హైదరాబాద్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్!


ప్రతిరోజూ సమీక్షలు
- 2014కు రిహార్సల్స్!
- ఇంటి వద్దే కొత్త నేత సమీక్షలు!
- సహాయకులుగా ఆరుగురు నేతలు
- కలిసొచ్చిన బాబు పర్యటనలు
- బాలయ్యకు చెక్ పెట్టేందుకు ఎత్తుగడ?
హైదరాబాద్, మే 17 (టీ న్యూస్):తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు లోకేశ్‌ను ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకు వస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి తెర వెనుక భారీ మంత్రాంగం నడుస్తోంది. లోకేశ్‌కు పార్టీపై పట్టు వచ్చేవిధంగా చంద్రబాబు అంతర్గతంగా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ఇందుకు తాజా ఉప ఎన్నికలను అవకాశంగా తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా చంద్రబాబు పర్యటనల్లో ఉన్న రోజుల్లో పార్టీ కార్యక్షికమాలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. దీంతో ఇంటి నుంచే పార్టీ కార్యక్షికమాలను లోకేశ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దాదాపుగా వచ్చిన ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, నిత్యం సమీక్షలు నిర్వహించడానికి లోకేశ్‌కు ఆరుగురిని సహాయకులుగా నియమించారు.
ఎమ్మెల్సీ రాజేంవూదవూపసాద్, పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావు, పార్టీకార్యాలయంలో ఉండి కార్యక్షికమాలను పర్యవేక్షించే జయరాండ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఐటీ నిపుణుడు శ్రీనివాస్, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరి లోకేశ్‌కు సహాయకులుగా ఉంటారు. లోకేశ్‌తో ఇంటి వద్ద ప్రతిరోజూ సాయంత్రం పార్టీ కార్యకలాపాల నిర్వహణ తీరుపై వీరందరూ చర్చిస్తారు. అలాగే రోజువారీ మీటింగ్‌లపై చర్చిస్తారు. ఆనాటి తాజా రాజకీయ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తారు. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా లోకేశ్‌కు రాజకీయాలపై, పార్టీపై పట్టు వచ్చేవిధంగా చంద్రబాబు భారీ యాక్షన్‌ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. 2009 ఎన్నికలకు ముందుగానే లోకేశ్‌ను రాజకీయ తెరపై తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ఇందులో భాగంగానే లోకేశ్ సూచన మేరకు నగదు బదిలీ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారని అప్పట్లో చర్చలు జరిగాయి. అయితే తన కుమారుడు వ్యాపారాలకే పరిమితం అవుతారని ఆనాడు చంద్రబాబు వివరణ ఇచ్చారు.
అయినా రాజకీయాలపై లోకేశ్ ఆసక్తి కనపరుస్తుండడంతో తిన్నగా పార్టీ కార్యక్షికమాల పర్యవేక్షణ అప్పగించినట్లు తెలిసింది. దీనికి ప్రస్తుతం చంద్రబాబు ఉప ఎన్నికల పర్యటనలో బిజీగా ఉండటం కూడా కలిసి వచ్చింది. ఈ సాకుతో బాబు లోకేశ్‌ను పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యేలా చేశారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి సినీ హీరో బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోబాలకృష్ణ స్వయంగా బాబుకు వియ్యకుండైనప్పటికీ, హీరో అయిన బాలయ్య వెనకాల పార్టీ క్యాడర్ తరలే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు, బాలకృష్ణను సైడ్ చేయడానికి ఈ ప్లాన్ వేశారన్న ప్రచారం ఉంది. అల్లుడైన లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాలకృష్ణ అడ్డు చెప్పకపోవచ్చుననే భావనతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.
లోకేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసమే తిన్నగా హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. లోకేశ్‌ను దృష్టిలో పెట్టుకున్న బాబు.. కావాలనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా ఆడియో ఫంక్షన్‌కు కుటుంబ సభ్యులు హాజరుకాకుండా చేయగలిగారని, దీని తరువాత ఈ విభేదాలు ముదిరాయని అంటున్నారు. అయితే తాతయ్య ఏర్పాటు చేసిన పార్టీని వీడనని జూనియర్ ప్రకటించినప్పటికీ దగ్గరకు రానివ్వడం లేదని సమాచారం. కేవలం లోకేశ్‌ను పార్టీ నాయకుడిగా చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరవూపదేశ్ సీఎం అఖిలేశ్‌యాదవ్ ఆదర్శంగా లోకేశ్‌ను టీడీపీలో తెరపైకి తెస్తున్నారని టీడీపీ నేత ఒకరు అన్నారు.

