ఈస్ట్ గోదావరి

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమేనని, ఒక ఇంట్లో ఒక ఓటరును మనవైపు తిప్పుకోగలిగితే కుటుంబంలోని ఓట్లన్నీ మనకే పడతాయని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి ముందు నరసాపురంలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఓటర్లు చాలా తెలివైన వారని, కాంగ్రెస్ పార్టీ వైపువారిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేయడం ఎన్నికల్లో కీలకమన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు స్థానికంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బూత్ కమిటీలు పరిశీలించుకోవాలని సూచించారు. మే 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున అప్పటికే బూత్‌కమిటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసి నివేదికను తయారుచేసుకోవాలని సూచించారు. ప్రతీ బూత్ కమిటీకి పదిమంది ఉండాలని, వీరు ఎన్నికల కోసం అహర్నిశలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు, ఇతర పార్టీల ఓటర్లు ఎవరు, తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరో గుర్తించి వారిలో కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపేవారిని మన ఓటర్లుగా మార్చుకోవాలన్నారు. ఒక కుటుంబంలో ఒక ఓటరును కాంగ్రెస్ పా ర్టీ వైపు తిప్పుకునేలా చేసుకుని, తద్వారా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలన్నారు. దీనివల్ల ఒక్క ఓటు వంద ఓట్లుగా మారుతుందని, ఆ వందల ఓట్లు వేల ఓట్లుగా పెరుగుతాయని చెప్పారు. ప్రతీ కుటుంబం వద్దకూ వెళ్ళి ఐదునుంచి పది నిమిషాలపాటు వారితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. అలాగే ఓటర్లకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే సత్తా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉందని వారికి వివరించాలని చెప్పారు.
నరసాపురం నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఓటర్లందరితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన చేసే కృషికి కార్యకర్తలు, నాయకులు కూడా కొత్తపల్లికి అండగా ఉండాలన్నారు. పత్రికలు చూసి ఓటర్లు మోసపోతున్నారని, అందుకోసం కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేకంగా బుక్‌లెట్ తయారుచేసిందని, దాన్ని ఓటర్లకు అందచేయాలని ముఖ్యమంత్రి కోరారు. గెలుపోటముల బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. రాజస్థాన్‌లో అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు ఒక్క ఓటుతో ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, వట్టి వసంతకుమార్, పీతాని సత్యనరాయణ, వట్టివసంతకుమార్, డిసిసి అధ్యక్షుడు గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా డి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్ద మంగళవారం సాయంత్రం ప్రైవేటు స్కూలు బస్సు ప్రధాన పంట కాలువలోకి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. మరో నలుగురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన కాలువలోకి దూకి చిన్నారులను రక్షించడంతో ప్రాణనష్టం తగ్గింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి… డి.గన్నవరంలోని ఒక ప్రైవేటు స్కూలు నుండి మంగళవారం సాయంత్రం 32 మంది పిల్లలతో మినీ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో ఎనిమిది మంది పిల్లలను దించివేశారు. మిగిలిన 24మందితో వెళుతున్న బస్సు జి.పెదపూడిలంక వద్ద ప్రధాన పంట కాలువ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీని తప్పించే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యింది. బస్సు పూర్తిగా కాలువలో బోల్తాపడింది. దీనితో ఒక్కసారిగా చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకి బస్సు నుండి చిన్నారులను బయటకు తీశారు. కాగా ఈ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న అడ్డాల రోహిత్ (8), చినమిల్లి బిందుమాధవి (8) మృతిచెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడటంతో వారిని 108 అంబులెన్స్‌లో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమలాపురం ఆర్డీవో సంపత్‌కుమార్, డిఎస్పీ శ్రీ్ధర్ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
గల్లంతు వార్తలతో గందరగోళం
కాగా ఈ ప్రమాదంలో సుమారు పది మంది వరకు గల్లంతై ఉండవచ్చని మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో అందరిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు, బంధువులు సంఘటనాస్థలం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. చివరకు పాఠశాల నుండి బస్సులో బయలుదేరిన విద్యార్థుల సంఖ్య, మధ్యలో దిగిపోయిన వారు, స్థానికులు రక్షించిన విద్యార్థుల సంఖ్యతో పోల్చిచూడటంతో మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని తేలింది. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తక్షణ సహాయ చర్యలకు సిఎం ఆదేశం
హైదరాబాద్: జి.పెదపూడి వద్ద బస్సు బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే గ్రామంలో బాధితులకు సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.

