వెస్ట్ గోదావరి

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ప్రతీ ఓటూ కీలకమే


ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమేనని, ఒక ఇంట్లో ఒక ఓటరును మనవైపు తిప్పుకోగలిగితే కుటుంబంలోని ఓట్లన్నీ మనకే పడతాయని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి ముందు నరసాపురంలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఓటర్లు చాలా తెలివైన వారని, కాంగ్రెస్ పార్టీ వైపువారిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేయడం ఎన్నికల్లో కీలకమన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు స్థానికంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బూత్ కమిటీలు పరిశీలించుకోవాలని సూచించారు. మే 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున అప్పటికే బూత్‌కమిటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసి నివేదికను తయారుచేసుకోవాలని సూచించారు. ప్రతీ బూత్ కమిటీకి పదిమంది ఉండాలని, వీరు ఎన్నికల కోసం అహర్నిశలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు, ఇతర పార్టీల ఓటర్లు ఎవరు, తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరో గుర్తించి వారిలో కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపేవారిని మన ఓటర్లుగా మార్చుకోవాలన్నారు. ఒక కుటుంబంలో ఒక ఓటరును కాంగ్రెస్ పా ర్టీ వైపు తిప్పుకునేలా చేసుకుని, తద్వారా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలన్నారు. దీనివల్ల ఒక్క ఓటు వంద ఓట్లుగా మారుతుందని, ఆ వందల ఓట్లు వేల ఓట్లుగా పెరుగుతాయని చెప్పారు. ప్రతీ కుటుంబం వద్దకూ వెళ్ళి ఐదునుంచి పది నిమిషాలపాటు వారితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. అలాగే ఓటర్లకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే సత్తా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉందని వారికి వివరించాలని చెప్పారు.
నరసాపురం నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఓటర్లందరితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన చేసే కృషికి కార్యకర్తలు, నాయకులు కూడా కొత్తపల్లికి అండగా ఉండాలన్నారు. పత్రికలు చూసి ఓటర్లు మోసపోతున్నారని, అందుకోసం కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేకంగా బుక్‌లెట్ తయారుచేసిందని, దాన్ని ఓటర్లకు అందచేయాలని ముఖ్యమంత్రి కోరారు. గెలుపోటముల బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. రాజస్థాన్‌లో అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు ఒక్క ఓటుతో ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, వట్టి వసంతకుమార్, పీతాని సత్యనరాయణ, వట్టివసంతకుమార్, డిసిసి అధ్యక్షుడు గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం : స్పీకర్‌ మనోహర్‌


గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఆరోగ్యంగా ఉండేలా క్రీడలను ప్రోత్సాహించాలని రాష్ట్ర శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాస్మో పాలిటన్‌ క్లబ్‌లో అంతర్జాతీయ స్ధాయి టెన్నీస్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో జీవిస్తున్న జన జీవనానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, రోజులో కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. దీనివల్ల మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతాయన్నారు. నిత్యం ప్రజలు ఉద్యోగ, వ్యాపార రంగాలలో నిమగ్నమై తమ ఆరోగ్యాలను లెక్కచేయక ఊబకాయంతో బాధపడుతున్నారని, దానికి తగిన వ్యాయామం క్రీడలేనని అన్నారు. దేశాభివృద్ధికి సేవ చేసే భాగ్యం తనకు భగవంతుడు కల్పించాడని, రాజకీయంగా ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో తాను 1986 లో ఇదే క్లబ్‌లో టెన్నీస్‌ టోర్నమెంట్‌లో పాల్గొని ఛాంపియన్‌ షిప్‌ను పొందానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. కాస్మో పాలిటన్‌ క్లబ్‌ అంతర్జాతీయ స్ధాయిలో టెన్నీస్‌ టోర్నమెంట్లు నిర్వహించడం పట్ల క్లబ్‌ సభ్యులను, నిర్వాహకులను ఆయన అభినందించారు. భీమవరం పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు విదేశాల నుండి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ మాట్లాడుతూ భీమవరంలో అంతర్జాతీయ టెన్నీస్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం ఒక ఉత్సవంలా ఉందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి క్రికెట్‌ క్రీడాకారుడిగా, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ టెన్నీస్‌ క్రీడాకారుడిగా ఆంధ్ర రాష్ట్రం గర్వించదగినదన్నారు. జిల్లా కలెక్టరు డా జి వాణీమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో ఉన్న స్పోర్ట్స్‌ క్లబ్‌ల కన్నా భీమవరంలో అంతర్జాతీయ స్ధాయిలో క్రీడలు నిర్వహించడం పశ్చిమగోదావరి జిల్లాకే గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ భీమవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ టెన్నీస్‌ టోర్నమెంట్‌లో 20 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొనడం పట్టణానికే గర్వకారణమన్నారు. అనంతరం స్పీకర్‌ మనోహర్‌ను క్లబ్‌ నిర్వాహకులు సన్మానించారు.

