వరంగల్

ప్రత్యర్థులను చిత్తు చేస్తాం : భిక్షపతి
ఉప ఎన్నికల జరుగుతున్న పరకాల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మొలుగూరి భిక్షపతి ఖరారయ్యారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహాడ్డి వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజామోదం, పార్టీ శ్రేణుల ఏకాభివూపాయంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల టికెట్‌ను ఆశించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పరకాలలో టికెట్ ఆశించిన టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులంతా భిక్షపతి అభ్యర్థిత్వాన్ని ఏకక్షిగీవంగా ఆమోదించారని చెప్పారు. ఏడెనిమిది మంది టికెట్లను ఆశించారని, పార్టీకి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారన్నారు. అన్ని రకాలుగా అర్హతలున్నా గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన భిక్షపతి అభ్యర్థిత్వం పట్ల మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారని వివరించారు.
పరకాల నియోజకవర్గంలోని ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించామని, ఆ నియోజకవర్గంలో ఇన్‌చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకుల అభివూపాయాలను తెలుసుకున్నాకే భిక్షపతి పేరును ఖరారు చేశామన్నారు. పరకాల సర్పంచ్‌గా రెండు సార్లు, జెడ్పీటీసీ సభ్యుడిగా, వరంగల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, పరకాల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా అనుభవం గడించడమే కాకుండా గత ఎన్నికల్లో కేవలం 12వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారని చెప్పారు. తగిన సమయం లేకపోవడం, టీడీపీ అనుసరించిన వైఖరి వల్ల గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందన్నారు. మానుకోట స్పందన పరకాలలో పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో టికెట్‌ను ఎవరైనా ఆశించవచ్చని, అందులో తప్పేమీ లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీజేఏసీ నిర్ణయంపై ఆయన స్పందిస్తూ మంచి నిర్ణయమేనని, జేఏసీ తమదేనని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ ఎన్నికల కమిటీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, డాక్టర్ జీ విజయరామారావు, సయ్యద్ ఇబ్రహీం, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, కే విద్యాసాగర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజయ్య యాదవ్, సహోదర్‌డ్డి, మంద ఐలయ్య, కిషన్‌రావు, వెంక దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
పరకాల అతి కీలకం, భారీ మెజారిటీ ఖాయం : ఈటెల రాజేందర్
పరకాల ఎన్నిక అతికీలకమైందని, తమ అభ్యర్థి భిక్షపతి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా ఈ ఎన్నిక నిలుస్తుందన్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టికెట్‌ను ఆశించిన ముఖ్య నాయకులంతా మనస్ఫూర్తిగా భిక్షపతికి సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. ఉద్యమాల ఖిల్లా అయిన వరంగల్ జిల్లా ప్రజలు, నాయకులు పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అందరి సహకారంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తాం : భిక్షపతి
పరకాల నియోజకవర్గ ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, లాయర్లు, వైద్యులు, పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్కరి సహకారంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తామని పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి చెప్పారు. పరకాల అభ్యర్థిగా తనను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉండి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేవరకు విశ్రమించేది లేదన్నారు. తనకు సమీప ప్రత్యర్థి ఎవరూ లేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గత పన్నెండేళ్లుగా తమ అధినేత కేసీఆర్ అలుపెరుగకుండా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్నారు. కనీసం 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పరకాలలో విజయఢంకా మోగిస్తామన్నారు.
భిక్షపతికి బీ ఫాం అందజేసిన కేసీఆర్
పరకాల నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ఖరారైన మొలుగూరి భిక్షపతికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం తన నివాసంలో బీ ఫాంను అందజేశారు. భిక్షపతిని కేసీఆర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టికెట్ కోసం ముఖ్య నాయకులు పోటీపడినప్పటికీ ప్రజామోదానికి అనుగుణంగా అందరూ ఏకక్షిగీవంగా మద్దతు తెలపడం పట్ల కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోటీదారులను కూడా అభినందించారు. పరకాల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, ఐక్యంగా ముందుకు సాగి భారీ మెజారిటీ సాధించాలని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని ఆయన సూచించారు.
