విద్య

మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం


ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల ప్రవేశానికి మెడికల్‌ కౌన్సెలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు ఒకటి నుండి 900వ ర్యాంకు వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉదయం పది గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కాగా తొలిగంటలోనే 50 సీట్లను భర్తీ చేశారు. తొలుత ఎంసెట్‌-2011 మొదటి ర్యాంకర్‌ మందరపు హిమజ ఉస్మానియా యూనివర్శిటీలో మెడికల్‌ సీటు ఎంచుకున్నారు. డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఐ.వి.రావు ఆమెకు అధికారిక పత్రాన్ని అందజేశారు. రెండోర్యాంకర్‌ ఎన్‌.ఉమామహేశ్వరి, మూడో ర్యాంకర్‌ లక్ష్మీప్రవల్లిక కూడా ఉస్మానియా మెడికల్‌ కళాశాలలోనే సీటు ఎంచుకున్నారు. గతంలో కౌన్సెలింగ్‌ సందర్భంలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కోవడంతో ఈసారి ముందుగా దరఖాస్తులన్నీ పరిశీలించిన తరువాతే కౌన్సెలింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. దీంతో వేగంగా కౌన్సెలింగ్‌ పూర్తవుతోంది. ఈనెల 19 నుండి 21వ తేదీ వరకూ ఓపెన్‌ కేటగిరీలో కౌన్సెలింగ్‌ జరుగుతుందని వర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వేణుగోపాలరావు తెలిపారు. 22వ తేదీ నుండి బిసి, ఎస్‌టి, ఎస్‌టి అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ జరుగుతుందని వివరించారు. మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారం అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరిలో సీటు తీసుకున్నా 22వ తేదీ తరువాత వచ్చి రిజర్వేషన్‌ కేటగిరిలో వారికి నచ్చిన సీటు ఎంచుకోవచ్చని రిజిస్ట్రార్‌ తెలిపారు. విజయవాడతోపాటు హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతిలోనూ తొలిరోజు కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రిజిస్ట్రార్‌ తెలిపారు.

గ్రూప్‌ 1 తప్ప వేరే ఇంటర్వ్యూలు వద్దు


ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే రిక్రూట్‌మెంట్‌లలో గ్రూప్‌ 1 సర్వీసు మినహా మిగిలిన అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె సత్యనా రాయణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ మిషన్‌ నిర్వహించే రిక్రూట్‌మెం ట్‌లో ఆలస్యంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయని గతంలో వచ్చిన ఆరోపణలపై అప్పటి ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె సత్యనారాయణను ప్రభుత్వం విచారణ అధికారిగా నియమించిన సంగతి తెలసిందే. ఎపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ పద్దతిలో పాదర్శకతతో పాటు ప్రస్తుతం ఉన్న పద్దతుల్లో పలు మార్పులను ఆయన సిఫార్స్‌లలో సూచించారు.
గ్రూప్‌ 1లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపిక జరుతు న్నందన అభ్యర్థి వ్యక్తిత్వం, ఆలోచనా పద్దతి, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాధికారం,వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సత్యనారాయణ తన సిఫార్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రిక్రూట్‌మెంట్‌ పద్దతిలో గ్రూప్‌ 4 సర్వీసు మినహా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీని వలన సమయం, వనరులు వృధా అవుతున్నాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని సత్యనారా యణ తన సిఫార్స్‌లో స్టేట్‌ సర్వీసులకు తప్ప మిగతా అన్ని సర్వీసులకు ఇంటర్వ్యూ పద్దతి లేకుండా వ్రాత పరీక్ష ఆధారంగా జనరల్‌ మెరిట్‌ లిస్టును రూపొందించాలని సూచించారు. దీని వలన ఎపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ పద్దతిలో పారదర్శకతతో పాటు సమర్ధతను పెంచుతుంది. సత్యనారాయణ చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒక వేళ ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్తులో జరిగే గ్రూప్‌ 2 రిక్రూట్‌మెంట్‌లు ఈ కొత్త పద్దతిలో జరుగుతాయి.

