NRI తెలుగు తేజాలు
షార్లెట్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో తెంగాణా పేరుతో తెలంగాణా పిక్‌నిక్‌ను ఇటీవల షార్లెట్ లోని నార్త్ కెరోలినాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. పిక్‌నిక్ స్థలంలోని వృక్షాలకు రంగురంగుల బెలూన్‌లు కట్టి అందంగా అలంకరించారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పాటతో ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ పదాలపైన లింగో క్విజ్, తెలంగాణ చరిత్రపై క్విజ్ జరిగింది. చిన్నారులకు టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, ఉట్టి కొట్టడం, సాకర్ కిక్ వంటి ఆటలను, యువతీ యువకులకు డంబ్ షెల్, అంత్యాక్షరి వంటి పోటీలు నిర్వహించారు. తెలంగాణాలో కృష్ణాష్టమి పండుగ రోజు ఉట్టి కొడతారు. అలాగే ఈ పిక్‌నిక్‌లో చిన్నారులు ఉట్టికొట్టడానికి ప్రయత్నించగా పెద్దలు వారిపై వాటర్ గన్స్‌తో నీళ్లని చల్లుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంత మంది కొత్త సభ్యులు గ్రూప్‌లో చేరి ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఖేలే జూమి గయే, తెలంగాణ అనే మాటలను ముద్రించిన కాఫీ మగ్గులను అసోసియేషన్ అందరికీ పంచింది.

నార్త్ అమెరికా తెలుగు ఇంటెలెక్చువల్ ఫోరమ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించింది. ఈ ఉత్సవానికి రాష్ట్ర మంత్రి మాణిక్య వరప్రసాదరావు కూడా హాజరయ్యారు.
ఈ సభలో ఇంకా ఆర్.టి.సి. మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు, ఎమ్.ఎల్.ఎ. రాంభూపాల్ రెడ్డి, స్థానిక మేయర్, న్యూజెర్సీలో నివసిస్తున్న పెక్కుమంది వై.ఎస్. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోట్లాది జన హృదయ నేత వై.ఎస్. అకాలమరణం ప్రపంచంలోని తెలుగు ప్రజలందిరికీ తీరని లోటు అని వక్తలు నివాళి అర్పించారు.
ముగ్గురు అమెరికన్ కుర్రవాళ్ల దుందుడుకు చర్యకు భారత దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త సోమవారంనాడు రాత్రి మృతి చెందాడు. డాక్టర్ దివ్యేందు సిన్హా అనే ఈ శాస్త్రవేత్త క్రిందటి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి న్యూ జెర్సీ శివార్లు లోని ఓల్డ్ బ్రిడ్జ్‌పై నడచి వెళ్తుండగా 17 ఏళ్ల యువకులు ముగ్గురు ఒక్కసారిగా తమ కారులోంచి దూకుతూ వచ్చి దాడి చేశారు. భార్య, ఇద్దరు కుమారులతో నడుచుకుంటూ వెళ్తున్న శాస్త్రవేత్త సిన్హాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా సిన్హా ప్రాణాలు కాపాడలేకపోయారు.
దాడి జరిగిన వెంటనే సిన్హా కుమారులు పోలీసులకు ఫోన్ చేశారు. క్షణాలలో వచ్చిన పోలీసులు నిందితులను పట్టుకోవడంకోసం వెంటనే పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించారు. కొద్ది సేపటిలోనే నిందితులు దొరికారు. అయితే వీరంతా 17 ఏళ్ల లోపు వారు కావడంతో వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు.
భారత శాస్త్రవేత్తపై ఈ కుర్రవాళ్లు దాడి చేయడానికి జాతి వివక్ష అనడానికి ఆధారాలు కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరికీ ఎవరూ పరిచయం కూడా లేరు కాబట్టి కేవలం సరదా కోసమే ఆ యువకులు ఇలా దాడి చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ దివ్యేందు సిన్హా వయస్సు 49 సంవత్సరాలు. ఆయన భారతదేశంలోని ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో చదువుకుని, ఆ తర్వాత న్యూ జెర్సీలోని హొబొకెన్‌లోని స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పి.హెచ్.డి. సాధించారు. కాలేజ్ ఆఫ్ స్టేటెన్ ఐలాండ్‌లో 1990 నుంచి దాదాపు పదేళ్ళు ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ సిన్హా ప్రస్తుతం ఆయన సియమెన్స్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎంతో నెమ్మదస్తుడైన డాక్టర్ సిన్హా కంప్యూటర్ ఇమేజింగ్‌పై పుస్తకాలు కూడా రాశారు.

