రంగా రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చిట్టచివరి సారిగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సారి అధిష్ఠానం సానుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌పై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి, గవర్నర్ కేంద్రానికి, అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, ఆ నివేదికల అధారంగానే అధిష్ఠానం ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు అధిష్ఠాన వర్గం తన దూతగా ఎవరినైనా పంపించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా అని వారు అభిప్రాయ పడ్డారు. సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఢిల్లీలో చేసిన ప్రకటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి తెరాస అధినేత కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సమావేశం ఖండించింది.
సకల జనుల సమ్మెతో తెలంగాణలో జన జీవనం స్తంభించినా అధిష్ఠాన వర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సారధ్య సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక చివరిసారిగా ఢిల్మీకి వెళ్ళి అధిష్ఠాన వర్గాన్ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుదాం, అధిష్ఠాన వర్గం సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేద్దాం’ అని సమావేశంలో సభ్యులు అన్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మళ్ళీ మనం ఎవరం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అందరం రాజీనామాలు చేస్తే అధిష్ఠానవర్గమే దిగి వచ్చి తెలంగాణను ప్రకటిస్తుంది’ అని అన్నారు.
మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న విషయం చర్చకు వచ్చినపుడు, ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సారధ్య సంఘం చైర్మన్‌గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సమావేశంలో తెలియజేశారు. వెంటనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకుని తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తన రాజీనామా గురించి ఇంతకు ముందే చెప్పానని, నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రకటించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, తన సోదరుడు, ఉద్యావన శాఖ మంత్రి ఆర్.వెంకటరెడ్డితో కూడా తాను రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన తెలంగాణ మంత్రుల్లో ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో ఇప్పుడే చెప్పలేమని వారు అభిప్రాయ పడ్డారు.
మాకు కావాల్సింది తెలంగాణ.. కిలో రూ.1 బియ్యం కాదు
ఇలా ఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. సకల జనుల సమ్మె ఇంత తీవ్రంగా ఉంటే రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘మాకు కావలసింది తెలంగాణ తప్ప రూపాయికి కిలో బియ్యం కాదు’ అని దామోదర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె ప్రభావం గురించి ముఖ్యమంత్రి అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.
తెలంగాణ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి పరిస్థితిని అధిష్ఠాన వర్గానికి వివరించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతామన్నారు. 26వ తేదీన అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటామని, ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్ తిరిగివచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
తప్పుడు నివేదికలు పంపుతున్న సిఎం, గవర్నర్
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాధం మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణా రాష్ట్ర డిమాండుతో సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘నో వర్క్ … నోపే’ అంటూ గతంలో జారీచేసిన జీవో 177ను కచ్చితంగా అమలుచేయాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఈనెల 17వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకూ, జిల్లా కలెక్టర్లకూ మెమో జారీ చేశారు. తాజాగా ఈ విషయమై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే ఆదేశాలను జారీచేశారు. ‘సమ్మె చేస్తున్న ఉద్యోగులకు జీతాలను నిలిపియండి’ అని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. విధులకు హాజరైన ఉద్యోగుల నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘విధులకు హాజరైన ఉద్యోగుల నుండి సర్టిఫికెట్లు తీసుకున్న తరువాతే వారి పేర్లను పే రోల్స్‌లో చేర్చాలి’ అంటూ గురువారం నాడే ఆదేశాలు జారీఅయ్యాయి. మరోవైపు సమ్మె కారణంగా ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని ప్రజలపై మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్న బొగ్గు, విద్యుత్, గ్యాస్ సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం యూనిట్‌కు 50 నుండి 60 పైసల సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నందున సర్‌ఛార్జీ భారాన్ని రైతులపై వేయలేం. ఇతర తరగతులకు చెందిన ప్రజలు, పరిశ్రమల నుండి ఈ మొత్తాన్ని వసూలు చేస్తాం’ అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ప్రజాశక్తితో చెప్పారు.
హైకోర్టు తీర్పు సాకుతో…!
‘నోవర్క్ .. నోపే’ విధానంతో జారీ చేసిన జీవో 177 అమలుకు హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఒక రిట్ పిటిషన్‌పై ఆగస్టు 16న హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో జీవో 177ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 1677 అమలుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జీవో 177ను అమలుచేయక తప్పనిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ అనుమతి లేకుండా జీవో 177లో ఎటువంటి మార్పులూ చేయకూడదని హైకోర్టు ఆదేశించిందని ఈ నేపథ్యంలో జీతాలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని ఆ వర్గాలంటున్నాయి. వాస్తవానికి ఈ విషయాలను పేర్కొం టూనే 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 30389 మెమోను అన్ని ప్రభుత్వ
శాఖలకూ జారీ చేశారు. జీతాల డ్రాయింగ్ అధికారులు జీవో 177ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, పే బిల్స్ ట్రెజరీకి సమర్పించే సమయంలో ఆ మేరకు సర్టిఫికెట్లు సమర్పించాలని ఆ మెమోలో ఆయన ఆదేశించారు. దీంతో పే రోల్స్ తయారు చేయడం నత్తనడకగా మారింది. దీన్ని నివారించడానికి విధులకు హాజరైన వారి నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రోజుకు 75 కోట్ల రూపాయల మేర జీతాలు చెల్లించాల్సుంది. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగులకు రోజుకు 33 కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించాల్సుంది.
విద్యుత్ భారం ఇలా…!
విద్యుత్ కొరతను నివారించడానికి ఇప్పటివరకు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదిగాకుండా ఇతర రాష్ట్రాలనుండి పెద్దఎత్తున బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గును సరఫరా చేయడానికి మహారాష్ట్ర 33 కోట్ల రూపాయల మొత్తాన్ని అడ్వాన్స్‌గా అడిగినట్లు తెలిసింది. మిగిలిన సంస్థలు కూడా ఇదే రీతిలో డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ను ‘బదులు’ ప్రాతిపదికన సరఫరా చేయడానికి సంసిద్దత వ్యక్తంచేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతోంది. లేనిపక్షంలో పీక్ సమయంలోనే ఆ రాష్ట్రాలు బదులు చెల్లించాలని డిమాండ్ చేస్తే కష్టమవుతుందని చెబుతున్నారు. బొగ్గు కోసం 40 నుండి 50 శాతం అధికంగా చెల్లించాల్సివస్తోందని, విద్యుత్ కొనుగోళ్ళు కూడా ఇదే మాదిరి సాగుతోందని, సహజవాయువు కోసం ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు చేయావస్తోందని ఒక అధికారి వివరించారు. ‘ఈ మొత్తాన్ని లెక్కిస్తే యూనిట్‌కు 50 నుండి 60 పైసలు అధికంగా ఖర్చవుతోంది’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ భారం ప్రజలపైనే పడనుంది.
సమ్మెలో లేని ఉద్యోగులకు సకాలంలో జీతాలు : సిఎం
సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు సిఎం ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
సమ్మెలో ఎందరు …?
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వోద్యోగులు 34 నుండి 36 శాతంలోపే సమ్మెలో పాల్గొంటున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఉపాధ్యాయులతో పాటు సింగరేణి, ఆర్టీసీల్లో సమ్మె పెద్దఎత్తున జరుగుతోంది. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగులు 85 శాతానికి పైగా సమ్మెలో భాగస్మాములవుతున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంతో పాటు, హెచ్‌ఓడిల స్థాయిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విధులకు హాజరవుతుండటంతో ప్రభుత్వోద్యోగుల సంఖ్య తక్కువగా కనబడుతోందని ఆయన వివరించారు. జిల్లాల స్థాయిలో 80 నుండి 86 శాతం మంది ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉన్నారని ఆయన చెప్పారు.
శాఖ మొత్తం ఉద్యోగులు సమ్మెలో ఉన్నవారు
ప్రభుత్వోద్యోగులు 252000 86800
ఉపాధ్యాయులు 141000 128000
సింగరేణి 67000 57100
ఆర్టీసి 66000 65192

‘ఇంకానా… ఇకపై సహించం’ అంటూ తెలంగాణ ఉద్యమ ఉధృతికి నేతృత్వం వహిస్తున్న కొందరు నేతలు తమ పిల్లల్ని మాత్రం ‘భద్రం కొడుకో…!’ అంటూ ఆంధ్రా ప్రాంతంలో హాస్టళ్లలో వుంచి చదివిస్తున్నారు. ఉద్యమ సెగ తమ పిల్లల భవిష్యత్తుకు ఏమాత్రం తగలకుండా ముందే జాగ్రత్త పడ్డారు. వాళ్ల బాటలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపన్న, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కొందరు కూడా తమ పిల్లల్ని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని కాలేజీల్లో చేర్పించారు.
తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. విద్యార్థులూ,ఉద్యోగులు, కవులు, కళాకారులు, కులసంఘాలు ఒకటేంటి అన్ని రంగాలకు చెందిన మెజారిటీ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జిల్లాల్లోని ఓయు, కేయు వంటి యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు పూర్తిగా ఉద్యమంలోనే ఉన్నారు. ఇక ప్రాధమికోన్నత పాఠశాలనుండి మొదలుకుని ఇంటర్ కాలేజీల వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సకల జనుల సమ్మెతో దాదాపు మూత పడ్డాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులంతా ఉద్యమంలో ఉంటే ఇటు ముందు చూపుతో ఆంధ్రాప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు ఎంచక్కా బుద్ధిగా చదువు కుంటున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉన్న నారాయణ, శ్రీచైతన్య, ఎన్‌ఆర్‌ఐ, శ్రీగాయత్రి, కెకెఆర్ గౌతమ్‌స్కూల్ వంటి సంస్థల్లో సుమారు 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ప్రస్తుత విద్యాసంత్సరంలో ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రాజిల్లాల్లో చేరారు.
విజయవాడ, గుంటూరుల్లోని శ్రీచైతన్య కాలేజీలొనె ఇంటర్ చదివే విద్యార్థులు సుమారు 28 వేల మంది చదవుతున్నారు. నారాయణ కాలేజీలో విజయవాడ, గుంటూరు బ్రాంచిల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. శ్రీగాయత్రీ, ఎన్‌ఆర్‌ఐ కాలేజీల్లో 40 వేలకు పైగా చదువుతున్నారు. ఇలా చేరడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ పోరాట భయమేనని పలువురంటున్నారు. తెలంగాణ పోరాటం తారాస్థాయికి చేరడంవల్ల తమ పిల్లల చదువులు తెలంగాణలో సజావుగా సాగవనే విషయాన్ని ముందుగానే గుర్తించిన ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనాయకులు అనేక మంది తమ పిల్లలను తెలివిగా ఆంధ్రా ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేర్పించారు.
తెలంగాణ విద్యార్థుల సంఖ్యపై ఇంటిలిజెన్స్‌ఆరా..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థుల సంఖ్యపై ఇటీవలే కేంద్ర,రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఆయా సంస్థలకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్,ఎంసిఏ, ఇతర టెక్నికల్ కోర్సుల్లో చదువుతున్నట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఆయా వర్గాలు ఈ అంశాలు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆంధ్రాప్రాంత జిల్లాల్లోని ఈ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తెలంగాణ ఉద్యమం లేని సమయంలోకూడా ఆయా జిల్లాలనుంచి విద్యార్థులు చదివారు. ఇప్పుడు ఆ నాటి శాతంతో పోల్చినప్పుడు వెయ్యిరెట్లు ఎక్కువగా చేరారు. ప్రస్తుత విద్యార్థుల వలసకు కారణం ముమ్మాటికీ తెలంగాణ ఉద్యమ తీవ్రతేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
‘కార్పొరేట్’ విద్యార్థుల తరలింపు..
ప్రధాన కార్పోరేట్ విద్యాసంస్థలు తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని హైద్రాబాద్‌తోసహా తెలంగాణ జిల్లాల్లో ఉన్న తమ బ్రాంచ్‌లనుండి సగానికి పైగా విద్యార్థులను సీమాంద్ర ప్రాంత జిల్లాలకు తరలించారు.

ఏ రాజకీయ నాయకుడి చైతన్యం ఉద్యోగులకు అవసరం లేదు. ఇక్కడ చైతన్యం వచ్చే ఉన్నరు. ఇదో కొత్త చైతన్యం మాకొద్దు. నీ చైతన్యం నీ నియోజకవర్గంలో అక్కడ చూపించుకో. నీ బండారం ఆడ బయటపడతది. అందుకే మనం రాజకీయ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉంది. జేఏసీలో లేని ఏ నాయకుడిని శిబిరాల్లో మన దగ్గర కాలుబెట్టనీయవద్దు. ఆడిని రానిచ్చినమంటే ఆడి మాయమాటలకు ఎప్పుడు ఇనికి పోతమో మనకే తెలియదు. అంత బంగారు మాయమాటలుంటాయ్ వాళ్లవి. సకల సజనుల సమ్మె ఏదీ? ఎవనంతట వాడు పోతనే ఉన్నడు. వస్తనే ఉన్నడు. బస్సులు తిరుగుతూనే ఉన్నయ్. పబ్లిక్ తిరుగునే ఉంది.
ఏరీ సకల జనులు? ఏరీ రాజకీయ నాయకులు? ఎవరు సమ్మెలున్నరు? ఉద్యోగులు చేస్తేనే సమ్మె. ఇది సకలోద్యోగుల సమ్మె. ఉద్యోగులు పది, ఇరవై రోజులు సమ్మె చేసి, ఇగ మాకు చేతగాదని మానేస్తే.. ఇంకా ఐదురోజులు చేయకపోతిర్రా.. తెలంగాణ వస్తుండె.. అని అప్పుడే లేచొచ్చిన లుచ్చాలు నామీద రాళ్లేస్తరు. రేపెవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే లాగి చెంపదెబ్బ కొట్టకొట్టండి. లమ్డికొడకా నీవెన్నిరోజులు చేస్తివిరా సమ్మె? ఎప్పటిదాకా చేస్తివరా సమ్మె అని నిలదీయండి. పదిరోజులు మించి సమ్మె చేయలేం. అంతకుమించి బలవంతం చేస్తే సహించవద్దు. రాజకీయ నేతలు మనల్ని పట్టించుకోవడం లేదు’ – ఈ మాటలు ఎవరివో తెలుసా? తెలంగాణ సకల జనుల సమ్మెకు సార ధ్యం విహస్తోన్న ఉద్యోగుల జేఏసీ నేత కె. స్వామిగౌడ్‌వి. రాజకీయ నాయకుల కంటితుడుపు మద్దతు, పెదవులకే పరిమితమైన సంఘీభావంతో ఉద్యోగులు ఏ స్థాయిలో విసిగి వేసారిపోయారో స్వామిగౌడ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమయింది.
గత కొద్దిరోజుల నుంచి రాజకీయ నాయకులు, ప్రధానంగా సకల జనుల సమ్మెను తెరవెనుక ఉండి నడిపిస్తున్న టీఆర్‌ఎస్.. సమ్మెకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఆగ్రహం కలిగిస్తోంది. తమను ముందుకు నెట్టిన రాజకీయ నాయకులు సీరియస్‌గా రంగంలోకి దిగడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారు. స్వామిగౌడ్ మాటలు నిశితంగా పరిశీలిస్తే మరో పదిరోజుల వరకే ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయగలరన్న విషయం స్పష్టమవుతోంది. ‘మీరు మాకు సమ్మెకు ముందు చెప్పినదేంది? ఇప్పుడు చేస్తున్నదేంది? రోడ్లపై బస్సులు తిరగనీయమన్నారు. సర్కారు కార్యాలయాలకు తాళాలు వేస్తామన్నారు. రోడ్లు తవ్వేస్తమన్నారు.
సరిహద్దులు మూసివేస్తామని అన్నారు. కానీ మీరు చెప్పిన మాటల్లో ఒక్కటీ జరగనప్పుడు మేం సమ్మె చేసి ఏం ప్రయోజనమ’ని గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ, జాక్ నేతలపై విరుచుపడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్వామిగౌడ్ ఆగ్రహం, ఆయన విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయారని స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుపెట్టుకుని, ఉద్యోగులను పావులుగా వాడుకుం టున్నారన్న విమర్శలను స్వామిగౌడ్ ఆవేదన నిజం చేసేలా ఉన్నాయి.