ఫీజులకు కత్తెర!


రాష్ట్రంలో బీసీ విద్యార్థులపై రాష్ట్ర ప్రభు త్వం ఉక్కపాదం మోపే ప్రయత్నం చేస్తోంది. బీసీలకు ఫీజు రియం బర్స్‌మెంట్‌ చెల్లింపులో అనేక ఆంక్షలతో అంటకత్తెర వేస్తోంది. దీని వల్ల బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారనుంది. ఇందులో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్‌ వంటి సాంకేతిక విద్యా కోర్సులు కూడా బీసీ విద్యార్థులకు దూరం చేయాలని సర్కారు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాజకీయ పరంగా బీసీలను అణగదొక్కన ప్రభుత్వం విద్యా రంగంలో ఉన్న అవకాశాలను కూడా వారికి దూరం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే.. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు కొత్త షరతులు విధిసూత వింత పోకడలు పోతుంది.
బీసీ వ్యతిరేక ప్రభుత్వంగా మారుతోంది. మొన్నటికి మొన్న ఆధార కార్డులు ఉన్న వారికే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని మెలిక పెట్టింది. అంతకు ముందు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారని పేర్కొంది. ప్రతి సెమిస్టర్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని, హజరు శాతం తప్పకుండా ఉండాలంటు అనేక ఆంక్షలు విధించింది. అయినప్పటికీ సకాలంలో బకాయిలు చెల్లించడంలో సర్కారు విఫలమైంది. అగ్రకుల మంత్రులే వేనక ఉండి బడుగుల ఫీజులకు అంట కత్తెర వేయిస్తన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయంలో బీసీ మంత్రులదీ ప్రేక్షక పాత్ర అనిపిస్తోంది.
జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో రిజర్వేషన్లు ఇవాల్సి వస్తోంది. ఓపెన్‌లోనూ.. రిజర్వేషన్‌లోనూ బీసీ విద్యార్థులే అధిక సంఖ్యలో సీట్లు సంపాదించుకోవడం వల్ల ఓర్వలేని అగ్రకుల ఆహంకారులు బీసీలను దొడ్డి దారిన దెబ్బ తీయాలనుకుంటున్నారు. అందులో భాగంగా జరిగే కుట్రంలో భాగంగానే.. ఫీజురీయంబర్స్‌మెంట్‌పై ఆంక్షలు విధిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం.. ఇప్పుడు వయోపరిమితిపై పడింది. అలాగే తప్పుడు దరఖాస్తులు ఉన్నాయన్న చెత్తా కారణంతో దాదాపు 2.64 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించే ప్రసక్తే లేదని మంత్రి ఉప సంఘంలో తుది నిర్ణయం తీసుకున్నారు.
బీసీ విద్యార్థులకు ఉన్నత, సాంకేతిక విద్యలు దూరం చేయడం కోసం దశల వారీగా బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై సోమవారం నాటి మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో బీసీ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు మంత్రి పితాని సత్యనారాయణ విలేకరులకు వివరించారు. ఓసి, బిసి విద్యార్థులకు వయోపరిమితి ఈ విద్యా సంవత్సరం నుంచే కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
గతంలో ఓసి, బిసీ విద్యార్థులకు 34 సంవత్సరాలు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 30 సంవత్సరాలకు కుదిస్తు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఒకే విద్యార్థి రెండు కోర్సులు లేదా 3 కోర్సులు చేసినప్పటికీ ఒక్క కోర్సుకు మాత్రమే ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసి, పిజి కాలేజీలో చేరిన విద్యార్థులకు మాత్రమే రియంబర్స్‌మెంట్‌ చెల్లిస్తామన్నారు. 2011-2012 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు జులై 30 లోగా రెన్యువల్స్‌ చేసుకోవాలన్నారు. 2.64 లక్షల విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు ‘నెట్‌’లో పెట్టడం జరిగిందన్నారు. ఆయా విద్యార్థులు సంబంధిత దరఖాస్తుల వివరాలను సరిదిద్దుకోవాలని, లేక పోయినట్లయితే వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లింపు జరగదని మంత్రి పితాని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ కింద ఉన్న రూ.594 కోట్ల బకాయిలను జులై చివరి వారంలోగా పూర్తిగా చెల్లిస్తామన్నారు.