స్థానిక సనివేల్ హిందూ దేవాలయ ఆడిటోరియంలో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ పేర ఇళయరాజా గౌరవార్ధం ఇటీవల సంగీత విభావరి జరిగింది. దాదాపుగా 1000 మంది సంగీతాభిమానుల సమక్షంలో కాన్సర్ట్ ఆద్యంతమూ ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో నేపద్య గాయకుడు మల్లికార్జున్, హైదరాబాద్ నైటింగేల్ సిస్టర్స్‌గా పేరొందిన శిల్ప ఉప్పలూరి, దీపిక ఉప్పలూరి పాల్గొన్నారు. విజయ ఆసూరి, కల్యాణ్ కట్టమైరి ఈ కార్యక్రమాన్ని వలక్షణంగా నిర్వహించారు.
అమెరికాలో పాత తెలుగు పాటలకు సముచిత గౌరవ స్థానం కల్పించాలనే ఒక సత్సంకల్పంతో ఒక సంగీత విభావరి శ్రేణిని మొదలుపెట్టామని చిమటమ్యూజిక్.కాం అధినేత శ్రీనివాసరావు చిమట వెల్లడించారు. గత సంవత్సరంలో నాటి మేటి సంగీత దర్శకులైన కే.వీ.మహదేవన్, సత్యం గార్ల జ్ఞాపకార్ధం రెండు సంగీత కచేరీలను లైవ్ ఆర్కెస్ట్రాతో జరపగా, ఈ ఇశయరాజా కాన్సర్ట్ ఈ సీరీస్ లో మూడోది.
ఇళయరాజా పాటల పోటీ విజేతలైన అమృత తుర్లపాటి, శ్రియ అరవీటి, శ్రేయ బుద్ధవరపు, నవ్యమైత్రి కొండా, పూజిత దశిక, నిత్య కస్తూరి, కార్తిక్ నూలి, శైలజ భాగవతులు, శ్రీనివాస్ వారణాసిలకు మెమెంటోలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా పరంగా ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భాష పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక నిర్వహించిన ‘నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రమంలో భాగంగా “తెలుగు భాష, సంస్కృతి” అనే అంశంపై ప్రసంగిస్తూ పత్రికలు, దూరదర్శన్ వంటి సమాచార సాధనాలలో రాజకీయ, సామాజిక పరిణామాలు, భాషపై వాటి ప్రభావం గురించి ఆయన ఉదాహరణలతో వివరించారు.
‘ప్రముఖ వాగ్గేయకారుల సాహిత్యం’ అనే అంశంపై బ్రహ్మశ్రీ సామవేదం ప్రసంగిస్తూ పదకవితా పితామహుడు అన్నమయ్య పదకవిత్వం, సామెతలు, శృంగార కీర్తనలు, దశావతారములు, క్షేత్రయ్య శృంగార సాహిత్యం, రామదాసు భజన సాంప్రదాయం, త్యాగరాజు సంగీత సాహిత్య విశేషాలను కూలంకషంగా సభికులకు విశదీకరించారు. సంగీతంలో వాడే భాషకు సరళత ప్రధానమని, అన్నమయ్య నోట తెలుగుపాట విశ్వరూపం ధరించిందన్నారు.
ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ చలన చిత్ర గేయ రచయిత డాక్టర్ వేటూరు సుందరరామమూర్తికి విజయ్ చంద్రహాస్ మద్దుకూరి ఘనంగా నివాళులర్పించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు ఎన్.ఎమ్.ఎస్.రెడ్డి మరియు పూర్వాధ్యక్షుడు ప్రసాద్ తోటకూర సంయుక్తంగా దుశ్వాలువతో పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డను సన్మానించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు రావు కల్వల, సురేష్ కాజ, అనంత్ మల్లవరపు, డాక్టర్ ఉరిమిండి తదితరులు సంయుక్తంగా ముఖ్య అతిథిని జ్ఞాపికతో సత్కరించారు.

అమెరికాలో మరో తెలుగు తేజం నేలరాలింది. అమె రికాలో ఎంఎస్ చదువుతోన్న యువ ఇంజనీరు ఆదర్శ్‌జాన్ (22) హత్యకు గురయ్యాడు. చదువులో తమ కుమారుడు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందున తోటి విద్యార్థులే హత్యచేసి ఉంటారని తల్లి దండ్రులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన డాన్‌బాస్కో, జసంతబాస్కో దంప తుల మొదటి సంతానం ఆదర్శ్‌జాన్ ఎం ఎస్ చేసేందుకు 2009లో అమెరికా వెళ్లా డు. అమెరికాలోని టెక్సాస్ బెల్టాన్‌సిటీ మేరీ హరిడాన్‌బెలర్ విశ్వవిద్యాయలంలో ఎంఎస్ చదువుతున్నాడు. విశ్వవిద్యాలయంస్థాయిలో తొలి స్ధానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు 11న జ్ఞాపికను కూడా అందుకోనున్నాడు. అందుకుగాను ఆయన తల్లితండ్రులను రమ్మంటూ విశ్వవిద్యాలయం నుంచి వర్తమానం కూడా అందింది. బయటకు వెళ్లిన అతను, తిరిగి రాకపోవడంతో స్నేహితులు టెక్సాస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విశ్వవిద్యాలయ ఆవరణలోని బావిలో జాన్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. జేబులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆదర్శ్‌జాన్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తల్లిదండ్రులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీఇచ్చారు.

