నెల్లూరు

రెండు పార్టీలకు పుట్టగతులు లేకుండా చేద్దాం
అధికారంలోకి వస్తే లక్ష
రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం
ఆత్మకూరు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు
ఉప ఎన్నికల్లో ప్రతీ తెలుగువాడి శక్తిని చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్‌కు, దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని అన్నారు. ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు మలివిడత ప్రచారాన్ని బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గంలో ప్రారంభించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన బాబు తొలిరోజు ప్రసంగాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో నిప్పుులు చెరిగారు. కరటంపాడు కల్యాణ మంటపంలో ఆత్మకూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే గెలుపుపై పూర్తి ధీమా ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ దొంగలపార్టీ అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ గజదొంగల పార్టీగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నాయకులని, నెల్లూరు పార్లమెంటు ఉపఎన్నికల యుద్ధానికి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకే తాను వచ్చానన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించిన జగన్మోహన్ రెడ్డి అవినీతిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకునివెళ్లాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తక్కువైనప్పటికీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తించానన్నారు. ఇప్పటికీ గ్రామాలకు వెళితే సిమెంట్ రోడ్లు, మంచినీటి పథకాలు, ఆర్టీసీ బస్‌స్టాండులు, పాఠశాలల భవనాలు టీడీపీ ప్రభుత్వ కాలంలో నిర్మించినవేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోగా ప్రజలకు చిన్నపాటి తాయిలాలు చూపించి కాంగ్రెస్ నాయకులు మాత్రం కుబేరులయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని, అయితే ఆ ఆదాయాన్ని అభివృద్ధికి ఖర్చుపెట్టకుండా కాంగ్రెస్ పాలకులు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు.
రైతుకు గిట్టుబాటు ధర లేక, పండించిన ఉత్పత్తులను అమ్ముకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే రైతుకోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించి, రైతాంగ సమస్యలపై దృష్టిసారిస్తానన్నారు. వారంరోజులకోసారి పెట్రోల్, డీజెల్ ధరలను పెంచటమేగాక, ప్రజలకు అవసరమైన అన్నీ వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. సిగ్గుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అవినీతి జగన్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. సెజ్‌ల పేరుతో రైతుల కడుపుకొట్టి, రైతులకు మాత్రం ఎకరాకు లక్ష రూపాయలు ఇచ్చి, కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే నిరుపేదలందరికీ ఉపయోగపడేలా నూతన ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి, అమలు చేస్తానన్నారు. ఒక్కో పక్కాగృహాన్ని లక్ష రూపాయలతో నిర్మిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పార్టీ కార్యకర్తలతే పక్కాగృహాలు మంజూరు చేసిందని, ఒక్కో కార్యకర్త పది గృహాలు మంజూరు చేయించుకుని, భవనాలు నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ బిల్లులు ఇబ్బడిముబ్బడిగా పెంచివేశారని, కావున ప్రజలు విద్యుత్ బిల్లులను చెల్లించవద్దని, అడిగిన అధికారులను కట్టిపడివేయండని, ఆ విషయంలో తాను అండగా నిలబెడతానన్నారు. గతంలో దీపం పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశామని, 9సంవత్సరాల పాటు ఒక్కపైసా కూడా సిలిండర్‌పై పెంచలేదన్నారు. తెల్లకార్డు లబ్దిదారులతో మద్యం షాపుల లైసెన్సులు పొంది, మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉన్న మద్యం షాపులు మరే నాయకునికి లేవని, ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ప్రారంభించి, బొత్స సత్యనారాయణ గుండెల్లో నిద్రపోతానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఆయన అన్నారు. జూన్ 12వ తేదీ జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బొల్లినేని రామారావులు మంచి మెజార్టీతో విజయాన్ని అందించాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంగళ, బుధవారాల్లో ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు జిల్లా ల్లో పర్యటించనున్నట్లు ముఖ్య మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళ వారం ఉదయం ఆయన 7 గంట లకు శంషాబాద్ విమానశ్రయం నుంచి బయలు దేరి కృష్ణా జిల్లా చేరుకుంటారని,అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఒంగోలుకు బయలుదేరి స్థానిక కార్యక్రమాల్లో పొల్గొంటారని పేర్కొంది. మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరు బయలు దేరి అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారని తెలిపింది. బుధవారం ఉదయం 11 గంటలకు వింజమూరు చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంట చేరుకుంటరాని తెలిపింది. అనంతరం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు బయలు దేరి .3.20 గంటలకు శంషాబాద్ చేరుకుం టారని తెలిపింది.