ఏ రాజకీయ నాయకుడి చైతన్యం ఉద్యోగులకు అవసరం లేదు. ఇక్కడ చైతన్యం వచ్చే ఉన్నరు. ఇదో కొత్త చైతన్యం మాకొద్దు. నీ చైతన్యం నీ నియోజకవర్గంలో అక్కడ చూపించుకో. నీ బండారం ఆడ బయటపడతది. అందుకే మనం రాజకీయ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉంది. జేఏసీలో లేని ఏ నాయకుడిని శిబిరాల్లో మన దగ్గర కాలుబెట్టనీయవద్దు. ఆడిని రానిచ్చినమంటే ఆడి మాయమాటలకు ఎప్పుడు ఇనికి పోతమో మనకే తెలియదు. అంత బంగారు మాయమాటలుంటాయ్ వాళ్లవి. సకల సజనుల సమ్మె ఏదీ? ఎవనంతట వాడు పోతనే ఉన్నడు. వస్తనే ఉన్నడు. బస్సులు తిరుగుతూనే ఉన్నయ్. పబ్లిక్ తిరుగునే ఉంది.
ఏరీ సకల జనులు? ఏరీ రాజకీయ నాయకులు? ఎవరు సమ్మెలున్నరు? ఉద్యోగులు చేస్తేనే సమ్మె. ఇది సకలోద్యోగుల సమ్మె. ఉద్యోగులు పది, ఇరవై రోజులు సమ్మె చేసి, ఇగ మాకు చేతగాదని మానేస్తే.. ఇంకా ఐదురోజులు చేయకపోతిర్రా.. తెలంగాణ వస్తుండె.. అని అప్పుడే లేచొచ్చిన లుచ్చాలు నామీద రాళ్లేస్తరు. రేపెవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే లాగి చెంపదెబ్బ కొట్టకొట్టండి. లమ్డికొడకా నీవెన్నిరోజులు చేస్తివిరా సమ్మె? ఎప్పటిదాకా చేస్తివరా సమ్మె అని నిలదీయండి. పదిరోజులు మించి సమ్మె చేయలేం. అంతకుమించి బలవంతం చేస్తే సహించవద్దు. రాజకీయ నేతలు మనల్ని పట్టించుకోవడం లేదు’ – ఈ మాటలు ఎవరివో తెలుసా? తెలంగాణ సకల జనుల సమ్మెకు సార ధ్యం విహస్తోన్న ఉద్యోగుల జేఏసీ నేత కె. స్వామిగౌడ్‌వి. రాజకీయ నాయకుల కంటితుడుపు మద్దతు, పెదవులకే పరిమితమైన సంఘీభావంతో ఉద్యోగులు ఏ స్థాయిలో విసిగి వేసారిపోయారో స్వామిగౌడ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమయింది.
గత కొద్దిరోజుల నుంచి రాజకీయ నాయకులు, ప్రధానంగా సకల జనుల సమ్మెను తెరవెనుక ఉండి నడిపిస్తున్న టీఆర్‌ఎస్.. సమ్మెకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఆగ్రహం కలిగిస్తోంది. తమను ముందుకు నెట్టిన రాజకీయ నాయకులు సీరియస్‌గా రంగంలోకి దిగడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారు. స్వామిగౌడ్ మాటలు నిశితంగా పరిశీలిస్తే మరో పదిరోజుల వరకే ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయగలరన్న విషయం స్పష్టమవుతోంది. ‘మీరు మాకు సమ్మెకు ముందు చెప్పినదేంది? ఇప్పుడు చేస్తున్నదేంది? రోడ్లపై బస్సులు తిరగనీయమన్నారు. సర్కారు కార్యాలయాలకు తాళాలు వేస్తామన్నారు. రోడ్లు తవ్వేస్తమన్నారు.
సరిహద్దులు మూసివేస్తామని అన్నారు. కానీ మీరు చెప్పిన మాటల్లో ఒక్కటీ జరగనప్పుడు మేం సమ్మె చేసి ఏం ప్రయోజనమ’ని గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ, జాక్ నేతలపై విరుచుపడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్వామిగౌడ్ ఆగ్రహం, ఆయన విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయారని స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుపెట్టుకుని, ఉద్యోగులను పావులుగా వాడుకుం టున్నారన్న విమర్శలను స్వామిగౌడ్ ఆవేదన నిజం చేసేలా ఉన్నాయి.

