క్రీడా వార్తలు

శిఖరాగ్రానికి ఒక మెట్టే దూరంలో సైనా

saina000భారత బ్యాడ్మింటన్‌ సెన్సేషన్‌ సైనా నెహ్వాల్‌ ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించింది. తాజాగా విడుదలన చేసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాకింగ్స్‌లో ఇటీవలి కాలంలో సాధించిన అద్భుతమైన విజయాలతో సైనా రెండో స్థానానికి ఎగబాకింది. ఇండోనేసియన్‌ ఓపెన్‌ గెలవకముందు మూడో స్థానంలో ఉన్న సైనా ర్యాంకు, ఆ టోర్నమెంట్లో విజయం తర్వాత రెండో స్థానానికి చేరింది. ఈ ఘనతతో ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణిగా అవతరించడానికి కేవలం ఒక అడుగు దూరంలోనే సైనా ఉంది. చైనా దేశస్థురాలు యిహన్‌ వ్యాంగ్‌ ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 64791.2637 పాయింట్లు సాధించి సైనా రెండో స్థానాన్ని కైవసం చేసుకొంది మూడో స్థానంలో చైనాకే చెందిన గ్జిన్‌ వ్యాంగ్‌ కొనసాగుతోంది.
‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇంత త్వరగా ప్రపంచ నెంబర్‌ టూ క్రీడాకారిణి అవుతానని అనుకోలేదు. నేనాడిన చివరి మూడు టోర్నమెంట్లలో వరుస విజయాలు ఈ స్థానానికి చేరుకోవడానికి నన్ను ఎంతగానో సహాయపడ్డాయి. నాకిది గొప్ప అనుభూతినిస్తుంది. అయినా ర్యాంకింగ్స్‌పై ధ్యాస పెట్టే కన్నా దేశ కోసం మరిన్ని టోర్నమెంట్లను గెలవడమే ఇక ముందు కూడా నా ప్రాధాన్యతగా ఉంటుంది.’ అని సైనా తన ఆనందాన్ని పంచుకుంది.
ర్యాంకింగ్స్‌లను ఆపుకోవడం కష్టమైన పని అయినా, ఇంకా బాగా కష్టపడి మరిన్ని టైటిళ్లు గెలిచి, త్వరలోనే ప్రపంచ నెంబరు వన్‌ క్రీడాకారిణి అవడానికి కృషి చేస్తానని ప్రస్తుతం జలుబు, జ్వరం బాధపడుతున్న సైనా పేర్కొంది. తన కూతురు ఈ ఘనత సాధించడంతో సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌ అనందానికి అవధుల్లేకుండాపోయింది. సైనా సాధించిన ఘనతపై సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తూ, దేశంకోసం ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. గత మార్చిలో ప్రతిష్ఠాత్మక అల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్స్‌చేరి ప్రపంచ ఐదో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించిన సైనా, ఆ తర్వాత ఆరో స్థానానికి పడిపోయింది.
ఇక సైనా భవిష్యత్తులో ఆడబోయే టోర్నమెంట్ల విషయాన్ని ఒకసారి చూసినట్లయితే వచ్చే నెల ప్యారిస్‌లో జరుగనున్న ప్రతిష్థాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సైనా దేశం తరపున పాల్గొననుంది. ఆ తర్వాత అక్టోబరులో స్వదేశంలోనే జరిగే కామన్వెల్త్‌ క్రీడలతో పాటు ఎషియన్‌ గేమ్స్‌లలో సైనా పాల్గొంటుంది.
15 వ స్థానంలో కొనసాగుతున్న చేతన్‌ ఆనంద్‌
తాజాగా విడుదల చేసిన బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో హైదరాబాదీ ఆటగాడు చేతన్‌ ఆనంద్‌ 15 వ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇతర భారత క్రీడాకారుల్లో అనంద్‌ పీ. కశ్యప్‌, అరవింద్‌ భట్‌లు వరుసగా 25, 27 ర్యాంకుల్ని సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జంట జ్వాల గుత్త, వీ దిజులు స్థానంలో ఎటువంటి మార్పులేదు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు.