రాజకీయాలకు అతీతంగా సేవ, కళా కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం మోహన్‌బాబుకు నటనావాచస్పతి బిరుదు ప్రదానోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిర్మించతలపెట్టిన ఎసి ఆడిటోరియంలో భాగంగా నెల్లూరులో కూడా పది కోట్ల రూపాయల వ్యయంతో ఆడిటోరియం నిర్మించనున్నట్టు వివరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రోగుల సహాయకులు సేదతీరే విధంగా కోట్లాది రూపాయల ఖర్చుతో అన్ని వసతులతో కూడిన షెల్టర్‌ను నిర్మించతలపెట్టినట్టు తెలిపారు. తన పినతండ్రి దొడ్ల సుబ్బారెడ్డి నిర్మించిన ఆస్పత్రి, పినతల్లి కౌసల్యమ్మ పేరుమీద నెల్లూరు నగరంలో డికెడబ్ల్యు మహిళా కళాశాల నిర్మించటంతో ప్రజల్లో ఎంతో మంచి పేరు లభించిందన్నారు. ఆ స్ఫూర్తిగా తాను కూడా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

కోవూరు ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్నను ఎమ్మెల్యేగా గెలిపించటం తన బాధ్యత అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మో హన్‌రెడ్డి అన్నారు. కోవూరు ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం బస వాయ పాళెం, వెంకన్నపురం, పద్మనాభసత్రం తదితర ప్రాంతాల్లో సోమ వారం ఆయన పర్యటించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండూ పని కట్టుకుని వైఎస్‌ఆర్‌సి పార్టీ గురించి విమర్శించడమే ధ్యేయంగా పెటు ్టకున్నాయని ఆయన విమర్శించారు.
ఆ రెండు పార్టీలు కుమ్మకై్క తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మ కం ఉండాలని, అలాంటివి లేనప్పుడు రాజకీయాలు భ్రష్టు పడతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి, వైఎస్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథ కాలను గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మూడవ పార్టీని ముందుకు రాకుండా అణగదొక్కేందుకు కాంగ్రెస్,టీడీపీలు చూస్తు న్నాయన్నారు. జగన్ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనానికి సంబంధించి పత్రాలు సరిగా లేకపోవడంతో అధికారులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం కోవూరు నియోజకవర్గంలో పర్యటించిన దానిపై ప్రసన్నకుమార్‌రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. తమ నాయకురాలు విజయమ్మ చిటికిన వేలుకి కూడా చంద్రబాబు పనికిరాడంటూ తీవ్రంగా విమర్శించారు.

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2005 నుంచి జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రివర్గం సమష్టి బాధ్యత తీసుకుంటుందని, అందులో దోషులుగా తేలితే ప్రజల ముందు ఉరి తీసుకునేందుకు ముందుగా ఉంటామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆవేశంగా అన్నారు. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ, సిఐడి దర్యాప్తు చేస్తున్నాయని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ నివేదికలో దోషులుగా ఏ స్థాయిలో ఉన్నవారు తేలినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై నాలుగురోజుల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ఎనిమిదేళ్ళ కాలంలో ప్రభుత్వం వివిధ శాఖలకు నిధుల కేటాయింపు, వాటి ఖర్చుపై గణాంకాలతో వివరించారు. ఏ వ్యక్తిపైనో కోపంతోనో ప్రభుత్వం పథకాలను రద్దు చేయడం లేదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే పనిచేస్తున్నామని రాంనారాయణరెడ్డి చెప్పారు. తమ కుటుంబంపై ప్రభుత్వం కక్షగట్టి సిబిఐ విచారణ చేయిస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు వైఎస్ విజయమ్మ చేసిన ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. పుత్ర వాత్సల్యంతో ఆమె మాట్లాడు తున్నారని, ఆమె కుమారుడు తండ్రినే బజారుపాలు చేస్తుంటే ఆయనను సమర్థించాలా అని ఆనం ఆగ్రహంగా అన్నారు. ఒక వ్యక్తి, ఓ కుటుంబం కోసం ప్రభుత్వం పనిచేయదని, ఎవరిపై కక్ష సాధింపుతో వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. గతంలో మంత్రులుగా ఉన్నవారంతా అవినీతిలో కూరుకుపోయారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల దృష్ట్యా పారదర్శకత కోసమే సిబిఐ దర్యాప్తులో ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పులు ఎవరు చేశారో తేలాల్సి ఉందని, ఆ తర్వాతే ప్రభుత్వ చర్యలు ఉంటాయని రాంనారాయణరెడ్డి చెప్పారు. 2004లో ఎన్నికల ప్రణాళికలో ప్రజలకిచ్చిన హామీలన్నీ ఇప్పటివరకు అమలు చేస్తూ వచ్చామని, 2014 వరకు వీటిని కొనసాగించి విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సంక్షేమం, నీటి పారుదల, మానవ వనరుల అభివృద్ధి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుందని ఆర్ధికమంత్రి చెప్పారు. మహిళా సంక్షేమానికి ఎనిమిదేళ్ళలో 6,365 కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే నీటిపారుదల రంగానికి 48వేల కోట్లు, వ్యవసాయ రంగానికి 29,480 కోట్లు కేటాయించామని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి నీటిపారుదలకు 15,000 కోట్లు, వ్యవసాయరంగానికి రూ.5,890 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రణాళికేతర బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీ రూ.5,500 కోట్లు, యూనివర్సిటీలకు రూ.2,945 కోట్లు, బియ్యం సబ్సిడీ రూ.3000 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.3,700 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్య, వైద్యం, పౌష్టికాహారానికి ఎన్ని కోట్లు ఖర్చయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్ధికమంత్రి చెప్పారు. ఆన్‌లైన్‌లో నమోదైన విద్యార్థులందరికీ నెలవారీగా ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేస్తున్నామని, గ్రీన్ ఛానెల్ విధానం ద్వారా స్కాలర్‌షిప్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పంచాయితీరాజ్ సంస్థలకు నిధులను నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రాంనారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 1,07,659 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని, అయితే ఇందులో 50 వేలు కొత్తగా మంజూరు చేసిన ఉద్యోగాలని ఆయన వివరించారు. వీటికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపిందని, మంత్రివర్గ ఆమోదం తీసుకోవాల్సి ఉందని రాంనారాయణరెడ్డి చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఈ ఏడాది ఇప్పటివరకు 773 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రజాసంక్షేమానికి సంబంధించి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదని, నిధుల కోత కూడా విధించలేదని, ప్రజలకిచ్చిన హామీల మేరకు పనిచేస్తామని ఆర్ధికమంత్రి చెప్పారు.

