పాకిస్తాన్‌లో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 152 మంది మృతి చెందారు. పాకిస్తాన్‌లోని ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీలో బుధవారం ఉదయం 7.45 గంటలకు బయల్దేరింది. ఇస్లామాబాద్‌కు రెండు గంటల ప్రయాణం. ఇస్లామాబాద్ శివారు పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 100కు పైగా మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. భారీ వర్షం, పొగమంచుతో మార్గం కన్పించక దామనేఖో ప్రాంతంలో వున్న మార్గల్లా పర్వతాన్ని విమానం ఢకొీన్నదని పోలీసులు, సహాయ కార్యకర్తలు చెప్పారు. సగం కాలిన మృతదేహాలు పర్వత సానువుల్లో చెల్లాచెదురుగా పడివున్నాయని, భారీ వర్షం, మంచు కారణంగా విమాన శిధిలాలు, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. ప్రమాదానికి ముందు నగరంలో అతి తక్కువ ఎత్తులో ఎగిరిన విమానాన్ని తాము చూసినట్లు స్థానికులు మీడియాకు వివరించారు. గాయాలతో బయటపడిన వారి కోసం తాము వెతకగా ఎవరూ కనిపించలేదని వారు పేర్కొన్నారు. మృతులకు సంతాప సూచకంగా పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ పాకీస్తానీయులేనని అధికారులు తెలియచేశారు. ప్రమాదానికి కారణం ఇంత వరకూ తెలియలేదు. కొంతమంది ప్రతికూల వాతావరణమే కారణమంటున్నారు. ప్రమాదాన్ని చూసిన కొంతమంది స్థానికులు విమానం బ్యాలన్స్ తప్పి కిందకి పడిపోయినట్లు కనపడిందని తెలిపారు. విమానం దిగవల్సిన సమయానికి కంట్రోల్ టవర్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సైంధియా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 67 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది దాకా గాయపడ్డారు. బీర్భమ్ జిల్లా సైంధియా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా వచ్చిన ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘మానవ తప్పిదం’ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయ పడుతున్నాయి. స్టేషన్ సమీపించినప్పటికీ ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ వేగం తగ్గించలేదని, అదే వేగంతో నాలుగో ప్లాట్‌ఫామ్‌నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వెనకవైపునుంచి వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్టేషన్ సమీపంలోని కీలకమైన సిగ్నల్‌ను ఉత్తర బంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. రైలును ఆపాలంటూ తాము అరిచినప్పటికీ లాభం లేకపోయిందని, డ్రైవర్ చాలా వేగంగా వస్తుండడంతో హ్యాండ్ బ్రేక్ వేయడానికి కూడా సమయం లేకపోయిందని వారు చెప్పారు. మృతి చెందిన వారిలో రెండు రైళ్ల డ్రైవర్లు, వనాంచల్ ఎక్స్‌ప్రెస్ గార్డు కూడా ఉన్నారు.
ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఎంత తీవ్రంగా ఢీకొట్టిందంటే రెండు అన్ రిజర్వ్‌డ్ బోగీలతో ససా వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు తునాతునకలై పోగా, ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పైకెగిరి పాదచారులకోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిపైన పడ్డాయి. ఒక బోగీలో కొంతభాగమైతే విడిపోయి బ్రిడ్జిని ఢీకొట్టిన తర్వాత రైలు పట్టాలకు పక్కనే ఉన్న రోడ్డుపై పడిపోయింది. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు సైన్యాన్ని, బిఎస్‌ఎఫ్ జవాన్లను రంగంలోకి దింపినట్లు చెప్పిన రైల్వే అడిషనల్ డిజిపిడిటిపి మిత్రా చెప్తూ, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అన్నారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బోగీల్లో చిక్కుకుపోయిన 32 మృత దేహాలను వెలికి తీసారు. దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు ముందుగా ప్రయాణికులను కాపాడడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు రైళ్లలోని చాలామంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. సురి జిల్లా ఆస్పత్రి, సైంధియా ఆస్పత్రుల్లో చేర్చిన క్షతగాత్రుల్లో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బుర్ద్వాన్ మెడికల్ కాలేజి ఆస్పత్రినుంచి 150 బాటిళ్ల రక్తాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మమత
కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసారు. ‘మా మనస్సుల్లో కొన్ని అనుమానాలున్నాయి. సమాచారం కోసం అనే్వషిస్తున్నాం, ముందు ప్రమాదం వివరాలు తెలియనివ్వండి’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు నెలల్లో రెండు ఘోరప్రమాదాలు జరగడం తమకు ఎంతో బాధకలిగిస్తోందని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు తలా 5 లక్షలు, గాయపడిన వారికి 25 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆమె ప్రకటించారు. మమత వెంట స్థానిక ఎంపి శతాబ్ది రాయ్ కూడా ఉన్నారు. కాగా, తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ నారాయణ్ త్రిపాఠీ, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ ఆర్‌పి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, ప్రయాణికులకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయడానికి హౌరా, సీల్డా రైల్వే స్టేషన్లలో రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసారు. ప్రమాదం కారణంగా హౌరా వెళ్లాల్సిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్, సీల్డా వెళ్లే డార్జిలింగ్ మెయిల్ సహా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్ని రైళ్లను రద్దు చేసారు.
భారత బ్యాడ్మింటన్ సెన్సేషన్ సైనా నెహ్వాల్ ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించింది. తాజాగా విడుదలన చేసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్‌లో ఇటీవలి కాలంలో సాధించిన అద్భుతమైన విజయాలతో సైనా రెండో స్థానానికి ఎగబాకింది. ఇండోనేసియన్ ఓపెన్ గెలవకముందు మూడో స్థానంలో ఉన్న సైనా ర్యాంకు, ఆ టోర్నమెంట్లో విజయం తర్వాత రెండో స్థానానికి చేరింది. ఈ ఘనతతో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా అవతరించడానికి కేవలం ఒక అడుగు దూరంలోనే సైనా ఉంది. చైనా దేశస్థురాలు యిహన్ వ్యాంగ్ ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 64791.2637 పాయింట్లు సాధించి సైనా రెండో స్థానాన్ని కైవసం చేసుకొంది మూడో స్థానంలో చైనాకే చెందిన గ్జిన్ వ్యాంగ్ కొనసాగుతోంది.
‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇంత త్వరగా ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారిణి అవుతానని అనుకోలేదు. నేనాడిన చివరి మూడు టోర్నమెంట్లలో వరుస విజయాలు ఈ స్థానానికి చేరుకోవడానికి నన్ను ఎంతగానో సహాయపడ్డాయి. నాకిది గొప్ప అనుభూతినిస్తుంది. అయినా ర్యాంకింగ్స్‌పై ధ్యాస పెట్టే కన్నా దేశ కోసం మరిన్ని టోర్నమెంట్లను గెలవడమే ఇక ముందు కూడా నా ప్రాధాన్యతగా ఉంటుంది.’ అని సైనా తన ఆనందాన్ని పంచుకుంది.
ర్యాంకింగ్స్‌లను ఆపుకోవడం కష్టమైన పని అయినా, ఇంకా బాగా కష్టపడి మరిన్ని టైటిళ్లు గెలిచి, త్వరలోనే ప్రపంచ నెంబరు వన్ క్రీడాకారిణి అవడానికి కృషి చేస్తానని ప్రస్తుతం జలుబు, జ్వరం బాధపడుతున్న సైనా పేర్కొంది. తన కూతురు ఈ ఘనత సాధించడంతో సైనా తండ్రి హర్వీర్ సింగ్ అనందానికి అవధుల్లేకుండాపోయింది. సైనా సాధించిన ఘనతపై సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తూ, దేశంకోసం ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. గత మార్చిలో ప్రతిష్ఠాత్మక అల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్స్‌చేరి ప్రపంచ ఐదో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించిన సైనా, ఆ తర్వాత ఆరో స్థానానికి పడిపోయింది.