ఎఐ ట్రిపుల్ ఇ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థుల హవా


అఖిల భారత ఇంజనీరింగ్ (ఎఐ త్రిపుల్ ఇ) ఫలితాల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు తమ సత్తాను చాటారు. జాతీయ స్థాయిలో 5,7, 8, 12 ర్యాంకులు రాష్ట్ర విద్యార్ధులకే లభించాయి. జాతీయ స్థాయిలో బిటెక్ విభాగం ఓపెన్ క్యాటగిరీలో జె వరుణ్‌కు ఐదో ర్యాంకు లభించింది. ఐ.పృథ్వీతేజ్ కు ఏడో ర్యాంకు, టి భార్గవరెడ్డికి ఎనిమిదో ర్యాంకు, బి సాయి సురేందర్‌రెడ్డికి 12వ‌ ర్యాంకు లభించింది. ఎఐ త్రిపుల్ ఇ ఫలితాలను ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 12,46,270 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి లక్షా పదివేల మంది ఈ పరీక్ష రాశారు.
ఇలా ఉండగా, జాతీయ స్థాయిలో బిటెక్ ఓపెన్ క్యాటగిరీలో మొదటి పది ర్యాంకుల్లో రాష్ట్రానికి మూడు లభించగా ఆ మూడింటిని తమ విద్యార్ధులే దక్కించుకున్నట్లు శ్రీచైతన్య సంస్థ ప్రకటించుకుంది. (చిత్రం) జె.వరుణ్ (రాష్టస్థ్రాయలో 1వ ర్యాంకు) , ఐ.పృథ్వీతేజ్ (రాష్టస్థ్రాయలో 2వ ర్యాంకు)

టెన్త్‌ ఫలితాల్లో 83.10శాతం ఉత్తీర్ణత


మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం ఆవరణలో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి శనివారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది 81. 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి 83.10 శాతం ఫలితాలు వచ్చాయి. సంపూర్ణ శ్రేణీ విధానం ‘గ్రేడింగ్‌’ విధానంలో ఫలితాలు ప్రకటించారు. మొత్తం 12,87,211 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 10,49,695 మంది రెగ్యులర్‌, 2,37,516 మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌లో 53,8112 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 445082 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 511583 మంది పరీక్షలు రాయగా, 427257 మంది పాసయ్యారు. బాలురు 82.71 శాతం, బాలికలు 83.51 శాతం మొత్తం 83.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 40.03 శాతం కాగా, బాలికలు 47.17 శాతం, బాలురు 36.98 శాతం మంది పాసయ్యారు. బాలుర కంటె కూడా బాలికలు 10.19 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌, కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించటం విశేషం. 2562 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఫలితాలలో కరీంనగర్‌ జిల్లా 91.57 శాతం ఫలితాలు సాధించి ప్రధమ స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ జిల్లా 72.76 శాతంతో చివరి స్థానంలో ఉంది. 8 ప్రైవేట్‌ పాఠశాలలు, 2 ప్రభుత్వ పాఠశాలలు సున్నా ఫలితాలతో వెనుకబడ్డాయి. మేనేజిమెంట్‌ వారిగా చూస్తే 100 శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు 88, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 444, మున్సిపల్‌ పాఠశాలలు 9, ఎపి గురుకుల పాఠశాలలు (సొసైటి) 111, ఎపి ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు 10 ఉండగా, ప్రైవేట్‌ పాఠశాలలు 1856 ఉన్నాయి. జిల్లాల వారిగా వారిగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది. కరీంనగర్‌ 91.57 శాతం, గుంటూరు 91.32 శాతం, నల్గొండ 89.89 శాతం, చిత్తూరు 88.70 శాతం, కడప 87.62 శాతం, పశ్చిమగోదావరి 86.72 శాతం, మహబూబ్‌నగర్‌85.83 శాతం, కృష్ణా 85.68 శాతం, మెదక్‌ 85.58 శాతం, నిజామాబాద్‌ 85.18 శాతం, వరంగల్‌ 84.38 శాతం, ప్రకాశం 83.27 శాతం, తూర్పుగోదావరి 82.21 శాతం, అదిలాబాద్‌ 81.51 శాతం, విశాఖపట్టణం 81.07 శాతం, ఖమ్మం 80.83 శాతం, విజయనగరం 80.65 శాతం, నెల్లూరు 80.63 శాతం, కర్నూలు 78.99 శాతం, శ్రీకాకుళం 78.17 శాతం, రంగారెడ్డి 75.26 శాతం, హైదరాబాద్‌ 72.76 శాతం ఫలితాలు సాధించాయి. పాసైన విద్యార్థులను మంత్రి పార్థసారథి అభినందించారు. గత సంవత్సరం కంటె కూడా ఫలితాలు ఎక్కువ రావటం సంతోషించదగ్గ విషయమన్నారు. ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 18 నుంచి జూలై 1 వరకు నిర్వహించనున్నామని ప్రకటించారు.