ఇంకా పార్లమెంటు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. అధిష్ఠానం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి కేంద్రకరిస్తోంది. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల హడావిడి చూస్తే వచ్చే నెలలోనే పార్లమెంటు ఎన్నికలున్నట్లు ఒకరిపై మరొకరు పోటీ పడి కత్తులు దూసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాము ఫలానా స్థానానికి పోటీ చేస్తా మని ప్రకటించి, సిట్టింగుల గుండెల్లో ఎమ్మెల్యేలు దడ పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ మార్కు రాజకీయం ఇది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముందస్తు ముసలం రేగింది. ఎంపీ స్థానాలపై ఎమ్మె ల్యేలు కన్నేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇదేవిధంగా అనిశ్చితి నెలకొంటుందని, ఈ గందరగోళంలో రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్ర రాజ కీయాలే మంచిదన్న ముందుచూపుతో ఎమ్మెల్యేలు పార్లమెంటు స్థానాలపై గురి పెట్టారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వస్తుందని, బీజేపీకి అధికారం లోకి వచ్చే అవకాశం లేదన్న ధీమాతోనే ఎంపీ సీట్లపై కన్నేసినట్లు స్పష్టమవుతోంది.
ఇది సహజంగానే సిట్టింగులకు కన్నెర్రగా మారింది. పక్కలో బాంబు పడినట్టయింది. తమ స్థానాలపై కన్నేసిన ఎమ్మెల్యేలపై ఎంపీలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాము కష్టపడి అభివృద్ధి చేసిన నియోజకవర్గాల్లో కాలుపెడితే ఖబడ్దార్ అంటూ బాహాటంగానే సొంత పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదం అందరికంటే ముందు విశాఖ నుంచి ఆరంభమయింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్రమంత్రి పురంధీశ్వరిని వచ్చే ఎన్నికల్లో విశాఖకు బదులుగా నర్సరావుపేట, ఒంగోలు వెళ్లాలని మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి చాలాకాలం క్రితమే సలహా ఇచ్చారు. విశాఖలో తనకు ప్రజాభిమానం ఉందని చెప్పుకున్నారు. అయితే, తాను వచ్చే ఎన్నికల్లో కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని, కావాలంటే సుబ్బరామిరెడ్డిని వేరే నియోజకవర్గం వెతుక్కోవాలని ఆమె ప్రతి సలహా ఇచ్చారు. అయినప్పటికీ, సుబ్బరామిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా ఎంపీ సీటు కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. రాష్ట్ర రాజధాని నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపైనా హోరాహోరీ మొదలయింది. రానున్న ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నానని మంత్రి ముఖేష్ పేల్చిన బాంబు కాంగ్రెస్‌లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. అంజన్ కావాలంటే ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సలహా ఇచ్చారు. సికింద్రాబాద్ నీ జాగీరు కాదని, నా నియోజకవర్గానికొస్తే ఖబడ్దార్, నీ బండారం బయటపెడతానని సిట్టింగ్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ నేరుగానే మంత్రిని హెచ్చరించారు. దానిపై మళ్లీ స్పందించిన ముఖేష్ సికింద్రాబాద్ తన జాగీరేనని, తాను పోటీ చేసేది ఖాయమని ముఖేష్ విస్పష్టంగా తేల్చి చెప్పారు.
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే నగరంలోని మరో పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అగ్గిరాజుకుంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ సర్వే సత్యనారాయణ పోటీ చేస్తే ఓడిపోతారని సొంత పార్టీ ఎమ్మెల్యే రాజిరెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. తాను పోటీ చేస్తానని చెప్పకపోయినా తనకు ఆసక్తి ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సర్వేకు సీటివ్వకూడదని, తాము ఒక అభ్యర్ధిని తయారుచేస్తామని, ముగ్గురు ఎమ్మెల్యేలదీ అదేమాట అని రాజిరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోని చరిత్ర ఉన్న జేసీ దివాకర్‌రెడ్డికీ శాసనసభపై విరక్తి కలిగింది. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇది అక్కడి సిట్టింగ్ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డికి సెగ పుట్టిస్తోంది. ఇప్పుడున్న అనిశ్చిత రాజకీయ పరిస్థితిలో ఎమ్మెల్యే కంటే ఎంపీనే మంచిదని జేసీ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇక నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో అక్కడ కూడా ఇలాంటి కిరికిరే మొదలయింది. ఎంపీకి పోటీ చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సిద్ధమవుతున్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా బరిలోకి దిగవచ్చంటున్నారు. దీనితో నెల్లూరు రాజకీయం కూడా వేడెక్కనుంది.
రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ ఎంపీ సీటుపైనా అప్పుడే కిరికిరి మొదలయింది. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వేరే నియోజకవర్గానికి వెళితే, తాను అక్కడి నుంచి పోటీ చేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. తాను ఖాళీ చేసిన మహేశ్వరం నుంచి తనయుడిని పోటీ చేయించాలని యోచిస్తున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి కూడా పార్లమెంటు సీటుపై మనసు పారేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేస్తానని ముందస్తుగానే ప్రకటించారు.

