విశాఖపట్నం

రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు

12.07
రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా కురుస్తున్నాయి. సకాలంలో రుతుపవనాలు రావడం, మధ్యలో రెండుసార్లు అల్పపీడనాలు ఏర్పడడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఏకంగా 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా కురవగా, ఒక్క అదిలాబాద్ జిల్లాలో మాత్రమే తక్కువగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా, ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏకంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడం విశేషం. అనంతపురం పట్టణంలో కూడా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం తెల్లవారు జామున విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి నీట మునిగింది. అవుకు రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరుతోంది. ఉయ్యాలవాడ మండల పరిధిలోని ఇంజేడు గ్రామ సమీపాన గల కుందర వాగు పొంగిపొర్లుతోంది.
రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటం, నదుల్లోకి నీరు భారీగా చేరడంతో జలాశయాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కొన్ని డ్యామ్‌ల వద్ద అప్పుడే గేట్లు ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనడం మంచి పరిణామంగానే చెప్పవచ్చు. అయితే భారీ వర్షాలతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నదుల్లోకి నీరు చేరుతుండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జిల్లాల అధికారులు ఆప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలుపడ్డాయి. నడిచేందుకు కూడా అవకాశం లేని విధంగా రోడ్లు మారిపోయాయి.
గత నెల రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కోస్తా ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదుకాగా, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం కొంత వర్షపాతం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని హైదరాబాద్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురవగా, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం సాధారణ స్థాయి కన్నా తక్కువగా వర్షం కురిసింది. ఇక్కడ జూలై నెల్లో ఇప్పటివరకు 234 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 174 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
ఇక శనివారం తెల్లవారుజాము నుండి అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ధర్మవరంలో వర్షం కురియగా, అనంతపురంలో 12, మాచెర్లలో 10, జమ్మలమడుగులో 8, హైదరాబాద్, ములుగు, నర్సంపేట, పరిగి ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే బాపట్ల, చిలమత్తూరు, భద్రాచలం, పులివెందుల్లో 6, దుమ్ముగూడెంలో 5, చేవెళ్ల, గోల్కొండ, వెంకటగిరి కోటల్లో 4, హకీంపేట, మచిలీపట్నం, ఆళ్లగడ్డ, అచ్చంపేట, నాగార్జునసాగర్ డ్యామ్, హిందుపురంలో 3, రెంటచింతల, కదిరి, పుత్తూరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి, గుడివాడ, కాళేశ్వరం, కుప్పం తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా సెంటీమీటర్ కన్నా అధికంగానే వర్షపాతం నమోదైంది.
కాగా, మరో రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు రోజులపాటు మబ్బులు కమ్ముకుని విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాగులో పడ్డ బస్సు .. ప్రయాణికులు క్షేమం
అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామం వద్ద డూపులేట్ వాగు ఉద్ధృతికి తాళలేక ఆదివారం ఉదయం వరంగల్ నుండి వస్తున్న పుట్టపర్తి డిపో బస్సు బోల్తా పడింది. అయితే డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి గ్రామస్తుల సహాయంతో 29 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ప్రయాణికుల తొక్కిసలాటలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఒంటరివాణ్ని కాను – దేనికైనా సిద్ధమన్న జగన్‌

09.07
వైఎస్‌ కొడుకుగా పుట్టడం నాకు పెద్ద వరం.. నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.. మీరంతా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు.. మీ కోసం నేను దేనికైనా సిద్ధం.. మీ కోసమే ఓదార్పు యాత్ర చేపట్టాను.. మీ అందరినీ చూసిన తరువాత నేను ఒంటరివాణ్ణి కాదన్న ధైర్యం వచ్చింది.. మీరందరూ నన్ను కొడుగ్గా చూసుకుంటున్నారు.. నాన్న ఆశయాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా’ అని కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో గురువారం మొదలుపెట్టిన ఓదార్పు యాత్రలో వ్యాఖ్యానించారు. ఎక్కడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడలేదు. పలకరింపులకూ, కరచాలనాలకే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇచ్ఛాపురానికి గురువారం ఉదయం 8.30 గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక ఉదయం 11.30 గంటలకు తన తండ్రి వైఎస్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించిన విజయస్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ 61వ జయంతిని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. యాత్ర రెండు గంటలు ఆలస్యంగా మొదలయ్యింది. యాత్ర ఆరుగంటలు ఆలస్యంగా నడుస్తోంది. నిర్వాహకులు ప్రకటించిన ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు టెక్కలి చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాల్సిన కంచిలి మండలం కేసరపడ గ్రామంలోనే ఆ సమయానికి ఉన్నారు.
కుటుంబాలకు పరామర్శఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో పైల చంద్రమ్మ, కవిటి మండలం జగతి గ్రామంలో రెడ్డి అప్పన్న, కంచిలి మండలం కేసరపడ గ్రామంలోని పిలక గణపతి కుటుంబాలను కలిసి జగన్‌ ఓదార్చారు. బాధిత కుటుంబాల ఇళ్లలో ఆహారాన్ని తీసుకున్నారు. ఆర్థిక సహాయం అందించే సమయంలో మీడియానూ, ఇతరులనూ బయటకు పంపేస్తున్నారు. యాత్ర ప్రారంభమైన ఇచ్ఛాపురంలో జనసమీకరణ చేశారు. మార్గమధ్యంలో ఎక్కువమంది ఉన్నచోట జగన్‌ వాహనం దిగి, అభివాదం చెప్పి ముందుకు సాగుతున్నారు.
జిల్లా ఎమ్మెల్యేలు డుమ్మా
యాత్రలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు కాని జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. మొదటినుంచీ యాత్ర ఏర్పాట్లు చూస్తున్న టిటిడి మాజీ ఛైర్మన్‌ బి కరుణాకర్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి మారెప్ప యాత్రలో పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, డిసిసి ఆధ్వర్యాన కాంగ్రెస్‌ నాయకులంతా యాత్రలో, జనసమీకరణలో భాగస్వాములయ్యారు. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యేలు ఎంవి కృష్ణారావు, నరేష్‌కుమార్‌ అగర్వాలా పాల్గొన్నారు. కంచిలిలో నరేష్‌కుమార్‌ సోదరుని కొడుకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. డిసిసి అధ్యక్షులు, ఎంపీ కిల్లి కృపారాణి భర్త డాక్టర్‌ రామ్మోహన్‌రావు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌ జగన్‌ యాత్రకు సారథ్యం వహించారు. యాత్రలో ‘జగన్‌ జిందాబాద్‌, జగన్‌ సిఎం కావాలి’ అంటూ నినాదాలు చేశారు.
దొంగతనాల జోరు
ఓదార్పుయాత్రలో దొంగతనాల జోరు ఎక్కువైంది. చోరులు కొందరు మహిళల ఆభరణాలను తస్కరించారు. పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేసినదాన్ని బట్టి తొలిరోజు ఆరు గంటల్లోనే సుమారు రూ.మూడు లక్షల విలువైన ఆభరణాలు దొంగలపాలయ్యాయి. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓదార్పు యాత్రలో అపశ్రుతులు
జగన్‌ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వస్తుండగా, రైల్వే స్టేషన్‌లోని రేకుల షెడ్డుపైకి ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఎక్కడంతో జగన్‌ ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కూలిపోయింది. సెక్యూరిటీ సిబ్బంది జగన్‌ను పక్కకు లాగడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లాభాల స్వర్ణమణి స్వాగతం పలికి వస్తుండగా, తొక్కిసలాటలో గాయపడ్డారు. ఓ అభిమానికి స్వల్ప గాయాలయ్యాయి