కిరణ్‌కుమార్‌ భేష్‌


రాష్ట్రంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నారని, గతంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడ సక్రమంగా అమలు చేస్తున్నారని కేంద్రమంత్రి, రాష్ట్ర పరిశీలకులు వాయిలార్‌ రవి ప్రసంసించారు. గురువారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లిd పరిధిలోని ఎర్రగుంట్ల ప్రభుత్వ కళాశాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టారని, వాటి ద్వారా మంచిపాలన సాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరిన్నీ మెరుగైన పథకాలను అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ ఇక్కడి నాయకులపై కూడ ఆధారపడి ఉందన్నారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలోని యుపీఏ ప్రభుత్వంలో కూడ ప్రజలు సంతోషంగా ఉండాలంటే అభివృద్దికి గుర్తుగా కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలకు కారణం కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడమేనన్నారు. అసలు రాజీనామాలు ఎందుకు చేశారో ఆ పార్టీ అభ్యర్థులను ప్రశ్నించాలని కేంద్రమంత్రి పదేపదే కార్యకర్తలకు సూచించారు.

అటాచ్‌మెంట్‌ మెమో


జగన్‌ అక్రమాస్తుల దిగ్బంధనానికి సిబిఐ రంగం సిద్దం చేసింది. జగన్‌కు చెందిన జగతీ పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ ఆస్తుల క్రయవిక్రయాల నిలిపివేతకు ప్రభుత్వం అనుమతించింది. జగన్‌తో పాటు ఎమ్మార్‌ -ఎంజిఎఫ్‌ కేసులో నిందితులైన సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కి కూడా ప్రభుత్వ అనుమతి లభించింది..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి చెందిన మీడియా ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అంగీకరిస్తూ సిబిఐకి ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి గురువారం సిబిఐకి మెమో పంపించారు. న్యాయనిపుణల సలహా అనంతరం ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ మెమోను ఢిల్లీలోని డైరెక్టరేట్‌కు సిబిఐ పంపించింది. అటాచ్‌మెంట్‌ ప్రక్రియ పరిశీలించడానికి ఆథరైజ్డు అధికారిని నియమించారు. స్వాధీనం చేసుకోవల్సిన ఆస్తుల జాబితా తయారీలో అధికారులు ఇప్పటికే తలమునకలై ఉన్నారు. జగతీ పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ ప్రతినిధుల చిరునామా పరిధిలోని కోర్టులో అటాచ్‌మెంట్‌ కోరుతూ ఆథరైజ్డు అధికారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. అస్తుల స్వాధీనం అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ ఒకట్రెండు రోజుల్లో దాఖలు చేసి, అనంతరం ఆస్తుల జపునకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల తర్వాత జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోర్టు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు జారీచేస్తే జగన్‌ మీడియా సంస్ధల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆస్తుల కొనుగోళ్ళు ఇతర లావాదేవీలు జరగకుండా యథాస్థితిని కొనసాగించాల్సివుంది. ఇదిలావుండగా జగన్‌ మీడియా క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్‌ చేయవద్దంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు సిబిఐ అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు అధిపతి అయిన జగన్‌ వ్యవహారంలో సిబిఐ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసింది. దశలవారీ వ్యూహంలో భాగంగా జగతీ పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ సంస్థల అకౌంట్స్‌ను సిబిఐ స్తంభింపజేసింది. జూబ్లీహిల్స్‌లోని ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఈ మూడు సంస్ధలకు సంబంధించి కొనసాగుతున్న కరెంట్‌ అకౌంట్స్‌ను నిలిపివేయవల్సిందిగా బ్యాంక్‌లను సిబిఐ ఇదివరకే అదేశించింది. అలాగే ఆ సమయంలో నగదు నిల్వల వివరాలు కూడా తెలపాలని పేర్కొంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లబ్ధిపొందిన కొందరు పారిశ్రామికవేత్తలు జగన్‌ సంస్ధలలో పెట్టుబడులు పెట్టారు. జగన్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జగతీ పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ మీడియా సామ్రజ్యంలోకి వేరువేరు మార్గాల ద్వారా 1172 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చినట్లు సిబిఐ గుర్తించింది. ఈ నేపధ్యంలో అక్రమ సొమ్ముతో జగన్‌ ఏర్పాటు చేసిన ఈ మూడు సంస్ధలను స్వాధీనం చేసుకునేందుకు 1944 చట్టాన్ని ప్రయోగించనుంది. చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా సంపాదించిన అస్తులను జప్తు చేసేందుకు క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌ 1944 అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం అక్రమంగా సంపాందించి కూడబెట్టిన ఆస్థులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదిలావుండగా ఎమ్మార్‌ కేసులో నిందితులైన సునీల్‌రెడ్డి, కోనేరు ప్రసాద్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిబిఐకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమ్మార్‌ -ఎంజిఎఫ్‌లోని విల్లాలు, ప్లాట్లు అమ్మకం ద్వారా కోనేరు ప్రసాద్‌ వసూలు చేసిన సొమ్ము సునీల్‌రెడ్డికి అందిన విషయం సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ఆస్తులు కూడా అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వానికి సిబిఐ లేఖ రాయడంతో అనుమతి లభించింది.

అఖిలపక్ష నేతలతో ఈసీ భేటీ


వచ్చే నెల 18 శాసనసభ, ఒక పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో గురువారం భేటీ అయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి 8 పార్టీల ప్రతినిధులు హాజరుకావాల్సి ఉండగా, కేవలం ఐదు పార్టీలకు చెందిన ప్రతినిధులే హాజరయ్యారు.అక్రమ మద్యాన్ని పారించకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల సభ్యులు ఈసీని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌ రావు, ఉమా మల్లేశ్వరరావు, తెదేపా నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, సీపీఎం తరపున పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ కార్యాలయ ఇంచార్జి జయరాం, తెరాస పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు డి. శ్రావణ్‌కుమార్‌, బీజేపీ నుంచి పార్టీ ఎన్నికల కన్వీనర్‌ డి ప్రదీప్‌కుమార్‌ హాజరయ్యారు.
సిీపీఐ, బీఎస్పీ, ఎంఐఎం తరపున ఎవరు కూడా హాజరుకాలేదు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు కమిషన్‌ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ ఎన్నికలు రోల్‌ మోడల్‌గా చరిత్రలో ఉండాలని అందుకు గానూ పార్టీల పరంగా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. నోటిఫికేషన్‌కు ముందే అక్రమంగా తరలిస్తున్న రూ. 14.5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా రూ. లక్షల విలువైన మద్యాన్ని కూడా స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు.  ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు 139 ప్లాటూన్ల కేంద్ర బలగాలను రప్పిస్తున్నామని తెలియజేశారు.

మోపిదేవి అరెస్టుకు రంగం సిద్ధం


21 తర్వాత ఏ క్షణాన్నైనా కటకటాల్లోకి
మంత్రి మోపిదేవికి కష్టాలు వచ్చి పడ్డాయి. జగన్‌ ఆస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఓ దఫా విచారించిన సిబిఐ అధికారులు తిరిగి ఈనెల 21న మరోసారి విచారణకు రావాలని కబురు పంపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెట్టుబడులు, మౌలిక సదుపా యాల మంత్రిత్వ శాఖను నిర్వహించిన మోపిదేవి ఆ సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌ సంస్థకు వేలంవెర్రిగా భూములను ధారాదత్తం చేసిన విషయం తెలిసిందే.
భూ సంతర్పణకు సంబంధించిన ఫైలుపై మంత్రి మోపిదేవి సంతకాలు చేశారని సిబిఐ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. ఈ విషయంలో మంత్రి మోపిదేవి ప్రమేయంపై ఇప్పటికే ఆరా తీసింది. మరోమారు విచారించి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2జీ స్పెక్ట్రం అవినీతిలో కేంద్రమంత్రి రాజాను అరెస్టు చేసిన తరహాలోనే మోపిదేవిని కూడా విచారణకు పిలిచి ఆయన వాంగ్మూలాలను సేకరించి అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిబిఐ అధికారులు కూడా ఈ విషయాన్ని ఏమాత్రం కొట్టిపారేయడం లేదు. మంత్రి మోపిదేవిని అరెస్టు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని సిబిఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకటించడం అనుమానాలకు దారితీస్తోంది.