మా హయాంలో అవార్డులు.. ఇప్పుడేమో జైళ్లు
మూలవిరాట్‌లను వదిలి సామాన్యులను పట్టేస్తున్నారు
మద్యం మాఫియా దర్యాప్తు తీరుపై బాబు ధ్వజం
రాజమండ్రి, ఫిబ్రవరి 4 : “ఒక వ్యక్తి చేయించిన తప్పులకు ఇపుడు ఎంతమంది జైలుకు వెళ్తున్నారో.. టీడీపీ హయాంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఐఏఎస్‌లు ఇపుడు జైలుకెళ్లే పరిస్థితి ఎదురైంది. ఇదంతా వైఎస్ హయాంలో, ఆయన ఒత్తిడికి తలొగ్గి పనిచేయడం వల్లే జరిగింది” అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మార్, గాలి అక్రమ గనులు, జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఒక్కొక్కరుగా ఐఏఎస్ అధికారులు జైలుకు వెళుతుండటం, దీనిపై ఐఏఎస్‌లు సీఎం కిరణ్ వద్ద నేరుగానే అసహనం వ్యక్తం చేయడం వంటి పరిణామాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వారికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. శనివారం తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ” జైలుకెళ్లినంత మాత్రాన తప్పుచేసినట్టు కాదు కదా” అని తనను కలిసిన ఐఏఎస్‌ల వద్ద సీఎం కిరణ్ అభిప్రాయపడటాన్ని తప్పుబట్టారు. జైలుకెళ్లినా ఫర్వాలేదా.. హవ్వ.. నవ్వుతారంటూ ఎద్దేవా చేశారు. ” జైలు కెళ్లడం తప్పేముందని సీఎం అంటున్నారు. ఎంత దారుణం. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవడం సీఎం స్థాయి వ్యక్తులకు తగద”ని పేర్కొన్నారు.
ఇపుడు జైలుకెళ్తున్న ఆఫీసర్లే తమ హయాంలోనూ పనిచేశారని, అప్పట్లో వారికి అవార్డులు వస్తే ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా వైఎస్ తన స్వలాభం కోసం అధికారులపై ఒత్తిడి చేయడం, ప్రలోభాలకు గురిచేసిన ఫలితమని ధ్వజమెత్తారు. ఆర్థిక కుంభకోణాల్లోనేకాదు..మద్యం మాఫియాలోనూ ‘మూలవిరాట్టు’లను వదిలేసి మామూలువాళ్లను అరెస్ట చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ బొత్సపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ” బొత్స మద్యం మాఫియా కింగ్. అందులో సందేహం లేదు. తమ కుటుంబానికి 31 మద్యం షాపులు ఉన్నాయని గతంలో ఆయనే చెప్పారు. అటువంటి మూలవిరాట్‌లను వదిలేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

దోషులపై కఠిన చర్యలు
అమలాపురంలో మంత్రుల బృందం హామీలు
అంబేద్కర్ సహా జాతీయ నాయకుల విగ్రహాల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుందని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, ధవళేశ్వరంలో మంత్రుల బృందం పర్యటించింది. అనంతరం అమలాపురం ఆర్‌డిఓ కార్యాలయంలో మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పరిపాలన సాగుతోందని, అటువంటి మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేయడం దేశద్రోహంగా పరిగణించాలని అన్నారు. విగ్రహాల భద్రత, దోషులను శిక్షించే విషయమై ఈ నెల 30న కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని సమాజం నుంచి వెలివేయాలని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సిఎం, స్పీకర్‌లతో చర్చించామన్నారు. మరో మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం జాతికే సిగ్గు చేటని, ఇటువంటి అనాగరిక చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విఫ్ కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ దుండగుల చర్య అనైతికమని, ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
