విశాఖపట్నం

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

మద్యం సిండికేట్లపై మళ్లీ ఎసిబి దాడులు


ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్‌ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్‌ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్‌ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్‌ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్‌పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్‌.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్‌ నాగేశ్వర్‌ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్‌, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్‌బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్‌ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్‌ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్‌ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్‌ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్‌ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్‌, పుష్కరగణేష్‌ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్‌పి రామకృష్ణప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్‌ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్‌రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని రైల్వే గేట్‌ ప్రాంతానికి చెందిన వీరాచందర్‌ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఐ కరమ్‌చంద్‌ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.

చిరంజీవే నా ప్రాణం – మంత్రి గంటా


చిరంజీవే తన ప్రాణమని, జీవిత కాలంపాటు ఆయన తోటే కలిసి ప్రయాణం చేస్తానని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఓడ రేవుల శాఖ ల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నమ్ముకున్న వారికి ద్రోహం చెెయరనేదానికి తన పదవే ఒక ఉదాహరణని అన్నారు. చిరంజీవి మానవ సంబంధాలు కలిగిన వ్యక్తని, తనను కుటుంబ సభ్యుడిలా, సోదరుడిలా ఆదరిస్తున్నారని అన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా విశాఖ వచ్చిన గంటాకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. వేలాది కారులతో భారీ ర్యాలీగా నగరంలో పర్యటించారు. సంపత్‌ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎల్‌ఐసి జంక్షన్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. అక్కడ నుంచి నేరుగా అనకాపల్లి చేరుకున్నారు. అంతకు ముందు విమానాశ్రయం వద్ద జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మంత్రి గంటా ప్రసంగించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా ఉంటానని జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రితో కలిసి టీమ్‌వర్క్‌ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. అందరి మన్ననలూ పొందే విధంగా తన వ్యవహారశైలి ఉంటుందన్నారు. రాష్ట్రానికి ఇంధనం వంటి శాఖను తనకు అప్పగిం చారని, ఆ శాఖకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. గంటాకు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. వేలాది వాహనాలు విమానాశ్రయానికి చేరుకోవడంతో కోలా హలంగా మారింది. ఈ సందర్భంగా విమానా శ్రయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా అభిమానులు పూల మాలలతోనూ, కాంగ్రెస్‌ కండువాలతోనూ ముంచెత్తారు. గంటాపై పూలజల్లు కురిపించారు. మంత్రి గంటా ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌, పోలీస్‌ కమిషనర్‌ జె.పూర్ణచంద్రరావు, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను గంటాకు కలెక్టర్‌ పరిచయం చేశారు. విప్‌ కోండ్రు మురళి, మేయర్‌ పులుసు జనార్దనరావు, ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాస్‌, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయకుమార్‌, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు పాల్గొన్నారు.

చిరంజీవిపై కూడా పోటీకి సిద్ధం


పార్టీ కార్యకర్తలు, అభిమానులు తాను తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని, వారి అభీష్టం మేరకు త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడనుంచైనా పోటీ చేస్తానని, చిరుపైన కూడా పోటీకి సిద్ధమన్నారు. ఇటీవల మా కుటుంబంలో విబేధాలున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం కాదన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని అన్నారు. అభిమానులు, కార్యకర్తలు వేర్వేరు కాదని, వారంతా అంకితభావంతో పార్టీ పురోభివృద్ధికి శ్రమిస్తున్నవారేనని అన్నారు. వారికి సరైన గుర్తింపునివ్వాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని, పార్టీలో ఇకపై ఎటువంటి పొరపాట్లూ చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని, కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వటం ద్వారా వారికి న్యాయం చేస్తానని అన్నారు.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనుల జీవితాలతో ఆడుకుందామనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని, వారి అభీష్టం మేరకు త్వరలోనే తాను క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తానన్నారు. పార్టీలో ఇకపై ఎటువంటి పొరపాట్లూ జరగకుండా, అందరికీ న్యాయం జరిగేలా జాగ్రత్త తీసుకుంటానని అన్నారు. విశాఖ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, మైదాన ప్రాంతమైన మాడుగల నియోజవర్గ కేంద్రాల్లో పర్యటించారు. పాడేరు జంక్షన్‌లోనూ, మాడుగుల జంక్షన్‌లోనూ ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, అన్నింటా కల్తీయేనని, కల్తీసారా తాగి అనేకమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఎంతసేపూ పదవులను కాపాడుకోవటానికే తప్ప ప్రజాసంక్షేమం ఏ కోశానా లేని పాలకులకు తగిన బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఆసన్నమవుతుందన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతిని పెంచి పోషిస్తున్నారని, మద్యం సిండి’కేట్లు’గా మారుతున్నారన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీకే విక్రయించాలని తెలుగుదేశం పార్టీ శతవిధాల పోరాటం సాగిస్తున్నా అధికారుల, అధికార పార్టీ ప్రతినిధుల అండ చూసుకుని మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతో కాలం సాగదని అన్నారు. అంతకు ముందు పాడేరు గెస్ట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాల ద్వారా బహుళజాతి కంపెనీలను ప్రోత్సహిస్తూ గిరిజనుల జీవితాలతో ఆడుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, బాక్సైట్‌ తవ్వకాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు గల అన్ని అనుమతులూ రద్దు చేస్తామని అన్నారు. తాను ఎన్టీయార్‌ నటవారసుడినే తప్ప రాజకీయ వారసుడిని కాదని, పార్టీ పురోభివృద్ధి కోసం అంకితభావం గల కార్యకర్తగా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినిమారంగం, రాజకీయరంగం రెండూ తనకు ప్రధానమేనని అన్నారు. అవకాశం వస్తే మీ సోదరి పురంధేశ్వరిపై పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఎప్పుడు రాజకీయరంగ ప్రవేశం చేస్తారన్న ప్రశ్నకు ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని, త్వరలోనే చెబుతానని అన్నారు. పార్లమెంటులో ఎన్టీయార్‌ విగ్రహం ఏర్పాటుపై వివాదం గురించి ప్రశ్నించగా, పెద్దగా వివాదమంటూ ఏమీ లేదని, విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని బాలకృష్ణ చెప్పారు. ఆయా సభల్లో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, మణికుమారి, ఆర్‌ ఎస్‌డిపి అప్పలనర్సింహరాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, సివేరి సోమ, కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, గవిరెడ్డి రామానాయుడు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమవతి తదితరులు పాల్గొన్నారు.

కొత్త మంత్రుల బయోడేటాలు


సి. రామచంద్రయ్య
1948లో కడపలో జన్మించి తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లిdలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 67లో కడపలోని సిండికేట్‌ బ్యాంక్‌లో క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 85లో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది అప్పటి మంత్రివర్గంలో ప్రణాళిక కార్యక్రమాల అమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో రాష్ట్ర ట్రేడింగ్‌ కార్పోరేషన్‌ సభ్యునిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎంపిగా కొనసాగుతున్న సమయంలో పదవీకాలం ఉంటుండగానే ప్రరాపాలో చేరారు. కాంగ్రెస్‌లో ప్రరాపా విలీనం తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా చార్టెడ్‌ అకౌంటెన్సీలో తనకున్న 30 ఏళ్ళ అనుభవంతో ప్రముఖ కంపెనీల ఆర్ధిక లావాదేవీలను చాకచక్యంగా నిర్వహించారు.
గంటా శ్రీనివాసరావు
1960లో ప్రకాశం జిల్లా కామేపల్లిలో జన్మించి చీరాలలోని విఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కాలేజీలో బి.కామ్‌, బి.ఎల్‌ పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలో స్థిరపడి పెట్రో కెమికల్‌ రంగంలో పలు యూనిట్లను స్థాపించారు. 1999లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో ప్రరాపాలో చేరి 09లో జరిగిన అసెంబ్లిd ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

విశాఖ బీచ్ రోడ్డులో ఎమ్మెల్యేల సైక్లింగ్


అరకు అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖ చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం విశాఖ బీచ్‌రోడ్డులో సైక్లింగ్ చేశారు. స్థానిక పార్క్ హోటల్ కూడలి నుంచి కాళీమాత ఆలయం వరకు సైక్లింగ్‌ను నిర్వహించారు. మేయర్ పులుసు జనార్దనరావు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సైక్లింగ్‌లో పాల్గొన్నారు. అరకు నుంచి వచ్చిన తరువాత స్థానిక ఓ స్టార్ హోటల్‌లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విందు ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు గురువారం ఉదయం బాగా పొద్దెక్కే వరకూ హోటల్ గదులకే పరిమితమైతే, కొంతమంది మాత్రమే సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతారణం, స్వచ్ఛమైన గాలిలో, అందునా వెహికల్ ఫ్రీ జోన్ ఏరియాలో వీరు సైక్లింగ్ చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ నగరానికి కాలుష్యం నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఇంధన పొదుపునకు సైక్లింగ్ చేయాలని ఇక్కడి అధికారులు తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటువంటి ఫ్రీ సైక్లింగ్ జోన్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, సుగ్రీవ్, రాజేష్, అబ్దుల్‌గనీ, సత్యనారాయణ, జగన్నాయకులు, ఎమ్మెల్సీలు సూర్యనారాయణ, నరేంద్రరెడ్డి తదితరులు సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా విశాఖ మేయర్ జనార్దనరావు మాట్లాడుతూ బీచ్ రోడ్డులో జాగింగ్, మోర్నింగ్ వాక్, సైక్లింగ్ చేసే వారికి వాహన కాలుష్యం నుంచి ఉపశమనం కలిగించడానికి వెహికల్ ఫ్రీ జోన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. బీచ్ రోడ్డులో సైక్లింగ్ చేయాలనుకున్న వారికి ఉచితంగా సైకిళ్ళను అందజేస్తున్నామన్నారు. జివిఎంసి కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు రోజుకి రెండు గంటలపాటు సైక్లింగ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. (చిత్రం) విశాఖ బీచ్ రోడ్డులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్‌ల సైక్లింగ్