ఒకవేళ వాన్‌పిక్‌ భూముల కేసులో మోపిదేవిని సిబిఐ అరెస్టు చేస్తే జగన్‌ ఆస్తుల కేసులో అరెస్టయిన తొలి మంత్రి మోపిదేవి అవుతారని అంటున్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇప్పటికే పీకలదాకా ఆరోపణలతో కూరుకుపోయిన మోపిదేవి జగన్‌ ఆస్తుల కేసులో కూడా తీవ్ర ఎదురు దాడులను ఎదుర్కొంటున్నారు. తన కుమారుడికి డిస్టిలరీ కంపెనీలో భాగస్వామ్యం కల్పించడంలో మోపిదేవి పాత్రను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఈ పార్టీ బయటపెట్టింది. వెంటనే మేల్కొన్న మంత్రి ఈ వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జగన్‌ ఆస్తుల కేసులో తాను బయటపడతానని కొంత ఆనందంతో ఉన్న మంత్రికి సిబిఐ తాజా కబురు ఇక్కట్ల పాలుచేసింది. ఈ నెల 21వ తేదీన ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ సంస్థకు 28వేల ఎకరాల భూమిని సేకరించి అందులో 15వేల ఎకరాలను ఈ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలీవిజన్‌, జనని ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టినందుకు బహుమతిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ఈ భూములను కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను వాన్‌పిక్‌ సంస్థకు ధారాదత్తం చేయడంలో మంత్రి మోపిదేవి పాత్ర కూడా ఎంతో ఉందని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. మోపిదేవితో పాటు అప్పటి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలో అధికారులుగా పనిచేసిన వారిని కూడా సిబిఐ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాన్‌పిక్‌ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు అప్పట్లో మౌలిక సదుపాయాల కల్పన శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన బ్రహ్మానందరెడ్డిని సిబిఐ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పది రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ అధికారులు ఈ నెల 21న మోపిదేవిని ఈ నిందితులిద్దరి ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ రోజున వీరిరువురు ఇచ్చే వాంగ్మూలాలు, మంత్రి మోపిదేవి ఇచ్చే సమాధానాలను బట్టి మంత్రిని అరెస్టు చేయాలా? వద్దా అనే విషయాన్ని సిబిఐ నిర్ణయించుకునే అవకాశం ఉంది.
వాన్‌పిక్‌ వ్యవహారంలో మోపిదేవి పాత్ర ఎంతో ఉందని ఇప్పటికే సిబిఐ గుర్తించినందున ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మంత్రిని అరెస్టు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. మంత్రిని అరెస్టు చేసేందుకు సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణను ఢిల్లిdలోని తన శాఖకు చెందిన ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవలసి ఉంటుందా? లేదా అన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మోపిదేవి వ్యవహారాన్ని లక్ష్మీనారాయణ ఇప్పటికే ఢిల్లిdలోని తమ శాఖ పెద్దలకు వివరించారని మంత్రి అరెస్టుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది.
ఇదిలా ఉంటే జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలీవిజన్‌, జనని ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టిన జగన్‌ సమీప బంధువు, పెన్నా సిమెంట్స్‌ అధినేత ప్రతాప్‌రెడ్డిని కూడా రెండు, మూడు రోజుల్లో సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టు చేసిన రోజునే ప్రతాప్‌రెడ్డిని విచారణకు పిలవాలని సిబిఐ భావించింది.
అయితే రిమాండ్‌ రిపోర్టు తయారీలో బిజీగా ఉన్న అధికారులు ఆయనను ఆ రోజున విచారించలేకపోయారు. ప్రతాప్‌రెడ్డికి సిబిఐ ఎస్పీకి ఒకరు ఫోన్‌ చేసి విచారణకు సిద్ధం కావాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆ అధికారి ప్రతాప్‌రెడ్డికి సూచించినట్టు సమాచారం.

