రంగా రెడ్డి

ఐ సే గెటౌట్‌ – దరఖాస్తు దారునిపై చిందులు తొక్కిన కలెక్టర్‌ దాన కిషోర్‌

Collector_RR
జిల్లా కలెక్టర్‌ ఎం.దానిశోర్‌కు కోపమొచ్చింది. ఆ కోపాన్నంత చూపిస్తూ శివాలెత్తారు. సమస్య విన్నవిద్దామని కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తుదారుడిపై చిందులుతొక్కారు. ఐ సే గెటౌట్‌ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ సెక్యూరిటీచేత గెంటించారు. కలెక్టర్‌ వైఖరితో సదరు దరఖాస్తుదారుడు బిత్తరపోవాల్సి వచ్చింది. కలెక్టర్‌ ఛాంబర్‌ సమీపంలోనే కంటతడిపెట్టుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి…. అల్వాల్‌కు చెందిన గోపికృష్ణారావు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించేందుకు సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌కు వచ్చారు. తనకు అందజేసిన ఎన్‌ఓసీపై రెండు సంతకాలు లేవని… అధికారులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌కు విన్నవించేందుకు ఆయన ఛాంబర్‌ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5.10నిమిషాల ప్రాంతంలో ఫిర్యాదుదారులనే కలిసేందుకు కలెక్టర్‌ తన ఛాంబర్‌ ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే నా ఫైలు మీవద్ద ఉందని సదరు ఫిర్యాదుదారుడు అంటుండగానే కలెక్టర్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. నీ ఫైలు నా దగ్గర ఉందని ఎవరు చెప్పారంటూ చిందులు తొక్కారు. ఆఫీసు ఫైళ్ల గురించి ఎవరు చెప్తారంటూ శివాలెత్తిన ఆయన ఐ సే గెటౌట్‌ అంటూనే ఇక్కడినుంచి ఇతన్ని పంపించండంటూ సెక్యురిటీని పురమాయించారు. కలెక్టర్‌ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బిత్తరపోయిన దరఖాస్తుదారుడు న్నీళ్ల పర్యంతమాయ్యరు. ఎన్‌ఓసీ కోసం నెలలతరబడి తిరుగుతుంటే గత నెలలో క్లియరెన్స్‌ ఇచ్చారని, అయితే, కలెక్టర్‌ సంతకాల్లో రెండుచోట్ల లేకపోవడంతో మళ్లీ అధికారులకు ఇచ్చానని, దీనికోసం అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడంలేదని, ఫైలు కలెక్టర్‌ వద్ద ఉందని తెలిస్తే సమస్యను కలెక్టర్‌కు విన్నవించాలని రోజూ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నానని దరఖాస్తుదారుడు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఆగ్రహ జ్వాలలు

టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీనేతల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం టీడీపీ నిర్వహించిన హర్తాళ్‌ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని అన్ని మండలాల్లో టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు చేపట్టి రాస్తారోకోలు నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం చవాన్‌ దిష్టిబొమ్మలను దహనంచేశారు. వికారాబాద్‌, తాండూరులలో రైలురోకో నిర్వహించారు. పరిగిలో రోడ్డుపైనే వంటలు చేసి, రోడ్డుపైనే భోజనంచేసి నిరసన వ్యక్తంచేశారు. మేడ్చల్‌లో టీడీపీ నేత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోవడంతో ఉద్రిక్తతపరిస్థితి నెలకొంది. మహేశ్వరంలో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీని చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. మహారాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో పోలీసులు కార్యకర్తలను అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. చేవెళ్ల, మొయినాబాద్‌, కీసర, కందుకూరు, శంషాబాద్‌, మేడ్చల్‌, శామీర్‌పేట్‌, మోమిన్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు.
కొన్నిప్రాంతాల్లో విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనగా, మరికొన్ని ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు వెళ్లి మూయించారు. అయితే, మొయినాబాద్‌ మండల పరిధి హిమాయత్‌నగర్‌లో ఉన్న టీడీపీకి చెందిన ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌కు మాత్రం తమ్ముళ్లు మినహాయించారు. అన్ని పాఠశాలలను మూయించిన తమ్ముళ్లు అటువైపుగా వెళ్లకపోవడంతో ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ యాజమాన్యం మాత్రం యధేచ్ఛగా పాఠశాలను కొనసాగించింది. హర్తాళ్‌ సందర్భంగా సుమారు 1500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావల్సివచ్చింది. హర్తాళ్‌ను పురస్కరించుకుని జిల్లా రూరల్‌, సైబరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

ఇంత ఘోరమా?

