విజయనగరం

ఇదే చివరి అస్త్రం – టి.కాంగ్రెస్ సారథ్య సంఘ నిర్ణయం


తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చిట్టచివరి సారిగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సారి అధిష్ఠానం సానుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌పై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి, గవర్నర్ కేంద్రానికి, అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, ఆ నివేదికల అధారంగానే అధిష్ఠానం ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు అధిష్ఠాన వర్గం తన దూతగా ఎవరినైనా పంపించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా అని వారు అభిప్రాయ పడ్డారు. సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఢిల్లీలో చేసిన ప్రకటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి తెరాస అధినేత కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సమావేశం ఖండించింది.
సకల జనుల సమ్మెతో తెలంగాణలో జన జీవనం స్తంభించినా అధిష్ఠాన వర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సారధ్య సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక చివరిసారిగా ఢిల్మీకి వెళ్ళి అధిష్ఠాన వర్గాన్ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుదాం, అధిష్ఠాన వర్గం సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేద్దాం’ అని సమావేశంలో సభ్యులు అన్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మళ్ళీ మనం ఎవరం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అందరం రాజీనామాలు చేస్తే అధిష్ఠానవర్గమే దిగి వచ్చి తెలంగాణను ప్రకటిస్తుంది’ అని అన్నారు.
మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న విషయం చర్చకు వచ్చినపుడు, ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సారధ్య సంఘం చైర్మన్‌గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సమావేశంలో తెలియజేశారు. వెంటనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకుని తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తన రాజీనామా గురించి ఇంతకు ముందే చెప్పానని, నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రకటించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, తన సోదరుడు, ఉద్యావన శాఖ మంత్రి ఆర్.వెంకటరెడ్డితో కూడా తాను రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన తెలంగాణ మంత్రుల్లో ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో ఇప్పుడే చెప్పలేమని వారు అభిప్రాయ పడ్డారు.
మాకు కావాల్సింది తెలంగాణ.. కిలో రూ.1 బియ్యం కాదు
ఇలా ఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. సకల జనుల సమ్మె ఇంత తీవ్రంగా ఉంటే రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘మాకు కావలసింది తెలంగాణ తప్ప రూపాయికి కిలో బియ్యం కాదు’ అని దామోదర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె ప్రభావం గురించి ముఖ్యమంత్రి అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.
తెలంగాణ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి పరిస్థితిని అధిష్ఠాన వర్గానికి వివరించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతామన్నారు. 26వ తేదీన అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటామని, ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్ తిరిగివచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
తప్పుడు నివేదికలు పంపుతున్న సిఎం, గవర్నర్
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాధం మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఒక సీటు గెలిచినా అవినీతికి లైసెన్స్‌ ఇచ్చినట్లే