వైఎస్ చేయించిన తప్పులకు ఐఏఎస్‌లు బలి


మా హయాంలో అవార్డులు.. ఇప్పుడేమో జైళ్లు
మూలవిరాట్‌లను వదిలి సామాన్యులను పట్టేస్తున్నారు
మద్యం మాఫియా దర్యాప్తు తీరుపై బాబు ధ్వజం
రాజమండ్రి, ఫిబ్రవరి 4 : “ఒక వ్యక్తి చేయించిన తప్పులకు ఇపుడు ఎంతమంది జైలుకు వెళ్తున్నారో.. టీడీపీ హయాంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఐఏఎస్‌లు ఇపుడు జైలుకెళ్లే పరిస్థితి ఎదురైంది. ఇదంతా వైఎస్ హయాంలో, ఆయన ఒత్తిడికి తలొగ్గి పనిచేయడం వల్లే జరిగింది” అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మార్, గాలి అక్రమ గనులు, జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఒక్కొక్కరుగా ఐఏఎస్ అధికారులు జైలుకు వెళుతుండటం, దీనిపై ఐఏఎస్‌లు సీఎం కిరణ్ వద్ద నేరుగానే అసహనం వ్యక్తం చేయడం వంటి పరిణామాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వారికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. శనివారం తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ” జైలుకెళ్లినంత మాత్రాన తప్పుచేసినట్టు కాదు కదా” అని తనను కలిసిన ఐఏఎస్‌ల వద్ద సీఎం కిరణ్ అభిప్రాయపడటాన్ని తప్పుబట్టారు. జైలుకెళ్లినా ఫర్వాలేదా.. హవ్వ.. నవ్వుతారంటూ ఎద్దేవా చేశారు. ” జైలు కెళ్లడం తప్పేముందని సీఎం అంటున్నారు. ఎంత దారుణం. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవడం సీఎం స్థాయి వ్యక్తులకు తగద”ని పేర్కొన్నారు.
ఇపుడు జైలుకెళ్తున్న ఆఫీసర్లే తమ హయాంలోనూ పనిచేశారని, అప్పట్లో వారికి అవార్డులు వస్తే ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా వైఎస్ తన స్వలాభం కోసం అధికారులపై ఒత్తిడి చేయడం, ప్రలోభాలకు గురిచేసిన ఫలితమని ధ్వజమెత్తారు. ఆర్థిక కుంభకోణాల్లోనేకాదు..మద్యం మాఫియాలోనూ ‘మూలవిరాట్టు’లను వదిలేసి మామూలువాళ్లను అరెస్ట చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ బొత్సపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ” బొత్స మద్యం మాఫియా కింగ్. అందులో సందేహం లేదు. తమ కుటుంబానికి 31 మద్యం షాపులు ఉన్నాయని గతంలో ఆయనే చెప్పారు. అటువంటి మూలవిరాట్‌లను వదిలేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