తెలుగు వాడి శక్తిని చాటుదాం


రెండు పార్టీలకు పుట్టగతులు లేకుండా చేద్దాం
అధికారంలోకి వస్తే లక్ష
రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం
ఆత్మకూరు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
ఉప ఎన్నికల్లో ప్రతీ తెలుగువాడి శక్తిని చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్‌కు, దోపిడీ దొంగలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని అన్నారు. ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు మలివిడత ప్రచారాన్ని బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గంలో ప్రారంభించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన బాబు తొలిరోజు ప్రసంగాల్లో కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్రస్థాయిలో నిప్పుులు చెరిగారు. కరటంపాడు కల్యాణ మంటపంలో ఆత్మకూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే గెలుపుపై పూర్తి ధీమా ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ దొంగలపార్టీ అయితే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గజదొంగల పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నాయకులని, నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికల యుద్ధానికి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకే తాను వచ్చానన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించిన జగన్మోహన్‌ రెడ్డి అవినీతిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకునివెళ్లాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ తక్కువైనప్పటికీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తించానన్నారు. ఇప్పటికీ గ్రామాలకు వెళితే సిమెంట్‌ రోడ్లు, మంచినీటి పథకాలు, ఆర్టీసీ బస్‌స్టాండులు, పాఠశాలల భవనాలు టీడీపీ ప్రభుత్వ కాలంలో నిర్మించినవేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోగా ప్రజలకు చిన్నపాటి తాయిలాలు చూపించి కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కుబేరులయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని, అయితే ఆ ఆదాయాన్ని అభివృద్ధికి ఖర్చుపెట్టకుండా కాంగ్రెస్‌ పాలకులు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు.
రైతుకు గిట్టుబాటు ధర లేక, పండించిన ఉత్పత్తులను అమ్ముకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే రైతుకోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించి, రైతాంగ సమస్యలపై దృష్టిసారిస్తానన్నారు. వారంరోజులకోసారి పెట్రోల్‌, డీజెల్‌ ధరలను పెంచటమేగాక, ప్రజలకు అవసరమైన అన్నీ వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. సిగ్గుమాలిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, అవినీతి జగన్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. సెజ్‌ల పేరుతో రైతుల కడుపుకొట్టి, రైతులకు మాత్రం ఎకరాకు లక్ష రూపాయలు ఇచ్చి, కాంగ్రెస్‌ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ ఉపయోగపడేలా నూతన ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి, అమలు చేస్తానన్నారు. ఒక్కో పక్కాగృహాన్ని లక్ష రూపాయలతో నిర్మిస్తానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం పార్టీ కార్యకర్తలతే పక్కాగృహాలు మంజూరు చేసిందని, ఒక్కో కార్యకర్త పది గృహాలు మంజూరు చేయించుకుని, భవనాలు నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్‌ బిల్లులు ఇబ్బడిముబ్బడిగా పెంచివేశారని, కావున ప్రజలు విద్యుత్‌ బిల్లులను చెల్లించవద్దని, అడిగిన అధికారులను కట్టిపడివేయండని, ఆ విషయంలో తాను అండగా నిలబెడతానన్నారు. గతంలో దీపం పథకం ద్వారా మహిళలకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేశామని, 9సంవత్సరాల పాటు ఒక్కపైసా కూడా సిలిండర్‌పై పెంచలేదన్నారు. తెల్లకార్డు లబ్దిదారులతో మద్యం షాపుల లైసెన్సులు పొంది, మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉన్న మద్యం షాపులు మరే నాయకునికి లేవని, ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ప్రారంభించి, బొత్స సత్యనారాయణ గుండెల్లో నిద్రపోతానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆయన అన్నారు. జూన్‌ 12వ తేదీ జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బొల్లినేని రామారావులు మంచి మెజార్టీతో విజయాన్ని అందించాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇక్కడెందుకున్నారు..ప్రచారానికి పొండి!