తమతో కలసిరండి అని వివిధ జిల్లాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను డబ్బుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభపెడుతోందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. రూ.5 కోట్లు ఇస్తాం రూ.10, రూ.20 రూ.30 కోట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు గాళం వేస్తున్నారని ధ్వజమె త్తారు. ఎవర్ని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు మీకు సమాచారం ఉంది అని అడగ్గా ఆ వివరాలు వెల్లడించడం ఇప్పుడు మంచిది కాదని ఆయన అన్నారు. అలా డబ్బు తీసుకొని వెళ్లే ఎమ్మెల్యేలు తిరిగి మరలా గెలవగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బేరసాలకు దిగుతున్నారని విమర్శించారు.
గురువారం గాంధీభవన్‌లో తనను కలసిన మీడియా ప్రతినిధులతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. తీసుకొన్న డబ్బు ఉత్సవ విగ్రహంలా పెట్టుకొని పూజించాలే గానీ వాటితో ఆ ఎమ్మెల్యేలు ఏమీ సాధించలేరని చెప్పారు. ఈ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించి ఉప ఎన్నికలు అనివార్య మైతే ఎదుర్కోనికి ఇప్పటికే ప్రత్యామ్నా యాలు చేసుకొంటున్నామన్నారు. డబ్బు తీసుకొన్న ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్లితే ఎన్ని కల్లో వారిని ప్రజలు హర్షిస్తారాఅ ని ప్రశ్నిం చారు. రాజీనామాలు చేసిన ఆ ఎమ్మెల్యేలతో మీరు చర్చించే అవకాశముందా అని ప్రశ్నిం చగా ఆ పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. ఎవర్ని దేహీ అంటూ అభ్యర్ధించాల్సిన అవ సరం కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌ పారీ కి ఓ స్పష్టత, సిద్ధాంతం, వైభవం ఉంద న్నారు. కాంగ్రెస్‌ పార్టీ గౌరవం ఇస్తుంది, తీసుకొంటుందని అని పేర్కొన్నారు. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యేలతో మీరేమైన మాట్లాడుతున్నారా అని అడగ్గా ఆ అవసరం తమకు లేదన్నారు. ప్రలోభాలకు గురిచేస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. జగన్‌ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో ఒకరైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతరపున గెలిస్తే మాత్రం అవి నీతికి లైసెన్స్‌ ఇచ్చినట్లేనని పేర్కొన్నారు.
కానీ వీరిని గెలిపించి అవినీతిని ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగాలేరని తెలిపారు. 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టంచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల భాష అసభ్యంగా ఉందన్నారు. జగన్‌ దోషి అని తేలితే కాంగ్రెస్‌ ముద్దాయిగా నిలుస్తుందని జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యనా లపై ప్రస్తావించగా అవినీతి పరులను, తప్పుచేసిన వారిని కాం గ్రెస్‌ పార్టీ కాపాడాలి అంటారా అని బొత్స తీవ్రంగా స్పందించారు. వై.ఎస్‌.నిర్దోషి అని కోర్టులో ప్రభుత్వం అఫిడివిట్‌ దాఖలు చేయ కపోవడంపై జీవన్‌రెడ్డి ప్రశ్నించడాన్ని అడగ్గా ఆయనే ఓ న్యాయవాది ఆ పని ఆయన చేస్తే బాగుంటుందన్నారు.  ఆ పనిచేశాక జీవన్‌రెడ్డి జగన్‌తో కలసి తిరిగితే బాగుంటుందని పేర్కొ న్నారు. వై.ఎస్‌.పై అవినీతి ఆరోపణలు వస్తే కొడుకుగా వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. ముందు ఆ పని జగన్‌ చేయాల్సి ఉంటుందన్నారు. మీ ముఖ్యమం త్రిగా వైఎస్‌ఆర్‌పై ఆరోపణలు వస్తే మీరేం చేయరా అని ప్రశ్నించగా ముందు జగన్‌ను చేయనీయండి ఆ తర్వాత తాము ఏం చేయాలో చేస్తామని బొత్స పేర్కొన్నారు. తండ్రిపై ఆరోపణలు వస్తే అది వాస్తవం కాదని ఆధారాలతో సహా చూపించాల్సింది పోయి మాపై బురదజల్లి తల్లి, దండ్రులపైనే బురద జల్లుకొంటున్నారని విమర్శించారు.
హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన విషయాన్ని ప్రశ్నించగా ఇది ముందే ఉహించిందన్నారు. జగన్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయనడానికి పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా బీజేపీ, కేసును ఆ పార్టీ నేత వాదించడమే ఇందు కు నిదర్శమన్నారు. స్పీకర్‌ ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమో దించే దాకా వారికి పునరాలోచనకు సమయం ఉన్నట్లేనని ఓ ప్ర శ్నకు జవాబిచ్చారు. జీవన్‌రెడ్డి పార్టీలైన్‌ దాటి మాట్లాడారా లేదా అన్నది తమ పార్టీ అంతరంగికంగా చర్చించుకొంటామన్నారు.