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల డాలస్ లేక్ ల్యూస్‌విల్ పార్క్‌లో వనభోజన కార్యక్రంమం జరిగింది. 400 మందికి పైగా తెలుగు వారు హాజరైన ఈ వేడుక ఒక వినోదయాత్రగా జరిగింది. డాలస్‌లోని అనేక ప్రాంతాలనుండి విచ్చేసిన సంస్థలు, మహిళలు కలిసి రుచిగల వంటకాలను తయారుచేశారు. ఈ వేడకకు ప్రకృతి అందం కూడా తోడైంది. చిన్నారులు నదిలో ఈతలు కొట్టడం, ఇసుకపై ఇళ్లు నిర్మించడం, బోట్ రైడ్స్ వంటివి అందరికీ ఆనందం కలిగించాయి. క్రికెట్, ఖోఖో, కబాడీ, వాలీబాల్, మ్యూజికల్ చైర్స్, లెమన్ ఆన్ స్పూన్, అంత్యాక్షరి వంటి కార్యక్రమాలను నిర్యహించారు. ఈ ఆటలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. అకో ్టబర్‌లో జరుగబోయే బతుకమ్మ మరియు దసరా సంబరాలకు ఈ కార్యక్రమం ప్రేరణగా నిలిచిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికాలోని వర్జీనీయాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కర్మన్‌ఘూట్‌కు చెందిన ప్రణీతాదేవి దుర్మరణం పాలయ్యారు. ప్రణీతాదేవి అమెరికాలో ఎం.ఎస్ చదువుతున్నారు. మృతురాలు ఫలక్‌నామా ట్రాఫిక్ సీఐ రామారావు కుమార్తె. వెస్ట్ వర్జీనియా నుంచి ఆమె స్నేహితులతో కలిసి ఓహియోకు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.

లాస్యం కూచిపూడి నృత్య పాఠశాల 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల అరోరాలోని బాలాజీ ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 30 మంది పాఠశాల విద్యార్థులు, కళాకారులు మరియు పాఠశాల సూత్రధారి హేమామాలిని యద్ధనపూడి స్వయంగా కలిసి చేసిన ఈ నృత్య ప్రదర్శన మూడు గంటల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. షికాగోలో మొట్టమొదటి సారిగా లాస్యం 14 వ శతాబ్ధపు భామాకలాపం నృత్య రూపకాన్ని ప్రదర్శించింది. వారు చేసిన ఉల్లాసవంతమైన మరియు చిరస్మరణీయమైన రూపకం, హేమామాలిని సూత్రధారి(మాధవి)గా, మనోలాస్యా పరేపా సత్యభామగా, జలజ శ్రీకృష్ణునిగా వారి వారి పాత్రలకు జీవం ఉట్టిపడేలా ప్రదిర్శించిన తీరు ప్రేక్షకులకు అలరింపజేసింది. నాటి యదార్థమైన కూచిపూడి సంగీతం, అభిన యాన్ని గుర్తుచేసాయి.

ట్రాయ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వికృతనామ ఉగాది వేడుకలు మిచిగన్ రాష్ట్రంలో ట్రాయ్ నగరంలో ఘనంగా జరిగాయి. దాదాపు 700 మంది స్ధానిక ఆంద్రులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం అద్యంతమూ తెలుగు సంస్కృతీ వైభవానికి అద్దం పట్టింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగుదనం వెల్లివిరిసింది.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయ తత్వానికి అద్దంపట్టేలా జరిగిన శాస్త్రీయ నృత్యరీతులు తెలుగుదనం పరిమళాలు అంతర్లీనంగా కదలాడుతూ ప్రేక్షకులను ఆనందపారవశ్యంలో ఓలలాడించాయి, గురుశిష్యుల అనుబంధానికి ప్రతీకలా నిలిచిన అలనాటి మేటి అపురూపగాధ “శ్రీ పరమానందయ్య శిష్యుల కథ”ను చిన్నారులు ప్రదర్శించగా ప్రేక్షకులు ఆ నాటకానికి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅథిదులుగా విచ్చేసిన తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ బండ్ల హనుమయ్య, ఎన్ ఆర్ ఐ హీరో హరనాథ్ పొలిచెర్ల, డాక్టర్ శిరీష నెమళ్లపూడిలను ట్రాయ్ తెలుగు అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమం సందర్భంగా అనేక స్వచ్చంద సంస్ధలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేషాఆదరణ లభించింది, అనంతరం షడ్రుచుల సమ్మిళితమైన వంటకాలతో ఘనమైన విందు భోజనం ఆహూతులను చవులూరించింది. ఆనందోత్సవాలతో నవరసభరితంగా సాగిన ఈ కార్యక్రమం జాతీయగీతాలాపనతో ముగిసింది. ఈ కార్యక్రమానిక విచ్చేసి జయప్రదం చేసిన అందరికీ, అలాగే వెన్ను తట్టి ప్రోత్సహించిన పెద్దలందరికీ ట్రాయ్ తెలుగు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియచేసింది.