విశాఖపట్నం

సి. రామచంద్రయ్య
1948లో కడపలో జన్మించి తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లిdలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 67లో కడపలోని సిండికేట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 85లో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది అప్పటి మంత్రివర్గంలో ప్రణాళిక కార్యక్రమాల అమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో రాష్ట్ర ట్రేడింగ్ కార్పోరేషన్ సభ్యునిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎంపిగా కొనసాగుతున్న సమయంలో పదవీకాలం ఉంటుండగానే ప్రరాపాలో చేరారు. కాంగ్రెస్‌లో ప్రరాపా విలీనం తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా చార్టెడ్ అకౌంటెన్సీలో తనకున్న 30 ఏళ్ళ అనుభవంతో ప్రముఖ కంపెనీల ఆర్ధిక లావాదేవీలను చాకచక్యంగా నిర్వహించారు.
గంటా శ్రీనివాసరావు
1960లో ప్రకాశం జిల్లా కామేపల్లిలో జన్మించి చీరాలలోని విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో బి.కామ్, బి.ఎల్ పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలో స్థిరపడి పెట్రో కెమికల్ రంగంలో పలు యూనిట్లను స్థాపించారు. 1999లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో ప్రరాపాలో చేరి 09లో జరిగిన అసెంబ్లిd ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అరకు అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖ చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం విశాఖ బీచ్‌రోడ్డులో సైక్లింగ్ చేశారు. స్థానిక పార్క్ హోటల్ కూడలి నుంచి కాళీమాత ఆలయం వరకు సైక్లింగ్‌ను నిర్వహించారు. మేయర్ పులుసు జనార్దనరావు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సైక్లింగ్‌లో పాల్గొన్నారు. అరకు నుంచి వచ్చిన తరువాత స్థానిక ఓ స్టార్ హోటల్‌లో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విందు ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు గురువారం ఉదయం బాగా పొద్దెక్కే వరకూ హోటల్ గదులకే పరిమితమైతే, కొంతమంది మాత్రమే సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతారణం, స్వచ్ఛమైన గాలిలో, అందునా వెహికల్ ఫ్రీ జోన్ ఏరియాలో వీరు సైక్లింగ్ చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ నగరానికి కాలుష్యం నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఇంధన పొదుపునకు సైక్లింగ్ చేయాలని ఇక్కడి అధికారులు తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇటువంటి ఫ్రీ సైక్లింగ్ జోన్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు మళ్ళ విజయప్రసాద్, సుగ్రీవ్, రాజేష్, అబ్దుల్‌గనీ, సత్యనారాయణ, జగన్నాయకులు, ఎమ్మెల్సీలు సూర్యనారాయణ, నరేంద్రరెడ్డి తదితరులు సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా విశాఖ మేయర్ జనార్దనరావు మాట్లాడుతూ బీచ్ రోడ్డులో జాగింగ్, మోర్నింగ్ వాక్, సైక్లింగ్ చేసే వారికి వాహన కాలుష్యం నుంచి ఉపశమనం కలిగించడానికి వెహికల్ ఫ్రీ జోన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. బీచ్ రోడ్డులో సైక్లింగ్ చేయాలనుకున్న వారికి ఉచితంగా సైకిళ్ళను అందజేస్తున్నామన్నారు. జివిఎంసి కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు రోజుకి రెండు గంటలపాటు సైక్లింగ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. (చిత్రం) విశాఖ బీచ్ రోడ్డులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్‌ల సైక్లింగ్

పేపర్ రహిత శాసనసభ ఆలోచనతో శాసనసభ వెబ్‌సైట్‌కి రూపకల్పన చేసినట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. శాసనసభ వెబ్‌సైట్‌ని మూడురోజుల అవగాహన కార్యక్రమానికి హాజరైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం విశాఖలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ వ్యవహారాల్లో దాచాల్సిందేమీ లేదని అన్నారు. పారదర్శకత పాటించాలన్న ఉద్దేశంతో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించామని, దీనిద్వారా ప్రతి ఒక్కరూ శాసనసభ వ్యవహారాలను తెలుసుకోవచ్చని చెప్పారు. వెబ్‌సైట్‌లో నియోజకవర్గాల వారీ సమాచారాన్ని పొందుపరిచి, శాసనసభ్యులకు పాస్‌వర్డ్ ఇస్తామని తెలిపారు. దీనిద్వారా శాసనసభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా నియోజకవర్గంలోని కార్యక్రమాల వివరాలను తెలుసుకుని సమన్వయం చేసుకోవచ్చని అన్నారు. ఈ వెబ్‌సైట్‌ని పదిహేను రోజులపాటు ప్రయోగాత్మకంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని, దీన్నిచూసిన తరువాత ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే వెబ్‌సైట్‌లో మార్పులుచేసి ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు మాట్లాడారు.

రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇవ్వాలని అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత చేసినా అధికారుల్లో మార్పు రాదన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని మెగాస్టార్, పిఆర్‌పి అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అరకులో జరుగుతున్న ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల్లో గడచిన రెండు రోజుల నుంచి చిరంజీవి చురుకుగా పాల్గొంటున్నారు. చివరి రోజైన బుధవారం ఆయన ప్రసంగించారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలు ప్రసూతి సమయంలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, ఎనస్థీషియా యూనిట్ లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతోందని తాను గమనించానని అన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ యూనిట్ గురించి తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చిన ప్రతి ఆరోగ్య శాఖ మంత్రినీ కోరుకుంటున్నానని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులను కూడా పదేపదే కోరాను. ఇదిగో మంజూరు చేస్తున్నాం.. అదిగో మంజూరు చేస్తున్నాం అని చెపుతున్నారే తప్ప, ఇప్పటి వరకూ ఆ యూనిట్ రాలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తినే అధికారులు పరిగణలోకి తీసుకోనప్పుడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారులు డిటాచ్‌డ్‌గా పనిచేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధితో కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాక్సైట్‌పై ఆచితూచి అడుగేయండి!
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తేనే మంచిదని అన్నారు. ఖనిజ సంపద అన్యాక్రాంతం చేసే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. బాక్సైట్ తవ్వకాల వలన ఇక్కడ వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని, దీనివలన నదీ జలాలు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉందని అన్నారు. గిరిజనులకు ప్రత్యేకించి మేలు చేయకపోయినా ఫరవాలేదని, వారి జీవన విధానాన్ని దెబ్బతీయకుండ చూడాలని చిరంజీవి అన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో గిరిజన తండాల్లోని జనం మరింత బిక్కుబిక్కుమంటున్నారని అన్నారు. అరకుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, సినిమా షూటింగ్‌లకు వచ్చినప్పుడు ఇక్కడి అందాలే చూశాను తప్ప, ఆ అందాల వెనుక ఉన్న ఆవేదనను చూడలేకపోయానని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లేక వీరి బతుకులు ఎంత ఛిద్రమైపోయాయో చూస్తే చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇవే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు సభ్యులు పెద్దగా పట్టించుకోరని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు సమస్యలకు వచ్చినప్పుడు వాస్తవాలను గమనించగలుగుతామని చిరంజీవి చెప్పారు.

నాయకులుగా ఎదిగితేనే దేశానికి ప్రయోజనం
ఎమ్మెల్యేల శిక్షణలో స్పీకర్ మనోహర్
ఉత్సాహంగా రెండో రోజు శిక్షణ శిబిరం
సీఎం చేతుల మీదుగా వెబ్‌సైట్ ప్రారంభం నేడు
చిరు రాకతో శిబిరంలో సందడి
అరకులోయ, జనవరి 10 : “ఎమ్మెల్యేలంటే నియోజకవర్గానికే పరిమితం కావాలని లేదు. పరిధిని విస్తరించుకోండి. సేవా దృక్పథం అలవరుచుకోండి. ర్రాష్టానికి, దేశానికి కొంత సమయం వెచ్చించండి. ప్రభుత్వం అంటే సచివాలయం, సీఎం మాత్రమే కాదు. మనం కూడా అందులో భాగమే. టీమ్ స్పిరిట్‌తో పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. దేశాభివృద్ధికి పాటుపడదాం ముందుకు రండి” అంటూ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.
ఎమ్మెల్యేలకు విజన్ ముఖ్యమని, దూరదృష్టి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులకు ఇప్పుడే బాటలు వేయగలుగుతామని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేల అవగాహన, శిక్షణ కార్యక్రమం రెండో రోజైన మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. శిబిరంలో భాగంగా కొద్దిసేపు క్వశ్చన్ అవర్ జరిగింది. అనంతరం ‘గిరిజన అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, అవగాహన’ అనే అంశంపై చర్చ జరిగింది. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పీకర్ మనోహర్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు.
రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక ప్రాంతం సమస్యలపై అధ్యయనం చేయడానికి వెళ్లడం, అక్కడి ప్రజలతో మమేకమై, వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడం శాసనసభ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రకటించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు సేద తీరడానికో, సరదాలు తీర్చుకోవడానికో ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి సదస్సు దేశంలోనే కాదు.. కామన్ వెల్త్ దేశాల్లోనూ ఎక్కడా జరగలేదన్నారు. ఎమ్మెల్యేలుగా భావించకుండా నాయకులుగా ఎదిగితే దేశానికి ఉపయోగపడతారని సూచించారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ఏజెన్సీ గ్రామాలకు తాను మూడుసార్లు వెళ్లానని, మరోసారి ఈ గ్రామాలకు వస్తే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
క్వశ్చన్ అవర్ నడిస్తేనే సభ జరిగినట్టు
శాసనసభలో క్వశ్చన్ అవర్ నడిస్తేనే సభ పూర్తిగా జరిగినట్టని, లేదంటే అసంపూర్తిగా ముగిసినట్టని, దానిని ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దని స్పీకర్ మనోహర్ కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ఎప్పుడు వేయాలి? ఎలా వేయాలి? అనే అంశాలపై పార్లమెంటు వ్యవహారాల కమిటీ అధికారి మధుకర్ అవగాహన కల్పించారు.
ఒకసారి మాట్లాడిన వారికే మళ్లీ అవకాశాలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చేలా చూడాలని స్పీకర్‌ను భీమునిపట్నం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కోరారు. సభలో ముందుగా క్వశ్చన్ అవర్ నిర్వహించి, ఆ తర్వాత సమావేశాలు పెడితే బాగుంటుందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు సూచించారు. ఆ సూచన బాగుందని, అమలు చేయడానికి ప్రయత్నిస్తామని స్పీకర్ ప్రకటించారు. ‘రూల్ 74′ కింద కాలింగ్ అటెన్షన్ మోషన్ పేరుతో ఏదైనా సమస్యపై పిటిషన్ రూపంలో ప్రశ్న ఇస్తే… స్పీకర్ దానిని స్వీకరిస్తారని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల సందేహాలకు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సదారామ్ జవాబులు ఇచ్చారు.
ఎమ్మెల్యేలకు వెబ్‌సైట్.. నేడు ప్రారంభం
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎమ్మెల్యేలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించబోతోంది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లోనే కాకుండా ఎమ్మెల్యేలకు వీలున్నపుడు ఈ వెబ్‌సైట్‌కు ఈ-ఫిర్యాదులు చేసుకోవచ్చు. దీన్ని విశాఖపట్నంలో బుధవారం ఆవిష్కరించనున్నట్టు స్పీకర్ మనోహర్ ప్రకటించారు. ఈ కార్యక్రమం సీఎం కిరణ్ చేతులు మీదుగా జరిగే అవకాశం ఉంది.
శిక్షణకు చిరంజీవి.. అరకులో సందడి
కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మంగళవారం అరకులోయ వచ్చారు. చిరంజీవి రాకతో అరకులో అభిమానుల సందడి పెరిగింది. విధి నిర్వహణలో, శాసనసభ వ్యవహారాల్లో ఈ కార్యక్రమం తమకు చక్కగా ఉపయోగపడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తారు. ఉదయం 7.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో అరకు చేరుకుని అక్కడ అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 9.45 గంటలకు కొత్తవలస (అరకు) చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు గూడెం కొత్తవీధిలోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు ఇంటికి వెళ్లి మంత్రి తల్లి మృతికి సంతాపం తెలుపుతారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.30 గంటలకు విశాఖపట్నం చేరి విమానంలో హైదరాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు.