బాబ్లీతోసహా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సందిర్శించడానికి వెళ్తే టీడీపీ నేతలను అరెస్టుచేయడం శోచనీయమని ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిషేధిత ప్రాంతంలో కాకుండా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సందర్శిస్తే ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్నందుకే సందర్శనకు చవాన్‌ ప్రభుత్వం నిరాకరిస్తుందని, పైగా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిషేధిత ప్రాంతంలో పర్యటిస్తే తప్పని, టీడీపీ నేతలు పాకిస్తాన్‌ సరిహద్దులో పర్యటించలేదని, ప్రాజెక్టుల నిర్మాణాలను శాంతియుత వాతావరణంలో పర్యటించేందుకు యాత్రచేస్తే నిర్బంధిస్తారా అంటూ ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును, మాజీ కేంద్ర, రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠినవైఖరి అవలంభించిన చవాన్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని నరేందర్‌రెడ్డి హెచ్చరించారు.

భద్రతావ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి

ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా భద్రతావ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనాఉందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎన్‌.నర్సింహ్మన్‌ స్పష్టంచేశారు. సోమవారం నోవాటెల్‌ హోటల్‌లో
ఏర్పాటుచేసిన జీఎంఆర్‌ పాన్‌ ఇండియా సెక్యూరిటీ సమ్మీట్‌-2010 నేషనల్‌ లెవల్‌ సెక్యూరిటీ సెమినార్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సెమినార్‌ జీహెచ్‌ఐఎల్‌ ఏపీ స్టేట్‌ డయాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌, రక్సా సెక్యూరిటీ సర్వీస్‌ లిమిటెడ్‌ వారి సౌజన్యంతో రెండురోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జనాభాతోపాటు కార్పోరేట్‌స్థాయిలో నిర్మిత మవుతున్న భారీభవనాల్లో జరుగుతున్న ప్రమాదాలను సాంకేతిక పరిజ్ఞానంతో ముందే పసిగట్టడంతో ధన, మాన, ప్రాణాలను కాపాడే అవకాశంఉందని అన్నారు.
ఏ స్థాయిలో జరిగే విపత్తు అయినా గుర్తించడానికి అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో సమాచారవ్యవస్థకు బాగా డిమాండ్‌ఉందని తెలిపారు. ఫుడ్‌ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, టెర్ర రిజమ్‌ సెక్యూరిటీకి, సైబర్‌ క్రైమ్‌ తదితర నేరాలను సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థతో గుర్తించే వీలుందని తెలిపారు. జీఎమ్మార్‌ దేశంలో దేశంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తూ సెక్యూరిటీలో పకడ్బందీగా వ్యవహరిస్తుందని తెలిపారు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌‌స బిజినెస్‌ ఛైర్మన్‌ గ్రంధి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ మల్టీనేషనల్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ను వరల్డ్‌క్లాస్‌ సెక్యూరిటీ సేవలందించడమే జీఎంఆర్‌ ధ్యేయమని తెలిపారు. రక్షా సెక్యూరిటీ అకాడమి బెంగుళూరులో 100ఎకరాల స్థలంలో శిక్షణను గత ఐదేళ్లనుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్‌ మాజీ గవర్నర్‌ శామలదత్త, రిటైర్డ్‌ డీజీపీ హెచ్‌.జె.దొర, ఎస్పీజీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం, ఎంఆర్‌ రెడి,్డ అరవిందరావు, ప్రవీణ్‌స్వామి, ఎం.ఎస్‌.బాలి తదితరులు పాల్గొన్నారు.

తాండూర్‌లో హర్తాళ్‌ సంపూర్ణం

టిడిపి రాష్ట్ర వ్యాప్త హర్తాళ్‌కు పిలుపునివ్వడంతో తాండురులో శనివారం బంద్‌ సంపూర్ణంగా జరిగింది.ఉదయం 3 గంటలకు ముంబాయి.10 గంటలకు హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపి వేశారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసి బస్టాండ్‌ చేరుకుని బస్సులను నిలిపి వేశారు. ఆందోళకారుల మాటలు వినకుండా బస్సులు నడిపించేందుకు ఆర్టీసి డిఎం ప్రయత్నించడంతో తాండూరు నుండి హైదరాబాద్‌,కరణ్‌కోట్‌ వెలుతున్న ఆర్టీసి బస్సులపైన ఆందోళన కారులు రాళ్ళు రువ్వారు.దీంతో బస్సుల అద్దాలు ద్వంసం అయ్యాయి. బంద్‌ పాటించని పట్ణంలోని ఓ కిరాణా కొట్టులో సామానులను ద్వంసం చేశారు.పట్ణణంలో ర్యాలి నిర్వహించి స్థానిక ఇందిరాచౌక్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు రాజుగౌడ్‌ మాట్లాడుతు గోదావరి నదిపై మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లి ప్రాజెక్టును సందర్శిం చడానికి వెళ్లిన తమ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహ మరో 70 మంది టిడిపి ప్రజా ప్రతినిధులను మహరాష్ట్ర పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని ఆరోపించారు.బాబ్లి నిర్మాణం ఆపే వరకు టిడిపి పోరాటం చేస్తుందని హెచ్చరించారు.టిడిపి రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు మాట్లాడుతు తెలంగాణా ప్రజల నీళ్లను అడ్డుకుంటే చూస్తు ఊరుకోమని అన్నారు.అకారణంగా అరెస్టు చేసిన టిడిపి ప్రజాప్రతినిధులను వెంటనె విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
పట్టణ టిడిపి అధ్యక్షులు అబ్దుల్‌ రావూఫ్‌ మాట్లాడుతు టిడిపి ప్రజా ప్రతినిధులను వెంటనె విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.మహరాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నాయకులను చిత్రహింసలు పెడుతున్నారని మహిళా ప్రజాప్రతినిధులకు సరైన సదుపాయాలు కల్పించలేదని ఆరోపిం చారు.ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదని అన్నారు. తమ నాయకులను భేషరతుగా వెంటనె విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సిఎం దిష్టి బొమ్మను దగ్దం చేశారు.ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో యాలాల జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్‌, తాండూరు జడ్పిటిసి సుందర్‌రాజ్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గాజిపూర్‌ నారాయ ణరెడ్డి, కౌన్సిలర్‌లు పరిమళ,శోభారాణి,నాయకులు భరత్‌ భూషణ్‌, అగ్గనూర్‌ జగదీశ్వర్‌,సపంత్‌కుమర్‌,అబ్దుల్‌ రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశం నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ ధర్నా

బాబ్లీలో టీడీపీ నాయ కుల అరెస్టుకు నిరసనగా ఆదివారం పెద్దేముల్‌ మండల నాయకులు మంబాపూర్‌లో ధర్నా నిర్వహించారు. అంతకుముందు గంటపాటు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ను సందర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ‘దేశం’ నాయకులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మహా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసుపలు కుతూ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తుం దని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రజల గొంతు ఎండుతుందని, నిర్మాణం పనులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు.
టీడీపీ నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు, లాఠీచార్జీలు ఉద్య మాలను ఆపలేరని హెచ్చరించారు. కార్యక్ర మంలో మారజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గాజీపూర్‌ నారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంజిల్‌రెడ్డి, ఎంపీటీసీ కొమ్ము గోపాల్‌రెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి ముస్తపా, గ్రామ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు.

బీటలు వారుతున్న ‘శివసాగర్‌’

తాండూరు డివిజన్‌ పరిధిలోని శివసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన అలుగు బీటలువారింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు కూడా బీటలువారడంతో ఆయకట్ట కింద ఉన్న భూములు ముంపునకు గురైయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిర్మాణదశలోనే ప్రాజెక్టు బీటలు వారడంతో పనులు ముందుకు కొనసాగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా నాసిరకం పనులు చేపట్టడంతో పనులలో నాణ్యతలోపించి ప్రాజెక్టు బీటలు వారింది. గతంలో ప్రాజెక్టు బీటలు వారడంతో అధికారులు సందర్శించి సదరు కాంట్రాక్టర్‌తో మరమ్మతులు చేయించారు. అయితే పనులు నాసికరంగా ఉండటంతో మళ్లీ ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడింది. యాలాల మండల రైతులకు సుమారు 900 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో రూ.4.96కోట్లతో శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మొదట్లో పనులు చురుగ్గా సాగినా నిధుల విడుదలో జాప్యం ఏర్పడి పనులు నిలిచిపోయాయి. ఆరు సంవత్సరాలు గడుస్తున్న పనులు పూర్తికాలేదు. కేవలం ప్రధాన అలుగు, ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నిర్మాణం చేపట్టారు.
కాంట్రాక్టర్‌లు పనులలో నాణ్యత పాటించక పోవడంతో చేసిన పనులు వృథాగా మారాయి. ప్రాజెక్టుపనులు 2008లో పూర్తి కావలసి ఉండగా ఇంతవరకు పూర్తికాలేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే సుమారు 900ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణదశలోనే బీటలు వారడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కుడి ఎడమ కాలువలు కూడా బీటలు వారి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పనులు పూర్తయినా ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.3కోట్లపైన నిధులు ఖర్చు చేసినా సగం పనులు కూడా పూర్తికాలేదు. నిర్మాణంలోనే ప్రాజెక్టు, కుడి ఎడమ కాలువలు బీటలు వారడంతో ఆయకట్టు కింద ఉన్న భూములకు ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. కాంట్రాక్టర్‌ల నిర్లక్ష్యం కారణంగానే పనులు నాసిరకంగా జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. బీటలువారిన ప్రాజెక్టు పనులను అధికారులు సందర్శించి మరమ్మతులు చేయించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

దశతిరగని దశబ్దాల ప్రాజెక్టులు

‘జలయజ్ఞం’ పేరిట కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. దశాబ్ధాల కాలం క్రితం నిర్మించిన పాత ప్రాజెక్టుకాల్వలు, ఆనకట్టలు, శిథిలావస్థకు చేరుకొని పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. పాత ప్రాజెక్టులకు పాతరవేసి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు చేసేది ఏమిటన్న విమర్శలొస్తున్నాయి. నిర్వహణలోపంతో దశాబ్ధాల క్రితం నిర్మించిన ప్రాజెక్టుల ఆయకట్టు ప్రతి ఏడాది కుచించుకుపోతుంది. జలయజ్ఞంలో ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో కాలువలు శిథిలావస్థకు చేరుకుని సాగునీరందిం చలేని పరిస్థితి నెలకొంది. తాండూరు నియోజకవర్గంలో నాలుగు దశాబ్ధాల క్రితమే రెండు మధ్యతరహా, రెండు చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మించారు. నాలుగు దశాబ్ధాల క్రితమే దాదాపు 15వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నిధులు కేటాయింపులేకపోవడం, నిర్వాహణలేక నేడది సగానికి ఆయకట్టు తగ్గిపోయింది. రైతు రాజ్యంలో ఆయకట్టు భూములకు నీరందక కర్షకులు కంటతడిపెడుతున్నారు.
నాలుగు ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాల్వలన్నీ శిథిలావస్థకు చేరుకొని పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. జిల్లాకే మణిహారమైన మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి తాండూరు నియోజకవర్గంలోనే ఉంది. గడిచిన నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల కేటాయింపే లేదు. అరకొర నిధులు కేటాయించిన కాట్రాక్టర్ల పాలవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పెద్దేముల్‌ మండలం కోట్‌పల్లి గ్రామసమీపంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించారు. తాండూరు నియోజకవర్గంలో జుంటుపల్లి ప్రాజెక్టు (యాలాల మండలం), శ్రీరాములవారి ప్రాజెక్టు, అల్లాపూర్‌ ప్రాజెక్టు (తాండూరు మండలం), కోట్‌పల్లి ప్రాజెక్టు (పెద్దేముల్‌ మండలం)లున్నాయి. వీటిలో కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు మధ్యతరహా, శ్రీ రాముల వారి అల్లాపూర్‌ ప్రాజెక్టులు చిన్నతరహా ప్రాజెక్టులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
‘జలయజ్ఞం’ పేరిట ఈ ప్రాంతంలో శివసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మధ్యతరహా ప్రాజెక్టులైనా కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులకు కూడా నిధుల కేటాయింపులు రాష్ట్రప్రభుత్వం చేయలేదు. దీంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని ప్రభుత్వం, పాలకులు చెబుతున్న మాట వాస్తవరూపంలో సుదూరంలో ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లుగా తాండూరు ప్రాంతం యాలాల మండలం కాక్రవేణి ఆధారంగా నిర్మిస్తున్న శివసాగర్‌ ప్రాజెక్టు ఐదేళ్లుగా నిర్మాణదశలోనే ఉంది. ఒక్క ఎకరం సాగువిస్తీర్ణం కొత్త ప్రాజెక్టు నిర్మాణం ద్వారా జరగలేదు. తాండూరు ప్రాంతంలోనున్న నాలుగు ప్రాజెక్టుల మరమ్మతులకోసం రాష్ట్రప్రభుత్వానికి కోట్లాది రూపాయల విలువైన ప్రతిపాదనలు పంపిస్తున్నారే తప్పా నిధుల మంజూరు లేదు.
కోట్‌పల్లి ప్రాజెక్టు కింద కెనాల్స్‌ పూర్తిగా ఆధ్వాన్నంగా తయారయ్యాయి. మంబాపూర్‌, మన్‌సాన్‌పల్లి, జనగాం, పెద్దేముల్‌ గ్రామాలను అనుసంధానంచేస్తూ దశాబ్ధాలక్రితం నిర్మించిన కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కాల్వలు ముళ్ళపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. దీంతో సగానికిపైగా సాగు విస్తీర్ణం పడిపోయింది. రైతులు వర్షాధార పంటలను పండించుకోవాలని యోచిస్తున్నారు. తాండూరు మండలం అల్లాపూర్‌, శ్రీరాములవారి ప్రాజెక్టు (జిన్‌గుర్తి) కింద ఉన్న 10 గ్రామాల రైతుల జీవనాధారం. అయితే ఇక్కడ కాల్వలు, తూములు మరమ్మతులు లేక అధ్వాన్నంగా మారి నాలుగోవంతు విస్తీర్ణం మాత్రమే సాగవుతుంది. యాలాల మండలం జుంటుపల్లి ప్రాజెక్టు కింద నిర్మించిన కాల్వలు పాడైపోయాయి. ప్రాజెక్టులలో వర్షాబావం వల్ల నీరుచేరిన కాల్వల దుస్థితి కారణంగా సాగునీరందడంలేదు. ఉన్న కాలువలైన మరమ్మతులకు నోచుకుంటే సాగు నీరందించేందుకు వీలవుతుంది.