రెండు పదవులకే చిరు పార్టీ అమ్ముడైంది


-రైతు సంక్షేమాన్ని విస్మరించిన కిరణ్ సర్కార్
-మళ్లీ అవిశ్వాసం పెడతాం
-కాపులు కాంగ్రెస్8ను వదిలి టీడీపీలోకి రావాలి
-పశ్చిమ గోదావరి రైతు పోరుబాటలో బాబు
పశ్చిమ గోదావరి, జనవరి 24 (టీ న్యూస్):చిరంజీవి సామాజిక న్యాయాన్ని పక్కనపెట్టి కేవలం రెండు మంత్రి పదవులకే పార్టీని అమ్మేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ లేకుండా ఉంటే టీడీపీయే గెలిచేదన్నారు. కాంగ్రెస్8లో చిరు కరివేపాకు అని, ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని బాబు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రైతు పోరుబాట యాత్ర నిర్వహించిన సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కిరణ్ ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెడతామన్నారు. కాంగ్రెస్8 ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం మద్యం మాఫియా గుప్పిట్లో ఉందని విమర్శించారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేకపోయినా రాష్ట్రమంతటా మద్యం ఏరులైపారుతుందని బాబు ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బుతో పుట్టిన పార్టీ వైఎస్8ఆర్ కాంగ్రెస్8 అని, ఆ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటు వేసిన టీడీపీ నాయకుడు పరిటాల రవీంవూదను చంపించింది వైఎస్8 సర్కారేనని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమకు 31 మద్యం షాపులు ఉన్నాయని స్వయంగా చెప్పుకోవడం కాంగ్రెస్8 నీచ సంస్కృతికి పరాకాష్ట అని బాబు విమర్శించారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం చాలా దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ నిర్మాతను కించపర్చడం సరికాదన్నారు. ఇది క్షమించరానిదని, నిందితులను కఠినంగా శిక్షించాలని బాబు డిమాండ్ చేశారు.
తడిపల్లిలో బాబుకు పరాభవం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తడిపల్లి గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన బాబును దళితులు అడ్డుకున్నారు. పూలమాల వేయడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. దీంతో విగ్రహానికి పూలమాల వేయకుండానే చంద్రబాబు వెనుతిరిగారు.
చంద్రబాబు సైకిల్‌ యాత్ర!
‘ప్రాణహిత’కు జాతీయ హోదా కోసం
టి-టిడిపి ఫోరం యాత్ర వాయిదా
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సైకిల్‌ యాత్ర చేపట్టబోతున్నారు. చంద్రబాబు సైకిల్‌ యాత్ర చేయనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. చంద్రబాబు సైకిల్‌ యాత్ర చేయనున్నట్లు తెలియడంతో ప్రాణహిత కోసం తలపెట్టిన పాదయాత్రను టి-టిడిపి ఫోరం వాయిదా వేసిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రైతు పోరు బాట పేరుతో చంద్రబాబు జిల్లాల్లో పర్యటించారు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత మరోసారి ఆయన తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు రైతు సమస్యలపై పర్యటించిన చంద్రబాబు ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక సమస్యలపై ఉద్యమించనున్నట్లు తెలుస్తోంది. అందుకు నాందిగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెకుక్టు జాతీయ హోదా కల్పించాలని, దాని నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సైకిల్‌ యాత్ర చేయను న్నట్లు తెలిసింది. బాబు యాత్రపై టి-టిడిపి ఫోరం నేతలు కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని వైఎస్‌ సర్కారు చేసిన వాగ్దానం అమలు చేయలేదని, కనీసం పనులు ప్రారంభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫోరం ఆధ్వర్యంలో యాత్ర చేయడం కంటే చంద్రబాబు సైకిల్‌ యాత్ర చేయడమే ఉపయోకరంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది.