మీ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే వచ్చాం..మీ ప్రాంతంలో విద్య, వైద్యం, రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం’అంటూ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ విశాఖమన్యం గిరిజనులకు హామీ ఇచ్చారు. తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలకు విశాఖజిల్లా అరకులోయలో మూడురోజులపాటు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో భాగంగా సోమవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో శాసనసభ్యుల బృందం ప్రత్యేక బస్సులో ముందుగా బొర్రా గుహలకు చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతగిరి వెళ్లి అక్కడి వసతిగృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. భోజనాదికాలు ముగించుకుని సాయంత్రం బయలుదేరి అరకు మండలం చొంపి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గిరిజనులతో స్పీకర్ మనోహర్, ఇతర శాసనసభ్యులు ఇష్టాగోష్టి జరిపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విధాలా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వారి సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకే తొలిసారిగా ఎమ్మెల్యేలతో మన్యం పర్యటన చేపట్టామని, గిరిజన సమస్యలపై వారికి అవగాహన కల్పించేందుకు మూడురోజులపాటు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఇష్టాగోష్టిలో అధికసంఖ్యలో పాల్గొన్న మహిళలు గ్రామ, ప్రాంత సమస్యలను స్పీకర్‌కు, ఎమ్మెల్యేలకు వివరించారు. వారంతా తమ ప్రాంతంలో పర్యటించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చొంపి గ్రామంలో తాగునీటి వసతి కల్పించాలని, మురుగుకాల్వలను నిర్మించాలని, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆంగ్ల బోధన ఉపాధ్యాయులను నియమించాలని, అర్హులైన గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని బోసుబెడ గ్రామానికి చెందిన పంచాడి పద్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని, స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న సహకారం చక్కగా ఉందని, ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయని, అధికారులు బాగా పని చేస్తున్నారని ఆమె వివరించారు. కొత్తవలస గ్రామానికి చెందిన సన్యాసమ్మ మాట్లాడుతూ పాఠశాల వద్ద ఉన్న బోరు మాత్రమే గ్రామానికంతటికీ ఆధారమని, అందువల్ల గ్రామానికి అందుబాటులో బోరు ఏర్పాటు చేయాలని కోరారు. గన్నెల పంచాయతీలో కిలోమీటరు దూరం వరకూ మంచినీటి కోసం వెళ్లాల్సి వస్తోందని, రాత్రిపూట మాత్రమే వెళ్లి నీరు తెచ్చుకోవాలని, వేసవిలో అయితే మరీ ఇబ్బందిగా ఉందని గిరిజన మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను సగం మాత్రమే చెల్లించారని, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ బిల్లులు ఇంతవరకూ చెల్లించలేదని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. చొంపి గ్రామానికి చెందిన జల్లెడ బాబూరావు తమ గ్రామానికి సాగునీరందటం లేదని, ఇందిరమ్మ బిల్లులు నాలుగైదేళ్లుగా అందటం లేదని చెప్పారు. అనంతగిరి మండల మాజీ అధ్యక్షుడు శెట్టి గంగాధరస్వామి మన్యప్రాంతాభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభాపతి మనోహర్ గ్రామాల్లో అమలవుతున్న పథకాల గురించి అడిగారు. వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యల పట్ల స్పందించి మూడు నెలల్లో అవి పరిష్కారమయ్యేలా చర్య తీసుకోవాలని పక్కనే ఉన్న కలెక్టర్ లవ్ అగర్వాల్‌ను ఆదేశించారు. చొంపి గ్రామంలో గ్యాస్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ అగర్వాల్ చెప్పారు. గన్నెల పంచాయతీకి రూ.5 లక్షలు, కొత్తవలస గ్రామానికి రూ.2 లక్షల వ్యయం కాగల తాగునీటి పథకాలను మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గ్రామంలో ఆంగ్ల బోధన ఉపాధ్యాయులను వెంటనే నియమిస్తామని చెప్పారు. చొంపి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ తీరు గురించి శాసనసభాపతి మనోహర్ వాకబు చేశారు. అక్కడే ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త తమ గ్రామంలో కేంద్రం సక్రమంగానే నడుస్తోందని, ఈ కేంద్రం పరిధిలో 12 మంది గర్భిణీలు, పదిమంది బాలింతలు, ప్రీస్కూలు పిల్లలు 15 మంది, మూడేళ్లలోపు పిల్లలు 41 మంది ఉన్నట్లు వివరించారు. పౌష్టికాహారం సక్రమంగా ఇస్తున్నారా అంటూ స్పీకర్ అడిగారు. పింఛన్లు, పిల్లల చదువు, మధ్యాహ్న భోజనంతో సహా