విజయనగరం

రాష్ర్టంలో విస్తుతంగా పోటెత్తిన వరదలు

మరో పర్యాయం తూర్పు తడిసి ముద్దయ్యింది. ఒకప్రక్క గోదావరి వరద ఉధృతి, మరో ప్రక్క అధిక వర్షాలతో జిల్లా అతలా కుతలం అవుతున్నది. ముఖ్యంగా కోనసీమ నీటి ముంపులో వుంది. గోదావరి కాచ్‌మెంట్‌ ఏరియాలోను, ఏజెన్సీలోను భారీగా వర్షాలు పడడంతో గోదావరి ఉప్పొంగుతుంది. ఆదివారం అర్థరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఇప్పటికి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. మరోపక్క కోనసీమ వర్షపు నీటి ముంపులో వుంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన సుమారు 20 సెం.మీ.ల వర్షపాతంతో కోనసీమ తడిసి ముద్దయ్యింది.
ఇంత భారీగా కురి సిన వర్షపాతం వల్ల కోనసీమలో పంట పొలాలన్నీ ముంపులో వున్నాయి. సుమారు 50 వేల ఎకరాలలో వరిపంట పూర్తిగా నీటముంపులో వుంది. గోదావరి నిండుగా పారడం, డ్రైన్లు అన్నీ బిగబట్టడంతో పంట పొలాలలో నీరు ఎగదన్నడంతో ఖరీఫ్‌ ఉక్కిరిబిక్కిరవు తుంది. పరిస్థితి ఇదే విధంగా రెండు, మూడు రోజులపాటు కొనసాగితే ఖరీఫ్‌పై ఆశ వదులుకోవలస్సిందేనన్న భయంతో కోనసీమ రైతాంగం వుంది. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే సుబ్బారెడ్డి సాగర్‌కు గండి పడడం, ఆనక పూడ్చివేత జరిగింది. ఏలేరు ఆయకట్టుతో పాటు విశాఖ జలాలకు నీరందించే ఏలేరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకుంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులలో కూడా అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే అటు డెల్టాలోను, ఇటు ఏలేరు రిజర్వాయర్‌కు ముప్పు పొంచివుం దం టున్నారు.
వశ్చిమంలోనూ అదే పరిస్థితి
ఏలూరు,మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : పశ్చిమ గోదావరి జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, డ్రైన్లు పొంగిపొర్లడంతో లక్షా 50 వేల ఎకరాలు నీటి మునిగాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలోని ప్రధాన వాగులకు వస్తున్న వరద నీరు తగ్గకపోవడంతో పరిస్థితి మరింతగా జఠిలమవుతుందని ఆం దోళన చెందుతున్నారు.ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరింతగా వస్తున్న తమ్మిలేరు, రామిలేరు, కొవ్వాడ, ఎర్రకాలువ, గొంతేరు డ్రైన్‌, యనమదుర్రు డ్రైన్లు, మొయ్యేరు లాంటి ప్రధాన డ్రైన్ల ద్వారా వస్తున్న వరద నీటితో కొల్లేరు నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక కొల్లేటి గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీనికి తోడు గోదావరికి కూడా భారీ ఎత్తున వరద రావడంతో ఏటిగట్టు పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.రానున్న రెండు రోజులలో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించడంతో ఏటిగట్టు ప్రజలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతం, పల్లపు ప్రాంతం అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వరద పరిస్ధితి ఒకేలా ఉండడం, గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు.