దద్దమ్మ ప్రభుత్వమిది – రైతు పోరుబాటలో బాబు


రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం సాగుతోందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతలేదన్నారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తాకట్టుపెడుతున్నారంటూ దుయ్యబట్టారు. అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని, కాంగ్రెస్‌ నేతలు,మంత్రులు మాత్రం ఎసి గదుల్లో కూర్చుని రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుతింటున్నారంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రైతుపోరుబాట సందర్భంగా పలుచోట్ల బాబు ప్రసంగించారు. నిడమర్రులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించగా, ఉండిలో బాబు ప్రసంగానికి ప్రజలనుంచి అపూర్వస్పందన లభించింది. మద్యం విక్రయాల్లో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తోందంటే ప్రజల్నేవిధంగా మద్యానికి బానిసలు చేస్తున్నారో గమనించాలని సూచించారు. గ్రామాల నుంచి నగరాల వరకు తాగునీటి సమస్య ఉంటే పట్టించుకోవడంలేదన్నారు. కానీ ఇంటికో బెల్ట్‌షాప్‌ అన్నట్లుగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారంటూ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉపాధి చూపామన్నారు. కూలీలకు పని కల్పించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజల దరికి చేరడంలేదన్నారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోని ప్రభుత్వాలు పనికిమాలిన దండగమారి ప్రభుత్వాలుగా అభివర్ణించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమర్ధవంతమైన పాలననందించిన ఘనత తెలుగుదేశందేనన్నారు. పిసిసి చీఫ్‌ బొత్సకు రాష్ట్రంలో 31మద్యం షాపులున్నాయని, స్వయంగా ఆయనే ఈ విషయాన్ని అంగీకరించారని గుర్తుచేశారు.లిక్కర్‌డాన్‌గా బొత్స ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారన్నారు. కరెంట్‌ను కూడా సరఫరా చేయలని అసమర్ధ ప్రభుత్వాన్ని కిరణ్‌ నడుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.
అదో అవినీతికూపం.. వైఎస్‌పార్టీపై బాబు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవినీతి కూపమని బాబు పేర్కొన్నారు. ప్రజలు ఆ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని చెప్పారు. వైఎస్‌ అవినీతి కారణంగా పలువురు ఐఎఎస్‌ అధికారులుకూడా జైళ్ళ పాలయ్యారని బాబు గుర్తు చేశారు. జగన్‌ అవినీతిలో భాగస్తులైన పలువురు వ్యక్తులు కూడా జైలుకెళ్ళారన్నారు. మిగిలిన వారు కూడా నేడోరేపో జైలుకెళ్ళడం ఖాయమని చెప్పారు. పేదల సొమ్మును ఎవడబ్బ సొత్తుగా కాంగ్రెస్‌ నేతలు దోచుకుతింటున్నారని బాబు ప్రశ్నించారు. ఎన్‌టిఆర్‌, తాను నీతిమంతమైన, సమర్ధవంతమైన పాలన అందించామన్నారు. పేదల సంక్షేమం కోసం నూరు శాతం కష్టపడ్డది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చెప్పారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో ఎరువులు దొరకడం లేదు.. డిఎపి ధర విపరీతంగా పెరిగింది.. అయినా ధాన్యం కొనుగోలు ధర పెంచకుండా వారిని అప్పులపాల్జేస్తున్నారని బాబు దుయ్యబట్టారు. అప్పుల్లో పుట్టి.. అప్పుల్లో పెరిగి.. ఆ అప్పుల్లోనే రైతులు చనిపోతున్నారంటూ బాబు ఆవేదనవ్యక్తం చేశారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు తాను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్లు నిలిచిపోయాయని చెప్పారు. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి రక్షణలేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే పరిష్కరించడం మాని ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. అజాద్‌ ముందు చేతులు కట్టుకుని రాష్ట్రనేతలంతా బడిపిల్లల మాదిరిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రుల్ని, లోక్‌సభ స్పీకర్‌లను కూడా తామే ఎంపిక చేసేవారమని, ఆ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది మాత్రమేనని చెప్పారు. బుధవారం పరిటాల రవి ఏడో వర్ధంతి అని, ఆయన్ను కూడా వైఎస్‌ ప్రభుత్వమే చంపించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేర చరిత్ర పెరగడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమంటూ దుయ్యబెట్టారు. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం కారణంగా వేలాది ఎకరాల్లోరైతులు పంట విరామం ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తమ హయాంలో రెండో పంటక్కూడా నీరిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలన్నింటికి ఈ ప్రభుత్వం అన్యాయమే చేసిందన్నారు. అసలే చేతకాని ప్రభుత్వంతో ప్రజలిబ్బంది పడుతుంటే సామాజిక న్యాయమంటూ రాజకీయాల్లోకొచ్చిన చిరంజీవి ఏం చూసి కాంగ్రెస్‌లో విలీనమయ్యారో ఆయనకే తెలియాలన్నారు. చిరంజీవి సామాజిక న్యాయం కోసం ఏ మేరకు కృషి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2009లో పిఆర్‌పి కారణంగానే టిడిపి పలు సీట్లను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. స్వలాభం కోసమే ఆయన కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి పట్టం గట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం తన చివరి రక్తపు బొట్టువరకు పోరాటం చేస్తానన్నారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి – పంకజ్‌ ద్వివేది

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్‌ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని  పంకజ్‌ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్‌ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్‌
తానే సైక్లోన్‌ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ దుర్గాదాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్‌ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమీషనర్‌ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్‌, కలెక్టరేట్‌ సూపరింటెం డెంట్‌ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