ప్రతి విషయాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే వంగాగీత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు, ఎఎన్‌ఎం, వైద్యుల సేవల గురించి ఆరా తీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ప్రభుత్వ పథకాల అమలుతో సహా చట్టాలు, నిబంధనలు అమలు జరుగుతున్న తీరుగురించి ప్రశ్నించారు. జ్వరాలతో పాడేరు ప్రాంతంలో అనేక మంది చనిపోతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో వాస్తవాలు తెలియజేయాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నాటుసారాను నియంత్రించే బాధ్యత గిరిజనులపైనే ఉందన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజన జనాభా 20 శాతం ఉన్నప్పటికీ ఆరు శాతం నిధులు మాత్రమే కేటాయిసు ్తన్నారని, అధిక శాతం నిధులు కేటాయించటం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. అంతకు ముందు అరకు ఎమ్మెల్యే సివేరి సోమ గిరిజనభాషలో మాట్లాడి ప్రజాప్రతినిధుల పర్యటన వివరాలను గిరిజనులకు తెలియజేశారు. ఈ ఇష్టాగోష్టిలో ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సోమేష్‌కుమార్, జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్, విశాఖ రేంజి డిఐజి సౌమ్యమిశ్రా, జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్, పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, సబ్‌కలెక్టర్ కార్తికేయమిశ్రా తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుల పర్యటన భారీ పోలీసు బందోబస్తు మధ్య సాగింది.

10 వేల మందితో భారీ భద్రత * కోటికి పైగా ఖర్చు
అసెంబ్లీ అంతా విశాఖ జిల్లా అరకుకు తరలి వస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అసెంబ్లీ స్థాయి అధికారులు విశాఖ జిల్లాకు చేరుకుంటున్నారు. సుమారు 160 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు, ముగ్గురు మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన అరకు, అనంతగిరి, పాడేరు ప్రాంతాల్లో ఇంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను విశాఖ ఏజెన్సీలో మోహరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బలగాలను ఇక్కడికి రప్పిస్తోంది. ఈనెల 9 నుంచి మూడు రోజులపాటు సాగే ఈ శిక్షణా శిబిరాలకు కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఖర్చంతా అసెంబ్లీయే భరించబోతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఏజెన్సీలో గిరిజనుల గురించి, వారి జీవన శైలి, పర్యావరణం, పర్యాటకం, కాఫీ తోటల పెంపకం, ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి మూడు రోజులపాటు వివరించనున్నారు. సుమారు 150 మంది ఎమ్మెల్యేలు మూడు బృందాలుగా విడిపోయి, ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు. గిరిజనులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. విశాఖ ఏజెన్సీలో దాగి ఉన్న గనుల గురించి తెలుసుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేల పర్యటనను దృష్టిలో పెట్టుకుని అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏజెన్సీలో గ్రేహౌండ్స్, సివిల్ పోలీస్, సిఆర్‌పిఎఫ్ బలగాలు ఎమ్మెల్యేలు పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం కొంత ఇబ్బందితో కూడుకున్నదే. దీన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రతా సిబ్బందితోపాటు ఆరు కంపెనీల సిఆర్‌పిఎఫ్ బలగాలను, అన్ని జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని, అధికారులను ఇక్కడికి రప్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు పర్యటించే మూడు రోజులూ, హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి కూడా భద్రతను కల్పించనున్నారు. మొత్తం మీద సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సుమారు మూడు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది వస్తుంటే ఏర్పాటు ఎలా ఉండాలి. వీరికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టూరిజం అతిధిగృహాల్లో వీరికి గదులు ఏర్పాటు చేశారు. అరకుకు రెండు కిలో మీటర్ల దూరంలోని కొత్తవలస ఉద్యానవన కేంద్రంలో ఎమ్మెల్యేల కోసం పగోడాలు ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడే శిక్షణా తరగతులు జరుగుతాయి. కలెక్టర్ లవ్ అగర్వాల్, ఇతర అధికారులు శుక్రవారం ఈ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిదో తేదీన విశాఖ చేరుకున్న ఎమ్మెల్యేలను అరకుకు