వాడవాడలా జననేతకు ఘనవినివాళి -పలుచోట్ల వైఎస్సార్‌ విగ్రహాల ఆవిష్కరణ

03.09.04
ప్రజాహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. ఊరూరా, వాడ, వాడలా కాంగ్రెస్‌ కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులు, కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఆయనను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకున్నారు. అనేక గ్రామాలు, పట్టణాలలో రాజకీయాలకు అతీతంగా కూడా నేతలు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. వైఎస్‌ ఘాట్‌ ఉన్న ఇడుపులపాయ, వైఎస్‌ స్మృతివనం ప్రాంతం జనసంద్రంగా మారాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం జననేతకు కన్నీటి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్‌ అమర్‌ రహే…, బడుగు జనబాంధవా నీకు మరణం లేదు.., మా గుండెల్లో ఉన్నావు…, జోహార్‌ వైఎస్‌ఆర్‌…, వంటి నినాదాల మధ్య తమ అభిమాన నేత చిత్ర పటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహిళలు, వృద్దులు కన్నీటితో జోహార్లు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) నిర్వహించాయి. రాష్ట్రానికి వైఎస్‌ చేసిన సేవలను స్మరించుకున్నాయి.  దివంగత నేత వైఎస్‌ సతీమణి వై.ఎస్‌. విజయారాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు, కడప ఎంపి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటిపెద్దను తలుచుకుని మౌనముద్రలో ఉండిపోయారు.ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎస్‌.వివేకానందరెడ్డి, వైఎస్‌ సోదరి విమలమ్మ, కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఉదయమే వారు వైఎస్‌ ఘాట్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్‌ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రారావు అయన సతీమణి నివాళులు అర్పించారు. కెవిపి సతీమణి బోరున విలపించారు. ఇదిలా ఉండగా, వైఎస్‌ స్మృతివనం నల్లమలలోని పావురాలగుట్ట వద్ద 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్‌ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రులు డి. మాణిక్య వరప్రసాద్‌, శిల్పామోహన్‌ రెడ్డి, వట్టి వసంతకుమార్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం దివంగత నేత వర్ధంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య తన నివాసంలో వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పి. సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, మేయర్‌ బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారన్నారు. వైఎస్‌ జ్ఞాపకార్థం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు వద్ద రూ. 20 కోట్లతో స్మారక వనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. శాసనసభ లాబీలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌, మాజీ మంత్రులు జేసీ దివాకరరెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. సిఎల్‌పి కార్యాలయంలో వైఎస్‌ చిత్రపటానికి మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలో వాడవాడలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సినీపరిశ్రమ సైతం వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటించింది. సినీహీరో శ్రీహరి, భైరవచిత్ర నిర్మాత నట్టికుమార్‌లు పేద కళాకారులకు వస్త్రలు పంపిణీచేశారు. ఎపి ఫిల్మ్‌ వర్కర్స్‌ కో ఆపరేటివ్‌ సౌసైటీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్‌ రాజశేఖర్‌, జీవిత పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, ఎపి జి.వి. హర్షకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
కడప జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌, రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అహ్మదుల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ స్మారక పార్కు పైలాన్‌ను ఆవిష్కరించారు. మాజీమంత్రి కొండా సురేఖ దంపతులు, అంబటి రాంబాబు తదితరులు కూడా వైఎస్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించారు.
చిత్తూరు జిల్లాలో కూడా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి గల్లా అరుణ, ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన వైఎస్‌ సంస్మరణ సభ జనసంద్రంగా మారింది. టిటిడి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ సుదర్శన మహాయాగంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా 56 మంది రుత్వికులతో ఈ యాగం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల నడుమ సుదర్శనయాగం ప్రారంభమైంది. యాగంతో పాటు గణపతిపూజ, నవగ్రహపూజ, వివిధ పూజలు నిర్వహించి రాజ్యాధికార యాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ఫలాన్ని కరుణాకరరెడ్డి, అంబటిరాంబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్‌కు ప్రాణంగా ఉన్న తాను ఆయన సంస్మరణ సభ నిర్వహించడం బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్‌ చనిపోయిన తర్వాత 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, తాను మాత్రం ప్రాణాలతో ఉండటం సిగ్గు చేటన్నారు.
విశాఖపట్టణం జిల్లా కేంద్రంలో పోస్టల్‌శాఖ వైఎస్‌. రాజశేఖరరెడ్డి స్మారకార్థం రూ. 5 పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. విశాఖకు చెందిన దుర్గాప్రసాద్‌ రూపొందించిన ఈ స్టాంప్‌ను తపాలాశాఖ విశాఖపోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ శారద సంపత్‌ అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎపి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాలలో రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి డి.కె. అరుణ కొత్తగా ఏర్పాటుచేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలు, మెదక్‌ జిల్లాలో మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, దామోదర రాజనరసింహ, చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ, నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి, ప్రభుత్వ విప్‌ డాక్డర్‌ శైలజానాథ్‌ పాల్గొన్నారు. వారు ఇడుపులపాయకు కూడా వెళ్లి వైఎస్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మానప్రసాదరావు, విజయనగరం జిల్లాలో మంత్రి శతృచర్ల విజయరామరాజు, గుంటూరు జిల్లాలో మంత్రులు గాదె వెంకటరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారథి, నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి సుదర్శనరెడ్డి పాల్గొన్నారు.