మత్య్సకారుల సమరం


యానాంలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, రిలయన్స్‌ పెట్రోలియం సంస్థలు తీర ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాలను నిరసిస్తూ జిల్లా మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఓఎన్‌జిసి రిగ్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని ..తమ జీవనోపాధికి విఘాతం కలుగుతోందని మత్స్యకారులు వాపోయారు. దీనికి ఆయా సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ నేతృత్వం వహించారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 300 బోట్లతో 3 వేల మంది మత్స్యకారులు సముద్ర మార్గాన రిగ్‌ ముట్టడికి బయలుదేరారు.
అయితే జిఎస్‌పిసి రిగ్‌ ముట్టడికి వందలాది బోట్లు వెళుతుండగా మార్గ మధ్యలో కోస్టు గార్డు సిబ్బంది తమ మినీ నౌక ద్వారా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, కోస్టుగార్డు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రిగ్‌ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్ల రాదని, నిషేధ ఆజ్ఞలున్నాయని, వెనుకకు వచ్చేయాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వాటిని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ డీఎస్పీ లక్ష్మీనారాయణ, అమలాపురం డీఎస్పీ రాజశేఖరరావు ఆందోళనకారులకు నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా జిఎస్‌పిసి కార్యకలాపాలు నిలిపి వేశారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించుకుని అదే ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జిసి రిగ్‌ను ఆందోళనకారులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండుగంటలన్నరపాటు 500 నాటికల్‌ మైళ్ళు ప్రయాణించి భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, తాళ్లరేవు, యానాం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సావిత్రి నగర్‌ పరిసర ప్రాంతాల్లో యానాం, ఆంధ్రా ప్రాం తానికి చెందిన పోలీసులు భారీగా మోహరించారు.

ఆంధ్ర మహిళలు తెలివైనవాళ్ళు – ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి


ప్రపంచంలో తెలివైన మహిళలు ఎవరైనా ఉన్నారంటే వారు ఆంధ్రప్రదేశ్‌ మహిళలేనని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కితాబు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల జిల్లా ప్రజాపరిషత్‌ హైస్కూలు మైదానంలో రైతు, మహిళా సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో రూ.22 వేల కోట్లు బ్యాంకుల నుంచి మహిళలకు రుణాలి స్తుండగా, కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఏడాది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు.
మహిళలకు ప్రభుత్వ పరంగా పావలా వడ్డీ రుణాలు అందిస్తున్నప్పటికి ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా సూక్ష్మరుణాలు అధిక వడ్డీకి తీసుకోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని వీటిని అధిగమించడానికి ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా స్ర్తీ నిధి బ్యాంకును రూ.1054 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. ఈ పథకాన్ని పూళ్ల నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇనుపపెట్టెలు తాళాలు ఎవరి దగ్గర ఉంటు న్నాయంటూ ఆయన చమత్కరించగా, తమ వద్దేనంటూ మహిళలు హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. అదేవిధంగా రైతుల పరిస్థితుల్లో కూడా గతంలో కంటే మెరు గైన మార్పును తమ ప్రభుత్వం తీసుకు రాగలిగిందన్నారు. గతంలో బ్యాంకుల ద్వారా రైతులకు కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించగా, ప్రస్తుతం ఆ మొత్తం రూ.48 వేల కోట్లకు చేరుకుందన్నారు.
రాష్ట్రంలో లంచగొండితనాన్ని రూపుమాపడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతు న్నామని సీఎం ప్రకటించారు. మండల రెవెన్యూ కార్యాలయాల, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వీటిని రూపుమాపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కృష్ణా, ఖమ్మం, చిత్తురు జిల్లాల్లో అవసరమైన అన్ని కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి కంప్యూటర్లు ద్వారా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ ఫీజుతో అంటే ఐదు రూపాయలు చలనా కట్టి అడిగిన సర్టిఫికెట్లను పది నిమిషాల్లో జారీ చేస్తామన్నారు.
ఇది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు లకు దారి తీయనుందన్నారు. లంచగొండితనంపై దేశస్థాయిలో పెద్ద ఎత్తున చర్య జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు సంబంధించి అవినీతి రహిత పరిపాలన అందిస్తామని తెలిపారు. లంచగొండితనాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి సమా యత్తమయ్యామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాజీవ్‌ యువకిరణాలు ద్వారా 15 లక్షల ఉద్యోగావకాశాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుం టామన్నారు. అందులో భాగంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు మొదటిదశలో చర్యలు తీసుకుంటామన్నారు.
మాది చేతల ప్రభుత్వం
అమలు జరుగుతున్న కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్లండంతోపాటు కొత్తపథకాలకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పితాని సత్యనారాయణ, టిటిడి ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రత్నకిషోర్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

free website analytics