ఉద్యమం వల్లే బీజేపీ బలపడుతోంది: విజయశాంతి
తెలంగాణ ఉద్యమం వల్లే బీజేపీ బలపడుతున్నదని, సొంతంగా ఆ పార్టీకి ఎక్కడా బలం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతున్నందు వల్ల జేఏసీతో కలిసి బీజేపీ బలాన్ని పెంచుకుంటోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం సెక్యులర్ శక్తులే ముందుంటాయన్నారు. ఈ వాస్తవాన్ని సీపీఎం కార్యదర్శి రాఘవులు గుర్తించాలని ఆమె సూచించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను దూషించిన సంఘటనలో టీడీపీ టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈనెల 7న ఎర్రబెల్లి దయాకర్‌రావు జఫర్‌గఢ్‌లో ప్రచారం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రచారం చేయాల్సి ఉన్నా దయాకర్‌రావు 12:30 గంటల వరకు ప్రచార సభను కొనసాగించారు. దీంతో జఫర్‌గఢ్ ఎస్‌ఐ ఎం రంజీత్‌కుమార్ ప్రచారాన్ని ముగించాలని సూచించారు. దీనిపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీ నన్ను ఆపడానికి. నీ పద్ధతి మార్చుకోవాలి. లేకుంటే నీ అంతు చూస్తా. దమ్ముంటే అరెస్ట్ చెయ్’ అని హెచ్చరించడంతోపాటు దుర్భాషలాడాడని ఎస్‌ఐ రంజిత్‌కుమార్ వర్ధన్నపేట సీఐకి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు సెక్షన్ 353, బెదిరించినందుకు సెక్షన్ 506, దుర్భాషలాడినందుకు సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య విలేకరులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జఫర్‌గఢ్‌లో కార్యకర్తల సమావేశం పాల్గొన్న దయాకర్‌రావును సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి వర్ధన్నపేట స్టేషన్‌కు తరలించారు. అనంతరం బందోబస్తు మధ్య వరంగల్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయమని దయాకర్‌రావు పెట్టుకున్న దరఖాస్తును న్యాయమూర్తి పాటిల్ వసంత్ తిరస్కరించారు. కోర్టునే పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించారనీ, తనకు తప్పుడు సమాచారం అందించి అడ్డదారిన బెయిలుకోసం ప్రయత్నించారని పీపీ నిండుకోర్టులో తెలియజేసిన సందర్భంలో దయాకర్‌రావు బెయిల్‌కు అర్హుడు కాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. బెయిల్ డిస్మిస్ చేయడంతో తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దయాకర్‌రావును పోలీసులు జైలుకు తరలించారు.

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్
ఉప ఎన్నికల నగారా మ్రోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఒక పార్లమెంటు, 11 శాసనసభా స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్(సిఇసి) షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు శాసనసభా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోవూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మృతితో మహబూబ్‌నగర్ ఖాళీ కాగా జగన్ వర్గంలో చేరిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌తో నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాలతో పాటు మంసా(గుజరాత్), పిరవొమ్(కేరళ), శంకరన్ కొవిల్(తమిళనాడు), అతాగర్(ఒడిషా) శాసనసభా స్థానాలకు, ఉడుపి చిక్మగలూర్(కర్నాటక) పార్లమెంటు స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 18 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 21న నిర్వహిస్తారు. కాగా ఉప ఎన్నికలు జరుగనున్న ఆయా స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని సిఇసి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా జమ్మూకాశ్మీర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన యశ్‌పాల్ ఖజరియా మృతితో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఇసి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఆ స్థానానికి పోలింగ్ జరగనుంది.

జిల్లా యంత్రాంగానికి సీఎస్ అభినందనలు
అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పణ
గతంలో జరిగిన జాతరల కన్నా ఈసారి మేడారంలో సౌకర్యాలు చక్కగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ అన్నారు. గురువారం ఉదయం ఆయన సతీసమేతంగా మేడారం వచ్చారు. ఇక్కడి ఐటీడీఏ గెస్ట్‌హౌస్ కార్యాలయం వద్ద ద్వివేదీ దంపతులకు జిల్లా కలెక్టర్, జేసీ, అదనపు జేసీ, ఎస్పీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గద్దెల వద్దకు వెళ్లి, వనదేవతలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 195-6లో తాను వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు సిబ్బందితో జాతర విధుల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మేడారంలోనే మూడు రోజులు బస చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చుకున్నటైతే ప్రస్తుత జాతరలో సౌకర్యాలన్నీ మెరుగుపడ్డాయన్నారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, ఆర్టీసీ, వైద్యం లాంటి సౌకర్యాలు కల్పించడంలో జిల్లా యంత్రాంగం ముఖ్య భూమిక పోషించిందని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో మేడారంలో 3 గుడిసెలు మాత్రమే ఉండేవని పంకజ్ ద్వివేదీ చెప్పారు.
అందులో ఒకటి కలెక్టర్‌కు, మరొకటి ఎస్పీకి, ఇతర అధికారులకు మరోటి ఉండేవని అన్నారు. ప్రస్తుత జాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. జాతరకు అవసరమైన నిధుల మంజూరు కోసం రాష్ట్ర ముఖ్యమంవూతితో కూడా ఒకసారి సమావేశమయ్యామని, తాను కూడా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు జాతర అభివృద్ధి పనులపై పర్యవేక్షించానని తెలిపారు. జాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కలెక్టర్ రాహుల్ బొజ్జాతో పాటు ఎస్పీ రాజేష్‌కుమార్ గత 15 రోజులుగా మేడారంలోనే ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారని పంకజ్ ద్వివేదీ తెలిపారు. ముఖ్యంగా జంపన్నవాగు వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ, వైద్యం, తాగునీరు పారిశుధ్యం లాంటి సౌకర్యాలపైన ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు అసౌకర్యాలు కలుగకండా ఏర్పాట్లు చేశారన్నారు. వనదేవతల దర్శనానికి వచ్చిన ద్వివేదీ తనెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించారు.90 కిలోల బంగారాన్ని దంపతులిద్దరు తల్లులకు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ ఈవో రాజేశ్వర్‌రావు, పూజారులు స్వాగతం పలుకగా వీరి వెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ రాజేష్‌కుమార్, జేసీ వాకాటి కరుణ, అదనపు జేసీ సంజీవయ్య, డీఆర్‌వో శేషాద్రి, ఐటీడీఏ పీవో ఎస్‌వీవీఎన్ మూర్తి తదితరులు ఉన్నారు.

ఆకాశంలో నిండుచంద్రుడు కాంతులు విరజిమ్ముతుండగా..లక్షలాది జనం తన్మయం చెందిన అపురూప క్షణాన చల్లని తల్లి సమ్మక్క గురువారం రాత్రి 7-27గంటలకు గద్దెను చేరింది..మేడారం జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి రాకతో భక్తజనం తమ మొక్కులు చెల్లించుకుంది. చెవుల్లో ప్రతిధ్వనించే గిరిజన కొమ్ము వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ..శరీరంలో ఆద్యాత్మిక ప్రకంపనలు రేకెత్తించేలా శివసత్తుల పూనకాలు సాగుతుంటే..సమ్మక్క తల్లి చిలకలగుట్టనుండి తరలివచ్చి గద్దెను చేరిన క్షణాన మేడారం పులకరించిపోయింది.. సమ్మక్క గద్దెను అధిష్టించిన సమయంలో మేడారంలో 50లక్షలమందికి పైగా భక్తజనం ఉంది. సమ్మక్క తల్లీ జయహో..అన్న నినాదాలు మిన్నంటాయి. అమ్మలగన్న యమ్మ గద్దెనెక్కిన వేళ..వేలాది కోళ్లు, మేకలను భక్తులు బలి ఇచ్చారు. లక్షల టన్నుల బంగారం (బెల్లం), బండారి (పసుపు)ని మొక్కుగా అందచేశారు. సాయంత్రం 5-24గంటలకు చిలుకలగుట్ట నుండి సమ్మక్క బయలుదేరింది. ఆ సమయంలో లాంఛనంగా సమ్మక్కతల్లి ఆగమనానికి ప్రతీకగా..జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ గాలిలోకి కాల్పులు జరిపి అమ్మకు సాదర స్వాగతం పలికారు. ఆయనతోపాటు కలెక్టర్ రాహుల్, మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాంనాయక్, జాయింట్‌కలెక్టర్ వాకాటి కరుణ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ములుగు సబ్‌కలెక్టర్ సర్ఫరాజ్, ఐటిడిఎ పిఒ మూర్తి, జాతర ట్రస్టుబోర్డు చైర్మన్ ఎన్. కన్నయ్య, ఇఒ రాజేశ్వర్ తదితరులు తల్లికి స్వాగతం పలికారు. మంత్రి బసవరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. గిరిజన పూజారుల పక్షాన ఈ మారు మహేశ్ ప్రధానపూజారిగా ఎన్నికైనప్పటికీ..ఆయన చిన్నవాడైనందున కృష్ణయ్య సమ్మక్క తల్లిని మేడారం గద్దెలపైకి తీసుకొచ్చారు. ఆయన వెంట గిరిజన వడ్డె(పూజారులు)లు ఉన్నారు. కాకతీయ సేనలతో అలుపెరగని పోరాటం చేసి సమ్మక్క అదృశ్యమైన చోట చిలుకల గుట్టలో తొలుత గిరిజన సాంప్రదాయ పద్దతుల్లో పూజాదికాలు నిర్వహించారు. అక్కడ ఆమె ప్రతిరూపమైన కుంకుమభరణిని తీసుకున్న ప్రధాన పూజారి మార్గమధ్యంలో చలపయ్య చెట్టువద్దకు చేరుకుని మరోమారు వడ్డెలతో కలిసి పూజలు చేశారు. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారంకు బయలుదేరారు. సమ్మక్క తల్లి వస్తున్న మార్గంలో వేలాదిగా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పానసారాలు పట్టారు. అంతకు ముందే జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి వచ్చిన భక్తులు అమ్మ దర్శనం కోసం బారులు తీరారు. సమ్మక్కను తీసుకుని వస్తున్న ప్రధాన పూజారిని తాకేందుకు భక్తులు ముందుకు నెట్టుకువచ్చారు. ప్రధాన పూజారికి రక్షణగా ఉన్న రోప్‌పార్టీ పోలీసులు ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా చూశారు. సమ్మక్క వస్తున్న తరుణాన భక్తి పారవశ్యంతో వేలాదిమంది బండారి (పసుపు)ని గాలిలోకి విసిరి అమ్మకు సాదర స్వాగతం పలికారు. అమ్మ వస్తున్న తన్మయత్వంలో శివసత్తులు ‘మా తల్లి సమ్మక్కయోబ్బా..’అంటూ పూనకాలతో శివాలెత్తిపోయారు..సమ్మక్క తల్లితో గద్దెకు చేరిన అనంతరం గద్దెపై ప్రధాన పూజారి పూజలు చేసి అమ్మను ప్రతిష్టించారు. ఆ సమయాన..సమ్మక్కతల్లీ మము సల్లంగ చూడు అంటూ భక్తులు జే గంటలు మోగిస్తూ..నినదిస్తుంటే..వేలాదిగా కొబ్బరికాయలు కొట్టి, టన్నుల కొద్దీ బెల్లంను మొక్కుగా చెల్లించారు. కాగా చిలుకల గుట్టవద్దనుండి సమ్మక్కతల్లిని తీసుకువచ్చే సమయాన పెద్దసంఖ్యలో పోలీసులు మొహరించడంతో..గిరిజనులనుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ సాంప్రదాయం ప్రకారం తల్లిని తీసుకొచ్చే వేళ..ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా పోలీసులు ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు గిరిజన యువకులు పోలీసులపైకి రాళ్లను విసిరారు. ఈ రాళ్లదాడిలో అయూబ్, పద్మాకర్‌రెడ్డి అనే పోలీసు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గిరిజనులకు నచ్చచెప్పి సమ్మక్కను ముందుకు నడిపించారు.
నేడు అమ్మవార్లకు మొక్కులు
గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువుదీరడంతో శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. శనివారం సాయంత్రం అమ్మవారలు తిరిగి వనప్రవేశం చేస్తారు.