కమిటీకి చట్టబద్ధత ఉంది – జస్టిస్ శ్రీకృష్ణ

14.08
‘మేం చెప్పిందే ప్రభుత్వం వింటుంది. కమిటీకి చట్టబద్ధత ఉంది. నిర్ణీత గడువులోపే అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తాం’ అని జస్టిస్ శ్రీ కృష్ణ స్పష్టం చేశారు. శ్రీ కృష్ణకమిటీ చైర్మన్, కార్యదర్శి వీకే దుగ్గల్, మరో ఇద్దరు సభ్యులు వరంగల్ జిల్లా ముచ్చర్ల గ్రామస్తుల అభిప్రాయలను మంగళవారం సేకరించారు.  అందరికీ ఆమోదయోగ్యమైన నివేదికనే అందిస్తాం అని శ్రీకృష్ణ (తెలుగులో) ప్రకటించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎట్టిపరిస్థితులలో ఊరుకోమని, ఇప్పటికే తెలంగాణ ప్రాంత విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నారని వారు తెలిపారు. మాకు కావలసింది రాష్ట్ర ఏర్పాటే తప్ప కమిటీలు కాదు. సాంకేతికంగా కమిటీని మేం బహిష్కరిస్తున్నాం. కానీ మా వాదనను బలంగా వినిపించేందుకు మీ ముందుకు వచ్చాం అని స్థానికుడు పృథ్వీరాజ్ కుండబద్దలు కొట్టారు.
మాకెప్పుడు విముక్తి: విద్యార్థిని స్రవంతి
“సర్.. మా తల్లిదండ్రులు మమ్మల్ని అప్పుచేసి చదివించారు. కానీ మేం ఏం చదువుకొని ఏం లాభం? మా ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోతున్నయి? ఆంధ్రా ప్రాంత ప్రజలు అందలం ఎక్కుతుంటే ఇక్కడ మేం అగాధంలోకి పోతున్నం. మాకెప్పుడు సార్ విముక్తి. మా తెలంగాణకు ఎప్పుడు విముక్తి. ప్లీజ్ సర్. మా తెలంగాణ మాకు ఇప్పించండి అంటూ” జస్టిస్ శ్రీకృష్ణతో ముచ్చర్ల గ్రామ విద్యార్థి గుడికందుల స్రవంతి తనగోడును వెళ్లబోసుకున్నారు.
మహాభారత యుద్ధమే …
కరీంనగర్: జిల్లాలోని నుస్తులాపూర్‌లో కమిటి ఆభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలో కొంతసేపు గందరగోళానికి దారి తీసింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండకపోతే మహాభారత యుద్ధం ఏర్పడుతుందన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ తాను ఆ కామెంట్‌ను ఆ సమావేశంలో గొడవ గురించి మాట్లాడిందే తప్ప తెలంగాణ గురించి కాదన్నా రు.అంతకుముందు స మావేశంలో కమిటీకి తెలుగు అర్థం కాదేమోన న్న భావనతో జడ్పీటీసీ సత్యనారాయణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై వికె దుగ్గల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కమిటీ దృష్టికి వచ్చే అంశాలన్నీ ప్రభుత్వపరంగా రికార్డు అవుతాయని, తమకూ తెలుగు తెలుసునని, ఏ అంశాన్ని విస్మరించమన్నారు. జిల్లాలో మంగళవారం కమిటీ బెజ్జంకి మండలం తోటపల్లి, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామాల్లో పర్యటించింది. అనంతరం జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. జిల్లాపరిషత్ ఎదుట బీజేపీ నేతలు శ్రీకృష్ణ కమిటీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలుపగా జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్ అని జిల్లా ప్రజలు కమిటీకి తేల్చిచెప్పారు.  తిమ్మాపూర్ మండలం తోటపల్లి వద్ద జరిగిన సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ తెలంగాణకు జరుగుతున్న వివక్షపై ఏకరువు పెట్టారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు చేపడితే జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని, దానికి బదులు దేవాదులను ప్రతిపాదించినా అదీ కార్యరూపం దాల్చలేదని వివరించారు. తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తే జస్టిస్ శ్రీకృష్ణ ఫొటోలను తమ ఇళ్ళల్లో పెట్టుకొని పూజ చేస్తామని గ్రామస్తులు అన్నారు.