ఇక సైనా భవిష్యత్తులో ఆడబోయే టోర్నమెంట్ల విషయాన్ని ఒకసారి చూసినట్లయితే వచ్చే నెల ప్యారిస్‌లో జరుగనున్న ప్రతిష్థాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనా దేశం తరపున పాల్గొననుంది. ఆ తర్వాత అక్టోబరులో స్వదేశంలోనే జరిగే కామన్వెల్త్ క్రీడలతో పాటు ఎషియన్ గేమ్స్‌లలో సైనా పాల్గొంటుంది.
15 వ స్థానంలో కొనసాగుతున్న చేతన్ ఆనంద్
తాజాగా విడుదల చేసిన బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో హైదరాబాదీ ఆటగాడు చేతన్ ఆనంద్ 15 వ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇతర భారత క్రీడాకారుల్లో అనంద్ పీ. కశ్యప్, అరవింద్ భట్‌లు వరుసగా 25, 27 ర్యాంకుల్ని సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జంట జ్వాల గుత్త, వీ దిజులు స్థానంలో ఎటువంటి మార్పులేదు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు.
మన రూపాయి ఇక అంతర్జాతీయ స్థాయిలో కొత్త సొబగులు సంతరించుకోనుంది. రూపాయి చిహ్నాన్ని మార్చాలని ఇప్పటి వరకూ మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐఐటి పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి డి ఉదయకుమార్ రూపొందించిన కొత్త నమూనాను ఆమోదిం చింది. ఈ చిహ్నం ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ఐదు చిహ్నాలను ఎంపిక చేసి మంత్రివర్గ ఆమోదానికి పంపగా అందులో ఉదరు కుమార్ రూపొందించిన చిహ్నానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చిహ్నంలో దేవనాగరి లిపిలో ‘ర’ అనే అక్షరం, రోమన్ అక్షరం కేపిటల్ ‘ఆర్’ (మధ్య కొమ్ము లేకుండా) ఉంటాయి. ఈ చిహ్నం రూపకల్పన కోసం ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.2.5 లక్షల ప్రైజ్‌మనీతో పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాను రూపొందించిన డిజైన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర లభించిందన్న విషయాన్ని తెలుసుకున్న ఉదరుకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గౌహతి ఐఐటిలో డిజైన్ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యునిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మావోయిస్టులను అదుపు చేసేందుకు వీలుగా మేజర్ జనరల్ స్థాయి రిటైర్డ్ సైనికాధికారి సారధ్యంలో ఏకీకృత (యూనిఫైడ్) కమాండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని బుధవారం ఇక్కడ జరిగిన నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో హోం మంత్రి పి చిదంబరం చెప్పారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర గవర్నర్, బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ మంత్రి సూర్యకాంత్ మిశ్రా హాజరయ్యారు. మావోయిస్టులపై చర్యలకు సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన సాయాన్ని పూర్తి స్థాయిలో అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు హోం మంత్రి హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, దళాలను కేటాయించడంతో పాటు అవసరమైన ఆయుధాలను కూడా అందజేస్తామన్నారు. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు, కొత్తగా 400 పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు స్టేషన్‌కు రెండు కోట్ల రూపాయల వంతున అవసరమైన నిధులను 80:20 నిష్పత్తిలో రెండేళ్లపాటు కేంద్రం సమకూరుస్తుందని ఆయన చెప్పారు.
