శ్రీకాకుళం

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ సోమవారంనాడు ప్రధానిని మన్మోహన్సింగ్ను కలిశారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడైన తర్వాత ప్రధానిని కలవటం ఇదే తొలిసారి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ముచ్చటించిన అనంతరం బయటికి వచ్చిన బొత్స తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాము ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏదీలేదని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలు ప్రధానికి వివరించానని, ప్రాణహిత ..చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మూరుమూల గ్రామాలకు లింక్‌రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి నిధులు పెంచి, కూలీలకు ఇచ్చే వేతనం పెంచి పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయాలని ప్రధానిని కోరినట్లు బొత్స చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తిచేసినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.
కాగా, ప్రధానిని కలిసిన సందర్భంలో రాజకీయాల ప్రస్తావన రాలేదని బొత్స సత్యనారాయణ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు, ముఖ్యమంత్రి వ్యవహారశైలి, పార్టీ పరిస్థితి, ముమ్మరంగా సాగుతున్న సిబిఐ దాడులు, దర్యాప్తు తదితర అంశాలపై ప్రధానికి బొత్స సత్యనారాయణ వివరించారని తెలుస్తోంది.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

ఎక్సైజ్ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్ నాగేశ్వర్ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్‌బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్ హెడ్‌కానిస్టేబుల్ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్, పుష్కరగణేష్ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్పి రామకృష్ణప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్‌రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన వీరాచందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సిఐ కరమ్‌చంద్ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.

సిబిఐ ఇడి పంపిన నోటీసులు అందాయి.. నా వాదనను హైకోర్టుకు వినిపించాలని నిర్ణయించుకున్నాను’ అని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. రైతు పోరు బాటలో భాగంగా ఆయన గురువారం విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో పాదయాత్ర చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతోందని విమర్శించారు. తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగపరంగా రెండు వర్గాల వాదన విన్న తరువాత కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని, గ్రామాల్లో జరిగే రచ్చబండలో కూడా ఈ విధానం ఉంటుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు 25 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేశారని, 26 విచారణలు జరిపించారని, 65 ప్రాజెక్ట్‌లను రివ్యూ చేశారని, అందులో ఎక్కడా తను దోషిగా నిరూపణ కాలేదని చంద్రబాబు అన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా తన పని తనను చేసుకోనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతుంటే, తనపై బురదచల్లుతున్నారని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నానని అన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో ఉందని అన్నారు. కనీసం వరికి, చెరకుకు మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు.
ప్రజాకోర్టులో తేల్చుకుంటా’
కాకినాడ, నవంబర్ 24: తనపై బనాయించిన తప్పుడు కేసులను ప్రజాకోర్టులోనే ఎదుర్కొంటానని చంద్రబాబుఅన్నారు. గురువారం ఉదయం అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లేముందు ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వచ్చిన ప్రతి ఒక్క ఆరోపణకు సమాధానం చెబుతూనే వచ్చానని, ప్రస్తుతం వచ్చిన ఆరోపణలను ప్రజాకోర్టులో తేల్చుకుంటానన్నారు. సింగపూర్‌లో తనకు ఒక హోటల్ ఉన్నట్టు జరిగిన ప్రచారం అవాస్తవమని తేలిందని, ఎవరు పడితేవారు కేసులు వేస్తే స్వీకరించడమేనా? అంటూ సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించడాన్ని చూస్తే తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ చరిత్రలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అంతటి కక్షసాధింపుదారుడు ఉండడని, ఆయన హయాంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఆయన అనుయాయులు దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 700 కరవు మండలాలుగా ఉన్నట్టు ప్రభుత్వమే అంగీకరించిందని, అయినప్పటికీ ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో పాలకులు పర్యటించి రైతులను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. వేల ఎకరాల్లో క్రాప్‌హాలిడే ప్రకటించినా ప్రభుత్వం దున్నపోతు చందాన నిద్రపోతోందని విమర్శించారు. తాము రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఉన్నట్టయితే నేటికీ తెలుగుదేశమే అధికారంలో ఉండేదని చెప్పుకున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలుల వేసే గనుల లీజుల అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమని చంద్రబాబు విమర్శించారు. గిరిజనులకు దక్కాల్సిన అటవీ సంపదను వైఎస్ ఆధ్వర్యంలో దోచుకున్నారని ధ్వజమెత్తారు.

రెండో విడుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ల్లో పర్యటించనున్నారు. తొలిత ముఖ్యమంత్రి హైదరా బాద్‌లో బుధవారం ఉదయం బయలు దేరి శ్రీకాకుళం జిల్లా కు వెళ్లనున్నారు.అక్కడనే ఏర్పాటు చేసిన రెండో విడుత రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించనున్నారు. అనం తరం విజయనగరం జిల్లాలో బొబ్బిలి రచ్చబండ కార్య క్రమంలో పాల్గొని పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సీఎం పంపిణి చేయనున్నార. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయ న ప్రసంగించనున్నట్లు సీఎంఒ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్ ఫోటోను ఇంటర్నెట్ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వేడుకగా జరిగింది. కార్తీకశుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) సందర్భంగా అరసవల్లి దేవస్థానానికి అభిముఖంగా ఉన్న ఇంద్ర పుష్కరిణిలో ఆదిత్యుని హంస నావికోత్సవం జరిపించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ఉషా, ఛాయా, పద్మినీ సమేతుండైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను అత్యంత శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు, అర్చనలు జరిపించారు. అనంతరం రజత సింహవాహనంలో పల్లకిలో ఊరేగుతూ ఆలయం నుండి పుష్కరిణి వరకు స్వామివారిని తోడ్కొని వచ్చారు. కిక్కిరిసిన జన సమూహం మధ్య నుండి దేవేరులతో స్వామివారి మంగళవాయిద్యాలు, సంప్రదాయ కీర్తనలు, భజనలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం నుండి బయలుదేరి పుష్కరిణి వరకు వచ్చారు. అనంతరం పుష్కరిణిలో సిద్ధంగా ఉన్న హంసనావలో స్వామివారిని ఇంద్రపుష్కరిణిలో తొమ్మిది పర్యాయాలు నౌకా విహారం చేయించారు. పటిష్టమైన బందోబస్తు నడుమ, తర తరాలుగా వస్తున్న సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ వెలుగులరేడు నావికోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్టు బోర్డు చైర్మన్ ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఇతర సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాలరావు తదితరులు స్వామివారి నావికోత్సవంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి ఆదిత్యుని తెప్పోత్సవాన్ని వీక్షించడమే కాకుండా, పుష్కరిణిలో దీపాలు వెలిగించి విడిచిపెట్టారు. (చిత్రం) ఇంద్రపుష్కరిణిలో ఆదిత్యుని హంస నావికోత్సవం

సిబిఐ సోదాలతో వైఎస్ జగన్ ఉక్కిరి బిక్కిరవుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి దిగింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉంటూనే జగన్ ఆస్త్రం సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్, గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, బస్సు యాత్ర ఎప్పటినుండి ప్రారంభించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీరి రాజీనామాలు ఆమోదించినా సర్కార్ మనుగడకు వెంటనే ముప్పు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అనిశ్చితి పెరిగి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్తే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. రాజీనామాల నిర్ణయం వెలువడిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. సిబిఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరును పేర్కొనడానికి నిరసనగా తమ బాటలోనే ప్రయాణించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తమ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోందని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఒక టివి ఛానల్లో మాట్లాడుతూ మరో 20 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, తొలిదశ తరువాత రెండు మూడు రోజుల్లో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. ఈ దిశలో కొందరితో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. జిల్లాల వారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఈ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
మూడు గంటల పాటు సమావేశం
అంతకుముందు జూబ్లిహిల్స్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన రెండు రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. సమావేశం నుండి కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఒకటికి రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. సమావేశం నుండే స్పీకర్ కార్యాలయానికి, గవర్నర్ కార్యాలయానికి ఫోన్లు చేసి అపాయింట్మెంట్లు ఖరారు చేసుకున్నారు. ఆ తరువాత రాజీనామాల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాసనసభలో బలాబలాల తీరు
294 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో సర్కారు మనుగడకు 148 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యంతో కలిసి 173 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించిన 29 మందిలో 27 మంది కాంగ్రెస్‌కు, పిఆర్పీకి చెందిన వారే! వీరి రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్ బలం 146కు పరిమితమవుతుంది. అయితే, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పటివరకు కాంగ్రెస్‌కే లభిస్తోంది. వీరిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వానికి వెంటనే ముప్పురాకపోవచ్చు. 12 మంది సభ్యులున్న టిఆర్ఎస్ కూడా శానససభలో కీలకపాత్ర పోషించనుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత శాసనసభలో 86 మంది సభ్యులుండగా, వారిలో ఇద్దరు తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 84కు పరిమితం కానుంది. గతంలోనే నాగం జనార్ధనరెడ్డితో పాటు మరో ముగ్గురు టిడిపి సభ్యులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు రాజీనామా నిర్ణయం తీసుకుంటే సర్కార్‌కు ముప్పు తప్పనిస్థితి ఏర్పడుతుంది.
కీలకం కానున్న స్పీకర్ నిర్ణయం!
29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణా ఏర్పాటు కోసం చేసిన రాజీనామాలను ఆయన ఇప్పటికే తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజీనామాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. అదే సూత్రాన్ని తాజా నిర్ణయాలకు వర్తింపచేస్తారో లేదో చూడాలి. తనను కలిసిన విలేకరులతో స్పీకర్ ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ రాజీనామా లేఖలు తనకు చేరిన తరువాత, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
11 గంటలకు రాజీనామాలు
సోమవారం ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించాలని జగన్ గ్రూపు ఎంఎల్ఏలు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లిహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని, అక్కడి నుండి పంజాగుట్టలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించాలని వారు నిర్ణయించారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత బస్సులో అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకుంటారు.

క్రాప్‌హాలిడేతో సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకుని, వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసి, పరిష్కార మార్గం అన్వేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సారి రైతుబాట పట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు విస్తరిస్తున్న క్రాప్ హాలిడేను ఆయుధంగా మలిచి సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్రానికి, దేశ ప్రజలకు వివరించేందుకు జాతీయ పార్టీ నాయకులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌పై రాష్ట్రం-కేంద్ర స్థాయిలో ఒత్తిడి పెంచనున్నారు.
రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యట ిస్తున్న బాబు, రైతుల దైన్య స్థితిని నేరుగా తెలుసుకు న్నారు. క్రాప్ హాలిడేపై రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను జాతీ య స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు తనకు సహకరించా లని ఆయన ఇటీవలి తన ఢిల్లీ పర్యటన సందర్భంలో జాతీయ నేతలు ప్రకాశ్ కరత్, దేవెగౌడ, అజిత్ సింగ్, సురవరం సుధాకరరెడ్డితో పాటు ఎఐఎడిఎంకే, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీల నేతలను కలసి అభ్యర్థించగా, వారంతా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దానితో ఈ నెల 22, 23వ తేదీల్లో వారంతా గోదావరి జిల్లాలకు వచ్చి, రైతు సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల ని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటులో ఈ పార్టీలన్నీ రాష్ట్ర రైతు సమస్యలను ప్రస్తావించి, సభను స్తంభింప చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు ఆదివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందారు. మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈతకెళ్ళి నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద లారీ- జీపు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుమంది చెన్నైవాసులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండ లం చేబ్రోలు గ్రామసమీపం లో జాతీయరహదారిపై లారీ, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లావాసులుగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శోభనాద్రిగూడెంలో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరు కర్నటాక మధుగిరి ప్రాంతం శేషాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలో రెండు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతిచెందారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం ముదురమెట్ల గ్రామంలోని క్వారీలో ఈతకెళ్ళిన ఆంజనేయులు, బాషా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. కరీంనగర్ శివారులోని మానేరు జలాశయంలో స్నానం చేయడానికి వెళ్ళిన రాహుల్, రాములు ప్రమాదవశాత్తు నీటిమడుగులో కూరుకుపోయి మృతిచెందినట్లు సమాచారమందింది.
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా చెన్నైవాసులు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తిరుగుప్రయాణంలో వరదయ్యపాళెం సమీపంలోని వాటర్‌పాల్స్‌ను చూసేందుకు జీపులో వెళ్తుండగా ఏర్పేడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ఎస్.సతీష్‌తో సహా నలుగురు యాత్రికులు కార్తీక్, వసీంరాజా, జయమూర్తి, సతీష్ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామసమీపంలో జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామానికి చెందినవారు. ఆలమూరు పురాణపండవీధికి చెందిన రెండు కుటుంబాలు సమీపంలోని మరో కుటుంబంతో కలసి మొత్తం ఎనిమిది మంది ఆదివారం తెల్లవారుజామున ద్వారకాతిరుమలశ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు బస్సుపై వచ్చారు. అక్కడి నుంచి ద్వారకాతిరుమలకు ఆటోలు కుదుర్చుకున్నారు. ఆటోలు చేబ్రోలు రైల్వేగేటు మీదుగా ద్వారకాతిరుమల రహదారిపై వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నాసిక్ నుంచి ఉల్లిపాయల లోడుతో తాడేపల్లిగూడెం వస్తున్న ఒక లారీ వేగంగా ఆటోను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలు అక్కడికక్కడే తిరగబడ్డాయి. ఆటోలో ప్రయాణిస్తున్న కంచర్ల సత్యమాత(45) ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ కూచిభట్ల శ్రీవాణి(40), పురాణపండ లలితాకుమారి(42)లను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే శ్రీవాణి మృతిచెందగా ఆసుపత్రిలో లలితాకుమారి ఆశువులుబాశారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం రఘునాథపాలెం నుంచి పీక్లానాయక్ తండాకు వెళ్తున్న ట్రాక్టర్ తమ్మారం గ్రామ సమీపంలో బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఉల్లివలస గ్రామం వద్ద ఆదివారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.