ఢిల్లీలో కనిపించకండి – ఎంపీలకు సోనియా క్లాస్‌
బిత్తరపోయిన నేతలు
మారుమాటాడకుండా వెనక్కి
శీలంకూ పటేల్‌ చురక
మేడమ్‌తో ఆజాద్‌ భేటీ
‘ఉప’స్థితిపై వివరణ
కిరణ్‌ ‘గొంతు’కు కితాబు
‘ఆరే’స్తారని నివేదన
రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీరేం చెప్పనక్కరలేదు… మొత్తం నాకు తెలుసు… అసలు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు ఉన్నారు? రాష్ట్రానికి వెళ్లండి… ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి… విస్తృతంగా ప్రచారం చేసి అభ్యర్థులను గెలిపించుకుని తీసుకురండి… రాష్ట్ర ఎంపీలతో సోనియాగాంధీ తీవ్ర స్వరంతో అన్నమాటలివి. బిక్కచచ్చిపోయి, నీళ్లు నములుతూ చిరంజీవి, విహెచ్‌, రాయపాటిలు వెనుదిరిగారు. అలాగే, సెంట్రల్‌ హాల్లో అహ్మద్‌ పటేల్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలంకు కూడా దాదాపు ఇదే తరహా క్లాస్‌ ఎదురైంది…
కాంగ్రెస్‌ పార్టీకి అగ్నిపరీక్షగా మారిన శాసనసభ ఉపఎన్నికలలో ఎలాగైనా పరువు నిలబెట్టుకొనే ప్రయత్నం చేయాలని భావిస్తున్న అధిష్టానం రాష్ట్రానికి చెందిన పార్టీ పార్లమెంట్‌ సభ్యులెవరూ ఢిల్లీలో కనిపించరాదని హుకుం జారీచేసింది.
బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున తప్పనిసరిగా సభకు హాజరుకావాలని పార్టీ పార్లమెంటరీ విభాగం ఒకవైపు విప్‌ జారీచేసినా ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారంటూ సాక్షాత్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిలదీస్తుండడంతో ఎంపీలలో అత్యధికులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ బాటపట్టారు.
బుధవారంనాడు పార్లమెంట్‌ ప్రాంగణంలోని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకొన్న సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వి.హనుమంతరావు, లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావులు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసినప్పుడు ‘అసలు మీరు ఇక్కడెందుకున్నారంటూ’ ఆమె ఎదురు ప్రశ్నించడంతో నీళ్లునమలాల్సి వచ్చిందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. ‘రాష్ట్రంలోని పరిస్థితులన్నీ నాకు తెలుసు, మీరు వెంటనే రాష్ట్రానికి వెళ్లి ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేయండి’ అంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించడంతో వారు మారుమాట లేకుండా అప్పటికప్పుడు విమానాశ్రయానికి బయలుదేరాల్సి వచ్చింది.
అలాగే, రాజ్యసభ సభ్యుడు జె.డి.శీలంకు కూడా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ నుండి ఇలాంటి ప్రశ్నలే ఎదురు కావడంతో పార్లమెంట్‌ అరవయ్యవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడు పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల గ్రూప్‌ ఫొటో కోసమే తాను ఈరోజు ఢిల్లీ రావాల్సి వచ్చిందని, గురువారం ఉదయమే తాను తిరిగి రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పుకొని బయటపడ్డారు. నిన్నటి వరకూ గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉపఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్నానని ఆయన వివరించడంతో సరే, వెంటనే రాష్ట్రానికి తిరిగివెళ్లమని ఆయన సలహా ఇచ్చారు.
గతవారంలో నరసన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం శాసనసభ నియోజక వర్గాలలో ‘ఇందిరా విజయరథం’తో ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన వి.హనుమంతరావు రామచంద్రాపురం నియోజకవర్గంలో తన రోడ్‌షోలకు సంబంధించిన ఛాయాచిత్రాలను అధ్యక్షురాలు సోనియా గాంధీకి చూపించి తాను ఎన్నికల ప్రచారంలోనే ఉన్నానని, మిగిలిన నియోజకవర్గాలలో కూడా ప్రచారాన్ని నిర్వహించేందుకు తిరిగి వెళ్తున్నానని వివరించినట్లు తెలియవచ్చింది. రాజ్యసభ సభ్యుడైన మరో ముఖ్యనేత చిరంజీవి తన రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.
ఇటీవల చెన్నైలోని తన వియ్యంకుని నివాసంలో ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో చిరంజీవి నాలుగైదు నిముషాలు మాత్రమే అయినా సోనియా గాంధీతో సమావేశం కావడంతో ఆదాయపు పన్ను శాఖ సోదాలపై తన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా అధ్యక్షురాలి దృష్టికి తెచ్చి ఉంటారనే అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నది.
రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ కూడా బుధవారంనాడు సోనియా గాంధీని కలుసుకొని రాష్ట్రంలోని ఉపఎన్నికల గురించి వివరంగా చర్చించినట్లు తెలియవచ్చింది. పార్లమెంట్‌ ప్రాంగణంలోని అధ్యక్షురాలిని కలుసుకొన్న ఆయన ప్రధానంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, జగన్‌ దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఈమద్య కాలంలో గళం పెంచుతున్న అంశాన్ని వివరించినట్లు తెలియవచ్చింది. ఉపఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతున్నదని, అన్నీ సక్రమంగా, అనుకొన్నట్లుగా జరిగితే అయిదారు నియోజకవర్గాలలో జగన్‌ పార్టీ అభ్యర్థులను ఓడించడం సాధ్యమేనని ఆయన అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ఎఐసిసి ప్రత్యేక పరిశీలకునిగా నియమితులైన మరో కేంద్ర మంత్రి వాయలార్‌ రవి కూడా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. గురువారంనాడు రాష్ట్ర రాజధానిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించనున్న ఆయన శుక్రవారంనాడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తారని, ఆ మరునాడు గుంటూరు జిల్లాలో ఉపఎన్నికలు జరుగుతున్న పత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలను సందర్శిస్తారని తెలియవచ్చింది.  పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత గులాంనబీ ఆజాద్‌ కూడా రాష్ట్రానికి వెళ్తారని, మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకు కూడా రాష్ట్రంలో ఉపఎన్నికల బాధ్యతలను అప్పగించే ఆలోచన ఉందని ఎఐసిసి అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