శాసనసభలో ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతల తీరుపై సీనియర్ పార్లమెంటేరియన్ ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన ఇద్దరు ముఖ్య నేతలు ఇలా తిట్టుకుంటుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆందోళన వెలిబుచ్చారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
“సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ.. శాసన సభ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. సభ హుందాతనాన్ని, గౌరవాన్ని మంటగలుపుతున్నారు. బజార్లో సామాన్యులు విమర్శించుకునే దానికంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారంనాటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, బజారు తిట్లు గమనిస్తే సభ విలువలు పతనమైపోతున్నాయన్న ఆందోళన కలుగుతోంది. అధికార పక్షానికి అంత అసహనం పనికి రాదు. ప్రతిపక్షం వాడిగా వేడిగా, సూటిగా విమర్శలు చేస్తే ప్రభుత్వం హుందాతనాన్ని పాటించాలి. కానీ, ప్రత్యారోపణలు చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడానికి అధికార పక్షం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రతిపక్షం కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. సీఎం, చంద్రబాబు ఇద్దరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ” అని వెంకయ్య హితవు పలికారు. సభలో ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో సంబోధించుకోవడం సరికాదన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవికి సీఎం కిరణ్ క్లీన్‌చిట్ ఇవ్వడం తప్పేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్‌సీటీసీ ఏర్పాటుకు కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని, 11 రాష్ట్రాలు వ్యతిరేకించినా.. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించినా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. జాతీయ అభివృద్ధి మండలిలో చర్చించకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం ‘సమాఖ్య’, ‘రాజ్యాంగ’ స్ఫూర్తికే విరుద్ధమన్నారు.

రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్
ఉప ఎన్నికల నగారా మ్రోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఒక పార్లమెంటు, 11 శాసనసభా స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్(సిఇసి) షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు శాసనసభా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోవూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మృతితో మహబూబ్‌నగర్ ఖాళీ కాగా జగన్ వర్గంలో చేరిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌తో నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాలతో పాటు మంసా(గుజరాత్), పిరవొమ్(కేరళ), శంకరన్ కొవిల్(తమిళనాడు), అతాగర్(ఒడిషా) శాసనసభా స్థానాలకు, ఉడుపి చిక్మగలూర్(కర్నాటక) పార్లమెంటు స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 18 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 21న నిర్వహిస్తారు. కాగా ఉప ఎన్నికలు జరుగనున్న ఆయా స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని సిఇసి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా జమ్మూకాశ్మీర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన యశ్‌పాల్ ఖజరియా మృతితో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఇసి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఆ స్థానానికి పోలింగ్ జరగనుంది.