గత ఆర్నెల్ల కాలంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. నక్సల్స్‌పై కార్యకలాపాల కోసం ఇప్పటికే నియమితులైన సిఆర్‌పిఎఫ్ అధికారులతో సమన్వయంతో వ్యవహరించేందుకు వీలుగా ఐజిపి స్థాయిలో ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలను కోరనున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించి ప్రస్తుతమున్న మార్గదర్శకాలను, నియమనిబంధనలను స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికా సంఘం సభ్య కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతాధికార సంఘం సమీక్షించి సవరిస్తుందన్నారు. షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పిసా) చట్ట నిబంధనలను సత్వరమే అమలు చేయాలని, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులకు సంబంధించిన హక్కులపై అధికారాలను గ్రామసభలకు అప్పగిస్తూ ప్రభుత్వ నియంత్రణలోని విభాగాలు, ఇతర సంస్థల జోక్యాన్ని తొలగించాలని ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు ఆయన చెప్పారు. నక్సల్ ప్రభావిత 35 జిల్లాల్లోని రోడ్ల నిర్మాణాన్ని కూడా మెరుగు పర్చనున్నట్లు, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రూ.950 కోట్ల అంచనా వ్యయంతో పలు రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. రోడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్యాభివృద్ధి, ఆరోగ్య సౌకర్యాలు, తాగునీటి సరఫరా వంటి అంశాల ప్రాతిపదికన నక్సల్ ప్రభావిత జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన అంశాన్ని ప్రణాళికా సంఘం పరిశీలిస్తోందన్నారు.
ఆగస్ట్‌లో పారిస్‌లో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ టోర్నమెంట్‌కు తొమ్మిది మంది సభ్యుల జట్టును మంగళవారం నాడిక్కడ ప్రకటించారు. వారు అదితీ ముటాట్కర్, జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప, చేతన్ ఆనంద్, పారుపల్లి కాశ్యప్, సనావే థామస్, వి.దిజు, రూపేష్ కుమార్. పుల్లెల గోపీచంద్ ఛీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ వి కె వర్మ జట్టును ప్రకటించారు. అత్యంత పిన్న వయసులోనే కెప్టెన్‌గా నియమితురాలైన సైనా నెహ్వాల్ ప్రపంచఛాంపియన్‌షిప్‌లో రాణించగలదన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తనపై ఎటువంటి ఒత్తిడి ఉండబోదని సైనా పేర్కొంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రాణిస్తే 101 స్వర్ణ నాణాలను ప్రదానం చేయగలమని ప్రీమియర్ బ్రాండ్స్ ఛైర్మన్ సురేష్ కుమార్ ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సన్మానంలో ఆమెకు తన వయసుకు అనుగుణంగా 20 నాణాలను ప్రదానం చేసారు.
నిప్పులు చెరుగుతూ నింగిలోనికి దూసుకెళ్లిన పిఎస్ఎల్వీ-సి15
నెల్లూరు జిల్లా, జూలై 12 : నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటిరాకెట్ ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్‌వీ-సీ15 రాకెట్ విజయవంతంగా నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. సోమవారం ఉదయం 9-22 గంటలకు దీనిని ప్రయోగించారు. మొదటి మూడు దశలను పూర్తి చేసిన పీఎస్ఎల్వీ నాలుగో దశలో సెకనుకు 7.5 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన వాహననౌక ఐదు ఉపగ్రహాలను నిర్నీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
18 నిమిషాలలోపే..