మావోయిస్టుల బంద్‌ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం

02.06
మావోయిస్టు పార్టీ రెండు రోజుల భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేహౌండ్స్‌ దళాలతో పాటు కేంద్ర పారామిలటరీ దళాలను రంగంలోకి దింపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేకపోయిన్పటికీ ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ జరిగింది కాబట్టి మావోయిస్టులు ఏక్షణమైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ది ఎన్‌కౌంటర్‌ కాదని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఆరోపిస్తున్న మావోయిస్టులు దీనికి నిరసనగా ఈనెల 7,8 తేదీల్లో భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలను డిజిపి ఆదేశించారు. డిజిపి గిరీష్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేందర్‌రెడ్డి కలిసి మంగళవారం సాయంత్రం ఆయా జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌-ఒరిస్సా సరిహద్దుల్లోని దండకారణ్యం అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని, ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని డిజిపి ఆదేశించారు. కూంబింగ్‌కు వెళ్లేటప్పుడు అడుగడుగునా మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసిన తర్వాతే ముందుకు కదలాలని, అనుమానం ఉన్న చోట మార్కింగ్‌ చేసి బాంబ్‌స్క్వాడ్‌ దళాలలతో తనిఖీలు చేసిన తర్వాత ముందుకు పోవాలని డిజిపి ఆదేశించినట్లు తెలిసింది.
విజయనగరంలో రెండు రైళ్ల నిలిపివేత
విజయనగరం జిల్లా కోనేరు వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చివేసినట్లు మావోయిస్టులు లేఖ పంపడంతో బిలాస్‌పూర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అలాగే కోర్సాలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరంలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌లను పరిశీలించాకే రైళ్లను ముందుకు పంపిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసినట్లు మావోయిస్టులు లేఖ రాయడంతో రాష్ట్ర పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. రైల్వే అధికారులకు సహకరించాలని, ట్రాక్‌లను అడుగడుగునా తనిఖీ చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డిజిపి ఆదేశించారు. అలాగే రైల్వే స్టేషన్ల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మద్యంపై లోక్‌సత్తా చైతన్య యాత్ర

07.07
మద్య నియంత్రణపై చైతన్య యాత్రకు లోక్‌సత్తా సిద్ధమైంది. మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం లక్ష్యంగా బుధవారం నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు మినహాయించి శ్రీకాకుళం వరకు మొత్తం 16 జిల్లాల్లో 22వతేదీ వరకు యాత్ర సాగే విధంగా షెడ్యూల్ ఖరారు చేసింది.  ఈమేరకు పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద చైతన్య రథానికి జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ‘కొత్త ఎక్సైజ్ సంవత్సరంలో మొదలైన మద్యం ప్రవాహం రాష్ట్ర ప్రజలను భయంకర సంక్షోభంలోకి నెడుతుంది.  ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న ఖర్చు కంటే మద్యం ద్వారా ప్రజలకు కలుగుతున్న నష్టం మూడు రెట్లు ఎక్కువ. మద్య నియంత్రణకు పార్టీలకతీతంగా అందరూ కదిలిరావాలి’ అని జేపీ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళా సత్తా రాష్ట్ర అధ్యక్షురాలు సరోజాదేవి పాల్గొన్నారు.

ప్రస్తుత ఉద్యమాలు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల కోసమే – రోశయ్య