సకలజనుల సమ్మె తెలంగాణ ప్రజల పాలిట మరో స్వాతంత్య్ర పోరాటమని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంఘీవభావం తెలిపేందుకు విచ్చేసిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు, రైతుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. అయితే విద్యుత్ ఉద్యోగులు రైతులకు కరెంటు సరఫరా చేసే విషయంలో ఎలాంటి రాజీలేని ధోరణిని ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను కరెంటు ఉద్కోగులు, రైతులు తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
పోలీసు బెటాలియన్‌లను రప్పించి ఉద్యమాన్ని ఆపాలని అనుకోవడం పొరపాటని, విలీనం నాడు దోపిడీ చేస్తారనే భయం ఉండేది, విడిపోయేటప్పుడు దోపిడీకి గురయ్యారన్న భయం తెలంగాణ ప్రజలకు ఉందని, తెలంగాణ వనరులను దోచుకుని సీమాంధ్ర నాయకులు పన్నులు కూడా చెల్లించరని ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 73శాతం తెలంగాణ ప్రజలు చెల్లిస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రజలు పన్ను ఎగవేస్తే, రాయలసీమ ప్రజలు అసలు పన్నే కట్టకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణలో ఉన్న వనరుల ద్వారా మిగులు బడ్జెట్ ఏర్పడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదన్న భయం అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వడ్డీతో సహ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని వాగ్దానం చేశారు. ఎన్‌టిపిసి ఉద్యోగులకు సమానంగా తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్ స్మారకస్ధూపాన్ని మింట్ కాంపౌండ్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పునఃనిర్మాణం కోసం అవసరమైతే ఒక గంట అధికంగా పని చేసి ఆర్ధికపరమైన ఒడిదుకులను ఎదుర్కొవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. 14ఎఫ్ కోసం పోరాటం చేసినప్పటికి పోలీసులు విద్యార్ధులపైన నిజాం కాలేజీలో లాఠీ ఛార్జీ చేయడం అమానుషమన్నారు. తెలంగా ణలో ప్రజలకు జోనల్ సిష్టం, 610జీఓని అమలు చేయకపోవడం అనేక రకాల అసమానతలకు గురిచేయడం వల్లనే తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నారని అన్నారు.
ఐక్యతతో రాజీలేని పోరాటం ద్వారానే తెలంగాణ ఏర్పడుతుంది తప్ప, రాజకీయ నాయకులను నమ్ముకుంటే రాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేసేంత వరకు గ్రామాల్లో రాన్విద్దని,60 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పోరాటాన్ని తెలంగాణ ఉద్యోగులు జీతాలకు కూడా భయపడకుండా జీవితాల కోసం పోరాటంలాగా భావిస్తున్నారని రాజకీయ నాయకులు మాత్రం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ప్రస్తుతం పరిస్ధితి పులిపై స్వారీలా ఉందని తెలంగాణ ఏర్పాటు ద్వారానే ఈ స్వారీ అంతమవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కొందడరామ్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్,కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పద్మారావు, జేఏసీ విద్యుత్ ఉద్యోగుల కన్వీనర్ రఘు, సభ్యులు జానయ్య, మోహన్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆనందం, న్యూ డెమోక్రసీ నాయకులు సూర్య, గోవర్ధన్, ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్, విద్యాసాగరరావు, ఖైరతాబాద్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ చంద్రశేఖర్(చందూ) తదితరులు పాల్గొన్నారు.

సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలపై జెఎసి నేతలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం, ఉద్యోగ సంఘ నేతలు స్వామిగౌడ్, విఠల్, దేవిప్రసాద్, శ్రీనివాసగౌడ్, బాజపా నేతలు సిహెచ్ విద్యాసాగర్‌రావు, రాజేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేతలు గోవర్ధన్, సూర్యంలు పాల్గొన్నారు. తెలంగాణ సాధనకు అంతిమ పరిష్కారంగా తెరాస అధినేత కెసిఆర్ చేపట్టదలచిన ఆమరణ దీక్షపై సైతం వాడిగావేడిగా జరిగిన చర్చలో ప్రస్తుతానికి ఆయన దీక్ష అంతగా అవసరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వారిస్తున్న తరుణంలో దీక్ష అంత మంచిది కాదనీ, ఇది కాకుండా మరేమైనా ఆందోళనను ఉధృతం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయా నికి వచ్చినట్లు తెలిసింది.