లలిత్‌మోడీ పిటిషన్‌ను తిరస్కరించిన బాంబే హైకోర్టు

lalit-modi౧
తనపై వచ్చిన ఆరోపణలను పూర్తి స్థాయిలో పరిశీలించడానికి బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రమశిక్షణ సంఘాన్ని పునర్వ్యవవస్థికరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఐపీఎల్‌ బహిషృ్కత చైర్మన్‌ లలిత్‌ మోడి చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు గురువారం తిరస్కరించింది. అంతేగాకుండా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తన వాదనలను వినిపించాలని అతనికి సూచించింది. విచారణ పూర్తయిన తర్వాత క్రమశిక్షణ సంఘం ఇచ్చిన తీర్పుపై లలిత్‌ మోడికి ఏమైనా అభ్యంతరాలుంటే అప్పు డు ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేయవచ్చని జస్టిస్‌ బీహెచ్‌ మార్లపల్లె, జస్టిస్‌ రోషన్‌ దాల్విలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.  పిటిషన్‌లో మోడి పేర్కొన్న వివి ధ అంశాలలోకి తాము వెళ్ళమని, పునర్వవస్ఠీకరించే అంశంపై క్రమశిక్షణ సంఘమే నిర్ణయం తీసుకోవచ్చని కూడా హైకోర్టు తీర్పులో పేర్కొంది. బోర్డు తనను బహిష్కరిం చిన అంశంతోపాటు, క్రమశిక్షణ సంఘం తీసుకోబోతున్న చర్యల్ని లలిత్‌ మోడి హైకోర్టులో సవాలు చేశారు. బీసీసీఐ నియమించిన క్రమశిక్షణ సంఘంలో బోర్డుకు సంబంధించిన వ్యక్తులు సభ్యులుగా ఉన్నారని, వారు తనపై చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్వవహరిస్తారనే నమ్మకం తనకు లేదని లలిత్‌ మోడి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.  బోర్డుకు సంబంధంచిన వ్యక్తులకు బదులు, బీసీసీఐతో సంబంధంలేని ఇరువర్గాలకు సమ్మతమైన, స్వతంత్ర వ్యక్తులను క్రమశిక్షణ సంఘంలో నియమించే లా చూడాలని పిటిషన్‌లో హైకోర్టును కోరాడు. ఐపీఎల్‌ తాత్కాలిక చైర్మన్‌ చిరాయు అమీన్‌, అరుణ్‌ జైట్లీ, జ్యోతిరాదిత్య సింధియాలు క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం నియామకానికి ముందు ఐపీఎల్‌ చైర్మన్‌ పదవినుంచి మోడిని సంస్పెండ్‌ చేసి అతనికి వరుసగా మూడు షోకాజు నోటీసులను బీసీసీఐ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఏల్‌ టోర్నీ నిర్వాహణలో మోడి అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారని బీసీసీఐ షోకాజు నోటీసుల్లో ఆరోపించింది.

లంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ – భారత్ 291 ఆలౌట్

లంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్ టీమ్… మన బౌలర్లను చితగ్గొట్టిందంటే, బహుశా జట్టులో జహీర్, శ్రీశాంత్‌ల రూపంలో కీ బౌలర్లు లేకపోవడమేనేమో అని సర్దుకుపోయాం..! మరి… మన బ్యాట్స్‌మెన్ ఆలా కాదు… వరల్డ్ క్రికెట్‌లోనే ఘనాపాఠీలు..! కానీ… బౌలర్లకు మల్లే మన బ్యాటింగ్ వీరులూ తేలిపోయారు. మిస్టరీ స్పిన్నర్ మెండిస్ ధాటికి ఒకరివెంట మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టి ‘కాగితపు పులులు’ అనిపించుకున్నారు..! అయితే… ఊరటల్లా ఒక్కటే..! ఇన్నాళ్లుగా పేలవఫామ్‌తో ఇబ్బందిపడుతున్న యువరాజ్ సింగ్ సెంచరీతో చెలరేగడమే అది..!