ఇద్దరు ఎంపీలు, 29 మంది ఎమ్మెల్యేల రాజీనామా – జగన్‌ మద్దతుదార్ల నిర్ణయం


సిబిఐ సోదాలతో వైఎస్‌ జగన్‌ ఉక్కిరి బిక్కిరవుతుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదురు దాడికి దిగింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉంటూనే జగన్‌ ఆస్త్రం సంధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీకర్‌, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, బస్సు యాత్ర ఎప్పటినుండి ప్రారంభించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీరి రాజీనామాలు ఆమోదించినా సర్కార్‌ మనుగడకు వెంటనే ముప్పు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అనిశ్చితి పెరిగి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్తే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. రాజీనామాల నిర్ణయం వెలువడిన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ పేరును పేర్కొనడానికి నిరసనగా తమ బాటలోనే ప్రయాణించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తమ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోందని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఒక టివి ఛానల్‌లో మాట్లాడుతూ మరో 20 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, తొలిదశ తరువాత రెండు మూడు రోజుల్లో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. ఈ దిశలో కొందరితో ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. జిల్లాల వారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఈ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
మూడు గంటల పాటు సమావేశం
అంతకుముందు జూబ్లిహిల్స్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన రెండు రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. సమావేశం నుండి కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఒకటికి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. సమావేశం నుండే స్పీకర్‌ కార్యాలయానికి, గవర్నర్‌ కార్యాలయానికి ఫోన్లు చేసి అపాయింట్‌మెంట్లు ఖరారు చేసుకున్నారు. ఆ తరువాత రాజీనామాల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాసనసభలో బలాబలాల తీరు
294 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో సర్కారు మనుగడకు 148 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజారాజ్యంతో కలిసి 173 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించిన 29 మందిలో 27 మంది కాంగ్రెస్‌కు, పిఆర్పీకి చెందిన వారే! వీరి రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్‌ బలం 146కు పరిమితమవుతుంది. అయితే, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పటివరకు కాంగ్రెస్‌కే లభిస్తోంది. వీరిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్‌ సర్కారు ప్రభుత్వానికి వెంటనే ముప్పురాకపోవచ్చు. 12 మంది సభ్యులున్న టిఆర్‌ఎస్‌ కూడా శానససభలో కీలకపాత్ర పోషించనుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత శాసనసభలో 86 మంది సభ్యులుండగా, వారిలో ఇద్దరు తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 84కు పరిమితం కానుంది. గతంలోనే నాగం జనార్ధనరెడ్డితో పాటు మరో ముగ్గురు టిడిపి సభ్యులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు రాజీనామా నిర్ణయం తీసుకుంటే సర్కార్‌కు ముప్పు తప్పనిస్థితి ఏర్పడుతుంది.
కీలకం కానున్న స్పీకర్‌ నిర్ణయం!
29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణా ఏర్పాటు కోసం చేసిన రాజీనామాలను ఆయన ఇప్పటికే తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజీనామాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. అదే సూత్రాన్ని తాజా నిర్ణయాలకు వర్తింపచేస్తారో లేదో చూడాలి. తనను కలిసిన విలేకరులతో స్పీకర్‌ ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ రాజీనామా లేఖలు తనకు చేరిన తరువాత, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
11 గంటలకు రాజీనామాలు
సోమవారం ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించాలని జగన్‌ గ్రూపు ఎంఎల్‌ఏలు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లిహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని, అక్కడి నుండి పంజాగుట్టలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించాలని వారు నిర్ణయించారు. వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత బస్సులో అసెంబ్లీలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

బాబు రైతు బాట


క్రాప్‌హాలిడేతో సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకుని, వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసి, పరిష్కార మార్గం అన్వేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సారి రైతుబాట పట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు విస్తరిస్తున్న క్రాప్‌ హాలిడేను ఆయుధంగా మలిచి సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్రానికి, దేశ ప్రజలకు వివరించేందుకు జాతీయ పార్టీ నాయకులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌పై రాష్ట్రం-కేంద్ర స్థాయిలో ఒత్తిడి పెంచనున్నారు.
రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యట ిస్తున్న బాబు, రైతుల దైన్య స్థితిని నేరుగా తెలుసుకు న్నారు. క్రాప్‌ హాలిడేపై రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను జాతీ య స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు తనకు సహకరించా లని ఆయన ఇటీవలి తన ఢిల్లీ పర్యటన సందర్భంలో జాతీయ నేతలు ప్రకాశ్‌ కరత్‌, దేవెగౌడ, అజిత్‌ సింగ్‌, సురవరం సుధాకరరెడ్డితో పాటు ఎఐఎడిఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ లాంటి పార్టీల నేతలను కలసి అభ్యర్థించగా, వారంతా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దానితో ఈ నెల 22, 23వ తేదీల్లో వారంతా గోదావరి జిల్లాలకు వచ్చి, రైతు సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.ఆ తర్వాత ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాల ని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటులో ఈ పార్టీలన్నీ రాష్ట్ర రైతు సమస్యలను ప్రస్తావించి, సభను స్తంభింప చేయాలని భావిస్తున్నారు.