పేపర్‌లెస్‌ అసెంబ్లీ కోసమే వెబ్‌సైట్‌ : స్పీకర్‌ మనోహర్‌


పేపర్‌ రహిత శాసనసభ ఆలోచనతో శాసనసభ వెబ్‌సైట్‌కి రూపకల్పన చేసినట్టు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. శాసనసభ వెబ్‌సైట్‌ని మూడురోజుల అవగాహన కార్యక్రమానికి హాజరైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం విశాఖలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ వ్యవహారాల్లో దాచాల్సిందేమీ లేదని అన్నారు. పారదర్శకత పాటించాలన్న ఉద్దేశంతో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామని, దీనిద్వారా ప్రతి ఒక్కరూ శాసనసభ వ్యవహారాలను తెలుసుకోవచ్చని చెప్పారు. వెబ్‌సైట్‌లో నియోజకవర్గాల వారీ సమాచారాన్ని పొందుపరిచి, శాసనసభ్యులకు పాస్‌వర్డ్‌ ఇస్తామని తెలిపారు. దీనిద్వారా శాసనసభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా నియోజకవర్గంలోని కార్యక్రమాల వివరాలను తెలుసుకుని సమన్వయం చేసుకోవచ్చని అన్నారు. ఈ వెబ్‌సైట్‌ని పదిహేను రోజులపాటు ప్రయోగాత్మకంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని, దీన్నిచూసిన తరువాత ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే వెబ్‌సైట్‌లో మార్పులుచేసి ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.చక్రపాణి, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు మాట్లాడారు.

అధికారుల పనితీరుపై ఎమ్యెల్యే చిరంజీవి ఆవేదన


రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత చేసినా అధికారుల్లో మార్పు రాదన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని మెగాస్టార్, పిఆర్‌పి అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో గడచిన రెండు రోజుల నుంచి చిరంజీవి చురుకుగా పాల్గొంటున్నారు. చివరి రోజైన బుధవారం ఆయన ప్రసంగించారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు ప్రసూతి సమయంలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, ఎనస్థీషియా యూనిట్ లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతోందని తాను గమనించానని అన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ యూనిట్ గురించి తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చిన ప్రతి ఆరోగ్య శాఖ మంత్రినీ కోరుకుంటున్నానని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా పదేపదే కోరాను. ఇదిగో మంజూరు చేస్తున్నాం.. అదిగో మంజూరు చేస్తున్నాం అని చెపుతున్నారే తప్ప, ఇప్పటి వరకూ ఆ యూనిట్ రాలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తినే అధికారులు పరిగణలోకి తీసుకోనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారులు డిటాచ్‌డ్‌గా పనిచేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధితో కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాక్సైట్‌పై ఆచితూచి అడుగేయండి!
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తేనే మంచిదని అన్నారు. ఖనిజ సంపద అన్యాక్రాంతం చేసే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన ఇక్కడ వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, దీనివలన నదీ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉందని అన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి మేలు చేయకపోయినా ఫరవాలేదని, వారి జీవన విధానాన్ని దెబ్బతీయకుండ చూడాలని చిరంజీవి అన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో గిరిజన తండాల్లోని జనం మరింత బిక్కుబిక్కుమంటున్నారని అన్నారు. అరకుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, సినిమా షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఇక్కడి అందాలే చూశాను తప్ప, ఆ అందాల వెనుక ఉన్న ఆవేదనను చూడలేకపోయానని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లేక వీరి బతుకులు ఎంత ఛిద్రమైపోయాయో చూస్తే చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇవే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు సభ్యులు పెద్దగా పట్టించుకోరని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు సమస్యలకు వచ్చినప్పుడు వాస్తవాలను గమనించగలుగుతామని చిరంజీవి చెప్పారు.