తెలంగాణ సాధన దిశగా సాగుతున్న సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ పొలిటికల్ జెఎసి నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకోను మరుసటి రోజుకూ పొడిగించి రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు టి-జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. అలాగే అక్టోబర్‌లో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయాలని తీర్మానించారు.
సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలపై జెఎసి నేతలు మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం, ఉద్యోగ సంఘ నేతలు స్వామిగౌడ్, విఠల్, దేవిప్రసాద్, శ్రీనివాసగౌడ్, బాజపా నేతలు సిహెచ్ విద్యాసాగర్‌రావు, రాజేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేతలు గోవర్ధన్, సూర్యంలు పాల్గొన్నారు. తెలంగాణ సాధనకు అంతిమ పరిష్కారంగా తెరాస అధినేత కెసిఆర్ చేపట్టదలచిన ఆమరణ దీక్షపై సైతం వాడిగావేడిగా జరిగిన చర్చలో ప్రస్తుతానికి ఆయన దీక్ష అంతగా అవసరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వారిస్తున్న తరుణంలో దీక్ష అంత మంచిది కాదనీ, ఇది కాకుండా మరేమైనా ఆందోళనను ఉధృతం చేసే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయా నికి వచ్చినట్లు తెలిసింది.
తెలంగాణ సాధన దిశగా సాగుతున్న సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ పొలిటికల్ జెఎసి నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకోను మరుసటి రోజుకూ పొడిగించి రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్లు టి-జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. అలాగే అక్టోబర్‌లో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయాలని తీర్మానించారు.

సీమాంధ్రుల పాలనాలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయ మే జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. నిజాం హయాంలోనే తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. నిజాం పాలనాను దూరం చేసుకుని తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణభవన్‌లో నాయిని జాతీ య జెండాను, టీఆర్‌ఎస్ పార్టీ పతకాన్ని ఎగురవేశారు. తెలంగాణలో రోడ్లు, రైల్వే, విద్యుత్, రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసిన ఘనత నిజాందే అన్నారు.
సీమాంధ్రుల పాలనలో నీళ్లు, నిధు లు, ఉద్యోగాలు పోయాయన్నారు. నిజాం హయాంలో గొలుసుకట్టు చెరువులు, నీటి ప్రాజెక్టు లను నిర్మిస్తే, ఆంధ్ర పాలకులు మాత్రం నీళ్ల దోపీడి యథేచ్చగా కొనసాగుతుందన్నారు. విమో చన దినోత్సవం తరువాత గణతంత్రం పోయి…తమకు మెడతంత్రం వచ్చిందని ఎద్దేవా చేశా రు. రాష్ర్టంలో ప్రభుత్వమే లేదని పరిపాలనా పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అన్ని శాఖలు సమ్మెలో పాల్గొంటున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రికి నీతి, నిజాయితీ ఉంటే ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే వెంటనే పదవి కి రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు అప్పుడు తమ తీర్పునిస్తారన్నారు.
తెలంగాణ సాధన కోసం అవసరమైతే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమేనంటూ నాయి ని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జమీందార్, జాగీర్, ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉద్యమించి రాచరిక వ్యవ స్థను కూలదోశారన్నారు. తెలంగాణ ప్రాంతం 1956 వరకు అభివృద్ధి, పునర్నిర్మాణం దిశగా కొనసాగుతుండగా, భాష ప్రాతిపదిక పేరిట ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేయడంతో అభివృద్ధి కుంటుబడిపోయిందన్నారు. నాటి నుంచి నేటి వరకూ అన్యాయానిి, అవినీతికి, అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమిస్తూనే ఉన్నారన్నారు. ప్రజస్వామ్య పద్దతిలో, రాజ్యాంగానికి లోబడి 1969 నుంచీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. రాచరికానికి వ్యతిరేకంగా తమ పూర్వీకులు, నేడు సీమాంధ్ర పాల కుల అహంకారానికి వ్యతిరేకంగా నేటి యువకులు ఉద్యమిస్తున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని కొంతమంది కేవలం వ్యక్తిగత, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ ప్రజలను మోసగిస్తున్నారని స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ముఖ్ధూంభవన్‌లో నిర్వహించిన ఆట-పాట-మాట కార్యక్రమంలో ఆయన ప్రసం గిస్తూ హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ఆనాటి పోరాటామే నేడు మరో రూపంలో ప్రత్యే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతోందనాను. అప్పటి