తొలుత మంత్రుల బృందం ధవళేశ్వరం, అమలాపురం మండలం చిందాడగరువు, చిట్టిగరువు, బండివారి పేట, నల్లవంతెన ప్రాంతాల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాలను పరిశీలించింది. మంత్రులు స్థానికులతో మాట్లాడారు. ఈ పర్యటనలో జిల్లా మంత్రులు పినిపే విశ్వరూప్, తోట నరసింహం, ఎంఎల్‌ఎలు రాపాక వరప్రసాదరావు, నల్లమిల్లి శేషారెడ్డి, వంగా గీత, ఎంఎల్‌సి కందుల దుర్గేష్, బలసాలి ఇందిర, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఎఒబి ప్రశాంతంగా ఉందని రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఉనికిని చాటుకోవడానికే కొన్ని సందర్భాల్లో మావోలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీటిని తాము దీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. అంతకుమించి రాష్ట్ర పరిధిలో కొత్త రిక్రూట్‌మెంట్‌లు,ఇతర కార్యక్రమాలు జరగడంలేదని స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం పర్యటించిన డిజిపి కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెలాఖరునుంచి ఏజెన్సీలో కూంబింగ్ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖలో ఎమ్‌ఐ..17 తరహా హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచుతామన్నారు. ఇందులో 20మంది సిబ్బందికి చోటుంటుందన్నారు. నెలకు కోటి రూపాయలకు పైగా దీని నిర్వహణకు వ్యయమౌతుందని చెప్పారు. విశాఖ గ్రేహౌండ్స్ అధీనంలో దీన్ని ఉంచుతామని డిజిపి వెల్లడించారు. అవసరమైన సందర్భాల్లో ఒకేసారి ఎక్కువమందిని వేగంగా తరలించేందుకిది ఉపయోగపడుతుందన్నారు. మానవరహిత విమానాన్ని మధురపూడి ఎయిర్‌పోర్టులో ఉంచుతామన్నారు. అక్కడి నుంచే ఇది తరచు గగన విహారం చేస్తుందని చెప్పారు. ఎలాంటి అలజడులు, అనుమానపు కదలికలున్నా పసిగట్టి వాటిని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుందన్నారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ట్రయిల్ రన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది సత్ఫలితాల్నిచ్చిందన్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను బతికే ఉన్నాడని డిజిపి చెప్పారు. అతన్నిపట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామన్నారు.గాలింపును కూడా ముమ్మరం చేశామన్నారు. కోస్తా తీరంలో గస్తీని పటిష్టపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈప్రాంతంలో ఒఎన్‌జిసి 9వేలకోట్లతో కార్యకలాపాల్ని నిర్వహిస్తోందన్నారు. వ్యూహాత్మకంగా కెజి బేసిన్ అత్యంత కీలకమైన ప్రాంతమని చెప్పారు. ఇక్కడున్న కొన్ని చమురు సంస్థలు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాయని, వాటన్నింటినీ కూడా పోలీస్ అదుపులోకి తెస్తామని తెలిపారు. మత్స్యకారులు వినియోగించే పడవలన్నింటికి ప్రత్యేక రంగు వేయిస్తామని తద్వారా శతృవుల పడవల రాకపోకల్ని గుర్తించే వీలుంటుందని డిజిపి చెప్పారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం రీజనల్ కేంద్రాల్లో సైబర్ నేరాల అదుపుకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌లకు అదనపు సిబ్బందిని కల్పిస్తామన్నారు. ఎస్‌ఐ, ఆ పైస్థాయి అధికారుల పదోన్నతుల్లో మహరాష్ట్ర, కర్నాటకల్లో అనుసరిస్తున్నవిధానాల్ని అధ్యయనం చేశామన్నారు. దీన్నే ఇక్కడ కూడా అమలు చేయనున్నట్లు చెప్పారు. దీంట్లో ఎలాంటి వివాదాలకుతావుండదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 15వేలమంది కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియ మొదలైందని డిజిపి వెల్లడించారు. ఉమేష్‌కుమార్ వ్యవహారం ఇంకా తన దృష్టికి రాలేదని ఆయనో ప్రశ్నకు బదులుగా చెప్పారు. అక్రమంగా ప్రభుత్వ స్థలాల్ని ఉమేష్‌కుమార్ పొంది ఉంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీస్‌స్టేషన్‌ల పరిధి పునర్విభజన
పోలీస్‌స్టేషన్ల పరిధిని పునర్‌విభజించనున్నట్లు డిజిపి చెప్పారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలు కొన్ని రెండేసి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోకొచ్చాయి. దీనివలన ప్రజాప్రతినిధులకు పోలీసులకు మధ్య సమన్వయం కొరవడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గమైన ఒకే సబ్‌డివిజన్ పరిధిలోకొచ్చేట్లు చర్యలు తీసుకోనున్నట్లు డిజిపి చెప్పారు.