ఎమ్మెల్యేలకు విజన్ ముఖ్యం


నాయకులుగా ఎదిగితేనే దేశానికి ప్రయోజనం
ఎమ్మెల్యేల శిక్షణలో స్పీకర్ మనోహర్
ఉత్సాహంగా రెండో రోజు శిక్షణ శిబిరం
సీఎం చేతుల మీదుగా వెబ్‌సైట్ ప్రారంభం నేడు
చిరు రాకతో శిబిరంలో సందడి
అరకులోయ, జనవరి 10 : “ఎమ్మెల్యేలంటే నియోజకవర్గానికే పరిమితం కావాలని లేదు. పరిధిని విస్తరించుకోండి. సేవా దృక్పథం అలవరుచుకోండి. ర్రాష్టానికి, దేశానికి కొంత సమయం వెచ్చించండి. ప్రభుత్వం అంటే సచివాలయం, సీఎం మాత్రమే కాదు. మనం కూడా అందులో భాగమే. టీమ్ స్పిరిట్‌తో పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. దేశాభివృద్ధికి పాటుపడదాం ముందుకు రండి” అంటూ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.
ఎమ్మెల్యేలకు విజన్ ముఖ్యమని, దూరదృష్టి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులకు ఇప్పుడే బాటలు వేయగలుగుతామని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేల అవగాహన, శిక్షణ కార్యక్రమం రెండో రోజైన మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. శిబిరంలో భాగంగా కొద్దిసేపు క్వశ్చన్ అవర్ జరిగింది. అనంతరం ‘గిరిజన అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన’ అనే అంశంపై చర్చ జరిగింది. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పీకర్ మనోహర్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు.
రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక ప్రాంతం సమస్యలపై అధ్యయనం చేయడానికి వెళ్లడం, అక్కడి ప్రజలతో మమేకమై, వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడం శాసనసభ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రకటించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు సేద తీరడానికో, సరదాలు తీర్చుకోవడానికో ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి సదస్సు దేశంలోనే కాదు.. కామన్ వెల్త్ దేశాల్లోనూ ఎక్కడా జరగలేదన్నారు. ఎమ్మెల్యేలుగా భావించకుండా నాయకులుగా ఎదిగితే దేశానికి ఉపయోగపడతారని సూచించారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ఏజెన్సీ గ్రామాలకు తాను మూడుసార్లు వెళ్లానని, మరోసారి ఈ గ్రామాలకు వస్తే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
క్వశ్చన్ అవర్ నడిస్తేనే సభ జరిగినట్టు
శాసనసభలో క్వశ్చన్ అవర్ నడిస్తేనే సభ పూర్తిగా జరిగినట్టని, లేదంటే అసంపూర్తిగా ముగిసినట్టని, దానిని ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దని స్పీకర్ మనోహర్ కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ఎప్పుడు వేయాలి? ఎలా వేయాలి? అనే అంశాలపై పార్లమెంటు వ్యవహారాల కమిటీ అధికారి మధుకర్ అవగాహన కల్పించారు.
ఒకసారి మాట్లాడిన వారికే మళ్లీ అవకాశాలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చేలా చూడాలని స్పీకర్‌ను భీమునిపట్నం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కోరారు. సభలో ముందుగా క్వశ్చన్ అవర్ నిర్వహించి, ఆ తర్వాత సమావేశాలు పెడితే బాగుంటుందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు సూచించారు. ఆ సూచన బాగుందని, అమలు చేయడానికి ప్రయత్నిస్తామని స్పీకర్ ప్రకటించారు. ‘రూల్ 74′ కింద కాలింగ్ అటెన్షన్ మోషన్ పేరుతో ఏదైనా సమస్యపై పిటిషన్ రూపంలో ప్రశ్న ఇస్తే… స్పీకర్ దానిని స్వీకరిస్తారని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల సందేహాలకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సదారామ్ జవాబులు ఇచ్చారు.
ఎమ్మెల్యేలకు వెబ్‌సైట్.. నేడు ప్రారంభం
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎమ్మెల్యేలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించబోతోంది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లోనే కాకుండా ఎమ్మెల్యేలకు వీలున్నపుడు ఈ వెబ్‌సైట్‌కు ఈ-ఫిర్యాదులు చేసుకోవచ్చు. దీన్ని విశాఖపట్నంలో బుధవారం ఆవిష్కరించనున్నట్టు స్పీకర్ మనోహర్ ప్రకటించారు. ఈ కార్యక్రమం సీఎం కిరణ్ చేతులు మీదుగా జరిగే అవకాశం ఉంది.
శిక్షణకు చిరంజీవి.. అరకులో సందడి
కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మంగళవారం అరకులోయ వచ్చారు. చిరంజీవి రాకతో అరకులో అభిమానుల సందడి పెరిగింది. విధి నిర్వహణలో, శాసనసభ వ్యవహారాల్లో ఈ కార్యక్రమం తమకు చక్కగా ఉపయోగపడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

నేడు విశాఖకు సిఎం


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తారు. ఉదయం 7.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో అరకు చేరుకుని అక్కడ అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 9.45 గంటలకు కొత్తవలస (అరకు) చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు గూడెం కొత్తవీధిలోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు ఇంటికి వెళ్లి మంత్రి తల్లి మృతికి సంతాపం తెలుపుతారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.30 గంటలకు విశాఖపట్నం చేరి విమానంలో హైదరాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు.

free website analytics