పరకాల బరిలో భిక్షపతి


ప్రత్యర్థులను చిత్తు చేస్తాం : భిక్షపతి
ఉప ఎన్నికల జరుగుతున్న పరకాల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మొలుగూరి భిక్షపతి ఖరారయ్యారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహాడ్డి వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజామోదం, పార్టీ శ్రేణుల ఏకాభివూపాయంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల టికెట్‌ను ఆశించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పరకాలలో టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులంతా భిక్షపతి అభ్యర్థిత్వాన్ని ఏకక్షిగీవంగా ఆమోదించారని చెప్పారు. ఏడెనిమిది మంది టికెట్లను ఆశించారని, పార్టీకి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారన్నారు. అన్ని రకాలుగా అర్హతలున్నా గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన భిక్షపతి అభ్యర్థిత్వం పట్ల మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారని వివరించారు.
పరకాల నియోజకవర్గంలోని ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించామని, ఆ నియోజకవర్గంలో ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకుల అభివూపాయాలను తెలుసుకున్నాకే భిక్షపతి పేరును ఖరారు చేశామన్నారు. పరకాల సర్పంచ్‌గా రెండు సార్లు, జెడ్పీటీసీ సభ్యుడిగా, వరంగల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, పరకాల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా అనుభవం గడించడమే కాకుండా గత ఎన్నికల్లో కేవలం 12వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారని చెప్పారు. తగిన సమయం లేకపోవడం, టీడీపీ అనుసరించిన వైఖరి వల్ల గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందన్నారు. మానుకోట స్పందన పరకాలలో పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో టికెట్‌ను ఎవరైనా ఆశించవచ్చని, అందులో తప్పేమీ లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీజేఏసీ నిర్ణయంపై ఆయన స్పందిస్తూ మంచి నిర్ణయమేనని, జేఏసీ తమదేనని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, డాక్టర్ జీ విజయరామారావు, సయ్యద్ ఇబ్రహీం, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కే విద్యాసాగర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజయ్య యాదవ్, సహోదర్‌డ్డి, మంద ఐలయ్య, కిషన్‌రావు, వెంక దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పరకాల అతి కీలకం, భారీ మెజారిటీ ఖాయం : ఈటెల రాజేందర్
పరకాల ఎన్నిక అతికీలకమైందని, తమ అభ్యర్థి భిక్షపతి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా ఈ ఎన్నిక నిలుస్తుందన్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టికెట్‌ను ఆశించిన ముఖ్య నాయకులంతా మనస్ఫూర్తిగా భిక్షపతికి సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. ఉద్యమాల ఖిల్లా అయిన వరంగల్ జిల్లా ప్రజలు, నాయకులు పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అందరి సహకారంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తాం : భిక్షపతి
పరకాల నియోజకవర్గ ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, లాయర్లు, వైద్యులు, పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్కరి సహకారంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తామని పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి చెప్పారు. పరకాల అభ్యర్థిగా తనను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉండి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేవరకు విశ్రమించేది లేదన్నారు. తనకు సమీప ప్రత్యర్థి ఎవరూ లేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గత పన్నెండేళ్లుగా తమ అధినేత కేసీఆర్ అలుపెరుగకుండా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్నారు. కనీసం 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పరకాలలో విజయఢంకా మోగిస్తామన్నారు.
భిక్షపతికి బీ ఫాం అందజేసిన కేసీఆర్
పరకాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ఖరారైన మొలుగూరి భిక్షపతికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం తన నివాసంలో బీ ఫాంను అందజేశారు. భిక్షపతిని కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టికెట్ కోసం ముఖ్య నాయకులు పోటీపడినప్పటికీ ప్రజామోదానికి అనుగుణంగా అందరూ ఏకక్షిగీవంగా మద్దతు తెలపడం పట్ల కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోటీదారులను కూడా అభినందించారు. పరకాల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, ఐక్యంగా ముందుకు సాగి భారీ మెజారిటీ సాధించాలని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఆయన సూచించారు.
ఉద్యమం వల్లే బీజేపీ బలపడుతోంది: విజయశాంతి
తెలంగాణ ఉద్యమం వల్లే బీజేపీ బలపడుతున్నదని, సొంతంగా ఆ పార్టీకి ఎక్కడా బలం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతున్నందు వల్ల జేఏసీతో కలిసి బీజేపీ బలాన్ని పెంచుకుంటోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం సెక్యులర్ శక్తులే ముందుంటాయన్నారు. ఈ వాస్తవాన్ని సీపీఎం కార్యదర్శి రాఘవులు గుర్తించాలని ఆమె సూచించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు.