సోమవారం ఉదయం గం. 9.22 నిమిషాలకు నింగికి ఎగిరిన క్షణం నుంచి 18 నిమిషాల వ్యవధిలోనే 694 కిలోల కార్టోశాట్-2బీ ఉపగ్రహంతోపాటు 116 కిలోల బరువుగల ఆల్జీరియాకు చెందిన ఆల్‌శాట్-2ఎ ఉపగ్రహం, 6.5 కిలోల బరువుగల ఎన్ఎల్ఎస్ 6.1, ఐశాట్-1 పేరుగల రెండు సూక్ష్మ ఉపగ్రహాలతోపాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఏడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు రూపొందించిన కిలో బరువుగల స్టుడ్‌శాట్ ఉపగ్రహం, ఎన్ఎల్ఎస్ 6.2, టిశాట్-1 అనే మరో రెండు ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టారు. 63 9 కిలోమీటర్ల ఎత్తులో సూర్యానువర్తన ధృవకక్ష్యలో వీటిని ప్రవేశపెట్టారు. ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా జరిగే ఆరో ప్రయోగం ఇది కావడం విశేషం. కార్టోశాట్ -2బీ ఉపగ్రహం ఐదేళ్లపాటు రోదసి నుంచి సేవలు అం దించనున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద బూస్టర్
పీఎస్ఎల్‌వీ మొదటిదశలో వాడే బూస్టర్‌లో 139 టన్నుల ఘన ఇంధనాన్ని నింపుతారు. ఈ తరహా బూస్టర్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బూస్టర్‌గా దీనిని శాస్త్రవేత్తలు భావిస్తారు. రెండోదశ, నాలుగోదశల్లో ద్రవ ఇంధనాన్ని, మూడోదశలో ఘనఇంధనాన్ని వాడుతున్నారు. కార్టోశాట్-2బీ ఉపగ్రహంలో పాన్ ప్రోమాటిక్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా రోదసిలో తనకు అవసరమైన విధంగా ముందుకు, లేదా పక్కకు తిరిగే సదుపాయాన్ని చేకూర్చారు.
ఉపగ్రహ గమన కేంద్రాలు
ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ రాకెట్ నాలుగో దశ నుంచి కక్ష్యలోకి విసరబడిన వెంటనే ఉపగ్రహంలో ఉన్న రెండు పోలార్ ప్యానర్లు తెరుచుకుంటాయి. వెంట నే బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం, లక్నో, మారిషస్, రష్యాలో ని బియర్స్ సరస్సు, ఇండోనేషియలోని బియాక్, నార్వే దేశంలోని స్వాల్బార్డ్ కేంద్రాలకు సంకేతాలు అందుతాయి. ఈ కేంద్రాల నుంచిఉపగ్రహ గమనాన్ని నియంత్రిస్తారు.
శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఆదివారం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్‌వీ సీ-15 రాకెట్ ప్రయోగ సందర్భంగా నమూనా రాకెట్‌తో ఆయన శనివారం రాత్రి తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. పద్మావతి ప్రధాన అతిథిగృహంలో బసచేసిన ఆయన సతీమణీతో ఆదివారం ఉదయం వేకువజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 20మంది అంతరిక్ష పరిశోధన నిపుణులను ఆయన తిరుమలకు తీసుకువచ్చారు. ప్రత్యేకాధికా రి ధర్మారెడ్డి, ఆర్-1గజపతి, ఓఎస్డీ చిన్నంగారి రమణలు వారందరికి దగ్గరుం డి అన్ని ఏర్పాట్లు చేశారు. రాకెట్ నమూనాను స్వామిపాదాల చెంతవుంచి ప్ర త్యేక పూజలు చే యించారు.
ఉంగాండా రాజధాని కంపాలాలో సంభవించిన బాంబు పేలుళ్లలో దాదాపు 64 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘ఫుట్‌బాల్ ప్రపంచ కప్’ వీక్షకులనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. ‘ఈ పేలుళ్లు కచ్చితంగా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చూసేందుకు వచ్చిన వారినే లక్ష్యంగా చేసుకుని జరిగాయి’ అని పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కాలే కయిహురా చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన వెనుక సోమాలియా తీవ్రవాదుల హస్తం ఉండి ఉండవచ్చునని కయిహురా చెప్పారు. సోమాలియా తీవ్రవాద నాయకుడు అల్ షబాబ్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సోమాలియాకు వెలుపల ఈ విధమైన పేలుళ్లకు తెగబడడం ఇదే ప్రథమమని వారు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఉగాండాలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే ఈ పేలుళ్లు జరిపి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఉగాండా శాంతి ప్రేమికులు పేలుళ్లు జరిగిన ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ పేలుళ్లలో అల్‌ఖైదా తీవ్రవాదుల హస్తం కూడా ఉందని భావిస్తున్నారు. రెండు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్ల శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల వరకూ వినిపించింది. జనాభా ఎక్కువగా గుమికూడి ఉన్న ప్రాంతంలో జరగడంతో భారీ ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఒక క్లబ్బు వద్ద ఏర్పాటు చేసిన భారీ తెరపై ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయని పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు కంపాలాలో జరిగిందని, ఈ ఘటనలో 49 మంది మరణించారని వారు తెలిపారు. రెండో పేలుడు ఇతియోపియన్ గ్రామంలో జరిగిందని ఈ పేలుడులో దాదాపు 15మంది మృతి చెందారని చెప్పారు. ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉలిక్కి పడ్డ ఉగాండా..