బౌలర్ల పేలవప్రదర్శనను మన బ్యాట్స్‌మెన్ విజయవంతంగా కొనసాగించారు. బోర్డు ప్రెసిడెంట్స్ లెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండోరోజైన బుధవారం టీమిండియా బ్యాట్స్‌మెన్ అజంతా మెండిస్ (6/67) ధాటికి కుదేలయ్యారు. ఫలితంగా భారత్ కేవలం 64.2 ఓవర్లలోనే 291 పరుగులకు ఆలౌటైంది. తద్వారా లంక తొలి ఇన్నింగ్స్ (514 డిక్లేర్డ్) కు 223 పరుగులు వెనుకబడిపోయింది. ఓపెనర్ గంభీర్ 89 పరుగులు చేయగా, యువరాజ్ ( 146 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 118) సూపర్ సెంచరీతో ఫామ్‌లోకొచ్చాడు.
ఇక తాను పడగొట్టిన 6 వికెట్లలో మెండిస్… బ్యాటింగ్ దిగ్గజాలు గంభీర్, సచిన్ (4), లక్ష్మణ్ (6)ల వికెట్లను కూల్చి జట్టులో స్థానానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. సెహ్వాగ్ (18), ద్రావిడ్ (11)లు టచ్‌లో ఉన్నట్టే కనిపించినా… తమ ఆరంభాలను సొమ్ముచేసుకోలేకపోయారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 432 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక బోర్డ్ ప్రెసిండెంట్స్ లెవెన్… 9 వికెట్ల నష్టానికి 514 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
సిక్సర పిడుగు… యువరాజ్..: మెండిస్, వెలెగెదరల ధాటికి ఒకదశలో భారత్ 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీటుగా ఆడుతున్న గంభీర్‌కు జతకలిసిన యువరాజ్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. అప్పటివరకు వికెట్ల వేటలో ఇరగదీసిన మెండిస్‌పై ఎదురుదాడికి దిగిన యువరాజ్… సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. అయితే… గంభీర్ (89) సెంచరీ ముంగిట బోల్తా కొట్టడంతో ఈ ఇద్దరి మధ్య 143 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
స్కోరుబోర్డు: బోర్డ్ ప్రెసిండెంట్స్ లెవెన్ తొలి ఇన్నింగ్స్: తరంగ (సి) లక్ష్మణ్ (బి) ఓఝా 110, తరిమన్నె (సి) గంభీర్ (బి) ఓఝా 66, కండంబి (స్టంప్డ్) ధోనీ (బి) మిశ్రా 101, సమరవీర (సి) గంభీర్ (బి) ఓఝా 102, జయవర్దనే (స్టంప్డ్) ధోనీ (బి) మిశ్రా 13, చండీమల్ (నాటౌట్) 47, సిల్వా (బి) శర్మ 19, సేననాయకే (ఎల్బీ) మిథున్ 11, మెండిస్ (బి) ఓఝా 10, వెలెగెదెర (ఎల్బీ) ఓఝా 0, ఎక్స్‌ట్రాలు: 35; మొత్తం:514/9 (డిక్లేర్డ్); బౌలింగ్: ఇషాంత్ 23-3-104-1, మిథున్ 25-2-99-1, మిశ్రా 26-1-125-2, సెహ్వాగ్ 2-0-15-0, ఓఝా 27.3-0-153-5; యువరాజ్ 1-0-11-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: గంభీర్ (సి) తరంగ (బి) మెండిస్ 89, సెహ్వాగ్ (బి) వెలెగెదర 18, ద్రావిడ్ (బి) వెలెగెదర 11, సచిన్ (ఎల్బీ) మెండిస్ 4, లక్ష్మణ్ (సి) జయవర్దనే (బి) మెండిస్ 6, యువరాజ్ (బి) సేననాయకే 118, ధోనీ (సి) కండంబి (బి) సేననాయకే 10, మిశ్రా (ఎల్బీ) మెండిస్ 1, ఇషాంత్ (సి) సేననాయకే (బి) మెండిస్ 5, ఓఝా (సి) కండంబి (బి) మెండిస్ 4, మిథున్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 64.2 ఓవర్లలో 291 ఆలౌట్; వికెట్ల పతనం: 1-36, 2-59, 3-67, 4-80, 5-223, 6-241, 7-252, 8-273, 9-278, 10-291; బౌ లింగ్: వెలెదెగెర 10-1-45-2, ఫెర్నాండో 12-1-55-0, సేననాయకే 23-1-94-2, మెండిస్ 17.2-3-67-6, కండంబి 2-0-23-0.

సైనాకు సారథ్యం

14.07
ఆగస్ట్‌లో పారిస్‌లో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్‌ భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ఈ టోర్నమెంట్‌కు తొమ్మిది మంది సభ్యుల జట్టును మంగళవారం నాడిక్కడ ప్రకటించారు. వారు అదితీ ముటాట్కర్‌, జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప, చేతన్‌ ఆనంద్‌, పారుపల్లి కాశ్యప్‌, సనావే థామస్‌, వి.దిజు, రూపేష్‌ కుమార్‌. పుల్లెల గోపీచంద్‌ ఛీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వి కె వర్మ జట్టును ప్రకటించారు. అత్యంత పిన్న వయసులోనే కెప్టెన్‌గా నియమితురాలైన సైనా నెహ్వాల్‌ ప్రపంచఛాంపియన్‌షిప్‌లో రాణించగలదన్న ఆశాభావం వ్యక్తం చేసారు. తనపై ఎటువంటి ఒత్తిడి ఉండబోదని సైనా పేర్కొంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రాణిస్తే 101 స్వర్ణ నాణాలను ప్రదానం చేయగలమని ప్రీమియర్‌ బ్రాండ్స్‌ ఛైర్మన్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సన్మానంలో ఆమెకు తన వయసుకు అనుగుణంగా 20 నాణాలను ప్రదానం చేసారు.

సాకర్‌ విజేత స్పెయిన్‌

fifa12fifa21
2010 ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ను స్పెయిన్‌ ఎగరేసుకుపోయింది. మొట్టమొదటి సారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన స్పెయిన్‌ తొలిసారి కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 1-0 తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. 116వ నిమిషంలో ఆండ్రస్‌ ఇనిఏస్టా గోల్‌ చేసి స్పెయిన్‌ విజయాన్ని ఖరారు చేశాడు. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయినే విజేతగా నిలవడం ద్వారా ఆక్టోపస్‌ జోస్యం నిజమైంది. ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో ప్రారంభం నుంచి ఇరు జట్లు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యత ఇచ్చాయి.

fifa1

అవకాశం వచ్చినప్పుడల్లా నెదర్లాండ్స్‌ గోల్‌పోస్టుపై స్పెయిన్‌ దాడి చేసింది. బాల్‌ పాసింగ్‌లోనూ, షాట్ల విషయంలోనూ స్పెయినే పైచేయి సాధించింది. నిర్ణీత సమయంలో ఏ జట్టూ గోల్‌ చేయలేకపోవడంతో అదనపు సమయం కేటాయించాల్సి వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో ఈ సమయం కూడా ముగుస్తుందనగా మంచి పాస్‌లు అందుకున్న ఇనిఏస్టా అద్భుతమైన గోల్‌ చేసి స్పెయిన్‌కు చిరకాల విజయాన్ని అందించాడు. ఈ విజయంతో యూరో ఛాంపియన్‌షిప్‌ తర్వాత ప్రపంచ కప్‌ నెగ్గిన రెండో జట్టుగా స్పెయిన్‌ నిలిచింది. ఐరోపా బయట నిర్వహించిన టోర్నీలో తొలి సారి ఐరోపా జట్టు విజేతగా నిలిచింది. 1974, 1978 సంవత్సరాల్లో ప్రపంచ కప్‌ పైనల్స్‌కు చేరినా కప్‌ను చేజిక్కించుకోవడంలో విఫలమైన నెదర్లాండ్స్‌కు 2010లోనూ భంగపాటు తప్పలేదు.

నేటి నుండి సెమీఫైనల్స్‌ – తొలి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌ – ఉరుగ్వే

06.07.01
నెల రోజుల ఫుట్‌బాల్‌ పండుగ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. మరో నాలుగు సంవత్సరాలపాటు ఈ మెగా ఈవెంట్‌ కోసం అభిమానులు నిరీక్షించాల్సిందే. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ థమాకా క్రీడోత్సవంలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. మంగళ, బుధవారాల్లో సెమీఫైనల్స్‌, మూడో స్థానం కోసం శనివారం మ్యాచ్‌, ఆదివారం నాడు ఫైనల్‌ జరగనున్నాయి. తొలి సెమీఫైనల్‌ ఉరుగ్వే, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మంగళవారం నాడు జరగనుంది. రెండో సెమీఫైనల్‌ జర్మనీ, స్పెయిన్‌ జట్ల మధ్య బుధవారం జరుగుతుంది.  మొదటి పది రోజులు నిస్తేజంగా, నిరుత్సాహంగా సాగిన ఈ టోర్నమెంట్‌ ఆ తరువాత పుంజుకుంది. అనేక సంచలన ఫలితాలు నమో దయ్యాయి. హాట్‌ఫేవరెట్స్‌గా భావించిన అనేక జట్లు ఇంటిదారిపట్టాయి. హాట్‌ఫేవరెట్స్‌గా భావించిన జట్లలో స్పెయిన్‌, జర్మనీ మాత్రమే రంగంలో మిగిలాయి. ఈ రెండు జట్లు బుధవారం నాడు తలపడనున్నాయి. అందువల్ల ఇందులో ఒకటి మాత్రమే మిగులుతుంది. మంగళవారం జరగ నున్న తొలి సెమీఫైనల్లో ఉరుగ్వే విజయం సాధించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రపంచాన్ని ఆశ్చర్య చకితులను చేసిన ఫలితం నమోదైంది. జర్మనీతో జరగనున్న మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే ఈ మ్యాచ్‌లో వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
వారు ఊహించినట్లుగా అర్జెంటీనా విజయం సాధించలేదు సరికదా జర్మనీకి కనీస ప్రతిఘటన ఇవ్వ లేకపోయింది. జర్మనీ పదేపదే గోల్స్‌ చేస్తుంటే అర్జెంటీనా క్రీడాకారులు గుడ్ల ప్పగించి చూస్తుండిపోయారే తప్ప ఎదురుదాడి చేసేందుకు ప్రయ త్నించలేదు. అసలు అర్జెంటీనాకు ఏమైందని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విధంగా ఈ మ్యాచ్‌ సాగింది. జర్మనీ జట్టులోని మిరోస్లావ్‌ క్లోజ్‌, ధామస్‌ ముల్లర్‌, ఫ్రెడరిక్‌ అర్జెంటీనాకు షాక్‌మీద షాక్‌ ఇచ్చారు. తమ జట్టును తక్కువగా అంచనా వేసినవాళ్లకు తమ సత్తా ఏమిటో నిరూపిం చుకున్నారు. వయసు మీదపడుతున్నప్పటికీ తనలో ఫైర్‌పవర్‌, ప్రత్యర్థి జట్టును క్లోజ్‌ చేసే సత్తా తనలో తగ్గలేదని మిరోస్లావ్‌ క్లోజ్‌ నిరూపిం చుకున్నాడు. అసలు క్లోజ్‌ను జట్టులో ఎంపిక చేయడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ ట్రోజెన్‌ హార్స్‌ను ఎంపిక చేయడమేమిటా అని అందరూ భావించారు. జర్మనీ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేలిమి కల యికగా ఉంది. ఆ జట్టులోని క్రీడాకారుల సగటు వయసు 24.9 సంవత్సరాలు. 1934 ప్రపంచకప్‌ తరువాత జర్మనీ పంపిన అతి పిన్న వయస్కులతో కూడిన జట్టు ఇదే. ఫుట్‌బాల్‌ నైపుణ్యంలో, కళలో కాపీరైట్‌ అంటూ ఏమీ ఉండదని, ప్రతిభ ఒకరి సొత్తు కాదని జర్మనీ నిరూపించుకుంది.  జర్మనీ జట్టులోని మేటి క్రీడాకారులంతా ఈ టోర్నమెంట్‌లో రాణించారు. అయితే మెసట్‌ ఓజిల్‌పై అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. సెమీస్‌ లేదా ఫైనల్‌కు అతడ్ని జట్టు రిజర్వ్‌ చేసినట్లుగా కనపడుతుంది. 22 ఏళ్ల ఓజిల్‌పైనే ఇప్పటివరకు అన్ని జట్లు దృష్టి కేంద్రీకరించాయి. రోనాల్డో ప్రపంచకప్‌లో 15 చేసి నెలకొల్పిన రికార్డుకు క్లోజ్‌ ఇంకా ఒక గోల్‌ దూరంలో ఉన్నాడు. చూస్తుండగానే జర్మనీ కప్‌ గెలుచుకునే హాట్‌ఫేవరెట్‌ జట్టుగా మారిపోయింది. మెరుపువేగంతో బంతిని జట్టు సభ్యులకు అందించడంలో, ఒక్కసారిగా పరిస్థితిని ఆకళింపు చేసుకుని తక్షణ వ్యూహాలను రూపొందించుకోవడంలో, సంయమనంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో, అన్నిటినీ మించి తామంతా దేశం కోసం ఆడుతున్నామన్న స్పూర్తిని నింపుకోవడంలో జర్మనీ క్రీడాకారులు ఇతర జట్లలోని క్రీడాకారులను అధిగమించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, అర్జెంటీనా జట్లపై నాలుగేసి గోల్స్‌తో విజయం సాధించినా, సెర్బియా చేతిలో 0-1తో ఓడిపోయినా నిబ్బరం కోల్పోకుండా సంయ మనంతో ఆడటం వారికే చెల్లింది. టైటిల్‌ చేజిక్కించుకునేందుకు తాము సంపూర్ణంగా అర్హులమని జర్మనీ ఇప్పటికే నిరూపించుకుంది. చూద్దాం, మున్ముందు మ్యాచ్‌ల్లో మరే సంచలనాలు చేసుకుంటాయో. ఇప్పటికి మాత్రం జర్మనీ నిస్సందేహంగా హాట్‌ఫేవరెట్‌. ఇందులో సందేహం ఇసు మంతైనా లేదు. ఫలానా జట్టు విజయం సాధిస్తుందని ముందుగానే ఖరా ఖండిగా చెప్పలేం. అయితే తమదైన బ్రాండ్‌ ఆటతో జర్మనీ క్రీడాకారులు సాకర్‌ ప్రపంచంలో లెక్కకుమిక్కిలి అభిమానులను సంపాదించుకున్నారు.వారు తమ అద్శుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఏం జరుగుతుందో వేచి చూద్దాం!

అనూహ్యరీతిలో కెప్టెన్‌ ధోనీ వివాహం

PTI7_5_2010_000200B
వాస్తవానికి వచ్చే సంవత్సరం జరగాల్సిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ధోనీ వివాహం అనూహ్యరీతిలో ఆదివారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. ధోనీ అక స్మాత్తుగా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేసాడు. ఎంత హడావిడిగా ఈ వివాహం జరిగిందంటే కావల్సిన వారికి కూడా అనేకమందికి ఆహ్వానపత్రాలు పంప లేకపోయారు. కొంతమంది ఎంపిక చేసిన వారికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. ఇలా హడావిడిగా వివాహం జరగడానికి ఒక జ్యోతిష్య శాస్త్రవేత్త ఇచ్చిన సలహానే కారణమని తెలిసింది. ఇది ఇలా ఉండగా తన చిన్ననాటి స్నేహితునితో వివాహం బంధం ఏర్పడు తుందని 23 ఏళ్ల వధువు సాక్షీ రావత్‌ ఊహించి ఉండదు. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధ రాజే సింధియాకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ వివాహం జరిగింది. ఈ ఫామ్‌ హౌస్‌ డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో లోయర్‌ కండోలీ గ్రామంలో ఉంది. ఆ గ్రామానికి వెళ్లే నాలుగు అడుగుల రహదారిలో 500 మందికి పైగా పోలీసులు బందో బస్తుగా నిలిచారు. ధోనీ కుటుంబం శణివారం సాయం త్రమే డెహ్రాడూన్‌ చేరుకుంది. ధోనీ మాత్రం ఆదివారం ఉదయం వచ్చాడు. కండోలీ గ్రామస్థులు కూడా వివాహం గురిం చి ఎవరికీ చెప్పకపోవడం ఆశ్చర్యకరం. విశ్రాంతి గృహంలో పనిచేసేవారు సైతం పెదవి విప్పలేదు.
పండిట్‌ ధర్మానంద్‌ మిథానీ ఈ వివాహం జరిపించారు. వివాహం మూడు గంటలపాటు కుమౌనీ సంప్రదాయాలకు అను గుణంగా జరిగింది. గత రెండు మాసా లుగా ఈ వివాహం కోసం సన్నాహాలు జరుగు తున్నట్లు మిథానీ చెప్పారు. ఒకవైపు వర్షం కురుస్తూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పటిికీ ఈ వివాహానికి సంబంధించిన వార్తలు సేకరించి పంపేందుకు పాత్రికేయులు పడిగాపులు కాచారు. ఇంతకుముందు వార్తలు వచ్చినట్లుగా హర్భజన్‌ సింగ్‌ వివాహానికి హాజరు కాలేదు. ఆశిష్‌ నెహ్రా, ఆర్‌.పి. సింగ్‌ మాత్రమే హాజరయ్యారు. వివాహంలో శాకాహారం మాత్రమే వడ్డించారు. ధోనీ ఆకుపచ్చ డిజైనర్‌ షెర్వాణీ, సాక్షి ఎరుపు లెహంగా ధరించి వివాహంలో పాల్గొన్నారు. ధోనీ, సాక్షి రాంచీలోని షర్మీలీ డిఎవిలో కలసి చదువుకున్నారు. సాక్షి 1994 ఆంధ్రప్రదేశ్‌ బ్యాచ్‌ ఐపిఎస్‌ క్యాడర్‌కు చెందిన అభిలాష బిష్త్‌ మేనకోడలు. ఆమె భర్త కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తరా ఖండ్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రొవిజనింగ్‌, మోడరైజేషన్‌ విభాగం లో డిఐజిగా పనిచేస్తున్నారు. బిష్త్‌ గత ఏప్రిల్‌లో రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఈ వివాహం కోసం మూడు హోటళ్లను అద్దెకు తీసుకున్నారు. ధోనీ గత రెండు సంవత్సరాలుగా డెహ్రా డూన్‌, ముస్సౌరీ పట్లణాలను తరచుగా సందర్శిస్తూండేవాడు.చరణ్‌దాస్‌ అనే స్థానిక పూల వ్యాపారి వివాహానికి కావల్సిన పూలను సరఫరా చేసాడు.వాహ సామగ్రిని ముంబయిలోని డిజెలో కొనుగోలు చేసారు.

వింబుల్డన్‌ విజేత సెరీనా

04.07.1
నా విజయాన్ని అడ్డుకునేదెవరు? అని నాల్గవ రౌండ్‌లో విజయం సాధించిన తరువాత ప్రశ్నించిన సెరీనా విలియమ్స్‌ తన ఆత్మస్థయిర్యాన్ని మరోమారు నిరూపించుకుంది. తాను నిజంగా నెంబర్‌ వన్‌ అని మరోసారి చాటుకుంది. వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ల టైటిల్‌ను నాల్గవ సారి గెలుచుకుంది. తన ఖాతాలో 13వ గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్‌ను జమచేసుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్లో ఆమె 21వ సీడెడ్‌ రష్యా క్రీడాకారిణి వేరా జ్వొనరేవాను ఓడించింది. 66 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సెరీనా 6-3, 6-2 తేడాతో తన ప్రత్యర్థిని చిత్తు చేసింది. సెమీఫైనల్లో గట్టి ప్రతిఘటనను ఎదురుచూసిన సెరీనాకు ఫైనల్లో విజయం అత్యంత సునాయాసంగా లభించింది. తన కెరీర్‌లో తొలి సారిగా గ్రాండ్‌శ్లామ్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న జ్వొనరేవా ఏ విధంగానూ సెరీనాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఒక్క బ్రేక్‌ పాయంట్‌ కూడా సాధించలేకపోయింది. సెరీనా 2002, 2003, 2009 సంవత్సరాల్లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి దానిని నిలబెట్టుకుంది. ప్రపంచ నెంబర్‌ వన్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించిన జ్వొనరేవాకు ఈ మ్యాచ్‌ నిరాశ మిగిల్చింది. ఈ టైటిల్‌ గెలచుకోవడం ద్వారా సెరీనా తమ దేశానికే (అమెరికా)చెందిన బీల్లీ జాన్‌ కింగ్‌ నెలకొల్పిన రికార్డును అధిగమించింది.
ఫైనల్లో పేస్‌, కారా బ్లాక్‌
లియాండర్‌ పేస్‌, జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌ జోడీ వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మిక్సెడ్‌ డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ రెండో సీడెడ్‌ జోడీ 6-3, 6-3తేడాతో లూకాస్‌ డ్లౌచీ, ఇవెటా బెనెసోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో పేస్‌, బ్లాక్‌ జోడీ సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించింది.
నేడు నాదాల్‌క్ష్మి బెర్డిక్‌ ఫైనల్‌ పోరు
వింబుల్డన్‌ టైటిల్‌పై ఆండీ ముర్రే పెట్టుకున్న ఆశలను రాఫెల్‌ నాదాల్‌ భగం చేసాడు. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో నాదాల్‌ 6-4, 7-6, 6-4 తేడాతో మూడు వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండు గంటల 22 నిమిషాలసేపు ఈ మ్యాచ్‌ జరిగింది. నాదాల్‌ వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో నాల్గవసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం నాడు జరగనున్న ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన టోమాస్‌ బెర్డిక్‌తో తలపడతాడు. 1938 తరువాత ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి బ్రిటన్‌ క్రీడాకారునిగా రికార్డు నెలకొల్పడంలో ఆండీ ముర్రే విఫలమయ్యాడు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో రోజర్‌ ఫెడరర్‌ చేతిలో ఓడిపోయిన ముర్రే 2008 యుఎస్‌ ఓపెన్‌లో కూడా చేదు అనుభవం రుచిచూసాడు. 2008 వింబుల్డన్‌లో క్వార్టర్‌ఫైనల్లో రాఫెల్‌ నాదాల్‌ చేతిలో ఓడిపోయాడు