రానున్న రచ్చబండలో 24 లక్షల కొత్త కార్డులు – బొత్స


కొత్తగా 24 లక్షల రేషన్‌ కార్డులు వచ్చే నెల రచ్చబండ కార్యక్రమంలో పంపిణీ చేస్తామని రవాణాశాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి (డిఆర్‌సి)లో ఆయన ప్రసంగించారు. విజయనగరం జిల్లాలో లక్షా 20 వేల రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇందిర జలప్రభ’లో భాగంగా ఎస్సీ, ఎస్టీ భూములను బ్లాకులుగా విభజించి భూ అభివృద్ధికి నిధులు ఇవ్వనుందని తెలిపారు. జిల్లాలో సుమారు 11,300 ఎకరాలను డ్వామా అధికారులు ఇప్పటికే గుర్తించారనీ, అక్టోబర్‌ రెండున ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందనీ చెప్పారు. జిల్లాలో సుమారు 70వేల ఎకరాల్లో రూ.73 కోట్లతో ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణను రైతుల ముంగిటకు అధికారులు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.
అన్ని పార్టీలు ఆమోదించాకే 14 ఎఫ్‌పై నిర్ణయం
రాష్ట్ర శాసనసభలో 14 ఎఫ్‌పై అన్ని రాజకీయ పక్షాలు చర్చించి ఆమోదించిన తరువాతే కేంద్ర హోంశాఖకు నివేదించామని బొత్స తెలిపారు. ఆ తరువాతే ఈ ప్రతిపాదనపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని తెలిపారు.
యంత్రాలివ్వండి : మంత్రి విశ్వరూప్‌
పెట్టుబడులు, కూలీల వేతనాలు పెరిగినందున ట్రాక్టర్లు, వరినాట్లు వేయడానికి రైతులకు యంత్రాలు ఇవ్వాలని వ్యవసాయ, బ్యాంకింగ్‌ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్‌ ఆదేశించారు.

నెత్తురోడిన రహదారులు – వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి


రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు ఆదివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందారు. మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈతకెళ్ళి నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద లారీ- జీపు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుమంది చెన్నైవాసులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండ లం చేబ్రోలు గ్రామసమీపం లో జాతీయరహదారిపై లారీ, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లావాసులుగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శోభనాద్రిగూడెంలో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరు కర్నటాక మధుగిరి ప్రాంతం శేషాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నగరంలో రెండు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతిచెందారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం ముదురమెట్ల గ్రామంలోని క్వారీలో ఈతకెళ్ళిన ఆంజనేయులు, బాషా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయంలో స్నానం చేయడానికి వెళ్ళిన రాహుల్‌, రాములు ప్రమాదవశాత్తు నీటిమడుగులో కూరుకుపోయి మృతిచెందినట్లు సమాచారమందింది.
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా చెన్నైవాసులు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తిరుగుప్రయాణంలో వరదయ్యపాళెం సమీపంలోని వాటర్‌పాల్స్‌ను చూసేందుకు జీపులో వెళ్తుండగా ఏర్పేడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌ ఎస్‌.సతీష్‌తో సహా నలుగురు యాత్రికులు కార్తీక్‌, వసీంరాజా, జయమూర్తి, సతీష్‌ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామసమీపంలో జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామానికి చెందినవారు. ఆలమూరు పురాణపండవీధికి చెందిన రెండు కుటుంబాలు సమీపంలోని మరో కుటుంబంతో కలసి మొత్తం ఎనిమిది మంది ఆదివారం తెల్లవారుజామున ద్వారకాతిరుమలశ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు బస్సుపై వచ్చారు. అక్కడి నుంచి ద్వారకాతిరుమలకు ఆటోలు కుదుర్చుకున్నారు. ఆటోలు చేబ్రోలు రైల్వేగేటు మీదుగా ద్వారకాతిరుమల రహదారిపై వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నాసిక్‌ నుంచి ఉల్లిపాయల లోడుతో తాడేపల్లిగూడెం వస్తున్న ఒక లారీ వేగంగా ఆటోను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలు అక్కడికక్కడే తిరగబడ్డాయి. ఆటోలో ప్రయాణిస్తున్న కంచర్ల సత్యమాత(45) ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ కూచిభట్ల శ్రీవాణి(40), పురాణపండ లలితాకుమారి(42)లను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే శ్రీవాణి మృతిచెందగా ఆసుపత్రిలో లలితాకుమారి ఆశువులుబాశారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం రఘునాథపాలెం నుంచి పీక్లానాయక్‌ తండాకు వెళ్తున్న ట్రాక్టర్‌ తమ్మారం గ్రామ సమీపంలో బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఉల్లివలస గ్రామం వద్ద ఆదివారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణపై నా వైఖరిలో మార్పు లేదు


