిచే పనిలో ఉన్నారు. వాటి స్థాయి, సంఖ్యను బాహాటంగానే వ్యాఖ్యాని స్తున్నారు. మీకు ఎన్ని కాపీలు? ఎన్ని ఎడిషన్లు? మీ చానల్‌ను ఎంతమంది చూస్తున్నారు? అని తూకం వేసే బాధ్యత తీసుకున్నారు. ‘మీకు ఎన్ని కాపీలున్నాయో తెలుసు. మీరు రాసే స్టోరీలను టీవీ వాళ్లు స్టోరీలుగా మార్చుకుంటారు. మీరు రాసిన వార్తలను కొందరు గిట్టనివాళ్లు ట్రాన్స్‌లేషన్‌ చేసి ఢిల్లీకి పంపిస్తారు. అంతేకదా’ అని మీడియాపై చిర్రుబుర్రులాడుతున్నారు. తన గురించి రాస్తే ఇక మీతో మాట్లాడేది లేదని, చనువుగా ఉంటున్నానని ఇష్టం వచ్చి రాసేస్తున్నారని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మీడియాపై రుసరుసలాడుతున్నారు.
తాజాగా మూడురోజులు ఢిల్లీలో గడిపిన సత్తిబాబు హైదరాబాద్‌కు వచ్చి అసెంబ్లీలో కాలుపెట్టినా సభలోకి మాత్రం వెళ్లకుండా లాబీల్లోనే తచ్చాడారు. మీడియాను పిలిపించుకుని చిట్‌చాట్‌తో కాలక్షేపం చేశారు. తనను ఆజాద్‌ ఉండమని చెప్పినా మళ్లీ వస్తానని ఫోన్‌ చేసినట్లు చెప్పుకున్నారు. మద్యం సిండికేట్లపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా అది ప్రజల కోసం జరుగుతున్న చర్చ కాదని చెప్పి లోపలికి పోకుండా లాబీల్లోనే కాలక్షేపం చేశారు. తాజాగా సభలో జరుగుతున్న చర్చ సమయంలో పైకి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించగా, మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేయడంతో పాపం సత్తిబాబు బిత్తరపోయారు.  మొన్నటి వరకూ చిట్‌చాట్‌లో సీఎం మీద, ఆయన అనుసరిస్తోన్న విధానాల మీద కామెంట్లు చేసిన సత్తిబాబు, గత కొద్దిరోజుల నుంచి ఎందుకో మౌనవ్రతం పాటిస్తున్నారు. పైగా తన వద్దకు వచ్చిన మీడియాను ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మనమన్నారంటూ చిరాకు ప్రదర్శిస్తున్నారు. అయితే, మీడియాపైనా, మీడియా ప్రతినిధులపైనా సత్తిబాబు విమర్శలు కురిపిస్తూ, జర్నలిస్టులను అవమా నిస్తున్నా కనీసం దానిని ప్రశ్నించే సాహసం కూడా చేయకపోగా, గాంధీభవన్‌లోని ఇద్దరు, ముగ్గురు మీడియా ఆస్థాన విద్వాంసులు మాత్రం అవన్నీ తమను కాదన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి భజనపరులు, ఆత్మాభిమానం లేని వారి వల్లే జర్నలిస్టులకు నేతల వద్ద విలువ లేకుండా పోయిందని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కిరణ్‌, బాబు లాలూచీ


ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రతిపక్షనేత చంద్రబాబు మిలాఖత్‌ అయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలకు బలంచేకూర్చేలా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రితో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు లాలుచీ పడ్డారని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంతో ఆయన లాలూచీ పడటంవల్లే ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా, సజావుగా జరిగిందని వ్యాఖ్యనించారు. అసెంబ్లీ లాబీలో తనకు తారసపడ్డ మీడియా ప్రతినిధులతో బొత్స ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తరువాత సీఎల్‌పీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను అలా అనలేదన్నారు.
తమ ప్రభుత్వం చట్టబద్దమైన ప్రక్రియలో సమాచార కమిషనర్ల ఎంపికను చేపట్టింది కాబట్టే చంద్రబాబు అందుకు సహకరించారని స్పష్టంచేశారు. సహకరించారు అంటే కుమ్మక్కయ్యారనే కదా అని అడగ్గా మీరు అలా అర్థంచేసుకోంటే తానేమీ చెప్పలేనని, అలాగే భావించుకోండి అని పేర్కొన్నారు. పిసిసి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణాకు న్యాయం జరుగుతుందంటే తప్పుకోవడానికి తాను రెఢీ అని బొత్స సత్యనారాయణ ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. రెండు రోజులు సభను టీడీపీ వృధా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సభలో బాబు తీరు ఛ..ఛ.. దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇక నుంచైనా సభ సజావుగా సాగి ప్రజాసమస్యలు చర్చకు వచ్చేలా సహకరించాలని చంద్రబాబును బొత్స కోరారు. మద్యం సిండికేట్లపై టీడీపీ వాయిదా తీర్మానం కింద చర్చకోరడంలో తప్పేలేదని కానీ కోరుతున్న తీరే బాగోలేదన్నారు.
మంత్రులపై వారి బందువులపై వస్తున్న ఆరోపణలపై చర్చించాలని తీర్మానంలో టీడీపీ డిమాండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు. యాత్రలు చేసే సమయంలో రైతులకు, చేనేత కార్మికులకు, జూనియర్‌ డాక్టర్లకు హామీ ఇస్తూ మీ సమస్యలు శాసనసభలో ప్రస్తావించి పరిష్కరిస్తామని చెప్పిన బాబు అందుకు భిన్నంగా సభలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, రైతులు, కార్మికులు, చేనేత వర్గాల వారిపై ఆయనకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఏమిటో అర్థమైపోతోందన్నారు. బాబు లాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరమని తాను చేసిన వ్యాఖ్యలపై తొలుత కొంత చింతించానని తెలిపారు. కానీ ఆయన తీరు చూశాకే అలా వ్యాఖ్యనించి ఉండకపోతేనే తప్పుచేసినట్లుగా అవుతుందన్న అభిప్రాయానికి వచ్చానని పేర్కొన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలనుంచి బయటపడి అప్పుడు ఇతరుల అవినీతిపై మాట్లాడినా బాగుంటుందని బాబుకు సూచించారు.
మద్యం సిండికేట్‌ వ్యవహారంపై బాబు ప్రజలకు బహిరంగ లేఖ రాయడం తగుదునమ్మ అన్నట్లు ఉందన్నారు. 2009లో కూడా బాబు ఇలాగే లేఖ రాశారని, కానీ ప్రజలకు మాత్రం ఆయనకు విశ్రాంతి తీసుకోవాలి అన్నట్లు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై మాట్లాడకుండా కేవలం మద్యం సిండికేట్‌ వ్యవహారంపైనే మాట్లాడటం అసహ్యమేస్తోందన్నారు. సమ్మె విరమించేందుకు సిద్దమవుతున్న జూనియర్‌ డాక్టర్లు ప్రతిపక్షాల మోసాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని, ఈ విషయాన్ని వారు అంగీకరించడం కూడా జరిగిందని చెప్పారు. మద్యం వ్యాపారంలో తమ సన్నిహితులు, బందువులు, కుటుంబ సభ్యులు మొత్తంగా 30 నుంచి 31 శాతం వరకు మాత్రమే ఉన్నారని, వారు చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిండికేట్‌ వ్యాపారంతో సంబంధం ఉన్న తన టీడీపీ ఎమ్మెల్యేపై చర్య తీసుకొనే ధైర్యంలేని చంద్రబాబు ఇతరుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. వారికైతే ఒక చట్టం మాకైతే ఒక చట్టమా అని ప్రశ్నించారు. మంత్రి మోపిదేనిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించగా ముద్దాయి చెప్పిన సాక్ష్యం నిజం ఎలా అవుతుందన్నారు. నివేదికను తాము బయటపెట్టాల్సిన అవసరంలేదని, సమాచార హక్కుచట్టం కింద ఎవరైనా పొందవచ్చు అన్న బొత్స టీడీపీకి అవసరమైతే మాత్రం సింటికేట్‌ వ్యాపారుల జాబితాను తాము పంపిస్తామని పేర్కొన్నారు. మద్యం విషయంలో కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొన వాటికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, అయితే విధానపర నిర్ణయాలలో కాంగ్రెస్‌ పార్టీ జోక్యం ఉండబోదన్నారు.

ప్రధానిని కలిసిన బొత్స దంపతులు


పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి పార్లమెంట్‌ సభ్యురాలు బొత్స ఝాన్సీ సోమవారంనాడు ప్రధానిని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడైన తర్వాత ప్రధానిని కలవటం ఇదే తొలిసారి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ముచ్చటించిన అనంతరం బయటికి వచ్చిన బొత్స తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాము ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏదీలేదని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలు ప్రధానికి వివరించానని, ప్రాణహిత ..చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మూరుమూల గ్రామాలకు లింక్‌రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి నిధులు పెంచి, కూలీలకు ఇచ్చే వేతనం పెంచి పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయాలని ప్రధానిని కోరినట్లు బొత్స చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తిచేసినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.
కాగా, ప్రధానిని కలిసిన సందర్భంలో రాజకీయాల ప్రస్తావన రాలేదని బొత్స సత్యనారాయణ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు, ముఖ్యమంత్రి వ్యవహారశైలి, పార్టీ పరిస్థితి, ముమ్మరంగా సాగుతున్న సిబిఐ దాడులు, దర్యాప్తు తదితర అంశాలపై ప్రధానికి బొత్స సత్యనారాయణ వివరించారని తెలుస్తోంది.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

మద్యం సిండికేట్లపై మళ్లీ ఎసిబి దాడులు


ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్‌ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్‌ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్‌ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్‌ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్‌పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్‌.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్‌ నాగేశ్వర్‌ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్‌, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్‌బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్‌ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్‌ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్‌ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్‌ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్‌ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్‌, పుష్కరగణేష్‌ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్‌పి రామకృష్ణప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్‌ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్‌రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని రైల్వే గేట్‌ ప్రాంతానికి చెందిన వీరాచందర్‌ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఐ కరమ్‌చంద్‌ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.

free website analytics