పోలీసుల కోసం సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి
పోలీస్ సిబ్బంది కోసం హైదరాబాద్‌లో ఓ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు డిజిపి వెల్లడించారు. ప్రతి బెటాలియన్ పరిధిలో ప్రత్యేక వైద్యుల నియామకానికి ముఖ్యమంత్రిఅంగీకరించారన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసుల కోసం అదనంగా ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిబ్బంది క్వార్టర్స్‌ను ఆధునీకరించనున్నట్లు డిజిపి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్తో పాటుపోలీస్ సంక్షేమ శాఖ నిధుల్ని కూడా వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోస్తా జిల్లాల ఐజి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఏలూరు రేంజ్ డిఐజి జి సూర్యప్రకాశరావు, ఎస్‌పిలు త్రివిక్రమవర్మ, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
దటీజ్ దినేష్‌రెడ్డి…
జిల్లా పర్యటనలో డిజిపి పోలీస్ దర్పాన్ని ప్రదర్శించారు. పోలీస్ అంటే ఇలా ఉండాలనేలా వ్యవహరించారు. ప్రజాప్రతినిధులెవర్ని పెద్దగా ఖాతరుచేయలేదు. కేవలం తాము ప్రజలకు మాత్రమే సేవకులన్నట్లుగా నడుచుకున్నారు. శాంతిభద్రతల కల్పన తమ విధి.. ప్రజల్ని పరిరక్షించడం తమ బాధ్యత.. నిరంతరం అందుకే తాము అంకితమౌతామన్న రీతిలో ఆయన పర్యటన సాగింది. అనవసర ఆర్భాటాలకు ఆయన తావివ్వలేదు. ప్రచారానికి ప్రాకులాడలేదు. నేరుగా ముఖ్యమంత్రి లేదా ప్రజలకే తాము జవాబుదారీ అన్నట్లు వ్యహరించారు. ఎందరో పోలీస్ ఉన్నతాధికారుల్ని చూసిన మీడియాకు, పోలీస్‌సిబ్బందికి కూడా దినేష్‌రెడ్డి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజమైన పోలీస్ బాస్ అంటే దినేష్‌రెడ్డే అన్న భావన వ్యక్తమైంది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పంకజ్ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్
తానే సైక్లోన్ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

అవినీతి ఆరోపణలకు జంకేది లేదని, తానే తప్పూ చేయలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సిబిఐ విచారణ ఇతర అంశాలకు సంబంధించి తాను సచ్చరితుడిగా నిగ్గుతేలతానని ఆయన స్పష్టం చేశారు. దీనిపై విచారణను రాష్ట్ర హైకోర్టులోనే ఎదుర్కుంటానన్నారు. తొలుత తన వాదనల్ని వినిపించే అవకాశం హైకోర్టు ఇవ్వలేదని, తమ పార్టీ నాయకులు సుప్రీంను ఆశ్రయించడంతో తమ వాదనల్ని వినిపించే అవకాశం లభించిందని చంద్రబాబు చెప్పారు. తూర్పుగోదావరిజిల్లాకు రైతు పోరుబాట సందర్భంగా బుధవారం ఇక్కడికి విచ్చేసిన చంద్రబాబు మర్రిపాక గ్రామంలో మీడియాతోమాట్లాడారు. తన ప్రభుత్వంలో పని చేసిన ఐఎఎస్ అధికారులంతా పదవీ విరమణ తర్వాత కూడా వివిధ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ విషయానికొచ్చేసరికి ఐఎఎస్‌లంతా కోర్టులు, సిబిఐ చుట్టూ తిరిగే పరిస్థితేర్పడిందన్నారు. ఇందుక్కారణం ఐఎఎస్ అధికారుల్ని తాము కేవలం సక్రమ పరిపాలన కోసమే వినియోగించుకుంటే కాంగ్రెస్ పాలకులు తమ సొంత ఆర్ధిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని, వారందరినీ ఇప్పుడు బలిపశువుల్ని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పని చేయాలంటేనే ఐఎఎస్‌లు భయపడే పరిస్థితి నేడు నెలకొందన్నారు. గతంలో తనపై వేసిన 25ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో 24గింటిని కోర్టు కొట్టేసిందన్నారు. 