తెలంగాణపై గతంలోని తన వైఖరిలో ఎలాంటి మార్పులేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. తాను ఎప్పుడూ ఒకటే మాట చెబుతానని అన్నారు. తాను తప్పు చేయలేదు కదా మాట మార్చడానికి అని పేర్కొన్నారు. తెలంగాణపై బొత్స వైఖరిలో మార్పు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు కదాఅని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కోమటిరెడ్డి అలా ఎక్కడ మాట్లాడారో పత్రికలో గానీ మీడియాలోగానీ చూడలేదన్నారు. అది చూశాక, లేక ఆయన్ని అడిగి తరువాత స్పందిస్తానన్నారు.  రాష్ట్ర విభజన సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమీక్ష అనంతరం బొత్స సత్యనారాయణ గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య వ్యక్తంచేసిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మూడు నెలలో సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారని ఆయన గుర్తుచేశారు. నిండు ప్రాణాలు బలితీసుకోవద్దని ఆయన కోరారు. ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు కూడా కొంత సంయమనం పాటించాలని సూచించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ జీత భత్యాల కోసం పోరాటం చేస్తే ఫలితముంటుందని, మెరుగైన ఫలితాల కోసం పోరాటం చేయవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర, కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. దీనిపై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. 14(ఎఫ్‌) తొలగింపు కోసం ఢిల్లీ పెద్దలతో తాను మాట్లాడానని చెప్పారు. ఇది హైదరాబాద్‌కు సంబంధించిన అంశమని, కానీ హైదరాబాద్‌లో ఎసై్స నియామకాలు జరగడంలేదని గుర్తుచేశారు. దీనివల్ల అన్యాయం జరుగుతుందన్న భావనతోనే 14(ఎఫ్‌)ను తొలగించాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొనే 14 (ఎఫ్‌)ను తొలగించాలని కోరుతున్నారని తెలిపారు. లగడపాటి రాజ్‌గోపాల్‌ లేఖ రాయడం ద్వారా 14(ఎఫ్‌) రద్దు ఆగిపోలేదన్నారు. పిఆర్‌పి విలీనం మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశముందన్నారు.
సాంకేతికంగా పిఆర్‌పి విలీనం జరిగిపోయిందన్నారు. సోనియా అనారోగ్య కారణాలతో అది కొన్ని రోజులు వాయిదా పడిందన్నారు. ఆజాద్‌తో ఆంధ్రా నేతల చర్చలు ఈ నెల 10 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణ మంత్రులు విధుల్లోకి వచ్చేలా రాయబారం నడుపుతారా అని అడగ్గా అది నిరంతర ప్రక్రియ సముదాయిస్తునే ఉన్నాం, ఒక ప్రాంతం వారినే కాదు ఇరు ప్రాంతాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ను గానీ కొంతమందితో కూడిన గ్రూప్‌ ఇన్‌ఛార్జ్‌లను గానీ పెడతామని చెప్పారు.  పార్టీలో నిజాయితీతో ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. ఆయనకు అన్యాయం జరిగిందని ఇప్పుడే గుర్తుకు వచ్చిందన్నారు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారని, మంత్రి పదవి రాలేదని, అన్యాయం జరగిందని నాడు గుర్తుకు రాలేదన్నారు. నచ్చితే ఒకళా, నచ్చకపోతే మరోలా అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ిపీఆర్‌పి, కాంగ్రెస్‌ నేతల మధ్య కోఆర్డినేషన్‌ కోసం సమావేశాలు పెడుతామన్నారు.

సర్వే, లగడపాటిలకూ అవకాశం

తెలంగాణ అంశంపై లోక్‌సభలో శుక్రవారం జరగనున్న చర్చలో సుష్మాస్వరాజ్‌, గోపీనాథ్‌ ముండే, రమేష్‌ బైస్‌లతో పాటు సిపిఐ పక్ష నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు, మల్కాజ్‌గిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ పాల్గొననున్నారు. అయితే, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తనకు కూడా చర్చలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు, అధికార పార్టీ చీఫ్‌విప్‌కు లేఖలు రాసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురై శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానానికి తగినంత వ్యవధి ఇవ్వాలనే అభిప్రాయంతో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే నిర్ణయించుకొన్నప్పటికీ రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులెవరూ శుక్రవారంనాటి తెలంగాణపై చర్చ సమయంలో సభకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పార్లమెంట్‌ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భావిస్తున్నప్పటికీ ఎప్పటి నుండి సభకు హాజరుకావాలనే విషయాన్ని శనివారంనాడు హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాలనుకొన్నందున తెలంగాణ ఎంపీలలో చాలామంది ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివెళ్లిపోయారని ఈ వర్గాలు తెలియజేశాయి.

అబ్కారీ శాఖలో డిప్యుటీ కమీషనర్ల బదలీలు


ఆబ్కారీ శాఖలో ఎట్టకేలకు డిప్యుటీ కమీషనర్ల బదిలీ వ్యవహారం పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి సిఫార్సులతో కష్టంగా మారిన బదిలీల వ్యవహా రం ఎట్టకేలకు సజావుగా పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాంద్ర, విశాఖ పట్నం జిల్లాల్లో ఆబ్కారీ శాఖ అధికారు లకు కోట్లాది రూపాయల ఆదాయం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోస్టిం గ్‌ల కోసం పైరవీలు భారీ స్థాయిలో జరిగాయి. విశాఖ పట్నం లాంటి ఒకే పోస్టుకు అటు ముఖ్య మంత్రి కిరణ్‌, ఇటు పిసిసి ప్రెసిడెంట్‌ బొత్సలు, ఎకై్సజ్‌ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సిఫా ర్సులు చేయడంతో తాజాగా జరిగిన బదిలీల్లో విశాఖ పట్టణం సోస్టును కదిలించ లేదు. మంత్రి కి వచ్చిన సిఫార్సులకు తోడు ఆయన భావించిన కేవలం కడపలో మాత్రమే తన మాటను ఆయన ఈ బదిలీలలో నిలబెట్టుకో గలిగారు.
బదిలీ అయ్యింది వీరే..
అదిలాబాద్‌లో డిప్యుటీ కమీషనర్‌గా పనిచేస్తోన్న ఎ.చంద్ర శేఖర్‌ నాయుడును ప్రకాశం జిల్లా ఒంగోలు డిసిగా, కడప జిల్లాలో డిసిగా విధులు నిర్వహిస్తోన్న ఎస్‌.ఎం. రాజేశ్వర్‌ రావును ఏలూరు డిసిగా, ఏలూరు డిసిగా పని చేస్తోన్న ఎ. అరవిందర్‌ సింగ్‌ను ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈదే విధంగా ఖమ్మం డిసిగా పనిచేస్తోన్న ఎ.వి. నరసింహ్మ రావును వరంగల్‌ డిసిగా బదిలీ చేవారు. మహబూబా బాద్‌ డిసి రాథోడ్‌ సురేష్‌ను విశాఖ పట్నం ఎకై్సజ్‌ సూపరింటెండెంట్‌గా అనకాపల్లికి బదిలీ చేశారు.
కరీంనగర్‌లో డిసిగా పనిచేస్తోన్న ఎం. దేవ కుమార్‌ను అనంత పూర్‌ డిసిగా బదిలీ చేశారు. ఎకై్సజ్‌ అకాడమీలో ఇంచార్జి జాయింట్‌ డైరెక్టర్‌ గా ఉన్న పి. గంగాధర్‌ను మెదక్‌ ఇంచార్జి డిప్యు టీ కమీషనర్‌గా బదిలీ చేస్తూ బుదవారం రెవె న్యూ కార్యదర్షి అశుతోష్‌ మిష్రా ఉత్తర్వులు జారీ చేశారు.ఎం. దేవ కుమార్‌, పి. గంగాధర్‌లకు టిఏ, డిఏలను వర్తింప జేయడంలేదని ప్రభుత్వం ఉత్త ర్వులో పేర్కొంది. వారి అభ్యర్థన మేరకు ఆయా స్థానాల్లో బదిలీచేయడంతో ఈ డిఏ, టిఏలను ఇవ్వడంలేదని ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది.