నేడు ఎంసెట్‌


ఎంసెట్‌ పరీక్ష నేడు జరగనుంది. దీనికి సంబంధించి పరీక్షసెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్‌ పేపర్‌కోడ్‌ను ఉదయం ఆరు గంటలకు జెఎన్‌టియుహెచ్‌ యూనివర్సిటీలో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేస్తారని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎమ్‌వి రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మెడిసిన్‌ పరీక్ష పేపర్‌ కోడ్‌ను ఉదయం పదిన్నర గంటలకు వైద్య, విద్య, ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడిసిన్‌ పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమన్నారు.

నేడు ఎస్‌ఎస్‌సి ఫలితాలు విడుదల

మార్చి/ ఏప్రిల్‌ నెలల్లో జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ఫలితాలను విడుదల చేస్తారు. ఎపి ఆన్‌లైన్‌, ఈ సేవా కేంద్రాల గ్రేడింగ్‌, సబ్డక్టుల వారిగా మార్కులో తెలుసుకోవచ్చు. మన బడి. కామ్‌, మన బడి. కో. డాట్‌ఇన్‌తో పాటు దాదాపు 40 సంస్థల వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వీలుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఐవిఆర్‌ఎస్‌ అండ్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చునని పరీక్షల డైరెక్టర్‌ ప్రణొతి సుహాసిని ఒక ప్రకటనలో తెలియజేశారు.
హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల
డిసెంబర్‌ నెలలో జరిగిన హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌ ఫలితాలను విడుదలయ్యాయి. పాస్‌, ఫెయిల్‌ మార్కుల మెమోలు త్వరలో నేరుగా అభ్యర్థులకు పంపుతామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ప్రణొతి సుహాసిని తెలిపారు. ఫలితాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఇఏపి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌,(ఆంధ్రప్రభ ప్రతినిధి) : మార్చి/ ఏప్రిల్‌ నెలల్లో జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ఫలితాలను విడుదల చేస్తారు. ఎపి ఆన్‌లైన్‌, ఈ సేవా కేంద్రాల గ్రేడింగ్‌, సబ్డక్టుల వారిగా మార్కులో తెలుసుకోవచ్చు. మన బడి. కామ్‌, మన బడి. కో. డాట్‌ఇన్‌తో పాటు దాదాపు 40 సంస్థల వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వీలుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఐవిఆర్‌ఎస్‌ అండ్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చునని పరీక్షల డైరెక్టర్‌ ప్రణొతి సుహాసిని ఒక ప్రకటనలో తెలియజేశారు.
హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల
డిసెంబర్‌ నెలలో జరిగిన హెడ్‌మాస్టర్‌ అకౌంట్‌ టెస్ట్‌ ఫలితాలను విడుదలయ్యాయి. పాస్‌, ఫెయిల్‌ మార్కుల మెమోలు త్వరలో నేరుగా అభ్యర్థులకు పంపుతామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ప్రణొతి సుహాసిని తెలిపారు. ఫలితాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఇఏపి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆమె పేర్కొన్నారు.