11హౌస్‌కమిటీలు, నాలుగు జుడీషియల్ విచారణలు, మూడు కేబినెట్ కమిటీలు విచారణ జరిపాయన్నారు. ఇవన్నీ తాను సచ్ఛీలుడిగానే నివేదికలిచ్చాయని బాబు వివరించారు. తెలుగుదేశం పార్టీ రూపొందించిన 65మెగా ప్రాజెక్ట్‌ల్ని కాంగ్రెస్ హైజాక్ చేసి అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. పథకాల్ని డబ్బులు, పైరవీల కోసం వినియోగించుకున్న ఘనత కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో తనపై కేసులు వేసిన వెంగళరావు, విజయభాస్కరరెడ్డిల స్మారక చిహ్నాల్ని ఏర్పాటు చేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుక కోసం ప్రయత్నిస్తోందని, దాన్ని పెద్దభూతంలా చూపేందుకు ప్రయత్నాలు ప్రాంభించిందన్నారు. తాను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకోసమే పాటుపడుతున్నానని చెప్పారు. తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఒక ట్రస్టీగానే పని చేశానన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తుల్ని సైతం ప్రకటించిన నిజాయితీని చాటుకున్నానన్నారు.
అవిశ్వాసం తథ్యం
ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టడం తద్యమని చంద్రబాబు చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి అసెంబ్లీని సమావేశపర్చే ధైర్యం కూడా లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే అవిశ్వాసాన్ని పెడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ను కలుపుకునే అవసరం లేదన్నారు. సమావేశంలో బాబుతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, పార్టీ నాయకులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీలు చినరాజప్ప, బొడ్డు భాస్కర రామారావు తదితరులున్నారు.

యానాంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ పెట్రోలియం సంస్థలు తీర ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాలను నిరసిస్తూ జిల్లా మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఓఎన్‌జిసి రిగ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని ..తమ జీవనోపాధికి విఘాతం కలుగుతోందని మత్స్యకారులు వాపోయారు. దీనికి ఆయా సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నేతృత్వం వహించారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 300 బోట్లతో 3 వేల మంది మత్స్యకారులు సముద్ర మార్గాన రిగ్ ముట్టడికి బయలుదేరారు.
అయితే జిఎస్‌పిసి రిగ్ ముట్టడికి వందలాది బోట్లు వెళుతుండగా మార్గ మధ్యలో కోస్టు గార్డు సిబ్బంది తమ మినీ నౌక ద్వారా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, కోస్టుగార్డు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రిగ్ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్ల రాదని, నిషేధ ఆజ్ఞలున్నాయని, వెనుకకు వచ్చేయాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వాటిని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ డీఎస్పీ లక్ష్మీనారాయణ, అమలాపురం డీఎస్పీ రాజశేఖరరావు ఆందోళనకారులకు నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా జిఎస్‌పిసి కార్యకలాపాలు నిలిపి వేశారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించుకుని అదే ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జిసి రిగ్‌ను ఆందోళనకారులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండుగంటలన్నరపాటు 500 నాటికల్ మైళ్ళు ప్రయాణించి భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, తాళ్లరేవు, యానాం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సావిత్రి నగర్ పరిసర ప్రాంతాల్లో యానాం, ఆంధ్రా ప్రాం తానికి చెందిన పోలీసులు భారీగా మోహరించారు.