రాష్ట్రీయం

రాష్ర్ట నాయకులు అఖిల పక్షంగా వెళ్ళి కేంద్రం మెడలు వంచి బాబ్లీపై రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయన్ని ఆపుతారని అనుకున్న రాష్ర్ట ప్రజలకు మరోసారి అవమానం ఎదురైంది.. అఖిల పక్షంగా వెళ్ళిన రాష్ర్ట పెద్దన్నలు ప్రధాని ముందు పేద అరుపులు అరవడానికే సరిపోయింది.. అయితే పేద అరుపులు విన్న ప్రధాని చాలా రిలాక్స్‌గా నాకు సాంకేతిక సమస్యలు తెలియవు తెలుసుకుంటానని తెలపడం అత్యంత హాస్యా స్పదం. రెండు రాష్ర్టాల మధ్య ఇంత పెద్ద ఎత్తున జల వివాదం తలెత్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రదాన ప్రతి పక్ష నేత మహారాష్ర్ట అరెస్టు, లాఠీ చార్జి జరిగిన తరువాత కూడా ఇంకా ప్రధాని సాంకేతిక సమస్యలు తెలియవని కుంటి సాకులతో సమాధానం ఇవ్వడం ఎంతో హాస్యస్పాదం. దీన్ని బట్టి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రభుత్వానికి ఎంత చిత్తశుధ్ది వుందనేది ఇట్టే అర్థం మవుతుంది.. అయితే మన పెద్దన్నలు ఈ విషయాన్ని ఎక్కడ కనపడకుండా మీడియా ముందు చంకలు గుద్దుకున్నారు. వారి మాటల్లో.. “ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాబ్లీ సమస్యను సావధానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది” – ముఖ్యమంత్రి రోశయ్య
బాబ్లీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. – చంద్రబాబు, తెలుగుదేశం
బాబ్లీ సమస్యను ప్రధాని సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనతో సమావేశం సంతృప్తికరంగా జరిగింది. – చిరంజీవి, ప్రజారాజ్యం
బాబ్లీని రాజకీయంగానే పరిష్కరించాలని ప్రధానిని కోరాం. ప్రధాని స్పందించిన తీరు అసంతృప్తి కలిగించింది. – నారాయణ, సీపీఐ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. – వినోద్ కుమార్, టీఆర్ఎస్
ప్రధానికి సమస్య తీవ్రత అర్థమైంది. సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రధానీ ఒక్క రోజులో సమస్యను పరిష్కరించలేరు. – జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా
బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్రం ముందు అఖిలపక్షం ఒకే మాట వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమర్చిన బాబ్లీ గేట్లను బద్దలు కొట్టాలని కోరింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మొరపెట్టుకుంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చింది.
సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విన్నవించింది. బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్‌ను కలిశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, 13 ఇతర ప్రాజెక్టులను నిలిపివేయకపోతే… ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారతాయని తెలిపారు.
మహారాష్ట్ర అక్రమాలను వివరిస్తూ 14 పేజీల వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. “సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు అమర్చింది. ఎలాంటిఅనుమతులు లేకుండానే గోదావరి 13 ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
ఇలాంటి అక్రమాలు అడ్డుకోవాలన్నా, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలన్నా ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన నియంత్రణ సంస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి” అని వినతిపత్రంలో కోరారు. కృష్ణా, గోదావరి నదులకు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది పార్టీల నేతలు మహారాష్ట్ర వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యాంగానికి అతీతమైనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ వ్యాఖ్యానించడం సరి కాదని రోశయ్య ప్రధానికి ఫిర్యాదు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని నేతలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే… ప్రధానమంత్రి నుంచి ఈ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. ఈ విషయంలో సాంకేతికాంశాలపై కేంద్ర జల సంఘం, జల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.
“సమాఖ్య వ్యవస్థలో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. నన్ను ఆలోచించుకోనివ్వండి” అని కోరారు. ప్రధాని హామీ పట్ల ముఖ్యమంత్రితోపాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు విశ్వాసం ప్రకటించారు. అయితే… సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని చెప్పకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు.
ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ ఆయన స మస్యను సానుకూలంగా విన్నారని, పరిష్కారం కోసం వేచి చూడడం మంచిదని ఇతర పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత నేతలు విలేఖరులతో మాట్లాడారు. తా ము చెప్పి విషయాలు ప్రధాని సావధానంగా విన్నారని దాదా పు అందరు నేతలు చెప్పారు.

ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మైక్‌లు, మాటలు బంద్ అయ్యాయి. పార్టీలన్నీ ‘మాటలు’ కట్టిపెట్టి… ‘చేతల్లోకి’ దిగాయి. డబ్బు మూటలు, మద్యం సీసాలు తెరుచుకుంటున్నాయి. తెలంగాణలో 12 నియోజకవర్గాల్లో ఆదివారంతో ప్రచారం ముగిసింది. మంగళవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం దాకా మద్యం, మనీ పంపిణీ చేయటానికి పలువురు నేతలు సన్నాహాలు చేసుకున్నారు. ఏదోవిధంగా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గుత్తగా వివిధ సంఘాల ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించనుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులంతా వారిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. యువజన సంఘాల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హామీలు గుప్పిస్తున్నారు. “ఈ 36 గంటలే కీలకం. దీనిని సమర్థంగా వినియోగించుకున్న వారిదే పైచేయి. ఫలితాలను తారుమారు చేసే సత్తా కూడా ఈ సమయానికే ఉంటుంది” అని గడిచిన 20 ఏళ్లుగా ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే… సెంటిమెంట్ ముందు ఇలాంటి ప్రలోభాలు పని చేయవని, ఈ విషయం గతంలో రుజువైందని టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు అన్నారు. “ప్రలోభాలు, సెంటిమెంట్ ఎంతగా ఉన్నా.. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడికీ పోదు. గత అనుభవాలు చెబుతున్నది ఇదే” అని టీడీపీ తెలంగాణ సీనియర్ ఒకరు చెప్పారు. పైకి ఏం చెబుతున్నా… దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వానానికి భారీగానే తెరలేచింది. అత్యధికంగా ఐదు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్ జిల్లాలో బెల్ట్‌షాపుల ద్వారానేకాక… పార్టీ నాయకులు స్వయంగా మద్యం పంపిణీ చేపట్టారు. మహిళా సంఘాలు, కులసంఘాలు, యువజన సంఘాలకు డబ్బులు ఎర వేస్తున్నారు.
ఒక్కో మహిళా సంఘానికి రూ.10వేల చొప్పున ఇస్తుండగా… కుల సంఘాల వారికి అడిగినంత అందిస్తున్నారు. మూడు రోజులుగా పలుగ్రామాల్లో ‘పంపిణీ హడావుడి’ స్పష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో ఆదివారం పోలీసులు ముగ్గురు స్థానిక టీడీపీ నేతల నుంచి రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మెట్‌పల్లిలోని హనుమాన్‌నగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ డబ్బు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్న వీరి నుంచి డబ్బుతోపాటు కరపత్రాలు, ఓటరు లిస్టులను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి.. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ పశ్చిమ పరిధిలోని హన్మకొండ వికాస్ నగర్‌లో డబ్బు పంపిణీ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డబ్బు, మద్యం సరఫరా చేసే బాధ్యతను పార్టీల నేతలు డివిజన్ స్థాయి ప్రచార ఇన్‌చార్జిలకు, నాయకులకు అప్పగించారు. ఆదివారం రాత్రి నుంచి ఆయా వార్డుల్లో రహస్యంగా సిట్టింగ్‌లు వేసి పంపిణీ పని చేపట్టారు. పురుషులకు డబ్బు, మద్యం అందిస్తుండగా… మహిళలకు చీరెలు, జాకెట్ పీసులు, వెండి కుంకుమ భరిణెలు పంచుతున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మద్యం, మనీ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ బరిలో నిలిచిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మద్యం, ధన ప్రవాహానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక అభ్యర్థి రాత్రికి రాత్రి రూ.2 కోట్లు పంపిణీ చేసేందుకు వీలుగా… గ్రామ సంఘాల నేతలతోపాటు ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు చేరవేసినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలోని లక్సెట్టిపేటలో 780 మద్యం క్వార్టర్ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో నేతలు క్షణం తీరిక లేకుండా ఓటర్ల చుట్టూ తిరిగారు. కొన్నిచోట్ల భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. గొడుగులు పట్టుకుని ప్రదర్శనలు, పాదయాత్రలు చేశారు. కుండపోత కారణంగా ఆదివారం మంచిర్యాలలో జరగాల్సిన కేసీఆర్ బహిరంగ సభ రద్దయింది. శ్రీరాంపూర్‌లో సీడబ్ల్యూసీ సభ్యుడు వెంకటస్వామి (కాకా) పాల్గొనాల్సిన సభ కూడా రద్దయింది. దీంతో నేతలు పాదయాత్రలకు పరిమితమయ్యారు. పది రోజులపాటు ఏకధాటిగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.తెలంగాణ సెంటిమెంట్, గ్రామాల్లో లభిస్తున్న స్వచ్ఛంద మద్దతు, జేఏసీ అండదండలతో ఘన విజయం తథ్యమని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరో నాలుగేళ్లు అధికారం తమ చేతుల్లోనే ఉంటుందని, అభివృద్ధి తమతోనే సాధ్యమని, తెలంగాణ ఇచ్చేది తామేనని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బాబ్లీతో సహా వివిధ సమస్యలపై చేసిన పోరును టీడీపీ అభ్యర్థులు ఏకరువు పెట్టారు. సంస్థాగతంగా బలం ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పోటీచేస్తున్న ఒకే ఒక్క స్థానం నిజామాబాద్ అర్బన్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. టీఆర్ఎస్‌తో కలిసి పావులు కదుపుతోంది.
రేపు వేతనంతో కూడిన సెలవు
ఉప ఎన్నికలు జరిగే 12 నియోజక వర్గాల పరిధిలో దుకాణాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి కార్మిక శాఖ మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులు పోలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాలెట్ భయం
ఉప ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులను వర్షం, బ్యాలెట్ భయాలు వెన్నాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలంగాణ అంతా ముసురు పట్టింది. సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం పోలింగ్ నాటికి వాతావరణం ఎలా ఉంటుందోననే ఆందోళన పార్టీల్లో వ్యక్తమవుతోంది. అసలే… వ్యవసాయ సీజన్, ఆపై వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్ బూత్‌ల దాకా ఎంతమంది వస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. అలాగే 64మందికంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉన్న ఐదు చోట్ల బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో బ్యాలెట్ పెద్దగా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఏజెంట్ల విషయంలోనూ గందరగోళం తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏకంగా 74 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదు వరుసల్లో, న్యూస్‌పేపర్ సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్‌లో ప్రధాన పోటీ దారులను గుర్తించడం కష్టమవుతుందని… చెల్లని ఓట్లు భారీగా ఉంటాయని నేతలు చెబుతున్నారు.

గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ సమక్షంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నరసారెడ్డి హాజరుకానున్నారు. టీడీపీ తరఫున చంద్రబాబునాయుడు, పీఆర్పీ తరఫున చిరంజీవి, టీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి కె. నారాయణ, బీజేపీ నుంచి జి.కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా నుంచి జయప్రకాశ్ నారాయణ, ఎంఐఎం తరఫున మహమ్మద్ పాషా ఖాద్రి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకోగా.. చిరంజీవి సోమవారం ఉదయం వెళ్లనున్నారు. ఇక, నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ లో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం ఏపీ భవన్‌లోనే విశ్రాంతి తీసుకుని.. అనంతరం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. హైదరాబాద్‌లోనూ మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్న నేపథ్యంలో దానిలోని సాధకబాధకాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కేంద్ర సామాజిక సంక్షేమ మంత్రి ముకుల్ వాస్నిక్‌ను కలుసుకున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీలు టి.సుబ్బిరామిరెడ్డి, వి.హనుమంతరావులు సీఎంతో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ గిరీశ్ సంఘీ నివాసంలో ఏర్పాటు చేసిన రాత్రి విందుకు రోశయ్య హాజరైనట్లు తెలిసింది. మరోపక్క, ఆదివారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్, ఆర్ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌లతో భేటీ అయ్యారు. ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన పరిణామాలను, బాబ్లీపై ఆ రాష్ట్రం చేస్తున్న అన్యాయాన్ని వారికి వివరించారు. దిగువ రాష్ట్రాలకు ఎగువ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయంపై జాతీయస్థాయి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారికి వివరించారు. తెలంగాణలో ఉప ఎన్నికల కంటే బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర రాష్ట్ర తమ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం ముఖ్యమైనదని, అందుకే తాము దానిపై దృష్టి సారించామని చెప్పారు. సోమవారంనాటి అఖిలపక్షంలో గోదావరిపై బాబ్లీతోపాటు మహారాష్ట్ర నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల గురించి కూడా చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారు. బాబ్లీ సందర్శనకు వెళ్లిన తమ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరిని ఎండగట్టనున్నారు. బాబ్లీ గేట్లు పెట్టి ఉంటే వాటిని పగల గొట్టించాలని ప్రధానిని డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వం కూడా దీటుగా స్పందించేందుకు సిద్ధపడుతోంది.

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పరీక్షల సంచాలకుల కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 24 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన ఈ పరీక్షలకు 3.73 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రూ.10 చెల్లించి ఈ-సేవా కేంద్రాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవచ్చు. www.ankusam.com, వెబ్‌సైట్ ద్వారా మార్కులు పొందవచ్చు.

నిన్నటిదాకా మహారాష్ట్ర ప్రభుత్వం.. తెలుగుదేశం పార్టీ మధ్య సాగిన బాబ్లీ యుద్ధం.. ఇప్పుడు రాష్ట్రానికి చేరింది! అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మధ్య కేంద్రీకృతమైంది! మాటల తూటాలు పేలాయి! వాగ్బాణాలు దూసుకొచ్చాయి! అధినేతలు మొదలు.. నేతల వరకూ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు! అటు ముఖ్యమంత్రి.. ఇటు మాజీ ముఖ్యమంత్రి! ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు! రోశయ్య చేతగాని సీఎం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటే… ఆయన ఓ హైటెక్ నేత.. ఏ పని కావాలన్నా ఒక్క సారి క్లిక్ చేస్తే అయిపోతుంది.. అంటూ వెటకారం దట్టించి తిప్పికొట్టారు ముఖ్యమంత్రి రోశయ్య! అధినాయకుల దారిలోనే నేతలూ నడిచారు! నిన్నటిదాకా సంయమనం పాటించినట్లు కనిపించిన కాంగ్రెస్ ఒక్కసారిగా విరుచుకుపడింది. పలువురు నేతలు బాబ్లీ వ్యవహారంలో టీడీపీని ఆరేశారు. బాబ్లీ.. టీడీపీ విష పుత్రిక అని ఆ పార్టీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపర్చాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేందుకే చంద్రబాబు బాబ్లీ యాత్ర పెట్టుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలంటూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించడం మంచిది కాదని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యాఖ్యానించింది. టీడీపీ హయాంలోనే బాబ్లీ మొదలైందన్న రోశయ్య వ్యాఖ్యలపై టీడీపీ నేత నాగం జనార్దనరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రోశయ్యను ముసలోడిగా అభివర్ణిస్తూ.. ‘బుద్ధుందా?’ అని నిలదీశారు. రోశయ్య అలా చెప్పడం నీతి మాలిన చర్యన్నారు. అన్నం తినేవాడెవడూ అలా చెప్పడని దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచి ఊడటం ఖాయమని హెచ్చరించారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రజాప్రతినిధులపై జరిగిన లాఠీచార్జిని బషీర్‌బాగ్ సంఘటనతో పోల్చడమేమిటని విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా… గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ తదితర ప్రాజెక్టులపై వాస్తవాలను వెల్లడించేందుకు, క్షేత్రస్థాయిలో జన సమీకరణ చేసి వాటిపై పోరాడేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే నిమిత్తం ముందుగా ఇక్కడ ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ కూడా ఇదే సలహా ఇచ్చింది. కాగా… మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పర్యవేక్షణ, నియంత్రణ కేంద్రం ఆధీనంలో ఉండాలని టీఆర్ఎస్ అభిప్రాయపడింది. బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్రంలోని అఖిలపక్ష బృందానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పీఆర్పీ అధినేత చిరంజీవి బుధవారం లేఖ రాశారు. అటు రాష్ట్రం వెలుపల కూడా బాబ్లీ రగులుతూనే ఉంది.
ఇంత జరిగినా బాబ్లీ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం తలబిరుసుతోనే ఉంది. ఏమైనా ఉంటే సుప్రీం కోర్టులో చెప్పుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ వ్యాఖ్యానించారు. అంతేకానీ.. ఇలా ఆందోళనల పేరుతో రోడ్డు పైకి వచ్చి శాంతిభద్రతల సమస్యను సృష్టించడం సరి కాదని అన్నారు. కాగా… చంద్రబాబు ఒక్కరే వస్తే బాబ్లీ ప్రాజెక్టును చూపిస్తామని నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత భాస్కరరావు పాటిల్ చెప్పారు.
ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు టీడీపీ నేతలకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయన్న ఆరోపణలు ఉంటే.. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే దృష్టిలో ఈ మాత్రపు అవమానాలు సరిపడినట్లు లేవు. చంద్రబాబుకు చవాన్ సర్కారు అల్లుడిలా మర్యాదలు చేసిందని మండిపడ్డారు. ఖైదీల డ్రస్సులేసి, చిప్పకూడు తినిపించి, మగ్గులో నీళ్లివాల్సిందని అన్నారు. అలా చేస్తే.. అప్పుడే వారంతా తిరిగి వెళ్లిపోయేవారని చెప్పారు.

బాబ్లీపై ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి రోశయ్యకు లేని బాధ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు ఎందుకని చవాన్ ప్రశ్నించటంతో ముఖ్యమంత్రి రోశయ్య ఆత్మ రక్షణలో పడవలసి వచ్చింది. చవాన్ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహంతో రగిలిపో తున్నారు. బాబ్లీపై పోరాడుతూ జైలుకెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన బృందాన్ని రాష్ట్రానికి తర లించడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్న ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వ్యాఖ్యలు ఇరుకునపెట్టాయి.
చవాన్ తమను రాష్ట్ర ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టారని మండిపడుతున్నారు. బాబ్లీకి సంబంధించి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తమను ఇంతవరకూ ఎలాంటి వివ రాలు అడగలేదని, ప్రతిపక్షమే అన్ని ప్రశ్నలూ వేస్తోందని, ఆంధ్ర ప్రభుత్వానికి లేని బాధ ప్రతిపక్షానికి ఎందుకని చవాన్ ప్రశ్నించడం ముఖ్యమంత్రి రోశయ్య సహా, కాం గ్రెస్ పార్టీని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ ేసింది. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే స్వయంగా బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్యకు చిత్తశుద్ధి లేదని చెప్పకనే చెప్పినట్టయింది. అదే సమయంలో బాబ్లీపై టీడీపీ ఒక్కటే మాట్లాడుతోందని, ఆంధ్ర ప్రభుత్వం కనీసం వాటి వివరాలు కూడా తమను అడిగే ఆసక్తి ప్రదర్శించడం లేదని చవాన్ తన వ్యాఖ్యల ద్వారా తేల్చిచెప్పారు.
ఇదే విషయాన్ని ఇప్పటివరకూ చెబుతూ వస్తున్న టీడీపీ నాయకులకు తాజాగా చవాన్ చేసిన వ్యా ఖ్యలు రోశయ్య సర్కారుపై ఎదురుదాడికి కొత్త ఆయుధం ఇచ్చినట్టయింది. బాబ్లీ అక్రమ కట్ట డాలకు సంబంధించిన ఫొటోలు కూడా ముందు తామే తీసి, ప్రభుత్వానికి ఇచ్చే వరకూ దాని గురించి నాటి వైఎస్ సర్కారుకు తెలియదని చెబుతూ వస్తోన్న బాబు వాదనకు చవాన్ ప్రకటన తో మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు.. అశోక్ చవాన్ చేసిన వ్యాఖ్యలతో బాబ్లీపై ఇప్పటికే తారాస్థాయికి చేర్చిన పోరాటాన్ని మరింత పదునెక్కించేందుకు తెలుగుదేశం పార్టీకి వీలుకలిగింది.
స్వయంగా చవానే రాష్ట్ర ప్రభుత్వానికి బాబ్లీపై ఆసక్తి లేదని, ప్రతిపక్షమే పోరా డుతోందని క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత ఇక ఎదురుదాడికి మరింత పదునుపెట్టాలని నిర్ణయించింది. కాగా, చవాన్ తమను ఇరుకునపెట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడుతు న్నారు. చవాన్ తమను రక్షించవలసింది పోయి, ప్రతిపక్షమైన టీడీపీ ఒక్కటే బాబ్లీ కోసం మాట్లాడుతుందని స్వయంగా క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీ ప్రభుత్వమే ఈవిధంగా భవిష్యత్ పరిణామాలు ఆలోచించకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఇక తాము ఏ విధంగా టీడీపీపై ఎదురుదాడి చేయాలని వాపోతున్నారు. ఒకవేళ తాము ఎదురుదాడి చేసినా, స్వయంగా మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే ‘మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ బాబ్లీపై వివరాలు అడగలేదని’ చెప్పిన వైనాన్ని టీడీపీ ప్రశ్నిస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

‘బుద్ధుందా ముసలోడికి..? రోశయ్య గోచీ ఊడాలి. బాబ్లీ ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలోనే ప్రారంభమైందని రోశయ్య చెప్పడం నీతి మాలిన చర్య. అన్నం తినేవాడెవడూ అలా చెప్పడు. ఆయనకు బుద్ధి మందగించిందో.. మతి భ్రమించిందో అర్థం కావడం లేదు. ఆయన సంగతి అసెంబ్లీలో తేలుస్తాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచీ ఉడడం ఖాయం. ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి అగౌరవంగా సాగనంపే పరిస్థితి వస్తుంది’ అని టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడి ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
‘బాబ్లీ పనులు ప్రారంభమయ్యాయని తొలిసారి శాసనసభలో మేం చెప్పినప్పుడు బఫూన్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ‘అది తాగునీటి కోసం కడుతున్న చెక్‌డాం’ అంటూ కొట్టిపారేశారు. కావాలంటే దాన్ని అసెంబ్లీ రికార్డుల్లో రోశయ్య చూసుకోవచ్చు’ అని నాగం హితవు పలికారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ పాజెక్టులకు సంబంధించి నూరు శాతం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విరుచుకుపడ్డారు. వాటిని ఎలా అడ్డుకోవాలన్న ప్రయత్నాలు చేయాల్సింది పోయి తమ మీదే రోశయ్య వ్యంగ్యాస్త్రలను సంధించడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య వ్యంగ్యాస్త్రలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే అప్పటి సలహాదారునితోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య విపరీతంగా దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. రోశయ్య సంగతి అసెంబ్లీలో తేలుస్తామని నాగం వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో బాబ్లీకి సంబంధించిన ఫైళ్లు ఏమైనా మాకు సర్క్యులేట్ చేశారా? లేక మా దగ్గర అనుమతులు తీసుకున్నారా?’ అని నాగం అన్నారు.
ఇప్పటికీ సిగ్గు లేకుండా మహారాష్ట్ర సర్కారుకు మద్దతిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నాగం దుమ్మెత్తిపోశారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రజాప్రతినిధులపై జరిగిన లాఠీచార్జిని బషీర్‌బాగ్ సంఘటనతో పోల్చడమేమిటని విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ కార్యాలయంపై రెండు రాళ్లు విసిరారంటూ తమ వాళ్లపై థర్డ్‌డిగ్రీని ప్రయోగించారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచీ ఊడుతుందని జనార్దన్‌రెడ్డి అన్నారు.

బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్రంలోని అఖిలపక్ష బృందానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పీఆర్పీ అధినేత చిరంజీవి బుధవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలను, ట్రిబ్యునల్ అ వార్డులను గౌరవించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు ఆ హ్వానించాలని ఆ లేఖలో కోరారు.
నీటి పంపిణీ ఒప్పందా లు, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డులను ఉల్లంఘించి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ.. ఇతర 13 ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ అక్రమ కట్టడాల వల్ల కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలూ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు.
అఖిలపక్ష బృందం ప్రధానిని కలవబోతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే బాబ్లీ సందర్శనకు పూనుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి, జాతీయ సమగ్రతకు వ్యతిరేకమని చిరంజీవి పేర్కొన్నారు.

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును చూసేందుకు తెలుగుదేశం పార్టీ సాహసోపేత ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నా రు. ఈ ప్రయత్నాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం దురుసు ప్రవర్తన సహించి… కొందరు నేతలు లాఠీఛార్జికి వెరవకుండా సాహసంతో ప్రాజెక్టు సైట్‌ను చూసే యత్నం చేశారని ఆయన పే ర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసుల తీరు గర్హనీయంగా ఉం దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, పోలీసు చర్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన మరోసారి తీవ్రంగా ఖండించారు.బాబ్లీ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని సీఎం స్పష్టం చేశారు. సీనియర్ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణతో కలిసి ఆయన బుధవారం సచివాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ ఆందోళనను అభినందిస్తూనే.. ఆ పార్టీ పాలనలో బాబ్లీకి వచ్చిన అనుమతులు, టెండర్ల అంశాలను ప్రస్తావించారు. ఉప ఎన్నికల సమయంలో బాబ్లీ యాత్ర చేపట్టిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎందుకు ఆందోళన వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. 2003లో బాబ్లీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలిచినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ‘టెండర్ల నోటిఫికేషన్‌ను ఎందుకు గుర్తించలే దు? అప్పుడు మీరేం చేశారు? ఆ రోజు రాష్ట్ర సీఎంగా, జాతీ య స్థాయి నేతగా మీరు ప్రజాస్వామికంగా అడ్డుపడితే ఇప్పుడు రాష్ట్రానికి ఇంత నష్టం జరిగేది కాదు. ఆ రోజు స్పం దించకుండా ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని రోశయ్య ప్రశ్నించారు. ఇటీవల శాసనసభలో విపక్షాల కోరిక మేరకు మహారాష్ట్ర, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ప్రధానికి నివేదించేందుకు ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నామని తెలిపారు. అఖిలపక్షం ఉన్నందున బాబ్లీ బస్సు యాత్రను విరమించుకోవాలని కోరినా బాబు వినలేదని ఆయ న తెలిపారు. తాము మహారాష్ట్ర పోలీసుల చర్యను ఖండిస్తే టీడీపీ నేతలు తమను ఖండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య మనస్ఫర్థలు పెరిగేలా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మరాఠీల పని పట్టాలన్న ఓ నేత వ్యాఖ్యలను బాబు ఖండించకుండా మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ఉప ఎన్నికలకు వెళ్లలేక…
తెలంగాణలో ఉప ఎన్నికలు లేకుంటే బాబు ఇంత హడావుడి చేసేవారు కాదని రోశయ్య విమర్శించారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని బాబుపై ఒత్తిడి ఉందని, దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు బస్సు యాత్ర పేరిట ఈ నెల 27 దాకా అక్కడే (మహారాష్ట్ర) ఉండాలనుకున్నారని చెప్పారు. దీంట్లో భాగంగా ఎవరైనా ప్రచారానికి పిలిస్తే బిజీ అంటున్నారని ఆరోపించారు.
మీ చరిత్ర మరిచారా?
“1983లో ప్రకాశం జిల్లా టంగుటూరు రోడ్డుపై ఆందోళన చేసిన పొగాకు రైతులపై కాల్పులు జరిపారు. వారేమైనా విదేశీయులా లేక శత్రుదేశాల వారా? మీ పాలనలో వేతనాలడిగిన అంగన్‌వాడీ వర్కర్‌లను గుర్రాలతో తొక్కించిన అమానుషాన్ని లోకం కోడైకూసింది. 2003లో బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఉద్యమం సందర్భంగా కాల్పులు జరిపారు. నేనూ ఆ ఆందోళనలో పాల్గొన్నాను.
శత్రుదేశం వారు ఏమైనా బాంబులు తీసుకొస్తున్నారని కాల్పులు జరిపారా? ఇవన్నీ మరిచిపోయి వేదాంత ప్రవచనం చెబుతున్నారు. మీ గొప్పతనం మీరు చెప్పుకోండి. మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏం చేయడం లేదని చెప్పడం బాగోలేదు. మేం ఏమీ చేయ డం లేదు కానీ ఆందోళన ఉన్న వాళ్లం. చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇక ముందూ చేస్తాం. కలిసిరండి” అని కోరారు.
ప్రతి రోజూ మాట్లాడా..
ప్రభుత్వానికి లేని ఆరాటం ప్రతిపక్షానికి ఎందుకన్న మహారాష్ట్ర సీఎం చవాన్ వ్యాఖ్యపై రోశయ్య సీఎం అభ్యంతరం వ్య క్తం చేశారు. చవాన్‌కు జ్ఞాపకశక్తి లేదేమోనన్నారు. బాబ్లీ స మస్య తీవ్రమయ్యాక ప్రతీ రోజూ ఆయనతో మాట్లాడానని తెలిపారు. తాను పట్టించుకోకపోతే ఆయనతో ఎలా మాట్లాడతానని సీఎం మండిపడ్డారు. బాబ్లీని ఆపించాలని సుప్రీం కోర్టుకు వెళ్లామని, 2006లో ప్రధాని దగ్గర సమావేశం పెట్టి, వారిది తప్పు అనిపించామన్నారు.
జంఝావతి, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు. ఇప్పటి దాకా జరిగిన దానితో సంబంధం లేకుండా బాబ్లీపై చర్చించేందుకు రావాలని మహారాష్ట్ర సీఎంనూ కోరినట్లు సీఎం తెలిపారు.
మహారాష్ట్ర పోలీసుల వైఖరి వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న టీడీపీ నేతల విమర్శలను ప్రస్తావించగా ఆయన తీవ్రంగా స్పందించారు. మరాఠీల సంగతి చూస్తామంటే సమస్య మరింత జటిలం అవుతుందన్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు, ఇక్కడున్న మరాఠీలు క్షేమంగా, స్వేచ్ఛగా ఉండాలని ఆకాక్షించారు.

అక్రమాలపై గళమెత్తినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, మరికొందరు టీడీపీ నేతలను అరెస్టు చేసి జ్యుడీిషియల్ కస్టడీకి పంపిన మహారాష్ట్ర సర్కార్ ఆదివారం కూడా అదే దూకుడును ప్రదర్శించింది. జలదోపిడీని ప్రశ్నించినందుకు తెలుగు మీడియా పైన, ప్రజలపైన విరుచుకుపడింది. బాబును, ఇతర టీడీపీ నేతలను బంధించిన ధర్మాబాద్ ఐటిఐ చుట్టూ పోలీసువలయాన్ని ఏర్పాటు చేసింది.
తెలుగువారిపై పోలీసుల వీరంగం

బాబు దిగ్బంధం విషయం తెలుసుకున్న తెలుగువారు ధర్మాబాద్ వెళ్లేందుకు యత్నించగా వారిపై లాఠీలను ప్రయోగించారు. ధర్మాబాద్ వెళ్లే అన్ని మార్గాలను తమ అదీనంలోకి తీసుకున్న మహా పోలీసులు సరిహద్దు ప్రాంతాన్ని రణరంగంగా మార్చేశారు. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తూ అనేకసార్లు దాడులకు తెగబడ్డారు. ఆదిలాబాద్ జిల్లా నుండి మహారాష్టల్రోకి ప్రవేశించే బిద్రేల్లి గేటు వద్ద మహారాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బిద్రేల్లి సరిహద్దు వద్ద ఆంధ్రా పోలీసులు లేకపోవడంతో అక్కడ మహారాష్ట్ర పోలీసుల హవా కొనసాగుతోంది.
టీడీపీ రాస్తారోకో

ధర్మాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడమేకాక, అక్కడి ప్రజల్ని ఆంధ్రాకు అనుమతించారు. ధర్మాబాద్ వెళ్ళేందుకు యత్నించిన వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ముథోల్ మండలానికి చెందిన టీడీపీ నాయకులు రాస్తారోకో చేపట్టడంతో మొదట దిగివచ్చిన పోలీసులు అనంతరం కఠినంగా వ్యవహరించారు. రాస్తారోకో చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపైకి దూసుకొచ్చిన మరాఠా పోలీసులు వెంటబడి చావబాదారు. ఏకంగా రెండు ఫర్లాంగుల మేర ఆంధ్రా సరిహద్దు వెంబడి వారిని వెంటాడి పశువులను బాదినట్లు బాదారు. ఈ ఘర్షణలో మారుతీ అనే తెలుగుదేశం కార్యకర్త కాక, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మీడియానూ వదల్లేదు

మరాఠా పోలీసుల తీరుతో భయభ్రాంతులకు గురైన మీడియా ప్రతినిధులు ప్రసార వాహనాలను వదిలి పరుగులు తీయాల్సి వచ్చింది. స్వయంగా డిఐజి స్థాయి అధికారి దగ్గరుండి ఈ తంతును నడిపిస్తుండగా అక్కడి ఎస్పీ సందీప్ కార్నిక్ ధర్మాబాద్ నుండి బిద్రేల్లి వరకు తెలుగుమీడియాపై ప్రతాపం చూపించారు. మీడియా ప్రతినిధులు, తెలుగు వారు కనిపిస్తే చాలు ఒంటికాలిపై లేచి దుర్భాషలాడుతూ కనిపించారు. దీంతో తమ అధినేత చంద్రబాబును కలుసుకోవాలనుకున్న వారికి చేదు అనుభవం ఎదురుకాగా పోలీసుల దిగ్బంధంలో ఉన్న నేతలూ అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.
సర్కార్ నిర్లక్ష్యం
తమ కస్టడీలో ఉన్న నేతలకు సౌకర్యాలను కల్పించడంలో మహాసర్కారు అదే నిర్లక్ష్యాన్ని కొనసాగించింది. భోజన సౌకర్యం తమకు తాముగానే కల్పించున్న నేతలు పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ వైద్య సౌకర్యాలు కల్పించలేదని ‘దేశం’ నేతలు ఆరోపించారు. బెయిల్ తీసుకొని వెళ్లాలంటూ పోలీసు అధికారులు పదేపదే హెచ్చరించినట్లు తెలిపారు. నిర్బంధించిన గది బయటకు వెళ్లేందుకైనా అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపించారు.
ఆదివారం మహిళా నేతలకు మరో గది సౌకర్యం కల్పించినా కనీస సౌకర్యాలను కల్పించకపోవడం పట్ల ఆవేదన వెళ్లగక్కారు. బాబును దిగ్బంధించిన ఐటిఐ భవనం వద్ద ఎలాంటి సమస్యలు లేకపోయినా మీడియాపై తీవ్ర ఆంక్షలు చేపట్టిన పోలీసులు ఎప్పటికప్పుడు వెంటబడి తరిమారు. ఆంధ్ర సరిహద్దుపై సైతం వారిదే ఆధిపత్యం కొనసాగడం గమనార్హం. ఇదిలావుంటే ఆంధ్ర పోలీసుల తీరు విమర్శలకు దారితీస్తోంది.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలుగువారిపె,ై తెలుగు మీడియాపై మహా దౌర్జాన్యాన్ని అడ్డుకోలేకపోయారు. మహారాష్ట్ర సరిహద్దులో అక్కడి పోలీసులు రౌడీల్లా వ్యవహరించినా ఆంధ్ర పోలీసులు సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో లోకేశ్వరం వద్ద ఉండిపోయారు. దీంతో ఆంధ్ర సరిహద్దులోనూ మహారాష్ట్ర పోలీసులు విన్యాసాలను కొనసాగించారు. చంద్రబాబు అరెస్టు సైతం ఆంద్ర సరిహద్దులోనే కావడం గమనార్హం.