ఉగాండాలో జరిగిన బాంబు పేలుళ్లకు దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ బంధువుల క్షేమ సమాచారాలను వెనువెంటనే అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ పేలుళ్లు ఏవిధంగా సంభవించాయో వారు తెలుసుకోలేకపోయారు. ప్రపంచ కప్ తుది సమరం సమయానికి ఇలా జరుగుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదని ఓ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఊహించని పరిణామం జరుగుతుందని అనుకున్నాం. కానీ, ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు’ అని ఆ అధికారి వ్యాఖ్యానిం చారు. పేలుళ్ల ధాటికి కొందరి శరీరాలు తునాతున కలయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తం, తెగిపడిన శరీర భాగాలతో అత్యంత భయానకంగా మారింది. చనిపోయిన, లేదా గాయపడిన వారిలో ఎక్కువమంది విదేశీయులే ఉంటారని అధికారులు చెప్పారు. కంపాలాలో జరిగిన రెండు పేలుళ్లు విదేశీయులు ఎక్కువగా విడిదిచేసే ప్రాంతాలేనని వారు తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతం ఉగాండా ప్రముఖులు, విదేశాలకు చెందిన ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతమని పోలీసు ఉన్నతా ధికారి ఒకరు చెప్పారు. ఇవి ఆత్మాహుతి దాడులే అయివుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
2010 ప్రపంచ ఫుట్‌బాల్ కప్‌ను స్పెయిన్ ఎగరేసుకుపోయింది. మొట్టమొదటి సారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన స్పెయిన్ తొలిసారి కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 1-0 తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. 116వ నిమిషంలో ఆండ్రస్ ఇనిఏస్టా గోల్ చేసి స్పెయిన్ విజయాన్ని ఖరారు చేశాడు. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయినే విజేతగా నిలవడం ద్వారా ఆక్టోపస్ జోస్యం నిజమైంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రారంభం నుంచి ఇరు జట్లు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చాయి.
అవకాశం వచ్చినప్పుడల్లా నెదర్లాండ్స్ గోల్‌పోస్టుపై స్పెయిన్ దాడి చేసింది. బాల్ పాసింగ్‌లోనూ, షాట్ల విషయంలోనూ స్పెయినే పైచేయి సాధించింది. నిర్ణీత సమయంలో ఏ జట్టూ గోల్ చేయలేకపోవడంతో అదనపు సమయం కేటాయించాల్సి వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో ఈ సమయం కూడా ముగుస్తుందనగా మంచి పాస్‌లు అందుకున్న ఇనిఏస్టా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌కు చిరకాల విజయాన్ని అందించాడు. ఈ విజయంతో యూరో ఛాంపియన్‌షిప్ తర్వాత ప్రపంచ కప్ నెగ్గిన రెండో జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఐరోపా బయట నిర్వహించిన టోర్నీలో తొలి సారి ఐరోపా జట్టు విజేతగా నిలిచింది. 1974, 1978 సంవత్సరాల్లో ప్రపంచ కప్ పైనల్స్‌కు చేరినా కప్‌ను చేజిక్కించుకోవడంలో విఫలమైన నెదర్లాండ్స్‌కు 2010లోనూ భంగపాటు తప్పలేదు.