గిరిజన ప్రాంతాల్లో మలేరియాను సమూలంగా నిర్మూలించాలి – గవర్నర్‌


గిరిజన ప్రాంతాల్లో మలేరియా సమూలంగా నిర్మూలనే లక్ష్యంగా చేసుకుని వైద్యాధికారులు పనిచేయాలని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నర్సింహన్‌ ఆదేశించారు. మంగళవారం అరుకులోయలోని ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఏరియా ఆసుపత్రితో వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ పి.వి.రమేష్‌, రాష్ట్ర కుటుంబ నియంత్రణ కమిషనర్‌ వై.శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌, ఐవివివిపి కమిషనర్‌ డాక్టర్‌ కె.ఫని కోటేశ్వరరావు, వైద్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.అరుణకుమారి, మలేరియాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోమరాజు, గిరిజన సంక్షేమశాఖ డాక్టర్‌ బి.కె.నాయక్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, డాక్టర్‌ జి.సావిత్రి, రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, ఇతర శాఖాధికారులతో గవర్నర్‌ గిరిజన గ్రామాల్లో వైద్యసేవలపై ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. అందరి భాగస్వామ్యంతో గిరిజన ప్రాంతాల్లో వ్యాధులను అరికట్టాలన్నారు. సమీకృత వైద్య సేవలను అందించాలని సూచించారు. అన్ని వ్యాధుల నిర్మూలన కోసం అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎన్నో కోట్ల రూపాయలు వైద్య పరంగా ఖర్చు చేస్తున్నామని, చేపట్టే వైద్యచర్యలు బహుళ ప్రచారం కావాలన్నారు. గ్రామాల్లో సర్పంచులకు ఆ గ్రామాల పరిస్థితి పూర్తిగా తెలుస్తుందని, వారిని గ్రామ ఆరోగ్య పరిస్థితికి బాధ్యులుగా ఉంచుతూ ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రెడ్‌క్రాస్‌ సంస్థల సహకారంతో వైద్య చర్యలు ముమ్మరం చేయాలని అన్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణాలతో వసతి, పారిశుద్ధ్యం మెరుగుపడ్డాయన్నారు. వచ్చే ఏడాదిలో మలేరియా పాజిటివ్‌ కేసులు రాకుండా ఉండాలన్న ధ్యేయంతో వైద్యాధికారులు కష్టపడాలన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు మారుమూల ప్రాంతాల్లో సైతం చేపట్టే వైద్యచర్యలు ప్రచారంతోపాటు వెనువెంటనే వైద్యం అందివ్వాలన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పోలీసుస్టేషన్లు వంటి సంస్థల నుంచి రక్తదాన శిబిరాల ద్వారా రక్తం సేకరించాలన్నారు. వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల పనితీరు, మందుల లభ్యం, గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన పాజిటివ్‌ కేసుల వివరాలు, వైద్య సిబ్బంది కొరత గవర్నర్‌కు వివరించారు. జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గిరిజనప్రాంతాల్లో వ్యాధుల నివారణకు ముందస్తుగా చర్యలు తీసుకున్నామని, ప్రతి మండలానికీ ఒక జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ క్లస్టర్‌స్థాయి అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి ఎఎన్‌ఎం, సిహెచ్‌డబ్ల్యూ, పిఆర్‌ఓ, అంగన్వాడీ వర్కర్ల భాగస్వామ్యంతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. ఏజెన్సీలో జరిగే 35 వారపు సంతల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సరఫరా చేస్తూ పర్యవేక్షణతో వైద్య సేవలు అందించే చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా గవర్నర్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విశాఖ ఏజెన్సీ లో చేపట్టే వైద్య సేవలను వివరించారు. సమావేశంలో అరకు ఎమ్మెల్యే సివేరి సోమ, వైద్యాధికారులు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.

free website analytics