పోరాటంలో నాయకులు ప్రాణత్యాగంతో సహా ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడితే, ప్రస్తుత నాయకులు మాత్రం వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ కోసం ఒకటి, రెం డు మినహా అన్ని రాజకీయ పార్టీలు సుము ఖంగా ఉన్నాయని, అందుకే డిసెంబర్ తొమ్మి దవ తేదీ ప్రకటన వెలువడిందన్నారు. అయి తే కేంద్రం ఇచ్చిన మాటను నిలుపుకో నట్లయితే తెలంగాణ ప్రజలకు సాయుధ పోరాటంమినహా మరో మార్గం లేదన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షులు సిహెచ్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం అసంపూర్తిగా మిగిలిపోయిందని, దానిని పూర్తి చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించాలన్నారు. ఆనాటి త్యాగాల వారసత్వాన్ని కమ్యూనిస్టులు నేడు కూడా కొనసాగించాలని సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ఉద్యమాన్ని చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. కాకపోతే ప్రజల చేతుల్లో నేడు తుపాకీ ఒక్కటే లేదన్నారు. అయితే వచ్చే తెలంగాణలో ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అబాల గోపాళం కోరుకుంటున్న కేంద్ర ప్రభుత్వ చెవికెక్కడం లేదని మరో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బోయినపల్లి వెంకటరామారావు అన్నారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ల కోసం చైర్మన్‌గా తాను ఎంతో పోరాడుతునప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి చిదంబరంను కలిసి వివరించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. పెన్షన్ల సాధన కోసం అన్నాహజారే తరహాలో మరోసారి ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువె ళ్లాలని ఓంకార్‌ప్రసాద్ అన్నారు. ఎందుకు, ఎవరిపై జరిగిందో కొత్తతరానికి వివరించాలన్నారు.

సకల జనుల సమ్మె విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కోరారు. దానివల్ల ప్రజలు కష్టాల పాలవుతున్నారని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణా సమస్య మీద ఈ సమ్మె ఎలాంటి ప్రభావం చూపబోదని, అందువల్ల ఈ సమ్మెతో ప్రయోజనం కలగదని ఆయన తెలంగాణా సకల జనుల సమ్మె నిర్వాహకులకు హితవు చెప్పారు. ఏమైనా తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా క్రాప్‌హాలిడేపై మోహన్‌కందా కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే రైతులకు న్యాయం చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా విమానంలో హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి గురువారం ఉదయం ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పంట విరామంపై మోహన్‌కందా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 2011 డిసెంబర్ చివర నాటికి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 1 లక్షా 16 వేల ఉద్యోగాలను భర్తీచేయగలమని కిరణ్ తెలిపారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను డిసెంబర్ చివరి నాటికి భర్తీ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు రాజీవ్ యువకిర ణాల పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా యువకిరణాలకు సంబంధించి డిసెంబర్ చివరనాటికి లక్ష మంది యువతకు ఆయా విభాగాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని దీని ప్ర్ర య కూడా మొదలు పెట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రులు తోట నరసింహం, పినిపే విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, ఎపిఐఐసి చైర్మన్ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో వున్నారు.
30 నిముషాలపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం:
సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి మధురపూడికి ప్రయాణిస్తూ వచ్చిన విమానం గురువారం ఉదయం సుమారు 45 నిముషాలపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. మధురపూడి విమానాశ్రయంలో ఉదయం 10.40 గంటలకు ల్యాండ్ కావల్సివుండగా ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై వుండడంతో సిగ్నల్ సరిగ్గా పనిచేయక పైలెట్ విమానాన్ని కిందికి ల్యాండ్ చేయలేకపోయారు. సుమారు 30 నిముషాలపాటు ఆకాశంలోనే దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొట్టారు. చివరకు ల్యాండ్ చేశారు. అయితే ఒకదశలో విమానం కిందికి ల్యాండ్ చేయకుండా తిరిగి హైదరాబాద్‌కు గాని, గన్నవరం విమానాశ్రయానికి గాని వెళ్ళేందుకు ఇంధనం సరిపోతుందా లేదా అనేదానిపై కూడా ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. విమానం క్షేమంగా కిందికి దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.