బంద్‌ను విజయవంతం చేయాలని మల్కాజిగిరిలో టిడిపి భారీ ర్యాలీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మల్కాజిగిరిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన వారిని మోసపూరితంగా అరెస్ట్ చేయటం సరైన చర్య కాదని, దీనికి నిరసనగా సోమవారం నిర్వహించనున్న బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. రంగారెడ్డిజిల్లా టిడిపి అధికార ప్రతినిధి ఆర్.జితేందర్ రెడ్డి, కార్యానిర్వహక కార్యదర్శి ఎన్.జగదీష్ గౌడ్, పూలపల్లి లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యాక్షుడు ఆకుల నర్సింగరావు, హుడా మాజీ డైరెక్టర్ ఎన్.వీరేశం యాదవ్ తదితరులు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన తమ తప్పుతెలుసుకొని బాబ్లీ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను చూసే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి తీవ్ర విఘాతం కలిగే బాబ్లీ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని, సోమవారం నాటి బంద్‌ను పూర్తిగా విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ర్యాలీలో డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సతీష్, వై.సుధాకర్ రెడ్డి, జి.కె.యాదవ్, కరుణం గోపి తదితరులు పాల్గొన్నారు.

ఆలయం వద్ద మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించిన మద్యం దుకాణాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలోని మద్యం దుకాణ అనుమతిని వేలంపాటలో శ్రీనివాస్ యాదవ్ దక్కించుకున్నారు. కాగా గంగారం మద్యం దుకాణం పేరుతో 9వ నెంబరు జాతీయ రహదారిపై గంగారం వద్ద ఆదివారం దుకాణాన్ని ప్రారంభించారు. ఈ దుకాణానికి సమీపంలో అమ్మవారి ఆలయం ఉండడంతో గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం తెలిపుతూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మద్యం దుకాణం మూసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళలో స్థానిక నాయకులు జి.రవికుమార్, వై.నగేష్‌యాదవ్, మహిళలు పాల్గొన్నారు.
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వివరణ
ఎక్సైజ్‌శాఖ నిబంధనల ప్రకారమే మద్యం దుకాణానికి అనుమతి ఇచ్చారని శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ఆలయం దేవాదాయశాఖ గుర్తింపు లేనందున అక్కడ దుకాణం నడుపుకోవచ్చని తెలిపారు. గుర్తింపు లేని దేవాలయాలను పరిగణలోకి తీసుకోమని, నిబంధనలను అనుసరించే ఏర్పాటు చేశారని వివరించారు. అయితే గ్రామస్థుల అభ్యంతరం మేరకు పరిశీలిస్తామని అన్నారు.