5నే గ్రూప్‌ -1 పరీక్ష

A.P.P.S.C,BULD
రెండు లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసే ప్రసక్తే ఉండకూడదని సంకల్పించింది. ఇక్కడ అధిక మంది అభ్యర్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమంటుంది. చిన్న చిన్న విషయాలకే పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని కృత నిశ్చయం తో రోశయ్య సర్కారు ఉంది. ఆ మేరకు సెప్టెంబర్‌ 5నే యథావిధిగా పరీ క్షలు నిర్వహించాలని ఎపిపిఎస్‌సికి సర్కారు ఆదేశాలుజారీ చేసింది. గ్రూప్‌-1 ప్రాథ మిక పరీక్షల నిర్వహణను తమ భుజాల పైకి ఎత్తుకున్న ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణ ప్రాంతం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిన చలించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎపిపిఎస్‌సి సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకా రం పరీక్షలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.
పరీక్షలు వాయిదా వేయాల్సిందే..
ఒక పక్క ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. మరో పక్క గ్రూప్‌-1 పోస్టులలో తెలంగాణ వాటా తేల్చాలని తెలంగాణ అభ్యర్థులు పట్టుబ డుతున్నారు. లేదంటే పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎపిపిఎస్‌సి సభ్యుల సమావేశంలో గ్రూప్‌-1 పరీక్షల వాయిదాకు తెలం గాణ సభ్యులు గట్టిగా పట్టుబట్టినప్పటికీ ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ దాన్ని అడ్డుకో గలిగారు. సీమాంధ్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్ధేశంతో ఆ పరీక్షలు సకాలంలోనే నిర్వహించలని ఎపిపిఎస్‌సి బోర్డు సభ్యులు సమా వేశంలో వాదించినట్లు తెలిసింది. గ్రూప్‌-1 పోస్టులలో ప్రాంతాల వారీగా పోస్టులు కేటాయించడం సాధ్యమయ్యేది కాదని ఎపిపిఎస్‌సి చెప్పుతోంది.

సీమాంధ్ర బంద్ సంపూర్ణం – ర్యాలీలు, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనాలు

Andhra_University1
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీ స్పాట్ వాల్యుయేషన్ కోసం వెళ్లిన సీమాంధ్ర అధ్యాపకులపై జరిగిన దాడి పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి. అధ్యాపకులపై దాడికి నిరసనగా సోమవారం సీమాంధ్రలో విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. సమైక్యాంధ్ర జేఏసీ ఈ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విదితమే. గుంటూరులో బంద్ ప్రశాంతంగా జరిగింది. నాగార్జున వర్సిటీ ముఖ ద్వారానికి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో తాళాలు వేశారు.  అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఎన్.శామ్యూల్, గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ సీమాం«ద్రులకు కేసీఆర్, కోదండరామ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు వారే బాధ్యులన్నారు. నల్లగొండ మహాత్మా గాంధీ వర్సిటీలో ఘటనను ఖండిచారు. విజయవాడలో బంద్‌కు దేవినేని అవినాష్ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సన్మానించారు.  నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన కలెక్టర్‌ను సన్మానించారు. పలు ప్రాంతాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని అంబేద్కర్ వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.  చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు చేసిన బంద్ విజయవంతమైంది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్డుపైకి వచ్చారు. ఎస్వీయూ వద్ద విద్యార్థులు తెలంగాణ జేఏసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిత్తూరులో జాక్టో, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద శాంతి నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ డీవీ కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రొఫెసర్లను కృష్ణా జిల్లా జేఏసీ, విద్యార్థి సంఘాలు సన్మానించాయి. విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అవినాష్ ఆధ్వర్యంలో కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ రవీంద్రలను శాలువాలతో సత్కరించారు. డీసీసీ కార్యదర్శి కె.శివాజీ మాట్లాడుతూ తెలంగాణ మేధావులు ఓయూ సంఘటనకు సమాధానం చెప్పాలన్నారు. ఓయూలో అధ్యాపకులపై దాడి అనాగరికమని శాంతకుమారి అన్నారు. స్పాట్ సమయంలో జవాబు పత్రాల డీకోడింగ్ ఉండడం వల్ల ఏ ప్రాంతం విద్యార్థుల పేపర్లో తెలియవని వివరించారు. విద్యారంగానికి రాజకీయ రంగు పులమడం సిగ్గుచేటని ఆమె అన్నారు.

మరో సారి రగిలిన సెగ

nirasanaa
ఉస్మానియా యూని వర్శిటీలో బీఎడ్‌ వాల్యుయేషన్‌కు వచ్చిన సీమాంధ్ర అధ్యాపకులపై జరిగిన దాడి మరోసారి ప్రాంతీయ వాదాలు, విభేదాలకు బీజం వేసింది. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న విద్యార్థి లోకం మళ్ళీ నిరసనలకు సిద్ధమయ్యేలా చేసింది. ఉస్మానియా ఘటనను రాజకీయ పార్టీలు, కోస్తా, సీమ ప్రాంత విద్యార్థి, ప్రజా సంఘాలు, జేఏసీలు ముక్త కంఠంతో ఖండిస్తుండగా కాకతీయ విద్యార్థి జేఏసీ తదితరాలు ఘటనలను సమర్థిస్తూ ప్రకటనలు చేశాయి. ఉస్మా నియా జేఏసీ మరో అడుగు ముందుకు వేసి నెలాఖరులోగా వర్శిటీలో ఉన్న ఇతర ప్రాంతాల అధ్యాపకులు వెళ్ళిపోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు జారీ చేయటం చూస్తే పరిస్థితి మరోసారి హింసాత్మకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

  • సీమాంధ్రలో నిరసనలు…

nirasana

ఉస్మానియా ఘటన జరిగినట్టు తెలిసిన వెంటనే సీమాంధ్రలోని పలు వర్శిటీల్లో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. దాడిని నిరసిస్తూ శనివారం ప్రదర్శనలు జరపటంతో పాటు సోమవారం సీమాంధ్రలోని వర్శిటీలన్నిటినీ బంద్‌ చేయాలంటూ విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఇలా భౌతిక దాడులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని సీమాంధ్ర జేఏసీ కన్వీనర్‌ శామ్యూల్‌ హెచ్చరించారు.
అనుమానాలతోనే…
మూల్యాంకన జరిపే అధ్యాపకుల్లో 50 శాతానికి పైగా సీమాంధ్ర ప్రాంతం వారున్నారని, వారివల్ల తమకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలను విద్యార్థి సంఘాలు వ్యక్తం చేశాయి. ఇలా జరగటం వల్ల గతంలోనూ తమకు తక్కువ మార్కులు వచ్చాయని, ఈసారీ అదే పరిస్థితి ఏర్పడుతుందన్న అనుమానంతోనే దాడులు జరపాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు విద్యార్థుల నుంచి వ్యక్తం అవుతుండగా బాధ్యతలు నిర్వహించేందుకు మాత్రమే తాము వచ్చామని, అలాంటి తమపై దాడులు జరపటం ద్వారా ఏమి సాధిస్తారని అధ్యాపకులు ఆవేదనతో అంటున్నారు.
దాడులు దారుణం…రాజకీయ పార్టీలు
అధ్యాపకులపై జరిగిన దాడిని పలు రాజకీయ పార్టీలు ఖండించాయి. ఇలాంటి దాడుల ద్వారా రాష్ట్రాల సాధన సాధ్యం కాదని టీడీపీ సీనియర్‌ నేత కింజరాపు ఎర్రన్నాయుడు వ్యాఖ్యానిస్తే రోశయ్య ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే ఈ దాడుల నాటకం నడిపించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, హోం మంత్రిని తొలగించాలని ధూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. దాడులు జరిపిన వారిపై రౌడీ షీట్లు తెరిచి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ విప్‌ శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటివి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
దాడులు జరగటం మంచిది కాదని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ పొన్నం ప్రభాకర్‌ అంటూనే సున్నితమైన వ్యవహారంలో ఇతర ప్రాంతాల వారిని రప్పించకపోతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అసలు దాడులే జరగలేదంటూ టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం నేత ఈటెల రాజేందర్‌ విద్యార్థులను సమర్థించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు మాత్రం దీనిపై స్పందించలేదు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు సైతం దాడులు మంచిది కాదని వ్యాఖ్యానించారు. దాడులకు అధికారులే బాధ్యత వహించాలని జూనియర్‌ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ స్పష్టం చేశారు. దాడులు దురదృష్టకరమని, విద్యార్థులు సంయమనం పాటించాలని ఉన్నత విద్యా శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని వర్శిటీ అధికారులను కోరామన్నారు. అఖిలభారతీయ విద్యార్థిపరిషత్‌ మాత్రం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటితో తమకు ఏమాత్రం సంబంధం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కడియం రాజు స్పష్టం చేశారు.
గవర్నర్‌ ఆరా…
దాడులపై వర్సిటీ చాన్సలర్‌, గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ వాకబు చేశారు. దాడులకు దారి తీసిన పరిస్థితులేమిటో తనకు సమగ్రమైన నివేదిక సమర్పించాలని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ను ఆదేశించారు. మరో వైపు తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ ఘటనపై తన వద్ద పూర్తి సమాచారం లేదని, అధికారులు ఇచ్చే వివరాలు చూచిన తర్వాత తగువైన రీతిలో చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు

200236712-001
రాష్ట్రమంతటా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలలో కుండపోతగా వానలు కురిసి పంటలు నీట మునిగాయి. పిడుగుపాటుకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. అనంతపురం జిల్లాల్లో నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మరణించారు. వాగులు పొంగి.. రంగారెడ్డి, మెదక్ జిల్లాలో పలువురు గల్లంతయ్యారు. హైదరాబాద్‌లో నాలాలో పడి ఒకరు కొట్టుకుపోయారు. కృష్ణా.. తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో బుధవారం రాత్రి 8.45 గంటలకు డ్యాం అధికారులు నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి.. ఒక్కో గేటు ద్వారా 26 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద 47 గేట్లు ఒక్కొక్కటి ఒక మీటర్ చొప్పున ఎత్తి 1,86,684 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సుంకేశుల నుంచి కూడా నీరు దిగువకు విడుదలవుతోంది.
ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ నుంచి 41,500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాగల 24 గంటలలో కోస్తా, రాయలసీమలలో భారీ వర్షాలు, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ దోపిడీ, లూటీ! ఎమ్మార్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి- మంత్రి బొత్స

4-3slider6
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సంస్థ ఏపీఐఐసీతో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా వేలకోట్ల విలువైన భూములను మరో కంపెనీకి బదిలీ చేసిందని… ఒప్పందంలోని అనేక అంశాలను ఉల్లంఘించిందని వస్తున్న ఆరోపణలే నిజమైతే జరిగింది పెద్ద లూటీ, దోపిడీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏది సరైనదని భావిస్తే ఆ విచారణ జరిపించడం అవసరమని అన్నారు. కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ క్రింద కూడా విచారణ జరిపించవచ్చన్నారు. గురువారం బొత్స ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.  పార్టీ ఎమ్మెల్యేలతో సహా చాలా మంది విచారణ కోరుతున్నారు. అవసరమైతే ఏపీఐఐసీ పుట్టినప్పటి నుంచీ జరిగిన ఒప్పందాలపై విచారణ జరిపించాలి” అని బొత్స అభిప్రాయపడ్డారు. “విల్లాలు, టౌన్‌షిప్ అభివృద్ధి కోసం ఎమ్మార్‌కు 285 ఎకరాలు కేటాయించాం. ఎమ్మార్, ఏపీఐఐసీ కలిసి కలిసి ఏర్పర్చిన మూడు ఎస్పీవీలలో ఎమ్మార్ వాటా 74 శాతం, ఏపీఐఐసీ వాటా 26 శాతం. ఈ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందాన్ని మార్చాలనుకుంటే… కంపెనీ చట్టం ప్రకారం ఏపీఐఐసీకి తెలియజేయాల్సిందే.  దీనిపై ఏపీఐఐసీ ప్రభుత్వానికి సమాచారం అందిస్తే… మరో జీవో ద్వారా ఆ మార్పును ఆమోదించాల్సి ఉంది. కానీ… ఒప్పందంలో జరిగిన మార్పుల గురించి ప్రభుత్వానికి ఏమాత్రం తెలియదు. నాకు తెలిసినంత వరకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలంటే మళ్లీ క్యాబినెట్ భేటీ కావాల్సిందే. జీవో ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని మరో జీవో ద్వారానే మార్చాలి. కానీ… అలాంటివేవీ జరగలేదు” అని బొత్స స్పష్టం చేశారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్య ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీయే ఏపీఐఐసీ-ఎమ్మార్ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసిందని ద్రువీకరించారు.”మేం విధాన నిర్ణయాలు మాత్రమే చేస్తాం. వాటిని అమలు చేయాల్సింది అధికారులే. ప్రతిదీ మేం పట్టించుకోం” అని తెలిపారు. తాము ఏర్పాటు చేసిన మూడు కంపెనీలుకాక నాలుగో కంపెనీ ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. “బోర్డు చర్చలో కూడా ఈ అంశం రాలేదని అంటున్నారు. బోర్డే అలా చెప్పినప్పుడు ఏం చేస్తాం? అవకతవకలు జరుగుతున్నాయని సంస్థ చైర్మనే చెప్పడంతో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది” అని బొత్స తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 285 ఎకరాలు కేటాయించినప్పుడు ఎకరానికి రూ.29 లక్షల విలువ కట్టామని, తెలుగుదేశం నిర్ణయించిన ధర కంటే ఇది ఎక్కువేనని బొత్స అన్నారు. ఇప్పుడు దాని విలువ ఎంత ఉందో తనకు తెలియదన్నారు. “హైదరాబాద్‌లో నాకు గజం స్థలం కూడా లేదు. అందువల్ల ధరలు తెలియవు. ఏపీఐఐసీకి దక్కాల్సింది తప్పక రాబట్టుకునే అవకాశాలున్నాయి.  ఆస్తులు ఎక్కడికీ తరలిపోలేదు. దుబాయ్‌కి పోకుండా ఇక్కడే ఉన్నాయి. ఒప్పందాలు కూడా రద్దయిపోతాయి. ముందు సరైన దిశలో విచారణ జరిగితేనే అన్ని వివరాలు తెలుస్తాయి” అని బొత్స పేర్కొన్నారు. అప్పట్లో బోర్డు సభ్యుడిగా ఉన్న బీపీ ఆచార్యకు పరిశ్రమల కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు కదా అని అడిగినప్పుడు… ‘ఆయనలో ఏ ప్రతిభ ఉందో!’ అని బొత్స వ్యాఖ్యానించారు.
నన్నెందుకు పిలుస్తారు?
ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై చర్చించడానికి అధిష్ఠానం తనను ఢిల్లీకి పిలిపించిందన్న వార్తల్లో నిజం లేదని బొత్స తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఉండగా తననెందుకు పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. “నా తర్వాత ముగ్గురు పరిశ్రమల మంత్రులు వచ్చారు. అధిష్ఠానం వారితో కాకుండా నాతోనే ఎందుకు మాట్లాడుతుంది? అధిష్ఠానం ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. నాకు ఏదైనా తెలిస్తే ముఖ్యమంత్రికి చెబుతాను” అని మంత్రి వివరించారు.
వైఎస్ మహానుభావుడు
అన్నిటికీ వైఎస్ సర్కార్‌కు ముడిపెట్టరాదని, వైఎస్ మహానుభావుడని బొత్స అన్నారు. దయ చేసి ఆ పేరు ఎత్తకూడదని అన్నారు. జగన్ పేరుకూడా అనవసరంగా లాగుతున్నారని అన్నారు. “జగన్‌కు పార్టీ కావాలి, పార్టీకి జగన్ కావాలి. ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయంగా ఉండాలి. రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు కావు” అని ఆయన అన్నారు. వైఎస్, రోశయ్యలు ఇద్దరి వద్దా పనిచేశారు కదా, మీ అనుభవం ఏమిటి అని ప్రశ్నించగా… “వైఎస్‌ది ఇన్‌స్టంట్ పరిపాలన. రోశయ్యది అనుభవ పూర్వక పరిపాలన” అని తెలిపారు.
ఇన్‌స్టంట్ పరిపాలనలో ప్రజలకు మేలు చేయడంలో కొన్ని తప్పులు జరిగినా తర్వాత సవరించుకుంటామని, అనుభవపూర్వక పాలనలో తప్పులు జరగకుండా ముందే జాగ్రత్తపడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఒక రోజు ఆలస్యం జరిగినా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాష్ట్రంలో అర్హులెందరో ఉన్నారని చెప్పారు. తెలంగాణకు చెందిన ఎంపీలంతా ఈ పదవికి అర్హులేనని అన్నారు. తాను పీసీసీ రేసులో లేనని, తనపై అభిమానం ఉన్న పత్రికలే తన పేరును రాస్తుంటాయని బొత్స చెప్పారు.

విడిపోవడం.. కలిసుండడం వేరే మాట – బొత్స

1-3slider1
విడిపోవడానికి, కలిసి ఉండటానికి సంబంధం లేకుండా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి జరగాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ జిల్లాలను వెనుకబడ్డ ప్రాంతాలుగా ప్రకటించడమే శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని, తెలంగాణ వెనుకబడిందని కేంద్రమే చెబుతోందంటూ టీఆర్ఎస్ చేసిన ప్రకటన’ను ప్రస్తావించగా.. బొత్స పైవిధంగా స్పందించారు.
‘ఏమో! అయి ఉండొచ్చేమో.. అయినా, విడిపోవడానికి, కలిసి ఉండటానికి సంబంధం లేకుండా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి జరగాలి. దళిత, గిరిజన జనాభా, వలసలు, తలసరి ఆదాయం, వెనుకబాటుతనం వంటి కోణాల్లోనుంచే ఆ జిల్లాలను ఎంపిక చేశారు. ఇంకా విద్య, వైద్యం, ఆదాయం, మౌలిక సదుపాయాలు, వనరుల వినియోగం లాంటి కోణాల్లో నుంచి చూస్తే వెనుకబడ్డ జిల్లాలు ఇంకా చాలా ఉన్నాయి’ అని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన- కలిసి ఉండే విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే సిఫారసును స్వాగతిస్తామన్నారు.
కరీంనగర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజల తలసరి ఆదాయం ఎక్కువగానే ఉందన్నారు. ‘విడిపోవడం అంటే దేశద్రోహమే’.. అన్న మంత్రుల ప్రకటనను ప్రస్తావించగా.. మంత్రి బొత్స చమత్కార మాడారు. “ఆ( .. సరేలే. ఓ ఛానెల్ నా బొమ్మను నిండుగా చూపిస్తే, మరో ఛానెల్ సగమే చూపించి.. మంత్రి అంటారు. ఇదీ అంతే! ఎవరి అభిప్రాయం వారికుంటుంది. ఎవరి విధానంలో వారు మాట్లాడుతుంటారు. నేను ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిని. ఇతరుల వ్యాఖ్యలపై నేనేం స్పందించను?” అన్నారు.

రాష్ట్రంలో 13 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు

C. P. Joshi
రాజధాని నగరం మినహా తెలంగాణ ప్రాంతంలోని మొత్తం తొమ్మిది జిల్లాలనూ వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది. వీటితో పాటు రాయలసీమలోని కర్నూలు మినహా మిగిలిన మూడు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాను కూడా వెనుకబడిన ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అయినా కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాలు, కార్యక్రమాలతో ఈ ప్రాంతాల అభివృద్ధికి చేయూతనందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సి.పి.జోషి సోమవారంనాడు లోక్‌సభలో ప్రదీప్‌ జైన్‌ ఆదిత్య అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. రాష్ట్రంలోని ఈ పదమూడు జిల్లాలతోపాటు దేశవ్యాపితంగా మొత్తం 250 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ఎంపిక చేసి 2006-07 ఆర్థిక సంవత్సరం నుండి వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్‌ నిధి (బిఆర్‌జిఎఫ్‌) నుండి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ప్రాంతాలుగా ఎంపిక చేసిన జిల్లాలలో తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, నిజాబామాబ్‌, రాయలసీమలోని చిత్తూరు, అనంతపూర్‌, కడప, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలు ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తన సమాధానంలో వివరించారు. వివిధ రాష్ట్రాలలోని ఈ 250 జిల్లాలు బాగా వెనుకబడి ఉండడానికి భౌగోళిక, చారిత్రక కారణాలతో పాటు తగినన్ని వనరులు లేకపోవడం, మౌలిక సదుపాయాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందకపోవడం కారణమని మంత్రి సి.పి.జోషి చెప్పారు. మొత్తం 27 రాష్ట్రాలలోని 250 జిల్లాల ప్రత్యేకాభివృద్ధికి బిఆర్‌జిఎఫ్‌ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రు.4670 కోట్ల నిధులను విడుదల చేసిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాలకు మొత్తం రు.348.28కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు బాగా వెనుకబడి ఉన్న రాష్ట్రం-బీహార్‌కు యుపిఎ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ ఏడాదిలో మరో రు.2000కోట్లు, ఒరిస్సాలోని అవిభక్త కలహండి-బొలాంగీర్‌-కోరాపుట్‌ (కెబికె) జిల్లాలకు మరో రు.250కోట్లు కూడా ప్రత్యేకించినట్లు ఆయన వెల్లడించారు.
మా వాదన నిజమని రుజువైంది: మధుయాష్కీ : ఒక్క హైద్రాబాద్‌ నగరం మినహా తెలంగాణ ప్రాంతమంతా బాగా వెనుకబడి ఉందని, అభివృద్ధి విషయంలో దశాబ్దాలుగా ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, వివక్షకు గురౌతున్నదన్న తమ వాదన వాస్తవమని సోమవారంనాడు కేంద్రం చేసిన ప్రకటన రుజువు చేస్తున్నదని నిజామాబాద్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కీ గౌడ్‌ అన్నారు.
అన్ని రంగాలలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురౌతున్న కారణంగానే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న సెంటిమెంట్‌ తెలంగాణవాసుల్లో బలపడిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని అనేక ఇతర ప్రాంతాల కంటే తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందంటూ కోస్తా, రాయలసీమ నాయకులు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన పలు నివేదికలలో పేర్కొనడం వాస్తవాలను కప్పిపుచ్చి తెలంగాణ ప్రాంత దోపిడీని యధేఛ్చగా కొనసాగించే కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల విషయంలో సోమవారంనాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అందించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని శ్రీకృష్ణ కమిటీని కోరుతామని ఆయన వెల్లడించారు.