మొక్కు తీర్చుకున్న కెసిఆర్
టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావురెండేళ్లలో నాలుగు కిలోల బరువుతగ్గారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆయన గురువారం అమ్మలకు తన ఎత్తు బంగారం (బెల్లం) మొక్కుగా సమర్పించారు. తులాభారంలో ఆయన 48కిలోల బరువుఉన్నట్లు తేలింది. రెండు సంవత్సరాల కిందట 2010 జనవరిలో జరిగిన జాతరకు వచ్చినపుడు ఆయన తన ఎత్తుగా 52కిలోల బంగారం అమ్మవారికి మొక్కుగా అందచేశారు. హైదరాబాద్‌నుండి ప్రైవేటు హెలిక్యాప్టర్‌లో సతీసమేతంగా కెసిఆర్ మధ్యాహ్నం 1-40గంటలకు మేడారం చేరుకున్నారు. హెలిప్యాడ్‌నుండి నేరుగా విఐపి ద్వారదర్శనం ద్వారా కెసిఆర్ గద్దెల ప్రాంగణానికి వచ్చారు. తొలుత సమ్మక్క గద్దెవద్దకు చేరుకుని అమ్మవారికి మొక్కుగా బెల్లం సమర్పించారు. కెసిఆర్ గద్దెల వద్దకు చేరుకున్నప్పుడు..క్యూలైన్లనుండి అమ్మవారి గద్దెలవైపుకొందరు భక్తులు విసిరిన చిన్న బెల్లం గడ్డ ఆయన తల వెనకభాగంలో స్వల్పంగా తగిలింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 250కోట్లరూపాయలను మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కేటాయించి అత్యంత వైభవంగా జరిపిస్తామని కెసిఆర్ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణలో ప్రాధాన్యత కలిగిన సమ్మక్క జాతరలో సౌకర్యాల కల్పన, మేడారం అభివృద్ధి కోసం పాలకులు గతంలో ఇచ్చిన హామీలు ఎవీ నెరవేరలేదని విమర్శించారు. మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాడ్వాయి మండలానికి సమ్మక్క-సారలమ్మ పేర్లను నామకరణం చేయాలని కోరారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పంకజ్ ద్వివేది దంపతులు గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. రెండున్నర దశాబ్ధాలకిందట వరంగల్ జిల్లాలో ద్వివేది కలెక్టర్‌గా పనిచేశారు. అప్పుడే ఆయనకు మేడారం జాతరతో అనుబంథం ఏర్పడింది. మళ్లీ ఇనే్నళ్లకు తాను అమ్మవారలను దర్శించుకుని నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుగా అందచేయడం..తాను ఈ స్థాయిలో ఉండడానికి అమ్మల దయ కారణమని ద్వివేది విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

మేడారంలో బుధవారం రాత్రి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపనని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క – సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధికెక్కింది. రెండేళ్లకోకసారి జరిగే ఈ జాతరను దాదాపు కోటిన్నర మంది దర్శించుకుంటారు.
దర్శనానికి వచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానమాచరిస్తే పుణ్యమని విశ్వసిస్తారు. పూర్వం ప్రతాపరుద్రుడిపై దండెత్తి వీరమరణం పొందిన సమ్మక్క చిలకలగుట్ట వద్ద అదృశ్యమై దేవతగా అవతరించినట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పటి నుంచి మేడారంలో ప్రతి రెండేళ్లకోకసారి ఈ జాతరను కన్నులపండుగగా జరుపుకుంటారు.

గిరిజనుల ఆరాద్యదైవం మేడారం సమ్మక్క-సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మేడారంకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కాంగ్రె స్ పార్టీ నాయకులు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రాంచంద్రయ్య, సమాచార శాఖ మంత్రి డి.కె. అరుణ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజులు మేడారంకు చేరుకున్నారు. వారికి జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీలు, రాజయ్య, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క, కవిత, కొండేటి శ్రీధర్, ఎమ్మెల్సీ చుక్కరామయ్యలు స్థానిక గిరిజన పూజారులు సిఎంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరంజీవిలు వనదేవతల ఒడిలో తులాభారం వేసుకున్నారు. తమ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు. దేవాదాయశాఖ ఆనవాయితి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయశాఖమంత్రి సి. రాంచంద్రయ్య వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా గిరిజన పూజారులు ముఖ్యమంత్రిని, మంత్రులను ఘనంగా సత్కరించారు.