చంచల్‌గూడకు నిమ్మగడ్డ – బ్రహ్మానందరెడ్డి


30 వరకు రిమాండ్‌
సిబిఐ కస్టడీపై నేడు నిర్ణయం
జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్‌ మ్యాట్రిక్‌ ప్రసాద్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిలకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 30 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వీరిద్దర్ని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం గురువారానికి వాయిదా వేయడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం న్యాయస్థానానికి తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం నిమ్మగడ్డ ప్రసాద్‌ను నిమ్స్‌కు, బ్రహ్మానందరెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి సిబిఐ అధికారులు తీసుకెళ్లారు. నిమ్మగడ్డకు కార్డియాలజీ విభాగంలో పరీక్షలు పూర్తయిన తర్వాత దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అక్కడి నుంచి నిందితులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ‘అరెస్టు చేసిన తర్వాత మీ పట్ల సిబిఐ ఏ విధంగా వ్యవహరించింది’ అని ప్రత్యేక న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. సిబిఐ అధికారులు సరిగానే వ్యవహరించారని నిమ్మగడ్డ ప్రసాద్‌ తరపు న్యాయవాది చెప్పారు. సిబిఐ జారీ చేసిన 41 నోటీసులను తమ క్లయింట్‌ అందుకున్నారని, 13 సార్లు సిబిఐ అధికారులు విచారించారని, వారడిగిన ప్రశ్నలకు తన క్లయింట్‌ సరైన సమాధానాలు ఇచ్చారని, ఇంకా చెప్పాల్సింది ఏమీలేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ అధికారులు పిటిషన్‌ దాఖలు చేయగా, కస్టడీకి అప్పగించే ముందు తమ వాదనలు వినాలని నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కొద్దిసేపు సిబిఐ తరపు న్యాయవాదికి- నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిల తరపు న్యాయవాదులకు మధ్య వాద ప్రతివాదాలు జరిగాయి. అనంతరం సిబిఐ కస్టడీ పిటిషన్‌పై న్యాయమూర్తి తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు. నిందితులకు ఈనెల 30 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిగా ఆయన తనయుడు జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్‌ సంస్థల్లో రూ.884 కోట్లు ఆయన పెట్టుబడులుగా పెట్టారని సిబిఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. వాన్‌పిక్‌ ఒప్పందానికి ముందే జగన్‌ సంస్థల్లో నిమ్మగడ్డ రూ.505 కోట్ల పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది.
జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డిని 73వ నిందితుడిగా చేర్చినట్లు సిబిఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఐపిసి 120బి (రెడ్‌విత్‌ 420), 409, 420, 477 ఏ సెక్షన్ల కింద బ్రహ్మానందరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రస్‌ అల్‌ఖైమాతో వాన్‌పిక్‌ ఒప్పందంపై బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌ సంతకాలు చేశారని, మంత్రి మండలి నిర్ణయాలకు విరుద్ధంగా అనేక లొసుగులతో ఒప్పందం జరిగిందని సిబిఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. వాన్‌పిక్‌కు భూములు సేకరించి అప్పగించాలని బ్రహ్మానందరెడ్డి గుంటూరు, ప్రకాశం కలెక్టర్లకు పలుమార్లు లేఖలు రాశారని, ఆయన లేఖల వల్ల ఆ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు 13 వేల ఎకరాలు వాన్‌పిక్‌కు ధారాదత్తమయ్యాయని సిబిఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. బయటవుంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టు చేశామని సిబిఐ అధికారులు తెలిపారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ ఛార్జిషీట్‌లో 12వ నిందితుడిగా చేర్చింది. ఇక వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడంతో పాటు భూ సేకరణ తదితర వ్యవహారాల్లో అండగా నిలిచిన అఖిల భారత సర్వీసు అధికారి బ్రహ్మానందరెడ్డిని కూడా ఈ క్రమంలో సిబిఐ అరెస్టు చేసింది. నిందితులిద్దర్నీ చంచల్‌గూడ జైలు అధికారులు అడ్మిషన్‌ బ్యారెక్‌లో ఉంచారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు 5852, బ్రహ్మానందరెడ్డికి 5853 రిమాండ్‌ ఖైదీ నెంబర్లు కేటాయించారు.
మరోసారి మంత్రి మోపిదేవి ఇంటరాగేషన్‌?
వాన్‌పిక్‌ వ్యవహారంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ మరోసారి విచారించనున్నట్లు సమాచారం. నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి విచారణలో వెల్లడించిన అంశాలపై మోపిదేవిని ప్రశ్నించాలని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిబిఐ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని మోపిదేవి వెంకటరమణ గుంటూరులో మీడియా ప్రతినిధులకు చెప్పారు. సిబిఐ అధికారులు విచారణ కోసం ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని, ఎలాంటి సమాధానమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు.

మూడు నెలల్లో చట్టం


సబ్‌ ప్లాన్‌పై రాజ నర్సింహ – సమావేశం తీరుపై అభ్యంతరం
మూడు నెలల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు కోసం చట్టాన్ని తీసుకొ స్తామని డిప్యూటీ సిఎం దామోదర రాజ నర్సింహ స్పష్టం చేశారు. తమ కమిటీ ఇచ్చే నివేదిక పవిత్రగ్రంథంలా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించింది. జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహతో పాటు సభ్యులైన మంత్రులు గీతారెడ్డి, కొండ్రు మురళీమోహన్‌, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్‌, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌ పీటర్‌ హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో పాటు దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుండి కమిటీ సూచనలు, సలహాలను స్వీకరించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు అవకాశమిచ్చి ఇతరుల్ని విస్మరించారు. దీంతో గిరిజన సంఘం, కెవిపిఎస్‌, ఇతర సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం జోక్యం చేసుకుని ప్రతి సంఘానికీ అవకాశం కల్పించారు. అనంతరం రాజనర్సింహ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ అమలు కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 23 జిల్లాల్లో పర్యటించి దళిత, గిరిజన సంఘాల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.
చట్టం రూపొందిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, ప్రతిపక్ష పార్టీల భాగస్వామ్యంతో ప్రతి రెండు మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరును సమీక్షించేలా చట్టాన్ని రూపొందిస్తామన్నారు. కార్యక్రమం లో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు చెరుపల్లి సీతారాములు, చుక్కా రామయ్య, దిలీప్‌ కుమార్‌, భారతీ రాగ్యానాయక్‌, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి, చందర్‌రావు, బాలునాయక్‌, యాదగిరిరావు, లింగయ్య, కలెక్టర్‌ ముక్తేశ్వర్‌రావు పాల్గొన్నారు.

free website analytics