4-0 తేడాతో అర్జెంటీనాపై విజయం – సెమీస్‌లో జర్మనీ

04.07
డిగో మారడోనా మంత్రం ఫలించలేదు. కోచ్‌గా ప్రపంచకప్‌ను సాధించాలని అతడు కన్న కలలు ఫలించలేదు. అతడు నమ్మకం పెట్టుకున్న లియోనెల్‌ మెస్సి ఘోరంగా వైఫల్యం చెందాడు. మొత్తంగా మూడోసారి ప్రపంచకప్‌ గెలుచుకోవాలన్న అర్జెంటీనా ఆశలు నిలువునా కూలిపోయాయి. శుక్ర వారం నాడు బ్రెజిల్‌, శనివారం నాడు అర్జెంటీనా అనుకోని రీతిలో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనే ఓటమి చవి చూసి 19వ ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ నుండి నిష్క్రమించాయి. నెదర్లాండ్స్‌ చేతిలో జర్మనీ పరాజయం పాలుకాగా తన చిరకాల ప్రత్యర్థి జర్మనీ చేతిలో అర్జెంటీనా చిత్తయ్యింది. మరోవైపు తనను బాల్‌బారు అని ఎగతాళి చేసిన మారడోనాకు తన సత్తా చూపిస్తానని సవాలు చేసిన థామస్‌ ముల్లర్‌ తన పంతం నెగ్గించుకున్నాడు. మ్యాచ్‌లో మూడో నిమిషంలోనే గోల్‌ చేసి అర్జెంటీనాను మానసికంగా ఒత్తిడికి గురిచేసాడు. శనివారం నాడిక్కడ జరిగిన ఫుట్‌బాల్‌ 19వ ప్రపంచకప్‌ మూడవ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో జర్మనీ 4-0 తేడాతో అర్జెంటీనాను చిత్తుచేసి సెమీస్‌లోకి దూసుకుపోయింది.గతంలో మూడుసార్లు ప్రపంచకప్‌ గెలుచుకున్న జర్మనీ నాలుగో సారి టైటిల్‌ చేజిక్కించుకునేందుకు ఉరకలేస్తోంది. ఈ మ్యాచ్‌ను చావోరేవోగా తీసుకోవాలని మారడోనా ఇచ్చిన పిలుపు ఫలించలేదు. అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో జర్మనీకి కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది.
థామస్‌ ముల్లర్‌ మూడో నిమిషంలో ఇచ్చిన షాక్‌ నుండి కోలుకోలేకపోయింది. జర్మనీ ఇదే అదనుగా గోల్స్‌పైన గోల్స్‌ చేసి మరింత ఒత్తిడికి గురిచేసింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి 1-0 ఆధిక్యతలో ఉన్న జర్మనీ ద్వితీయార్ధంలో మరో మూడు గోల్స్‌ చేసి అర్జెంటీనాను చిత్తు చేసింది. 74వ నిమిషంలో ఫ్రెడరిక్‌ గోల్‌ చేయగానే స్టాండ్స్‌లో ఉన్న మారడోనా తన అల్లుని భుజంపై తల మోదుకున్నాడు. ముల్లర్‌ 3వ నిమిషంలో గోల్‌ చేయగా మిరోస్లావ్‌ క్లోజ్‌ 67, 89 నిమిషాల్లో చేసాడు. నాల్గవ గోల్‌ ఫ్రెడరిక్‌ 74వ నిమిషంలో చేసాడు. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా క్లోజ్‌ గోల్‌ చేసాడు. 32 ఏళ్ల క్లోజ్‌ 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఈ మ్యాచ్‌తో పూర్తి చేసుకున్నాడు. 2001లో అల్బేనియాపై తొలి మ్యాచ్‌ ఆడిన క్లోజ్‌ మొత్తం 50 గోల్స్‌ చేసాడు.ప్రపంచకప్‌లో 12 గోల్స్‌ చేసి పీలే రికార్డును సమం చేసాడు. టాప్‌ స్కోరర్‌గా ఉన్న రోనాల్డో కంటే మూడు గోల్స్‌ మాత్రమే తక్కువగా ఉన్నాడు.

సెల్ఫ్‌గోల్ తప్పిదం – సెమీస్‌లో నెదర్లాండ్

03.07
సాకర్ దిగ్గజం బ్రెజిల్ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ, క్వార్టర్స్‌కు ముందు వరకు గాంభీర్యంతో తెగ అతిశయించింది. కానీ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సీన్ రివర్సయింది.  ఒక దశలో ‘యే మ్యాచ్ హమ్‌కో దేఁ…’ అన్నట్టుగా బ్రెజిల్ చెలరేగడం చూస్తే, ప్రత్యర్థికి రంగుప’డచ్’ అనిపించింది కూడా..! కానీ… ఫిలిప్ మెలో సెల్ఫ్‌గోల్‌కు తోడు… రెడ్‌కార్డ్‌కు గురికావడంతో బ్రెజిల్ డ (చ్)స్సి పోయింది. ఇంకేముంది.. జట్టులో ‘అబ్ కిత్నే ఆద్మీ హైఁ…?’ అని చూసుకుంటే ‘సిర్ఫ్ దస్ ఆద్మీ’ అని లెక్క తేలింది. అరె.. ఓ ‘సాంబా’… అని దుమ్మురేపుతుందనుకున్న ‘సాంబా’ కథ ముగిసింది.
పోర్ట్ఎలిజబెత్: టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్‌కు ఫైనల్ బెర్త్ ఖాయం.. సాకర్ ప్రపంచ కప్‌కు ముందు అందరినోటా ఇదే మాట.. అయితే అనూహ్యంగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సాకర్ దిగ్గజానికి క్వార్టర్స్‌లోనే షాక్.. ఆరెంజ్ దెబ్బకు సాంబా జట్టు వరుసగా రెండోసారి సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రెండుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ఆరోసారి చాంపియన్‌గా నిలవాలన్న బ్రెజిల్ ఆశలపై నీళ్లు చల్లింది. ద్వితీయార్థంలో ఫిలిప్ మెలో (53వ) సెల్ఫ్‌గోల్ చేయడం, ఆ వెంటనే మరికొద్ది నిమిషాలకు అతను రెడ్‌కార్డుకు గురవడం బ్రెజిల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. మరోమారు గోల్‌తో విజృంభించి మిడ్‌ఫీల్డర్ వెస్లీ స్నీడర్ (68వ) నెదర్లాండ్స్‌ను గెలిపించా డు.
ఆరంభం అదుర్స్..
ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన దుంగాసేన అంచనాలకు తగ్గట్టే ఆరంభంలో అదుర్స్ అనిపించింది. ఆదినుంచే దూకుడైన ఆటతీరుతో సాంబా ఆటగాళ్లు ప్రథమార్ధం స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
మ్యాచ్ మొదలైన పది నిమిషాలకే గోల్ ఖాతా తెరచి ఆటపై పట్టు సాధించారు. పదో నిమిషంలో డచ్ కీపర్ ్గను బోల్తా కొట్టిస్తూ సహచరుడు మెలో అందించిన డైరెక్ట్ పాస్‌ను రాబిన్హో గోల్‌గా మలచి బ్రెజిల్ అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు.
సెల్ఫ్‌గోల్ తప్పిదం..
ఓ గోల్ ఆధిక్యంతో ఫస్టాఫంతా మ్యాచ్‌పై పట్టు బిగించామని సంబరపడుతున్న బ్రెజిల్ శిబిరానికి అంతలోనే ఊహించని షాక్. ద్వితీయార్థం మొదలైన 8 నిమిషాలకే బ్రెజిల్ ఆటగాడు మెలో అనూహ్యంగా సెల్ఫ్‌గోల్ సమర్పించుకుని తన జట్టుకు తానే విలన్ అవతారమెత్తాడు.
53వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు స్నీడర్, జూలియో సీజర్‌ల గోల్ అవకాశాలను అడ్డుకునే యత్నంలో మెలో హెడర్ ద్వారా బంతి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ క్రమంలోనే డచ్ స్నీడర్ 68వ నిమిషంలో గోల్‌తో విజృంభించి 2-1తో ఆధిక్యాన్ని అందించాడు.
మరో ఐదు నిమిషాలకు సెల్ఫ్‌గోల్ ఆటగాడు మెలో రెడ్‌కార్డ్‌కు గురవడం బ్రెజిల్‌ను మరింత దెబ్బ తీసింది. డచ్ మిడ్‌ఫీల్డర్ స్నీడర్‌ను మెలో ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడం, ఆ వెంటనే రిఫరీతో రెడ్‌కార్డ్‌ను అందుకోవడంతో బ్రెజిల్ చివరి 17 నిమిషాలను పదిమందితోనే ఆడడం బ్రెజిల్ కొంపముంచింది.