17.06
”సబ్సిడీలు తగ్గించాలని ప్లానింగ్‌ కమిషన్‌ ఒత్తిడి చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌ లభించలేదని ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా చూస్తూ అర్హులైనవారందరికీ మా ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. ఆగస్టు నెలాఖరుకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల బకాయిలన్నీ చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం… రీయంబర్స్‌మెంట్‌ బకాయిల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు విద్యార్థుల కోసం కాదేమోనని అనిపిస్తోంది.. ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల కోసం జరుగుతున్నాయనిపిస్తోంది” అని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. తమ పార్టీ, ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఇతర కార్యక్రమాలకు నిధుల కోత విధించైనా, విద్యార్థుల ఫీజుల విషయంలో నిధుల సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో రోశయ్య మాట్లాడారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దుర్వినియోగం కాకుండా తగిన రీతిలో ప్రణాళికలను రూపొందించామని ఆయన తెలిపారు. సమాజంలో ఉన్నత వర్గాలతో సమానంగా అందరూ చదువుకోవాలన్న లక్ష్యంతో శాచ్యురేషన్‌ విధానంతో వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయాన్ని అందిస్తుందన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, 2008-09 నుంచే ఫీజుల బకాయిలు అధికంగా ఉన్నాయనీ, అయితే ప్రతీయేటా నిధుల సర్దుబాటు కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన గణాంక వివరాలను ప్రస్తావించారు. ”విద్యార్థుల పేరుతో జరిగే ఆందోళనలో రాజకీయ నేతలను కలవడం ఏమిటి? వారి మద్దతు తీసుకోవడం ఔచిత్యం ఏమిటి?” అని రోశయ్య ఎద్దేవా చేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, స్కాలర్‌షిప్‌ల రీయంబర్స్‌మెంట్‌, ఫీజుల విషయంలో కృష్ణయ్యతో ముందుగానే చర్చలు జరిపామనీ, ఎక్కడైనా, ఏ కాలేజీలోనైనా విద్యార్థులు ఫీజుల వల్ల ఇబ్బందులు పడుతుంటే తనకు తెలియచేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటానని కూడా తాను కృష్ణయ్యకు చెప్పానని ముఖ్యమంత్రి చెప్పారు. ”అయితే కృష్ణయ్య ఏ ఒక్క విద్యార్థి పేరును కూడా ప్రస్తావించకుండా, చెప్పకుండా ఆర్ధిక శాఖ అధికారులంతా దొంగలంటూ ఆరోపణలు చేయడం ఏ మాత్రం సబబు? ఈ విషయంపై నేను తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాను. అధికారులపై అనుచితంగా మాట్లాడడం తగదని కూడా చెప్పాను.. హాల్‌టిక్కెట్‌ రాని ఒక్క విద్యార్థి పేరైనా చెప్పమని కూడా ఆయన్ని నేనడిగా.. స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని పూర్తిస్థాయిలో కేటాయించే విధంగా నేను చొరవ తీసుకుంటానని మా శ్రీనివాస్‌గారు కృష్ణయ్యకు హామీ ఇచ్చినట్లుగా నాతో చెప్పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇతర డిమాండ్లు అంటూ కృష్ణయ్య దీక్ష చేపట్టడం ఆశ్చర్యంగా ఉంది” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యమాల పేరుతో కుట్ర జరుగుతోందని రోశయ్య మరోమారు ఆరోపిస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకపోయినప్పటికీ కాలేజీల యాజమాన్యాల ద్వారా ఈ ఉద్యమానికి ప్రోత్సాహం లభిస్తున్నదని వ్యాఖ్యానించారు. గతంలో కాలేజీల యాజమాన్యాలు కూడా తనతో చర్చలు జరిపాయనీ, నిధుల సర్దుబాటు చేసుకుంటూ బకాయిలను చెల్లిస్తామని కూడా తాను వారితో చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. మద్యం దుకాణాల ద్వారా వచ్చిన ఆదాయమంతా సీజులకు కేటాయించాలని కొందరు, జలయజ్ఞం, రోడ్లు, ఇతర నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేసి స్కాలర్‌షిప్‌లను చెల్లించాలని మరికొందరు డిమాండ్‌ చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తున్నదని ఆయన చెప్పారు. రెవెన్యూ వ్యయాన్ని మాత్రమే పంచుతూపోతే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
పెట్టుబడి వ్యయం తగినంతగా లేకపోతే ప్రణాళికామండలి అభ్యంతరం చెబుతోందని, ఇదే జరిగితే రాష్ట్రానికి పైసా రుణం లభించదని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఇష్టానుసారంగా రుణాలు స్వీకరించడానికి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అడ్డుగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ రంగానికి నిధుల కొరత సమస్య ఉత్పన్నం కాకుండా చూడడంతో పాటు సమతూకాన్ని పాటించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, ఇందులో భాగంగానే అనర్హులని ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటామనీ, రానున్న రోజుల్లో బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు ఉండవని రోశయ్య అన్నారు. ఇంకో ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుత విధానంలో సవాలక్ష లోపాలున్నాయనీ, అందుకే మంత్రివర్గ ఉపసంఘం వాటిని పరిశీలిస్తున్నదనీ, వెనకబడిన వర్గాలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖతో నేరుగా చర్చలు జరిపేందుకు తాను ఈ సంఘానికి పూర్తిస్థాయిలో అధికారాన్ని ఇచ్చానని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రధాని దృష్టికి మత్స్యకారుల సమస్యలు తీసుకువెళతా – చిరంజీవి

26.06
నేవెల్‌బేస్‌ నిర్వాసితుల సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మత్స్యకారులకి పూర్తిస్థాయిలో ప్యాకేజి అందేవిధంగా తాను కృషిచేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం నేవెల్‌బేస్‌లో గత నెలరోజులుగా మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులను శుక్రవారం మధ్యాహ్నం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకి ప్రభుత్వం జి.ఓ ప్రకారం ఇచ్చే మౌలిక సదుపాయాలు అన్ని తప్పనిసరిగా కల్పించాలన్నారు. రక్షణశాఖకు నిధులు ఎక్కువ ఉన్నాయన్నారు. నిర్వాసితులకి ఇచ్చే నిధులు 50వేల కోట్లు కన్నా తక్కువే ఉంటాయన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్ధం కాలేదన్నారు. మత్స్యకారులకి చేపలు వేట తప్ప వేరే వృత్తి చేతకాదన్నారు. అయినా వారు సర్వం కోల్పోయారు కాబట్టి వారి విద్య అర్హతను బట్టి ఏ పనైనా చేయటానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. 18 సంవత్సరాలు దాటిన మత్స్యకారులందరికీ ఉద్యోగం, అన్ని సదుపాయాలతో ప్యాకేజీ ఇవ్వాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు. మత్స్యకారులకి న్యాయ జరిగేవరకు ప్రజారాజ్యం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మత్స్యకారులు దీక్షలు చేపట్టి నేటికి 31వ రోజులు అవుతున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగాని, నాయకులు కాని కనీసం కన్నెత్తి చూడకపోవడం శోచనీయమన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ఈ ప్రాంతం వారు గత ఎన్నికలలో మంచి మెజారిటీ ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దీక్షలు చేస్తున్న మత్స్యకారులకి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. సమావేశం ముందు చిరంజీవికి మత్స్యకారులు వేషధారణతో తలకి బుంగ తగిలించి చేతికి వల ఇచ్చారు. దీంతో మత్స్యకారులు అంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
మత్స్యకారులు సమస్యలపై మీరు దృష్టి పెట్టకపోతే తామంతా ఆత్మహత్యలు చేసుకోకతప్పదని కన్నయ్య అనే మత్స్యకారుడు చిరంజీవి వద్ద భోరున కన్నీళ్లు పెట్టుకోగా కన్నయ్యని చిరంజీవి దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. చిరంజీవి సుమారు 15నిమిషాలపాటు ప్రసంగించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మత్స్యకారులు సమస్యలపై ప్రసంగించారు. సమావేశానికి మత్స్యకారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పి. రమేష్‌బాబు, భీమిలి ఎమ్మెల్యే ఎ. శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే సిహెచ్‌. వెంకటరామయ్య, ఆర్‌. ఎర్రాపాత్రుడు, డి. నాగేంద్ర, కె. జగదీష్‌, సిహెచ్‌. చిరంజీవి, కె. రవికుమార్‌, పి. సత్యనారాయణరాజు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురి దుర్మరణం

21.06
విశాఖ జిల్లా యలమంచిలి మండలం తండాలదిబ్బ వద్ద ఆగి ఉన్న లారీని ఢ కొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నక్కపల్లి మండలం ఉప్మాకలో స్నేహితుడి వివాహానికి వెళ్లి స్కార్పియోలో తిరిగి వస్తుండగా ఆదివారం నాడీ ప్రమాదం జరిగింది.
ఉప్మాకలో జరుగుతున్న స్నేహితుడి వివాహానికి శనివారం రాత్రి హాజరైన వీరంతా ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా తండాలదిబ్బ వద్ద ఆగి ఉన్న లారీని ఢకొీట్టింది. దీంతో అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వారంతా విశాఖపట్నం సిటీలోని పలు ప్రాంతాలకు చెందినవారు. మృతి చెందిన వారిలో ప్రణిక్‌ అషేష్‌కుమార్‌(21), కింగూరి అని మేష్‌కుమార్‌ (22), బొద్దేటి హేమంత్‌ కుమార్‌ (21), పాత్రుని శివతేజ(21), అవిరెడ్డి శేఖర్‌ (22), బొట్టా కార్తిక్‌ (21), వి. నాని(26) వారిలో ఉన్నారు. వీరంతా అక్కయ్యపాలెం, అల్లిపురం, కైలాసపురం, ఎన్‌ఎడి, మర్రిపాలెం ప్రాంతాలకు చెందిన వారు. స్థానిక సిఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మృతదేహాలను వెలికి తీశారు. క్రేను సహాయంతో లారీ కిందికి దిగిపోయిన స్కార్పియోను బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌పి వినీత్‌ బ్రిజిలాల్‌, నర్సీపట్నం డిఎస్‌పి నరసింహకిషోర్‌, అనకాపల్లి ఆర్టీఓ శ్రీదేవి, తదితరులు సందర్శించారు.

ఐసెట్‌లో 92 శాతం ఉత్తీర్ణత

i-cet15-6-10-44546
ఐసెట్‌-2010 పరీక్ష ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఐసెట్‌ గతనెల 27న రాష్ట్రమంతటా జరిగింది. ఫలితాల సీడీని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విడుదల చేశారు. 1,74,094 మంది దరఖాస్తు చేసుకోగా, 1,62,381 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,50,715 (92.8 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
విశాఖ విద్యార్థుల హవా
ప్రథమ, ద్వితీయ ర్యాంకులుసహా మొదటి పది ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు విశాఖ విద్యార్థులు సాధిం చారు. విశాఖ ఎన్‌ఎడి కొత్తరోడ్డు కాకాని నగర్‌కు చెందిన అయినపూడి సాయి ప్రవీణ్‌ 200 మార్కుల కుగాను 188 సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. పెందుర్తి ప్రశాంతినగర్‌కు చెంది న ఆదిభట్ల భరద్వాజ్‌ 187 మార్కు లతో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. హైదరా బాద్‌ అమీర్‌పేటకు చెందిన కెవి నంద కిషోర్‌, కాకినాడ శ్రీరాంనగర్‌కు చెందిన ఎన్‌ఎన్‌ శివ శ్రీకాంత్‌ 180మార్కులతో మూడు, నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నారు. విశాఖపట్నం శ్రీనగర్‌కు చెందిన కె.రామ ధీరజ్‌, అనంత పురం జిల్లా హిందూపురానికి చెందిన బిఆర్‌ హరికృష్ణ 179 మార్కులుతో ఐదు, ఆరు స్థానాలను, విజయవాడ సూర్యారావుపేటకు చెందిన కప్పగంట లావణ్య, విశాఖ ఆర్‌కె నగర్‌కు చెందిన అడ్డగర్ల కార్తీక్‌, వరంగల్‌ హనుమకొండకు చెందిన సీరీస్‌కుమార్‌ గౌడలు 178 మార్కులతో ఏడు, ఎనిమిది, తొమ్మిది ర్యాంకులను పొందారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన డి రాజేంద్ర విజరు కుమార్‌ 177 మార్కులతో పదో ర్యాంకును కైవశం చేసుకున్నారు. 178 మార్కులతో ఏడో ర్యాంకు సాధించిన కె లావణ్య విద్యార్థినుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.
ఫీజు రీయింబర్స్‌మెంటుపై ఆందోళనొద్దు : మోపినేని
ఫీజు రీయింబర్స్‌మెంటుపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు భరోసా ఇచ్చారు. రీయింబర్స్‌మెంటులో లోపాలను సవరించేందుకు ముఖ్యమంత్రి రోశయ్య కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైందని తెలిపారు. త్వరలో జరిగే సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. అర్హుడైన ప్రతి విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందనీ హామీ ఇచ్చారు. వచ్చేనెల ఒకటి నుంచి ఐసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభమౌతుందని తెలిపారు. ఐసెట్‌ ఫలితాలు 18 రోజుల్లో విడుదల కావడం తొలిసారని పేర్కొన్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభమౌతుందని తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ మూర్తి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కెసి రెడ్డి, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో 498 ఎంబిఎ, 698 ఎంసిఎ కళాశాలలున్నాయనీ, వాటిలో 30,960 మంది విద్యార్థులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, రాష్ట్ర ఉన్నత మండలి ఛైర్మన్‌ కెసి రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనరు డాక్టర్‌ కె.లకీëనారాయణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, ఎయు ఉపకులపతి బీలా సత్యనారాయణ, రిజిస్ట్రారు, ప్రసాదరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య జిఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.

‘టి’ కప్‌ విన్నర్స్‌ నాగ్‌ టీమ్‌

  • మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అక్కినేని అఖిల్‌

SIV_012614-6-10-51578
సినీ కళాకారులతో ‘మా’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎల్‌.బి.స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నాగ్‌ కింగ్స్‌ జట్టు విజయం సాధించి టి20 టాలీవుడ్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన 10 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెంకీ వారియర్స్‌ జట్టు 88 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించిన నాగ్‌ కింగ్స్‌ జట్టుకు చెందిన అక్కినేని అఖిల్‌, తారకరత్నల జోడీ 6.4 ఓవర్ల వద్ద 67 పరుగులు చేసి ఆదర్శ్‌ బౌలింగ్‌లో మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఖయ్యుంతో కలిసి అఖిల్‌ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే 8.4 ఓవర్లకు 88 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాడు. అఖిల్‌ పరుగులను ఆపడంలో వెంకీ వారియర్స్‌ విఫలమయ్యారు. పలుమార్లు క్యాచ్‌కు అవకాశం వచ్చినా జారవిడవటంతో విజయావకాశాలు కోల్పోయారు.
మ్యాన్‌ఆఫ్‌ ది సీరీస్‌, మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అఖిల్‌
మ్యాచ్‌ ప్రారంభం నుంచీ ఫైనల్స్‌లోనూ మంచి ప్రతిభ కనపరచిన అఖిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సీరీస్‌ అవార్డు లభించింది. కాగా క్లాసిక్‌ క్యాచ్‌ అవార్డును సుమంత్‌కు అందజేశారు.
విజేతలకు ట్రోఫీలు అందజేసిన మంత్రులు
టి20 టాలీవుడ్‌ ట్రోఫీని నాగ్‌ కింగ్స్‌ జట్టుకు రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ జె.గీతారెడ్డి, పి.సబితారెడ్డి, దానం నాగేందర్‌ అందజేశారు. జట్టు క్యాప్టెన్‌ అక్కినేని నాగార్జున ఈ ట్రోఫీని అందుకున్నారు. అలాగే రన్నర్స్‌గా నిలిచిన వెంకీ వ్యారీయర్స్‌కు మంత్రి దానం నాగేందర్‌ ట్రోఫీని బహూకరించారు.
ట్రోఫీల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు ఎం.మురళీమోహన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్‌బాబు హల్‌చల్‌ సృష్టించారు.

నకిలీ విత్తనాలపై విచారణకు సిఎం ఆదేశం

CM-6
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై నిఘా ఉంచాలని, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా నకిలీ విత్తనాలు, ఎరువులకు కేంద్ర స్థానంగా మారిందని వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి. ప్రసాద్‌, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రేచల్‌ ఛటర్జీలను ఆదేశించారు. అలాగే వారం రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కోరారు.