ప్రారంభమైన ఎస్‌ఎస్‌సి పరీక్షలు


రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మాస్‌ కాపీయింగ్‌ ఘటనలు జరగలేదని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ప్రణొతి సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. 2452 కేంద్రాలను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు సందర్శించాయని పేర్కొన్నారు. బయటి వ్యక్తులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఇబ్బందులు కలిగించిన ఘటనలు జరగలేదు. మాల్‌ ప్రాక్టీస్‌ కింద డిఇఓలు ఇద్దరిపై, డిఎల్‌ఓలు ఒకరిపై, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు 52 మందిపై మొత్తం 56 కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో ఒక పిఇటి, ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేశారు. పలు కారణాలతో ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఒక పిఇటిని సస్పెండ్‌ చేశారు. 43 మంది ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, నలుగురు శాఖాధికారులను బాధ్యతల నుంచి తప్పించారు.  అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దారావురం గ్రామానికి చెందిన కళావతి ఆమె కూతురు అలైఖ్యలు పరీక్షలు రాయటం విశేషం. కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన 10 మంది విద్యార్థులు పరీక్ష రాయటానికి ఆటోలో వెళుతూ గాయపడ్డారు. వారిలో వినయ్‌కుమార్‌ అనే విద్యార్థి చేయి విరగటంతో సహాయకుడితో పరీక్ష రాసేందుకు అధికారులు అంగీకరించారు. సిరిమల్లి మాధురి అనే 8 వ తరగతి విద్యార్థిని సహాయంతో పరీక్ష రాశారు.

నేటి నుంచి ఇంటర్‌ ఎగ్జామ్స్‌


తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే ఈ పరీక్షలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, ఇందులో ప్రథమ సంవత్సరం 4 లక్షల 90 వేలు, ద్వితీయ సంవత్సరం 7 లక్షల 80 వేల మంది ఉన్నారు.  పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,400 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ప్రతి కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్లు ఎ.కె.ఖాన్‌, ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ నెల 10న తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస మిలియన్‌ మార్చ్‌కు పిలుపునివ్వడంతో ఆ రోజున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.  పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి రవాణా ఇబ్బంది కలగకుండా కళాశాలల యాజమాన్యాలు, ఆర్టీసీ, సెట్విన్‌ ప్రత్యేక బస్సులను నడపాలని సంకల్పించింది. జిల్లాల్లో పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో రెవెన్యూ అధికారులను కూడా సభ్యులుగా చేర్చారు. పరీక్షలు ముగిసే వరకు రెవెన్యూ అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా పరీక్షలను మరింత పటిష్టంగా జరిపేందుకు సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో మెరుపు దళాలను కూడా నియమించింది. వీలైనంత త్వరగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తిచేసి ఫలితాలను ఇవ్వడానికి బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బలరామయ్య తెలిపారు. మిలియన్‌ మార్చ్‌ను నిర్వహించినా పరీక్షలను వాయిదా వేసేది లేదని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథి మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 10న ఇంటర్మీడియట్‌తో పాటు సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ పరీక్ష కూడా జరుగుతున్నదని, ఈ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు  పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంబంధిత అధికారులు ప్రకటించారు. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ రెండు బోర్డులకు సంబంధించి దాదాపు పదివేల మంది విద్యార్థులు హైదరాబాద్‌ నగరంలో ఈ నెల పదవ తేదీన పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.  విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలపై ఆధారపడకుండా స్వతహాగా పరీక్షా కేంద్రానికి తమ విద్యార్థులను చేరవేసేందుకు ముందస్తు ఏర్పాట్లను చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ ఎ.కె.ఖాన్‌ కోరారు. పరీక్ష జరిగే రోజుల్లో ఉదయం ఏడున్నర గంటలకే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్‌ బోర్డు కోరింది. ఉదయం 8 గంటలకే పరీక్ష ప్రారంభమవుతున్నందున మారుమూల, వెనకబడిన ప్రాంతాలలో ఉండే విద్యార్థులు త్వరితగతిన పరీక్ష కేంద్రానికి రావాలని, ఉదయమే బస్సు సౌకర్యం లేకపోతే పరీక్షా కేంద్రం కేటాయించిన ప్రాంతంలోనే రాత్రిపూట బస చేసి ఉదయం పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.  ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ప్రశ్నపత్రం కోడ్‌ను డ్రా ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపిక చేసిన కోడ్‌ను వెనువెంటనే ఎలక్ట్రానిక్‌ మీడియాలో, ఆకాశవాణి ప్రాంతీయ వార్తలతో పాటు ఫ్యాక్స్‌ల ద్వారా తెలియపరుస్తామని బలరామయ్య తెలిపారు. పరీక్షల నిర్వహణలో కీలక భూమిక పోషించే చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు ఎంపిక చేసిన ప్రశ్నపత్రం కోడ్‌ను మాత్రమే తీసుకోవాలని, మిగిలిన బండిళ్లను పోలీస్‌స్టేషన్‌లు, జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే ఉంచాలని సూచించారు. మాస్‌ కాపీయింగ్‌, ఇతర అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉన్న పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని, ఆయా పరీక్షా కేంద్రాలకు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు కూడా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులతో సహకరించాలని ఆయన కోరారు.

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ – మంత్రి పార్ధసారథి వెల్లడి


ఇంటర్మీడియట్‌ పరీక్షలు యథాతథంగానే జరుగుతాయని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ మంత్రి పార్ధసారథి వెల్లడించారు. కొద్ది రోజులుగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు శుక్రవారం సాయంత్రం తెరదించారు. అయితే 10న జరిగే రెండవ సంవత్సరం ఇంటర్‌ పరీక్షపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఈ పరీక్ష గురించి శనివారం ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ గైర్హాజరవగా తెరాస నుంచి రవీంద్రరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిరంజన్‌, సిపిఐ ఆంజనేయులు, సిపిఎం వైవి. రామకృష్ణ, జూలకంటి రంగారెడ్డిలు హాజరయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వివరించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలను సహకరించమని చేసిన విజ్ఞప్తికి ఆయా రాజకీయ పార్టీలు స్పందిం చాయన్నారు. దాదాపు 19లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాస్తున్న విషయాన్ని అఖిలపక్ష నేతలకు వివరించామని చెప్పారు.  ప్రాంతీయ విభేదాల వలన వారికి నష్టం జరుగుతుందని వివరించానని, సమావేశానికి హాజరైన నేతలు దీనిని అంగీకరించి పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే 10న జరిగే ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షను కచ్చితంగా ‘వాయిదా వేయాల్సిందేనని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ పట్టుబట్టినట్టు సమాచారం. ఆ రోజున మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. నిరంజన్‌ వాదనతో మిగిలిన పార్టీల నాయకులు కూడా ఏకీభవించడంతో 10వ తేదీ పరీక్షపై నిర్ణయాన్ని శనివారానికి వాయిదా వేసుకుందామన్న మంత్రి సూచనకు నేతలు అంగీకరించారు. మిలియన్‌ మార్చ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతున్నందున ఆరోజు పరీక్షను ఇక్కడ మాత్రమే వాయిదా వేయాలా లేక తెలంగాణ ప్రాంతంలోనా లేక రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా వేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సమావేశానికి హాజరుకాని ఇతర పార్టీల నాయకులతో సంప్రదించిన అనంతరం ప్రకటిస్తామని మంత్రి పార్ధసారథి చెప్పారు.

free website analytics