తరలించేందుకు పర్యాటక శాఖ ఐదు బస్సులను ఏర్పాటు చేసింది. ఇవి ఏమాత్రం సరిపోవు. ఎమ్మెల్యేలకు, అధికారులకు భోజన ఏర్పాట్లను పర్యాటక శాఖే చూసుకుంటున్నా, మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అయిన ఖర్చులన్నింటికీ బిల్లులు పొందుపరిస్తే, వాటిని అసెంబ్లీయే చెల్లిస్తుందని స్పీకర్ హామీ ఇచ్చినట్టు ఐటిడిఎ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, 11న ఉదయం ఈ ఎమ్మెల్యేల బృందం అనంతగిరిలో పర్యటించి అక్కడి నుంచి ఎస్‌కోట మీదుగా విశాఖకు చేరుకుంటుంది. ఆరోజు సాయంత్రం విశాఖలో జరిగే ఐటి సదస్సులో వీరు పాల్గొనే అవకాశం ఉంది. మార్గమధ్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎస్‌కోటలో ఎమ్మెల్యేలకు విందు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పంకజ్ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్
తానే సైక్లోన్ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

‘పెంచిన విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే గతంలో టిడిపికి పట్టిన గతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ రూపాల్లో రూ.పదివేల కోట్ల భారం ప్రజలపై మోపింది. మళ్లీ విద్యుత్తు ఛార్జీలు రూ.4,950 కోటు,్ల సర్‌ఛార్జీ రూపంలో రూ.తొమ్మిది వేల కోట్లు ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధంగా ఉంది. విద్యుత్తు కోతలకూ, ఛార్జీల పెంపుదలకూ ప్రభుత్వమే కారణం. విద్యుత్తు కంపెనీల లోటును ప్రభుత్వమే భరించాలి. ప్రతిపాదిత ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే ప్రజలు ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు జాగ్రత్త” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు హెచ్చరించారు.
అనకాపల్లిలో సిపిఎం విశాఖ జిల్లా 20వ మహాసభల సందర్భంగా మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టిడిపి హయాంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాడిందని గుర్తుచేస్తూ.. దీని ఫలితంగా రాష్ట్రంలో పదేళ్లపాటు విద్యుత్తు ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు భయపడ్డాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ నుండి విద్యుత్తు ఛార్జీలను రెట్టింపు చేసేందుకు సిద్ధపడిందని విమర్శించారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తే విద్యుత్తు కోత, భారాలతో పని ఉండేది కాదని తెలిపారు. వినియోగ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్కేంద్రాలను నిర్మించనందునే విద్యుత్తు కోత తీవ్రమైందని అన్నారు. పంటలకు అనుకూలం కాని చవిటి భూముల్లో కాకుండా సోంపేట, కాకరాపల్లి తదితరచోట్ల రెండు పంటలకు అనుకూలమైన భూముల్లో థర్మల్ విద్యుత్కేంద్రాలు నెలకొల్పి, ఆరుగురి ప్రాణాలు తీసిందని విమర్శించారు. ప్రజలతో మద్యం తాగించి, వారిని అనారోగ్యం పాల్జేసి, చావులకు కారణమై ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. వరంగల్‌లో ఓ తండాలో వంద ఇళ్లుంటే 30 ఇళ్లలోని పురుషులు అతిగా తాగి, అనారోగ్యంతో చనిపోయారని గుర్తుచేశారు. వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించని, రైతులను ఆదుకోని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.
బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా ప్రభుత్వ చౌక డిపోల్లో కిలో బియ్యం రూపాయికి ఇచ్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. రాజీవ్ యువకిరణాల కింద ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 1200 మంది ’104 ఉద్యోగుల’ను తొలగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కంచం లాగేసి మెతుకులు ముందుపడేసేలా రాష్ట్ర పభుత్వ తీరు ఉందనీ, ఇటువంటి జిమ్మిక్కులను సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసేది సిపిఎం, వామపక్షాలేనన్నారు. ప్రజల కోసం ప్రాణాల్వివడానికి సిద్ధపడే వాళ్లంతప్ప, ముడుపుల కోసం ఆందోళన చేసేవాళ్లం కాదని పేర్కొన్నారు.
సిపిఎం విశాఖజిల్లా కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ జిల్లాలోని సముద్ర తీరాన్ని, భూముల్ని, గనుల్ని కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ నేతలు డాక్టర్ మిడియం బాబూరావు, ప్రభావతి, సురేంద్ర మాట్లాడారు. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎ బాలకృష్ణ అధ్యక్షత వహించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది.